నచికేతకు నిద్ర రావడంలేదు.
అర్ధరాత్రి రెండు దాటినా ఇంకా మెలకువగానే ఉన్నాడు. ఎదురుగా కాన్వాసు స్టాండు వుంది.
కళ్ళు బలవంతంగా మూసుకున్నా నిద్ర రావడంలేదు. అతనికి ప్రతి క్షణం ఆ అడవే గుర్తొస్తోంది.
కానీ, అడవి ఎలా వుంది?
ఆ అడవిలో తను గెస్ట్ హౌస్ చూసేడు.
గెస్ట్ హౌస్ ఎలా వుంది? ఎలా...ఎలా...ఎలా...? తల విదిల్చాడు.
ప్రెండ్స్ అందరూ సినిమా చూశాక ఎక్కడివాళ్లక్కడికి వెళ్లిపోయారు. తను ఇంటికి వచ్చి అలా ఆలోచిస్తూ ఉండిపోయాడు.
ఓ చిన్న సమస్య పెద్దగా కనిపిస్తోంది.
ఓ చిన్న ఆలోచన పెద్ద సమస్యగా మారనుంది. ఏంచేయాలి? నిద్రమాత్రలు వేసుకుంటే? అప్పుడప్పుడు నిద్ర రానప్పుడు 'తప్పనిసరిగా' వేసుకునే నిద్రమాత్ర వేసుకుని ఈ రాత్రి హాయిగా పడుకోవాలి.
ఆ ఆలోచన రాగానే రిలాక్సయ్యాడు.
వెంటనే టేబుల్ దగ్గరకు వెళ్లి టేబుల్ సొరుగు లాగాడు. లోపల ఉన్న నిద్రమాత్రల సీసా కోసం వెతికాడు. ఎంతకీ కనిపించలేదు.
క్షణక్షణానికి అసహనం పెరిగిపోతోంది. నిద్రపట్టక పోవడం ఎంత పనిష్మెంటో అర్ధమవుతోంది.
ఏమైనట్టు? తనకి బాగా గుర్తు...ఈ డ్రాయర్ సొరుగులోనే వుండాలి.
మరో సొరుగు ఓపెన్ చేశాడు. నిద్రమాత్రల సీసా చేతికి తగిలింది.
సీసా బయటకుతీసి అలానే ఆ సీసావంకే చూస్తుండిపోయేడు.
ఆ సీసా ఖాళీగా అతడ్ని వెక్కిరిస్తూ కనిపించింది.
నిన్నటికి నిన్న ఫుల్ గా ఉన్న నిద్రమాత్రల సీసా ఏమైంది?
అవి...తండ్రికోసం అట్టే పెట్టుకున్న మాత్రలు. తండ్రీ, తల్లీ ఇద్దరూ ఇండియాలోని విజిటింగ్ ప్లేసెస్ చూడ్డానికి వెళ్లడంతో తనకు ఎప్పుడైనా పనికొస్తాయని తీసుకువచ్చారు.
ఇప్పుడా మాత్రలన్నీ ఏమైనట్టు?
"రా...మ...య్యా.." కేక వేశాడు నచికేత.
అతనికేమైనా తెలుసేమో కనుకుంటే సరి..అనుకున్నాడు...
రామయ్య బదులు పలకలేదు.
"నిద్రపోతే ఓ పట్టాన లేచి చావడు..." విసుక్కున్నాడు.
కానీ, రామయ్య నిద్రపోలేదని, అటువైపు తిరిగి కళ్ళు తెరిచి మెలుకువగానే ఉన్నాడని నచికేతకు తెలియదు. అంతేకాదు, అతనికి తెలియని విషయం మరోటి వుంది.
ఆ సీసాలోని నిద్రమాత్రలు...ఆ ఇంట్లో డస్ట్ బిన్ లో పడివున్నాయి.
సీసాలోని నిద్రమాత్రలు డస్టబిన్ లో పారేసింది రామయ్యే.
ఆ రాత్రి నచికేత సుఖంగా నిద్రపోవడం ఇష్టంలేక రామయ్య ఆ పనిచేశాడు.
ఎందుకు, ఏమిటి అనేది ముందు ముందు తెలుస్తుంది.
* * *
ఎవరో భుజం తట్టి లేపడంతో ఉలిక్కి పడి లేచాడు ప్రభు.
ప్రొఫెసర్ తనని లేపుతున్నాడు.
"ఏమైంది సార్" కంగారుగా అడిగాడు.
"ఏమీ కాలేదు...మార్చురీవాళ్లకి డెడ్ బాడీ అప్పగించాలి. రాత్రి ఆ రూమ్ కు లాక్ చేసింది నువ్వే కదా...కీస్ అడుగుదామని లేపాను" చెప్పాడు ప్రొఫెసర్ పరమహంస.
తలదిండుకిందవున్న 'కీ' తీసుకొని ల్యాబ్ రూమ్ ఓపెన్ చేశాడు ప్రభు.
ఐస్ దాదాపు కరిగిపోయింది. శవం నుంచి ఒక విధమైన వాసన వస్తోంది.
"ప్రభూ...ఈ డెడ్ బాడీని కాసేప్పట్లో మార్చురీ బాయ్ వచ్చి తీసుకువెళ్తాడు." చెప్పాడు ప్రొఫెసర్.
అలాగే అన్నట్టు తలూపాడు ప్రభు.
ఆ శవం కుడిచేతికి రంగు రంగుల దారాలు ఉన్న విషయం ప్రభు గమనించాడు. అతని చేతిమీద 'వాకర్' అన్న అక్షరాలు పచ్చపొడిచి వున్నాయి.
4
సింగపూర్
10-45 పి.ఎం
డబుల్ ప్లయ్ ఓవర్ మీద పక్కగా నడుస్తున్నాడు పీటర్సన్
ఆరడుగుల ఎత్తు. ఎత్తుకుతగ్గ లావుతో దృఢంగా ఉన్నాడతను. లాంగ్ కోట్ వేసుకున్నాడు.
సన్నని వాన తుంపర్లలో తడుస్తూ కూడా తాపీగా, తన వాకింగ్ స్టిక్ ను నేలకు తాటిస్తూ నడుస్తున్నాడు. అప్పుడప్పుడు తన ఎడమ చేత్తో ఫెల్ హేట్ తీసి పెట్టుకుంటున్నాడు.
సింగపూర్ లో రాత్రి వాతావరణం చాలా బావుంటుంది. ఓ పక్కన డబుల్ డెక్కర్ బస్సులు, కార్లు, కాబ్ లు వెళ్తుంటే మెర్క్యురీ లైట్ల కాంతిలో ఎత్తయిన బిల్డింగ్ లు మెరిసిపోతున్నాయి.
క్లబ్ ముందు విచిత్ర వేషధారణతో యువతీ యువకులు నిలబడి, కస్టమర్లని ఆకర్షిస్తున్నారు.
ఒక ప్లయ్ ఓవర్ మీద మరో ఫ్లయ్ ఓవర్, రెండో ఫ్లయ్ ఓవర్ నుంచి కిందికి చూస్తుంటే థ్రిల్లింగ్ గా వుంది. పీటర్సన్ ఇవేమీ పట్టించుకోకుండా పెద్ద పెద్ద అంగలు వేస్తూ నడుస్తున్నాడు.
ఫ్లయ్ ఓవర్ చివర లెఫ్ట్ సైడ్ కు తిరిగాడు. ఓ కాబ్ ని పిలిచి కూచొని అడ్రస్ చెప్పాడు.
కాబ్ ముందుకు కదిలింది.
కాబ్ డ్రైవర్ వేగంగానే పోనిస్తున్నాడు.
వ్యూ మిర్రర్ లో అప్పుడప్పుడు పీటర్ సన్ ని గమనిస్తున్నాడు.
చాలా సీరియస్ గా వుందతని మొహం.
"సార్..." డ్రైవర్ పిలుపుతో ఉలిక్కిపడి డ్రైవర్ వైపు చూశాడు.
"మీరు చెప్పిన అడ్రస్." అతని మాటలింకా పూర్తికాకుండానే పీటర్సన్ సీరియస్ గా లాంగ్ కోట్ లోనుంచి డాలర్స్ తీసిచ్చాడు.
డ్రైవర్ మిగతా బ్యాలెన్స్ ని ఇవ్వబోతూ...
"ఈ టైంలో ఇక్కడేం పనిసార్...?" అడిగాడు క్యాజువల్ గా.
సీరియస్ గా చూశాడు పీటర్సన్.
కుడిచేతిని పైకెత్తి వెళ్లమన్నట్టు సైగ చేశాడు.
కుడిచేతి మణికట్టు దగ్గర ఉన్న రంగురంగుల దారాలను చూసి ఉలిక్కిపడి మరో మాట మాట్లాడకుండా వెళ్లిపోయాడు డ్రైవర్.
కాబ్ వెళ్లిపోగానే బరియల్ గ్రౌండ్ గేటు ఓపెన్ చేశాడు పీటర్సన్.
రాత్రి పదికాగానే ఆ శ్మశానం గేటుకు తాళం బిగించి వెళ్లిపోతారు. మరుసటి రోజే ఓపెన్ చేస్తారు.
బరియల్ గ్రౌండ్ కు, సిటీకి చాలా దూరం కావడంవల్ల అక్కడ కాపలా కూడా ఎవరూ ఉండరు.
పీటర్సన్ చాలా తేలిగ్గా ఆ గేటు ఉన్న తాళం ఓపెన్ చేశాడు.
వరుసగా సమాధులు వున్నాయి. ఓ పక్కగా పాడుబడిన సమాధులు. ఒక్కో సమాధిని దాటుకుంటూ వెళ్తున్నాడు.
కుడివైపు తిరిగాడు.
వర్షం ఇంకా ఎక్కువైంది. టార్చిలైటు వెలుతురులో ఆ బరియల్ గ్రౌండ్ భయానకంగా వుంది.
అటువైపు పగటిపూటే ఎవరూ రావడానికి సాహసించరు.
కేవలం దుష్టశక్తుల వలనో ప్రమాదశాత్తు చనిపోయిన శవాలను మాత్రమే ఇక్కడ పాతిపెడతారు. ఇక్కడ పాతిపెట్టిన శవాలు ఆత్మలై తిరుగుతాయని ఆ పట్టణ ప్రజలకు ఓ నమ్మకం...మరో చోట పాతిపెడితే, ఆ ఆత్మలు తిరిగి ఇంటికి వచ్చి ఆ కుటుంబ సభ్యులను ఇబ్బంది పెడతాయనే నమ్మకంతో, ప్రమాదవశాత్తు లేదా దుష్టశక్తుల కారణంగా చనిపోయిన వ్యక్తుల శరీరాలను ఈ బరియల్ గ్రౌండ్ లో పాతిపెట్టి తమకి ఏ కీడు రాకుండా చూసుకుంటారు. (దక్షిణాఫ్రికాలోని ఓ ఆటవిక తెగకు చెందిన వాళ్ళు తమలో ఎవరైనా ప్రమాదవశాత్తుగానీ, క్షుద్రశక్తులవల్లకానీ మరణిస్తే వాళ్లను ప్రత్యేక స్థలంలో పాతిపెట్టి తెగ దేవతకు అభిషేకించిన మంత్రజలాన్ని, ఆ స్థలం చుట్టూ చల్లుతారు.
అలా చేయకపోతే, అర్ధాంతరంగా చనిపోయిన వారి ఆత్మలు, ఆ తెగలో ఎవరో ఒకరిని ఆవహిస్తాయని వాళ్ళనమ్మకమట.
ఢిల్లీలో ఆర్.కె.పురం వెళ్ళే రూట్ లో ఫుట్ పాత్ మీద అప్పుడప్పుడు దక్షిణాఫ్రికాలోని అడవుల్లోని ఆటవికుల గురించి, వాళ్ల తెగల ఆచారాల గురించి పుస్తకాల దొరుకుతాయి. చౌకబారు కవర్ పేజీతో హిందీ, ఇంగ్లీషు భాషల్లో దొరికే ఈ పుస్తకాల ఖరీదు అరవై నుంచి తొంభై రూపాయల వరకూ ఉంటుంది. ఇందులోని విషయాలు ఎంతవరకూ వాస్తవమో
తెలియకపోయినా, చదువుతుంటే కొన్ని థ్రిల్లింగ్ గా అనిపిస్తాయి.
మెరామెసో అనే తెగ ఆటవికులు...తమకు నచ్చిన స్త్రీలతో వెళ్ళే హక్కు కలిగి ఉంటారట. సంవత్సరంలో ఒకరోజు విధిగా కుటుంబంలో ఎవరో ఒకరు వాళ్ల కులదేవతకు రక్తాన్ని ధారపోయాలాట. ఇలాంటి విషయాలు ఆ పుస్తకాల్లో విరివిగా వుంటాయి.
(అలా నేను తెచ్చుకున్న పుస్తకం పర 'హస్త' గతమైంది. చూసిస్తానన్న పెద్ద మనిషి తిరిగివ్వలేదు. పై విషయాలు నేను ఆ పుస్తకంలో చదివినవే-రచయిత్రి)
పీటర్సన్ కుడివైపున నాలుగో వరుసలో ఉన్న ఆరవ సమాధి దగ్గరకు వెళ్లాడు.
కొన్ని సమాధులు మామూలుగా నిర్మిస్తే మరికొన్ని చలువరాతితో నిర్మించబడి వున్నాయి.
పాలరాతి సమాధి దగ్గరకు వెళ్లాడు.
అది నిర్మించి ఒక్కరోజు కూడా అవ్వలేదని ఆ సమాధిని చూస్తేనే తెలుస్తోంది.
రెబకా
జననం 1984
మరణం 2000 అని వుంది.
సమాధి మీదుగా వర్షం నీరు కారిపోతూ వుంది.
అక్కడక్కడ దట్టమైన చెట్లు వున్నాయి.
జన సంచారంలేని నిర్మానుష్యమైన ప్రాంతం
పీటర్సన్ తన జేబులోని బ్లాక్ చాక్ పీస్ తీశాడు. సమాధిమీద 'ఇంటూ' ఆకారంలో ఓ మార్క్ చేశాడు.
ఆ తర్వాత మరో జేబులోంచి చిన్నపాటి టూల్ బాక్స్ తీసి,ఓ మేకును 'రెబకా' అనే పేరు దగ్గర పెట్టి, చిన్నపాటి సుత్తితో కొట్టాడు.
