Previous Page Next Page 
ది పార్టనర్ పేజి 6

 

    "నువ్వు ప్రయత్నిస్తే అతని మనస్సులో రేగిన గాయాన్ని తుడిచి వెయ్యగలవు . నాకు ఆ నమ్మకం వుందమ్మా.....నాకళ్ళ ముందు చిలకా గోరింకల్లా తిరిగిన మీ ఇద్దరూ చివరకు చూస్తుంటే నాకే భాధగా వుందమ్మా...."
    "కొందరి జీవితాలు అంతే మాష్టారు.... విధి ఆడించినట్లు ఆడక తప్పవు" విరక్తిగా అంటూ లేచి నిలుచుంది ధీరజ.
    "ఏమిటమ్మా.....అప్పుడే వెళ్ళిపోతావా?"
    'అవును మాష్టారూ ... వచ్చినపని అయింది.....సునీల్ ఇంకా ఈ ఇంటిలోనే వుంటున్నాడేమోనని ఎలా వున్నాడో పలకరించి పోదామని వచ్చాను. ఈసారి ఎప్పుడయినా సునీల్ మీకు కనిపిస్తే నేను వచ్చి వెళ్ళానని చెప్పండి. వీలయితే కనీసం ఒకసారి నాతొ ఫోన్ లో నయినా మట్టాడమని చెప్పండి."
    భారమయిన మనస్సుతో వెనుదిరిగింది ధీరజ.
    "అలాగే తల్లీ..."
    అంటూ కళ్ళు వత్తుకున్నాడు అయన.
    ఏ బంధమూ లేకపోయినా కేవలం రెండు సంవత్సరాలు గది అద్దెకు తీసుకుని వస్తూ పోతూన్నందుకే నారాయణ మాష్టారూ ఆ ఇద్దరి ఎడబాటుకు తల్లడిల్లి పోతున్నారు.
    ధీరజ కళ్ళముందు గతించిపోయిన గతం మెదులుతున్నది.....

    
                                                           *    *    *

    ఎగిరిపడుతున్న సముద్రపుటలల వేపు దీక్షగా చూస్తున్నాడు సునీల్.
    అతను కూర్చున్న రాతిబండను వేగంగా వచ్చి డీ కొంటున్నాయి కెరటాలు....
    వచ్చినంత వేగంగా వెనుదిరిగి పోవడం వలన నీటి తుంపర్లు వర్షంలా ఎగసి పడి సునీల్ ను ముంచెత్తుతున్నాయి.....
    అయినా అతనిలో చలనం లేదు...
    ఉన్నట్టుండి మెత్తని స్పర్శ అతని భుజాన్ని తాకడంతో ఉలిక్కిపడి వెనుదిరిగి చూశాడు.
    ఎదురుగా ధీరజ.
    గులాబీ రంగు చీరలో ....దివి నుండి దిగివచ్చిన అప్సరసలా వెన్నెల వంటి చల్లని చూపులతో అప్యాయతాను రాగాలను కురిపిస్తూ కనిపించింది.
    ఆమె ముఖంలోకి సూటిగా చూసే ధైర్యం లేకనో......మరెందువలనో వెంటనే చూపులను మరల్చుకున్నాడు.
    అతని పక్కనే కూర్చుంటూ పరిశీలనగా చూసింది ధీరజ.
    "సన్నీ డియర్....ఏమిటలా డల్ గా వున్నారు.....ఎనీ ధింగ్ రాంగ్!"
    సునీల్ బదులు చెప్పలేదు.
    'నిన్నే డియర్.....మాట్లాడవేం....ఏమయింది ఇప్పుడు?"
    "ఏమీ కాలేదనే నా బాధంతా?"
    "సన్నీ లివీట్.... నీ టాలెంట్ ను గుర్తుంచక పోవడం వాళ్ళ ఖర్మ. అంతే తప్ప ఏదో సర్వస్వం కోల్పోయినట్టు అంతగా డీలా పడిపోతే ఎలా?" అనునయంగా అన్నది ధీరజ.
    "ఎలా సరిపెట్టుకోమంటావు ధీరూ.....నేను ఎంతగా పోలీస్ సెలక్షన్స్ కోసం రాత్రింబవళ్ళు శ్రమించానో నీకు తెలియదూ.....ఎప్పటికయినా పోలీస్ ఆఫీసర్ కావాలనే నా కలలు కల్లలుగానే మిగిలిపోయాయి. పోలీసులు అంటే ఏమిటో నిజాయితీగా వుంటే ఈ సమాజానికి ఎంత మంచి చేయవచ్చో.....అరాచకత్వాన్ని ఎలా అణచి వేయాలో నాలో నేనే వూహల్లో విహరించి అహర్నిశలూ కృషి చేసి అన్ని స్పోర్ట్స్ ఛాంపియన్ అనిపించుకున్న చివరకు నాకు దక్కిందేమిటి? ఈ మొద్దు శరీరం. నాకన్నా ఎలాంటి అర్హతలు లేని కొందరు అనామకులు అయితే సెలెక్ట్ కాగలిగారు. ఆ అదృష్టం నాకు లభించలేదు. ఇంటర్వ్యు బాగానే చేశాను కాని సెలక్షన్ మిస్సయింది. నాపేరు సెలక్షన్ లిస్టులో మొదటిపేరుగా వుంటుందని భావించాను, కాని నా ఆలోచనలు తలక్రిందులయి అయ్యాయి.... అందుకే నా టాలెంట్ మీద నా క్వాలిఫికేషన్ మీదా..... చివరకు ఈ జీవితం మీదే నమ్మకం పోతుంది.' నిరాశగా అన్నాడు సునీల్.
    "ఇప్పుడు కాకపోతే ఇంకోసారి ప్రయత్నించవచ్చు. అయినా మన ఇద్దరిలో ఎవరు సెలక్ట్ అయినా ఒకటే కదా - నేను సెలెక్ట్ అయినందుకయినా నువ్వు ఆనందించాలి. ఆ ఆనందాన్ని ఇద్దరమూ కలిసి పంచుకుందాం.... బి హేపీ సన్నీ"
    అతనిని మూడ్ లోకి తీసుకువచ్చే ప్రయత్నం చేసింది ధీరజ.
    "ధీరూ.....నాకు ఎటూ ఆ అదృష్టం లేకపోయినా కనీసం నువ్వు అయినా సెలక్ట్ అయినందుకు నాకన్నా ఎక్కువ సంతోషించే వాళ్ళు ఎవరూ ఉండరు.....ఆ విషయం నీకూ తెలుసు....అయినా జరిగింది కళ్ళముందు మెదులుతుంటే నా మనస్సుకి సర్ది చెప్పుకోలేక పోతున్నాను."
    "అబ్బ....సన్నీ.....ఎంతసేపూ బాధపడుతూ కుర్చోవడమేనా? మాంచి హిందీ పిక్చర్ ఆడుతుంది. నువ్వు తప్పక వస్తావనే రెండు టిక్కెట్లు తెచ్చాను.....కమాన్ వెళదాం..." అంటూ బలవంతంగా అతనిని లేవదీసింది ధీరజ.
    అన్యమనస్కంగానే సునీల్ ఆమె వెంట నడిచాడు.
    విసురుగా వచ్చిన కెరటం మరింత వేగంగా వచ్చి ఆ కొండరాతిని డీ కొన్నది. నీటి తుంపర్లు ఒక్కసారిగా తన ముఖాన్ని ముంచెత్తడంతో ధీరజ త్రుళ్ళి పడింది, కలవరపాటుగా చూసిందామె...
    ఎదురుగా నిశ్చలంగా వున్న సముద్రం ....అలలు ఉండుండి వేగంగా కదిలి తీరం వైపు వస్తున్నాయి.....తను నిలుచున్న రాతిబండ చాలా ఎత్తుగా ఉన్నది కావడం వల్ల పెద్ద కెరటం వచ్చినప్పుడు తప్ప నీటి జల్లు మీద పడదు.
    ఎనిమిది సంవత్సరాల నాటి జ్ఞాపకాల నుండి వర్తమానంలోకి వచ్చింది ధీరజ.
    బరువెక్కిన గుండెలతో ఆ పరిసరాలలో సంచరించిన గత స్మృతులను నెమరు వేసుకుంటూ ఇన్ స్పెక్టర్ ధీరజ అప్పటికే ఆమె వైజాగ్ వచ్చి రెండు రోజులయ్యింది. ఆ కేసులో మిస్టరీని చేదించడానికి అవసరమైన ఏర్పాట్లు అన్నీ చేసి విజయవాడకు ప్రయాణమయింది ధీరజ.
    సెక్షన్ డ్యూటీకి వచ్చిన ఎస్. ఐ . ప్రసాద్ సెల్యూట్ చేయడంతో చిరునవ్వుతో గ్రీట్ చేసింది ఇన్ స్పెక్టర్ ధీరజ....
    "కమాన్ టెక్ యువర్ సీట్"
    ఆమె ఎదురుగా వున్న సీట్ లో కూర్చున్నాడు ఎస్. ఐ.
    "మీరూ రోజూ అరగంట ఆలస్యంగా వస్తున్నారు , ....ఎనీ ధింగ్ రాంగ్ ఎట్ యువర్ హౌస్."
    "సారీ మేడమ్ .... పిల్లలు ఇద్దరినీ తయారు  చేసి కాన్వెంటుకు పంపిన తరువాత బయలుదేరాలి. అందుకే ఉదయం అప్పుడప్పుడూ ఆలస్యం అవుతుంటుంది....."
    "మీరు చేయడం ఏమిటి , మరి మీ మిసెస్..."
    "లేదు... ఈ లోకంలోనే లేదు....ఐ యామ్ విడోవర్."
    "ఐ యామ్ సారీ.....నాకు ఆ విషయం తెలియదు...." నొచ్చుకుంటూ అన్నది ధీరజ.
    "ఇట్స్ అల్ రైట్ మేడమ్...."
    "మరి మీరు డ్యూటీ నుంచి తిరిగి ఇంటికి వెళ్ళేంతవరకూ పిల్లలు ఒంటరిగానే వుంటారా? ఒకవేళ నైట్ డ్యూటీ లో మీరు వుండిపోతే పిల్లలు ఎలా వుండగలరు? మరో ప్రత్యామ్నాయం ఏదయినా ఆలోచించక పోయారా"
    "అంటే....." అతను అర్ధం కానట్టు అడిగాడు.
    "ఇటు సంసారా బాధ్యతలూ....అటు ఉద్యోగ ధర్మానికి రెండింటికీ న్యాయం చేయాలంటే మీరు మరల వివాహం చేసుకుంటే బాగుంటుందేమో మీకు సేవలు చేయడానికి పిల్లలకు తోడుగా వుండడానికి."
    ధీరజ మాటలు పూర్తీ కానేలేదు...
    "సారీ మేడమ్ ....ఆమెను మరచిపోలేక పోతున్నాను....అయినా మరలా నన్ను అర్ధం చేసుకునే స్త్రీ తారస పడలేదు. అందుకే ఆ విషయం గురించి నేను సీరియస్ గా ఆలోచించలేదు.
    ఎస్. ఐ. ప్రసాద్ ఒట్టి సిన్సియర్ మాత్రమే కాదు.....దురదృష్టం కాలనాగులా కాటువేసిన సబ్ ఇన్ స్పెక్టర్ కూడా....!


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS