ఆ నిశ్శబ్ద రాత్రిలో, ఆ సుత్తిదెబ్బ భయంకరంగా ఆ బరియల్ గ్రౌండ్ లో ప్రతి ధ్వనించింది.
ఒకటి...
రెండు...
మూడు...
ఆ పేరు చెదిరిపోయింది...పాలరాతి ముక్కలు కిందపడ్డాయి.
టూల్ బాక్స్ ను యధావిధిగా తన లాంగ్ కోట్ జేబులోకి తోసేసి కుడిచేతి మణికట్టుకి ఉన్న రంగుల రంగుల దారాల్లోనుంచి ఓ నల్లని దారం తీసి ఆ సమాధిమీద వుంచి ఏవో మంత్రాలను ఉచ్చరించాడు.
అప్పుడు కదలిక వచ్చింది ఆ బరియల్ గ్రౌండ్ లో...
ఏవేవో అరుపులు...ఈదురుగాలి...కీచురాళ్ల ధ్వని...దూరంగా తీతువుపిట్ట కూసింది భయంకరంగా...
సమాధులే వణికిపోతున్న బ్రాంతి కలిగింది. అయినా పీటర్సన్ కళ్ళు మూసుకుని మంత్రాలను ఉచ్చరిస్తున్నాడు.
ఎవరో అతడిని బలంగా తోసినట్టు...ఒక్కక్షణం సమాధి మీద పడబోయి నిలదొక్కుకున్నాడు.
అతను నిర్భయంగా వున్నాడు. ఏ మాత్రం చలించలేదు.
రె...బ...కా...రె...బ్...కా...
క...మ్...క...మ్...
అతని పెదాల్లో కదలిక చిత్రంగా వుంది.
ఒకటి రెండు..మూడు...
అయిదునిమిషాలపాటు అతని పెదవులు కదులుతూనే వున్నాయి. అతను మంత్రాలను ఉచ్ఛరించేటప్పుడు అతని మెడ దగ్గర నరాలు ఉబ్బిపోసాగాయి.
ఐదు నిమిషాల తర్వాత...
పీటర్సన్ కళ్ళు తెరచాడు...ఆ సమాధి వంక చూశాడు.
సమాధి మీద అతను ఉంచిన నల్లదారం...పొడవుగా సాగుతూ...సమాదిని మొత్తం అ...ల్లు...కుం..టోం...ది.
పీటర్సన్ వెనుతిరిగాడు...
అతను వెనక్కి తిరిగివస్తూంటే...రెబకా సమాధిలోంచి కీచుగా, బాధగా వేడుకోలు వినిపిస్తోంది.
ప్లీజ్...లీవ్ మీ...
ప్లీజ్...లీవ్ మీ...
బరియల్ గ్రౌండ్ గేటు వేశాడు.
జేబులోనుంచి సెల్ ఫోన్ తీశాడు. ఏవో నెంబర్లు ప్రెస్ చేశాడు.
"నేను పీటర్సన్ ని...నా పని పూర్తయింది. మీరు వెంటనే బయల్దేరండి. మిడ్ నైట్ రెండు అయ్యేలోగా సమాధిలోని శవం...నా దగ్గరుండాలి...అంటే వన్ మోర్ థింగ్ సమాధిలో నుంచి శవాన్ని తీసేప్పుడు ఏ మాత్రం చలించొద్దు. మీ పని ఆపివేయవద్దు. ఏ సంఘటన జరిగినా...శవం కళ్ళు తెరిచినా సరే...మీ పని మీరు చేసుకుపోవాలి...ఓ...కే...బై..."
సెల్ ఆఫ్ చేశాడు పీటర్సన్..
వానలో తడుస్తూ నిలబడ్డాడు.
సరిగ్గా పదిహేను నిమిషాల తర్వాత పెద్ద వ్యాన్, ఓ కారు వచ్చి పీటర్సన్ ముందు ఆగాయి.
వ్యాన్ లోనుంచి ఆరుగురు వ్యక్తులు దిగారు. వాళ్ల చేతుల్లో పలుగు, పార వున్నాయి.
పీటర్సన్ వ్యాన్ వెనుగ్గా ఉన్న కారులో కూచున్నాడు. కారు వెనక్కి తిరిగి, సిటీవైపు కదిలింది. ఆ ఆరుగురూ బరియల్ గ్రౌండ్ గేటు ఓపెన్ చేసి లోపలికి నడిచారు.
* * *
ఆర్పాడ్ స్ట్రీట్
పీటర్సన్ ఎక్సపోర్ట్స్.
ఆ కాంప్లెక్స్ లోని పదహారో అంతస్తుమీద అక్షరాలు నియాన్ లైట్ వెలుతురులో మెరిసిపోతున్నాయి.
ఆ కాంప్లెక్స్ లోని ప్రతి ఫ్లోర్ కి గ్లాస్ డోర్స్ వున్నాయి.
పీటర్సన్ లిఫ్ట్ ఎక్కి పదహారో ఫ్లోర్ బటన్ నొక్కాడు.
లిఫ్ట్ పదహారో ఫ్లోర్ లో ఆగింది.
పీటర్సన్ చూడగానే వాచ్ మెన్ వినయంగా సెల్యూట్ చేశాడు.
ఆఫీసులోకి నడిచాడు పీటర్సన్.
కంప్యూటర్లు, ప్యాక్స్ మెషీన్స్, టెలిఫోన్లు...ఫర్నీచర్..అంతా 'పోష్' గా వుంది.
తన ఛాంబర్ లోకి వెళ్లాడు పీటర్సన్.
ఛాంబర్ లో నిలబడి ఆ గ్లాస్ డోర్స్ లోనుంచి చూస్తోంటే కింద రోడ్డు కనిపిస్తోంది. వాహనాలు చిన్నవిగా కనిపిస్తున్నాయి. అతను ఓ క్షణం నిట్టూర్చి..లాంగ్ కోటు విప్పి ఓ మూలకు గిరాటేశాడు. ప్యాంట్ తీసి టేబుల్ మీద పెట్టి...టెలిఫోన్ దగ్గరకు లాక్కుని రిసీవర్ ఎత్తి ఓ నెంబర్ డయల్ చేశాడు.
"హల్లో..."
"ఆ. డేనియల్...నేనే వెంటనే వచ్చేసేయ్..." అంటూ ఫోన్ పెట్టేశాడు.
ఈ లోగా ఓ గ్లాసులో వైన్ వంపుకుని తీసుకొని వచ్చి టేబుల్ మీద పెట్టాడు.
అరగంట తర్వాత డేనియల్ వచ్చాడు టెన్షన్ గా.
యాభై ఏళ్ళుంటాయి అతనికి. దృడంగా వున్నాడు.
అతను వస్తూనే పీటర్సన్ ని విష్ చేసి అతనికి ఎదురుగావున్న సీట్లో కూచున్నాడు.
"ఏంటి ప్రాబ్లమ్?" అడిగాడు మొహంలోకి చూస్తూ డేనియల్.
"యస్...ప్రాబ్లమే..మనం తక్షణం ఈ అవతారానికి గుడ్ బై చెప్పాలి..." స్థిరంగా అన్నాడు పీటర్సన్.
"వాట్...ఇంత సడన్ గా ఈ డెసిషన్ ఏంటి? బిజినెస్ ఆపేయడమంటే...?"
"మనం ఎక్స్ పోర్టు అండ్ ఇంపోర్టు పేరుతో చేస్తోన్న స్మగ్లింగ్ పనులు క్రయిమ్ బ్రాంచ్ కి తెలిసిపోతున్నాయని నా అనుమానం.." పీటర్సన్ అన్నాడు.
"నిజమా?" హౌకెన్ యూ సే..."
క్రయిమ్ బ్రాంచ్ ఇన్స్ పెక్టర్ ఒకతను మఫ్టీలో రెండ్రోజులుగా మన ఆఫీసును వాచ్ చేస్తున్నాడు. రెసిడెన్స్ దగ్గరకూడా నిఘా వేశాడు"
"మైగాడ్...ఇంత హఠాత్తుగా మనం మన బిజినెస్ ని వైండప్ చేస్తే...
"ఏమీ కాదు...నథింగ్ టు వర్రీ...మన టార్గెట్ కేవలం ఈ బిజినెస్సే కాదని నీకూ తెలుసు" పీటర్సన్ అన్నాడు వైన్ గ్లాసు పెదవులకు ఆన్చుకొని.
"మేటర్ అంత సీరియస్సా?" బిజినెస్ వైండప్ చేస్తే సరిపోతుందిగా"
"బిజినెస్ కు సంబంధించి మనకు ప్రాబ్లం రాదు...ఓకే మరి మనం చేసే ఇతర యాక్టివిటీస్ మాటేమిటి?"
"అప్ కోర్సు..."
"అందుకే నేనో నిర్ణయానికి వచ్చాను. ఈ బిజినెసుని వెంటనే మనం వైండప్ చేసి ఈరోజు మనం వెళ్లిపోవాలి.."
"బాంకాక్ వెళ్దామా?"
"వద్దు. బాంకాక్ పోలీసులు కూడా మనల్ని వెంటాడుతున్నారు. అక్కడ మన యాక్టివిటీస్ మీద వాళ్ళు అప్పుడే ఓ ఫైల్ తయారుచేశారు. ఆ విషయం మరిచిపోయావా?"
"యస్పెస్..అయితే ఎక్కడికి వెళ్దాం?"
"ఇండియా..." చెప్పాడు ఒక్కో పదం వత్తి పలుకుతూ పీటర్సన్...
"ఇండియానా?"
"యస్...ఇండియానే...ఈలోగా మనమో పని చేయాలి"
"ఏమిటది?"
"నా పి.ఏ.రామశర్మని చం...పే...యా...లి...మన రహస్యాలను క్రయిం బ్రాంచికి అందించింది అతనే..." కోపంగా చెప్పాడు పీటర్సన్.
వాళ్ల సంభాషణ అంతా చాటుగా నిలబడి వింటున్న వాచ్ మెన్ పక్కకు తప్పుకున్నాడు.
5
రామశర్మ మొహమంతా చెమట పట్టేసింది.
తన ప్లాట్ లో అటూ, యిటూ పచార్లు చేస్తున్నాడు. అప్పుడప్పుడు భయంతో వణికిపోతున్నాడు. పీటర్సన్ తనని చంపేస్తాడు.తనుచేసిన పని అతనికి తెలిసిపోయిందని అర్ధమైంది. పైగా అరగంట క్రితమే వాచ్ మెన్ ఫోన్ చేసి ఆ విషయం కన్ ఫర్మ్ చేసేడు.
నాలుగు రోజుల క్రితం జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది. తను క్రయిం బ్రాంచికి వెళ్ళడం, క్రయిం బ్రాంచిలో ఆఫీసర్ రాబర్ట్ కు పీటర్సన్ గురించి చెప్పడం...గుర్తొచ్చింది.
యాభై అయిదేళ్ళ రామశర్మ ఇరవై అయిదు సంవత్సరాల క్రితం కట్టుబట్టలతో, కట్టుకున్న భార్యతో సింగపూర్ వచ్చాడు. మేనమామ సింగపూర్ లో మంచి ఉద్యోగం యిప్పిస్తానని చెప్పాడు.
అలా ఇరవై అయిదేళ్ళ క్రితం వచ్చిన రామశర్మ చాలా కంపెనీలలో పనిచేసి, సరిగ్గా అయిదేళ్ళ క్రితం పీటర్సన్ కంపెనీలో పీటర్సన్ పి.ఎ.గా ఉద్యోగంలో చేరాడు. ఈ ఇరవై అయిదేళ్ళలో ఎన్నో మార్పులు జరిగాయి. మేనమామ కుటుంబం యాక్సిడెంట్ లో పోవడం, భార్య క్యాన్సర్ తో చనిపోవడం...యిలాంటి సంఘటనలు రామశర్మని కృంగదీశాయి. పైగా ఈ చివరి దశలో తన మాతృ దేశంలో గడపాలని అనుకున్నాడు. అతని ఏకైక పుత్రిక తరళ...
తన కూతుర్ని ఇండియా అబ్బాయికిచ్చి పెళ్ళి చేయాలని, తన శేషజీవితం ఇండియాలోనే గడపాలని నిర్ణయించుకున్నాడు.
ఆ విషయమై తన కూతురితో కూడా చెప్పాడు.
సరిగ్గా ఇదే టైంలో నాలుగు రోజుల క్రితం పీటర్సన్ కు సంబంధించిన విషయాలు తెలిశాయి.
అందులో ఒకటి...పీటర్సన్ ఎక్స్ పోర్ట్ అండ్ యింపోర్ట్ పేర స్మగ్లింగ్ కార్యకలాపాలు సాగిస్తున్నాడని...
అంతకన్నా దారుణమైన మరో విషయం...పీటర్సన్ క్షుద్ర శక్తుల కోసం ఘోరమైన పనులు చేస్తున్నాడని...
పెళ్లికాని అందమైన పదహారు సంవత్సరాల యువతి శవాన్ని క్షుద్రశక్తులకు బలియిస్తే కొన్ని అతీతశక్తులు వస్తాయని...ఆ ప్రయత్నంలో ఓ అమ్మాయిని చంపించే ప్రయత్నం చేశాడని తెలిసింది.
రామశర్మకు ఏం చేయాలో పాలు పోలేదు. చూస్తూ చూస్తూ ఈ దారుణాన్ని ఆపకపోతే ఎలా? నీతికి కట్టుబడే రామశర్మ వెంటనే క్రయిం బ్రాంచికి వెళ్లి ఆఫీసర్ ని కలిసి, పీటర్సన్ గురించి తనకు తెలిసిన నిజాలన్నీ చెప్పాడు.
