ఒక విధంగా అతని కధ విన్న ధీరజ సయితం చలించిపోయింది.
అతని సిన్సియారిటీ, అతనిని కాపదలేకపోయింది......అతని కుటుంబాన్ని రక్షించలేకపోయింది. డిపార్టుమెంట్ తరపు నుంచి కేవలం సానుభూతి మాత్రం లభించింది.
తమ సహచారుడ్ని పోలీసులు ఎన్ కౌంటర్ చేయడానికి ఎస్. ఐ ప్రసాద్ కారణం అని భావించిన సంఘ వ్యతిరేక శక్తులు అందుకు ప్రతిగా అతని మీద ప్రతీకారాన్ని తీర్చుకున్నాయి.
అతనిని కాపాడబోయిన అతని భార్య ప్రాణాలు పోగొట్టుకున్నది.
వీరవనితగా నిలిచిపోయిందామె.
అప్పటికి అతనికి పెళ్ళయి ముచ్చటగా మూడేళ్ళు కూడా నిండలేదు.
అంతలోనే ఆమెను మృత్యువు అలా పొట్టన పెట్టుకున్నది.
అప్పటి నుండి తల్లిలేని పిల్లలకు అతనే సర్వస్వం అయ్యాడు.
తనకు ఎదురయిన విషాదాన్ని తలరాతలా భావించాడే తప్ప ఉద్యోగ ధర్మాన్ని మరచిపోలేదు.
"మిస్టర్ ప్రసాద్.....ఇప్పుడు మీ పిల్లలకు తల్లి అవసరం ఎంతయినా వుంది.....మరొకసారి ఆలోచించండి" సానుభూతిగా అన్నది ధీరజ.
ఒకక్షణం పాటు ధీరజ వైపు సున్నితంగా చూశాడు అతను.
"మీరు అన్నట్టు నా పిల్లలకు తల్లి కావాలని వచ్చే ఆమె సవతి తల్లి అవుతుందే కాని తల్లి కాలేదుగా.....ఆ వచ్చే ఇల్లాలు ఆ పిల్లలను తన సంతానంగా భావించాలని ఎక్కడ వున్నది? అందుకే అలాంటి ప్రయత్నాలు చేయదలచుకోలేదు." అని కూర్చున్న వాడల్లా లేచాడు ఎస్. ఐ. ప్రసాద్.
అతని ముఖం కందిపోయి ఉండడం గమనించింది.
ధీరజ మనస్సు చివుక్కుమన్నది.....
తనేమయినా అతనిని హార్టు చేయలేదు కదా....
తన మనసులోని మాట చెప్పిందే తప్ప అతనిని భాధించడం తన అభిమతం కాదు. ఉన్నట్టుండి ఆమెను సునీల్ జ్ఞాపకాలు కలవరపరిచాయి...
ఇప్పుడు అతను వైజాగ్ లో ఏం చేస్తున్నట్టు?
ఏమి చేయకుండా వుంటే వైజాగ్ వదిలి తన దగ్గిరకు ఎందుకు రాలేకపోతున్నాడు?
తను ఇంకా గుడ్డిగా అతనినే కలవరిస్తూ ఒంటరి జీవితం గడుపుతుంది కానీ సునీల్ అసలు తను గుర్తుందో లేదో....ఏమాత్రం ఉండి వున్నా ఈ ఎనిమిదేళ్ళ కాలంలో ఒకసారి అయినా తనను కలుసుకుని వుండేవాడు.
కనీసం ఫోన్ కాల్ లోనయినా కాంటాక్ట్ చేసి వుండేవాడు.
అలా చేయలేదు కాబట్టే అసలు సునీల్ కు ఏమయిందో ననే సందేహం ఆమె మనస్సుని పట్టి పీకుతున్నది...
తను తన సబార్డినేట్ ప్రసాద్ ను గురించి జాలిపడి సలహా ఇచ్చింది. ఒకవిధంగా అతను సంస్కార వంతుడు కాబట్టి తన మాటలను విని మౌనం వహించాడు. అదే ఇంకొకరు అయితే అలాంటి సందర్భాన్ని ఇంకొక విధంగా మలుచుకునేవాడు.....
అతనికి తను ఇచ్చిన ఉచిత సలహా తిరిగి అతను తనకు ఇచ్చి వుంటే.....తను ఏం సమాధానం చెప్పగలిగి వుండేది?
ఇంకా నయం ....మీకు అభ్యంతరం లేకుంటే నన్ను పెళ్ళి చేసుకోగలరా? అని అడగనందుకు సంతోషించాలి....
నిజానికి అతను తనను పెళ్ళి చేసుకుంటానని అడిగితె తప్పు ఏంటీ? వయస్సు బేధం.....అధికార బేధం ? తప్ప అతనికి లేని అర్హత ఏమిటి?
ఆ భావనకే ఆమె మనస్సు అదోలా అయిపొయింది.
ఇంకా తన మనస్సు పొరలలో నుండి సునీల్ చెరిగిపోలేదు.....తను సునీల్ ను మరచిపోలేదు.....అతనిని తప్ప తన జీవితంలోకి మరెవరినీ ఆహ్వానించలేదు.... అన్నది సత్యం.
అది తన అంతరాత్మ బోధన.
ధీరజ ఆలోచనలో ఉండగానే ఫోన్ మోగింది.
రిసీవర్ తీసింది....
డి.ఎస్. పి . లైన్ లో వుండడంతో ఎలర్ట్ అయింది.
ఫోన్ మాట్లాడం అయి పోయాక....
"మిస్టర్ ప్రసాద్ ....యూ కెన్ అటెండ్ యువర్ డ్యూటీ."
అతనితో సంభాషణను అలా కట్ చేసి డి.ఎస్. పి. ఆఫీసుకు బయలుదేరింది ధీరజ.
* * *
వైజాగ్ సిటీ....
సాయంత్రం ఐదు గంటల సమయం కావడం వలన సిటీ బస్సులు అన్నీ కిటకిట లదిపోతున్నాయి.
ఆఫీసుల నుంచి వచ్చేవాళ్ళు .....కాలేజీ స్టూడెంట్స్ తో బస్ స్టాపులు కళకళ లాడుతున్నాయి.
ఇద్దరు యువతులు చాలాసేపటి నుంచి ఆ బస్ స్టాప్ లో నిలుచుని వున్నారు.
వాళ్ళ బస్ ఎంతకూ రాకపోవడంతో మెల్లగా కబుర్లలోకి దిగారు.
"లలితగారూ ! మీవారు కాంప్ కు వెళ్ళినట్టున్నారు?"
"అవును..... అందుకేగా మీతో సినిమాకు వచ్చాను. అదే మీరు లేకపోతే నేను ఒకదాన్నే ఈ సిటీలో ఒంటరిగా రావడమే."
అప్పుడే హీరో హోండా పై వస్తున్న ఓ యువకుడు ఆ బస్ స్టాప్ దాటి వెళుతూ వాళ్ళను చూసి వెంటనే టక్కున బ్రేక్ వేసి సర్రున బండిని వెనక్కు తిప్పాడు.
దాటినంత వేగంగా తిరిగి వచ్చి వాళ్ళ ముందు ఆగాడు.
"హయ్ లలితా?" అంటూ పకలరించాడతను.
"హలో సునీల్! బాగున్నావా?" అన్నదామె.
సునీల్ హీరో హుండాకు స్టాండ్ వేసి వాళ్ళని సమీపించాడు.
"ఏమిటీ? ఈ మధ్య బొత్తిగా కనిపించడం మానేశావు?"
"ఎంతో పరిచయం ఉన్నదానిలా మాట్లాడుతున్నది లలిత.
"ఆడవారి మాటలకు అర్ధాలు వేరులే అన్నట్టు .....చూశావా నింద నా మీదనే వేస్తున్నావు. ఈ మధ్య ఫోన్ చెయ్యడం మానేసింది నువ్వు చెప్పాపెట్టకుండా కలవడం మానేసి ఇప్పుడు కనబడి తప్పు అంతా నాదే అన్నట్టు మాట్లాడుతున్నావు."
"అదేమీ లేదులే సునీల్.
ఆ ఇద్దరి సంభాషణను ప్రేక్షకురాలిలా వింటున్నది రమణి.
"లలితా ! ఇంతకూ మాటలతోనే కాలక్షేపం చేస్తావా? ఇంటికి రమ్మని పిలిచేది ఏమయినా వుందా లేదా?" నవ్వుతూ అన్నాడు అతను.
"రమణీ! ఈయన మా ఫామిలీ ఫ్రెండ్-----పేరు సునీల్....."
అంటూ తన స్నేహితురాలికి అతనిని పరిచయం చేసింది లలిత.
"నమస్తే!" అంటూ మర్యాదగా పలకరించాడు అతను.
పరాయి మగవాడితో అంతసేపు బస్ స్టాప్ లో మాట్టాడమూ .... చుట్టూ పక్కల వాళ్ళ చూపులు తమనే తినేసేలా చూస్తుండడమూ గమనించిన రమణి చాలా ఇబ్బందిగా ఫీల్ అయింది.
"మా ఇంటిలోనే రమణి అద్దెకు వుంటున్నది. మా వారికి ఈ మధ్యనే ఒక ప్రవేట్ కంపెనీలో సేల్స్ రిప్రజెంటేటివ్ గా ఉద్యోగం దొరికింది. కాష్ కలక్షన్ కోసం మా వారు ఎప్పుడూ కాంప్ లకు వెళుతున్నారు. అందుకే ఒంటరితనం పోతుందని తోడుగా వుంటారనే ఉద్దేశంతో క్రింది పోర్షన్ ను రమణికి అద్దెకు ఇచ్చాను."
"అవి అన్నీ ఇక్కడ మట్టాడుకోవడం ఎందుకు? అంత బాగా పరిచయం వున్న వారయితే ఇంటికి పిలవండి. ఇంటికి వెళ్లి టీ తాగుతూ మాట్టాడుకోవచ్చు."
సలహా ఇచ్చింది రమణి.
'అదిగో చూశావా.....? ఇప్పుడే పరిచయం అయిన మీరు అయితే పిలిచారు గాని....రెండు సంవత్సరాల నుంచి స్నేహితురాలు అయిన తను మాత్రం పిలవలేక పోయింది."
"అది ఏమీ లేదులేవయ్యా.....సరేలే ఇప్పుడు పిలుస్తున్నాను కదా.... ముందు ఒక అటో పిలిచి మమ్మల్ని ఇంటికి చేర్చు" లలిత గారాలు పోతూ అడిగింది.
సునీల్ అటుగా వెళ్ళే ఆటోని పిలిచాడు.
రమణి, లలిత అటో ఎక్కి కూర్చున్నారు.
వాళ్ళ వెనుకనే హోండా బయలుదేరింది.
లలిత ఇంటి దగ్గర ఆగాక సునీల్ అటో ఫేర్ చెల్లించి వాళ్ళతో పాటు ఇంటిలోకి నడిచాడు.
హాలులో వాళ్ళను కూర్చోబెట్టి టీ పెట్టడానికి లోనికి వెళ్ళింది లలిత.
టీ తెచ్చేవరకూ రమణి, సునీల్ ఏదో ఒకటి మాట్టాడుతూనే వున్నారు. టీ కప్పులతో లలిత రావడం చూసి ఆ ఇద్దరి మాటలు ఆగిపోయాయి.
తను వెళ్ళేటప్పుడు దూరదూరంగా కూర్చుని వున్న వాళ్ళిద్దరూ ఇప్పుడు ఎంతో దగ్గరగా కూర్చుని వుండడం . తనను చూడగానే ఖంగారు పడిపోవడం లలిత గమనించినా గమనించనట్టే మౌనం వహించింది.
"ఏమండోయ్ రమణిగారూ! మీరు మా లలితతో ఎలా వేగుతున్నారండీ బాబూ?" చిరునవ్వుతో అన్నాడు అతను.
అతనివేపు వింతగా చూసింది రమణి.
"మీరేమంటున్నారో నాకు అర్ధం కావడం లేదు."
"ఓహో....? విషయం చెప్పనేలేదు కదూ? లలిత ఒక సినిమాల పురుగు! రిలీజ్ అయిన ప్రతి క్రొత్త సినిమా చూడవలసిందేనని పట్టుపడుతూ వుంటుంది. మీకు కొత్త కాబట్టి ఇప్పుడు ఇబ్బంది పెడుతూ వుండకపోవచ్చు కానీ మీరు దగ్గరై పోయారు అనుకోండి......ఇక అంతే సంగతులు....."
పెద్దగా అని వాళ్ళిద్దరి ముఖాల వేపు పరిశీలనగా చూశాడు సునీల్.
"అబ్బ.....? వూరుకో .....నిజం అనుకుంటారు."
"ఏం నిజం కాదా.....మనం ఇద్దరం ఎన్ని సినిమాలు చూసి వుంటామో నువ్వే చెప్పు. అయినా ప్రత్యక్ష సాక్షిని నేనే వుండగా నిన్ను అడగడం ఎందుకు?"
