సురేష్ గతుక్కుమన్నాడు.
పిల్లికి బిచ్చం పెట్టనివాడు తనకు కాఫీ ఓపెన్ ఆఫర్ ఇవ్వటమా? పైగా పిన్ని వరస కూడానా?
ఎక్కడో ఏదో 'కాచ్' ఉంది.
ఏమయి ఉంటుందది?
తను నిరుద్యోగి అనీ, తిండికి కూడా కష్టమవుతోందని తెలిసి కూడా వాళ్ళాఫీస్ కి వెళ్ళి సర్టిఫికేట్ ట్రూ కాఫీస్ మీద సంతకాలు పెట్టమని అడిగితే ఫ్యూన్ తో కాఫీకి రెండ్రూపాయలు లంచం తీసుకున్న ఇంటర్నేషనల్ ఫ్రాడ్ మాస్టర్ ఇప్పుడు పరమ ఉచితంగా కాఫీ ఇస్తాడా! తను ఆ శ్రీదేవిని కాకా పట్టబట్టి బ్రతికిపోయాడు గానీ వీడి దయమీదే ఆధారపడేట్లయితే ఆ వాటర్ టాంక్ కింద కాపురమున్నందుకు అద్దె కూడా వసూలు చేసేవాడేమో!
"కాఫీయాండీ! ఇప్పుడే తాగానండీ!"
"ఎక్కడ?"
"హోటల్లోనండీ!"
"వెధవ హోటల్ కాఫీ ఏం బావుండేడుస్తుందని/ పద - చల్లారిపోతుంది మళ్ళీ."
కాదంటే ఈ ఉన్న కాస్త షెల్టర్ కూడా పోతుంది.
షర్టు వేసుకుని స్టీమ్ ఇంజన్ తో పాటు లిప్టు వేపు నడిచాడు.
"నేను మెట్లు దిగి వస్తాన్సార్."
"ఏం ఫర్లేదోయ్! మా పని మీద వస్తున్నప్పుడు లిప్టు వాడుకో! నీ పని మీద తిరిగేప్పుడే వాడకూడదని ఆసోసియేషన్ వాళ్ళు రిజల్యుషన్ పాస్ చేశాం! అంతే - రా"
లిప్టు కిందకు దిగుతోంటే నరకంలో కేళుతున్న ఫీలింగ్.
"అంతా కర్రప్షన్! గుమాస్తాలు, ఫ్యూన్ లు, నేనెంతకాలం కనిపెట్టి ఉండగలను? దేశం సర్వనాశనమయిపోతుంది! చూస్తుండు."
ఒరేయ్ స్టీమ్ ఇంజన్! నీలాంటి డబుల్ స్టాండర్ద్ గాళ్ళ వల్లేరాదేశం నాశనం అయేది! మొన్న జరిగిన ఇంటర్ వ్యూలో నువ్ ఒక మెంబర యుండి మూడు రోజుల్లో రెండు లక్షలు సంపాదించిన సంగతి ఎవడికి తెలీదనుకోకు.
"అందుకే మా పిల్లల్ని చాలా స్ట్రిక్టు డిసిప్లిన్తో పెంచుతున్నావోయ్! మన అపార్టుమెంట్స్ లో మిగతా పిల్లలను చూడు. మావాళ్ళను చూడు. ఆఫీసర్లన్నాక పిల్లలు కూడా డిగ్నిపైడ్ గా బిహేవ్ చేసేట్లు తర్ఫీదు ఇవ్వాలి."
వాళ్ళు గుడినీ గుళ్ళో లింగాన్నీ కూడా మింగి దేశాన్ని రెండు వందల గజాల ప్లాటు వేసి లక్కీడిప్ స్కీమ్ లో అమ్మిపారేస్తారు.
"మా మిసెస్ కూడా హైవీ ఎడ్యుకేటెడ్ కదా! అందుకని పిల్లల్ని పెంచటంలో చాలా కేర్ తీసుకుంటుంది ."
లిప్టు గ్రౌండ్ ఫ్లోర్ లో ఆగింది.
స్టీమ్ ఇంజన్ వెనుకే ప్లాట్ లోకి నడిచాడు.
"కూర్చోవోయ్! అలా నిలబడ్డావేం? ఓహో నేను అఫీసర్ ననా ఇంటి దగ్గర అలాంటివేమీ లేవులే! అల్ ఆర్ వన్! కూర్చో."
కమలాదేవి కాఫీ తీసుకొచ్చింది.
"నమస్కారమండీ!"
"నమస్తే! ఎక్కడోయ్ - నల్లపూసయిపోయావ్?"
"ఈ మధ్య కొంచెం ఇంటర్ వ్యూ లకూ, పరీక్షలకూ ప్రిపేర్ అవుతున్నాను కదండీ! అందుకని మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్ కెళ్ళి వచ్చేసరికి ఆలస్యం అయిపోతోంది."
"కాఫీ తీసుకో చల్లరిపోతోంది."
కాఫీ అందుకున్నాడు.
కప్పు నోటి దగ్గర పెట్టుకోబోతుండగా వచ్చాడు వాళ్ళ సుకుమారుడు.
ఏడేళ్ళుంటాయ్.
"ఎవర్రా నువ్ -- సాలె."
సురేష్ అదిరిపడ్డాడు.
నోట్లోని కాఫీ మళ్ళీ కప్పులో కొచ్చేసింది.
"కౌన్ హైరే తుమ్ ..... సాలే."
చేతిలోని క్రికెట్ బాట్ ని ఆయుధంలా వాడే ఉద్దేశ్యంతో భయంకరంగా తనమీద కొస్తున్నాడు.
ఒకే ఒక్క దెబ్బతో వాడిని నేలమీద పడేసి వీపు మీద కాలితో నొక్కి పెట్టాలన్న కోరిక తీవ్రంగా కలుగుతోంది.
శ్రీహరి వాడివేపు ప్రేమగా చూస్తూ నవ్వాడు.
"సిద్దార్ధా! పెద్దాళ్ళతో అలా మాట్లాడొచ్చా?"
"నేను మాట్లాడతా! నీకెందుకురా బాడుకన్!"
శ్రీహరి మొఖం వాడిపోయింది కానీ బలవంతంగా నవ్వాడు.
"మోస్ట్ మిస్చువర్ ఫెలోనోయ్ వీడు! చాలా ఇంటిలిజెంట్. చాలా డిసిప్లెన్ డ్! కానీ ఈ అపార్ట్ మెంట్స్ లో కొచ్చాక సరిగ్గా కేర్ తీసుకోక"
కమలాదేవి వాడి చేయి పట్టుకుంది.
"సిద్దార్ధా! డాడీని అలా అనవచ్చా?"
"వాడు డాడీ కాదు! మంకీ!"
సురేష్ అతి కష్టం మీద నవ్వాపుకున్నాడు.
"ఏరా సాబే ఎందుకు నవ్వుతున్నావ్'?" బాట్ ఎత్తాడు కొట్టటానికి
"కమలా ! వీడిలా తయారయ్యాడేమిటోయ్! కొంచెం కేర్ తీసుకుకోవాలి నువ్వు!"
"చెప్తూనే వుంటానండీ! " రెస్ పెక్టుతో మాట్లాడాలని!" సిద్దార్ధా! అలాంటి మాటలు మాట్లాడగూడదమ్మా!' మందలింపుగా అందామె.
వాడు 'నేనే నెంబర్ వన్ రౌడీ' అన్న ఫోజులో నిలబడి తల్లి వేపు చూశాడు.
"నేను మాట్లాడతా! నీకెందుకు ? నువ్ నోర్మూసుకో."
శ్రీహరి మొఖం వాడిపోయింది గానీ ఓడిపోలేదు.
"వెధవ! చిన్నప్పటి నుంచీ ఇంతే! గారాబంగా పెంచాం కదా! నీ దగ్గరే ఇలా మాట్లాడతాడు గానీ స్కూల్లో మోస్ట్ డిసిప్లిన్ డ్ బాయ్ సిద్దార్ధా! నువ్ గుడ్ బాయ్ ని కదా! గుడ్ బాయ్స్ అలా మాట్లాడతారా మరి?"
"నువ్ పోరా మంకీ సాలే."
శ్రీహరి ముఖం పూర్తిగా ఫ్రై అయిపొయింది.
"ఏయ్! డాడీనలా అనవచ్చా?" కమలమ్మ అందుకుంది.
"అంటానే బోడి! నా ఇష్టం. ముండా."
వాడిని బలవంతంగా లోపలకు లాక్కెళ్ళిందామే వాడు బండబూతులు తిట్టటం వినబడుతూనే ఉంది.
"వీడిని ఎలాగయినా అయ్ ఏ.ఎస్. చేయాలని నాకుందోయ్! మా మిసెసేమో వప్పుకోవటం లేదు. సూపర్ స్పెషాలిటీస్ డాక్టర్ గా చేస్తానంటోంది."
వాడు రిక్షా తొక్కటానికి క్కూడా పనికిరాడని తెలుస్తూనే వుంది.
"నీ ఉద్యోగ ప్రయత్నాలెంతవరకూ వచ్చాయేమో?"
"ఇంటర్ వ్యూల కేళుతున్నానండీ."
"నీలాంటి ఇండస్ట్రియస్ ఫెలోస్ కి తప్పకుండా మంచి ఫ్యూచర్ వుంటుందిలే."
నీలాంటి గుంటనక్కలుంటే ఎవడికెంత మంచి ఫ్యూచరున్నా భగ్గున మండి బూడిదయిపోతుంది.
"నీకు ఉద్యోగం వచ్చేవరకూ ఎలాగూ లీజర్ వుంటుంది కదా! అంతవరకూ మా పింకికీ కొంచెం తెలీని సబ్జెక్టు ఏమయినా చెప్తావేమోనని పింకీ ఓ పింకీ!"
