అతనితో స్నేహాన్ని పెంచుకుంది.
ఆశల్ని పెంచుకొంది.
కలల్లో తేలిపోయింది.
తను సామాన్యురాలు.
తల్లీ, తండ్రి పెళ్ళి చేయగల స్థితిలో లేరు.
ప్రేమ చిగురించి అతన్ని తను పెళ్ళి చేసుకొంటే తల్లికి, తండ్రికి పెద్ద బరువు దిగిపోతుంది.
అదే ఉద్దేశ్యంతో పరిచయాన్ని స్నేహంగా, స్నేహాన్ని ప్రేమగా రూపుదిద్దుకొంది.
కానీ మగాడు మగాడే!
కిరణ్ మోసగాడని అతని స్నేహం చేసిన సంవత్సరం గడిచాక గానీ తెలీలేదు. అప్పటికే అతనికి వెళ్ళయింది. భార్యా, పిల్లలు వున్నారు.
అంతకాలం నిజం చెప్పనందుకు క్షమించమన్నాడు. అతని భార్య చదువు సంధ్యలేనిది, పల్లెటూరు మనిషని, అందుకే తనతో స్నేహం చేసానన్నాడు. అభ్యంతరం లేకపోతే తనతో ఉంచేసుకొంటానన్నాడు.
స్నేహానికీ ప్రేమకీ తేడా లేదా?"
తనని ఎందుకు నమ్మించాడు. అతనంటే జుగుప్స కలిగింది. ఇంకెప్పుడూ తనకి ముఖం చూపించవద్దని తెగేసి చెప్పింది.
అప్పటికే ఇంట్లో తన ప్రేమకధ తెలిసిపోయింది. తండ్రి కొట్టారు. అన్న కాళ్ళు విరగ్గొడతానన్నాడు. తల్లి తిట్టింది. ఉద్యోగం మానేసి ఇంట్లో వుండమంది. తనసలు అతనితో ఎందుకు ప్రేమలో పడింది?
అతనో ఆఫీసరు తనూ ఉద్యోగం చేస్తోంది.
వయసు కలిసింది. మనసూ కలిసింది.
అతను తనకి నచ్చాడు. మాటల్లో నమ్మించాడు. మనిషి కూడా ఆకర్షణీయంగానే వుంటాడు. సమయం చూసి ఇంట్లో చెప్పాలనుకుంది. ఇంట్లో తన పెళ్లి చేసే స్థితిలో లేరు. అందుకే..... అతన్ని నమ్మింది.
కానీ కథకి ముగింపు అది అనుకోలేదు.
చిన్నప్పట్నుండీ అంతే!
తను కోరుకున్నదేదీ జరగలేదు.
తను గొప్పగా పుట్టివుంటే కిరణ్ లాంటివాడు తన స్థాయికి రాగలిగేవాడు కాదు. తను మోసపోయేదీ కాదు.
ఆ కసితోనే జి.కె.ని పెళ్లి చేసుకుంది.
డబ్బులో మునిగిపోవాలి.
డబ్బుమీద పడుకోవాలి.
డబ్బుపైన నడవాలి.
ఎటు చూసినా డబ్బే కనపడాలి. అందుకే జి.కె.తో పెళ్ళి అనగానే వయస్సు వ్యత్యాసాన్ని కూడా విస్మరించి ఒప్పుకుంది.
కానీ జి.కె. స్వభావం పెళ్ళయినాక కానీ తెలీలేదు.
మొదటిరాత్రి- అతనికి కాకపోవచ్చు.
కిరణ్ చేసిన గాయం ఓ పక్క, డబ్బుకోసం, ఓ అంతస్థు కోసం జీవితానికి చితిపెట్టుకున్నానన్న బాధ మరోపక్క.
"నీకిదే మొదటిరాత్రా?!" అడిగాడు జి.కె. సిగరెట్ వెలిగిస్తూ.
అతని మాటలకు ఉలిక్కిపడింది. కలవరపాటుతో అతనికేసి చూసింది.
మొదటిరాత్రి భార్యతో మాట్లాడే తీరు అదేనా?
ఆడపిల్లకి భయాన్ని పోగొట్టి లాలించి, మురిపించి, దగ్గరికి తీయాలి.
