ప్రాతఃకాలం
చీకటి నవ్విన
చిన్ని వెలుతురా!
వాకిట వెలసిన
వేకువ తులసివా!
ఆశాకాంతుల ధ్వాంతములో
నవసి యిలపై వ్రాలిన
అలరువా! ---అప్స
రాంగనా సఖీ చిరవిరహ
నిద్రా పరిష్వంగము విడ
ఉడు పథమున జారిన
మంచు కలనా!
ఆకలి మాడుచు
వాకిట వాకిట
దిరిగే పేదల
సురిగే దీనుల
సుఖ సుప్తిని చేరచే
సుందర రాక్షసివా!
యుద్ధాగ్ని పొగవో - వి
రుద్ధ జీవుల రుద్ధ కంఠాల
రొదలో కదిలెడి యెదవో!
అబద్ధపు బ్రతుకుల వ్యవ
హారాల కిక మొదలో?
కవికుమారుని శుంభ
త్కరుణా గీతామవా!
శ్రీ శాంభవి కూర్చిన
శివఫాల విలసితమౌ
వెలుగుల విబూదివా!
దేశభక్తులూ, ధర్మపురుషులూ
చిట్టితల్లులూ, సీమంతినులూ
ముద్దుబాలురూ, ముత్తైదువలూ,
కూడియాడుచు కోకిల గళముల
పాడిన శుభాభినవ ప్రభాత
గీత ధవళిమవా!
* * *
సంధ్య
గగనమొక రేకు
కన్నుగవ సోకు
ఎరుపెరుపు చెక్కిళ్ళ విరిసినది చెంగల్వ
సంజె వన్నెల బాల రంగు పరికిణి చెంగు
చీకటిని తాకినది అంచుగా
చిరుచుక్క ప్రాకినది
వాలు నీడల దారి నీలి జండాలెత్తి
చుక్క దీపపువత్తి సొగాయు బాటలనల్ల
నిదుర తూలెడి నడక గదుము మైకపు కోర్కె
వచ్చు నిశిలో కరగి నవ్వు శశిలో కలసి
సంజె వన్నెల బాల రంగు రంగు రుమాల
విసిరింది కలలల్లు
వెండితోటల మధ్య
వ్రాలినది వ్రాలినది తావిగా
సోకినది సోకినది
