Previous Page Next Page 


    జయరాం వెళ్ళగానే సురేష్ ఎదురొచ్చి చెప్పాడు. అంబిక హాస్పిటల్ కి వెళ్ళి వస్తుంటే నలుగురు నాలుగు విధాలుగా అని నవ్వుకొంటున్నారని నీలతో చెప్పి బాధపడటం మామూలయిపోయిందని ఆరోజు ఎవరో అంబిక హాస్పిటల్ నుండి యింటికొస్తుంటే ఆమెకు వినిపించేటట్లుగా అన్నారని జయరాం అనే అతనితో ఈ డాక్టర్ లేచి వెళ్ళిపోయిందని చెప్పుకొని నవ్వుకుంటుంటే విని భరించే శక్తిలేక ఆమె ఇంటికి వచ్చి ఆ రాత్రి ఏడుస్తూ చివరికి చచ్చిపోవాలని నిశ్చయించుకొని ఆత్మహత్య ప్రయత్నం చేస్తే తన భార్యకి అనుమానం వచ్చి తలుపుతట్టి తియ్యకపోతే తనను లేపిందని, తలుపులు తీసుకొనివెళితే ఇంకేమిటి కాస్తలో ఆమె ప్రాణం పోయేదంటూ వివరంగా చెబుతుంటే జయరాం నిశ్చేష్టుడై నిలబడిపోయాడు.


    నిద్రలోంచి లేచి నడిచినట్టు మెల్లగా ఆమె గదిలో కెళ్ళాడు.


    అతన్ని చూసి నీల ఇవతలకి వచ్చేసింది.


    అంబిక మంచంమీద బోర్లా పడుకొని ఏడుస్తుంటే ఏమనాలో తోచలేదు.


    అలా క్షణంసేపు నిలబడి మెల్లగా పిలిచాడు. "అంబికా!" అతని స్వరం అతనికే వింతగా గమ్మత్తుగా అనిపించింది.


    అతనికి ఊహ తెలిసిన దగ్గరనుండి అలా మెత్తగా మృదువుగా ఎవర్నీ పిలవలేదు.


    అది అతనికి మొదటిసారి అలా పిలవడం.


    ఆమె మాట్లాడలేదు.


    దగ్గరగా వెళ్ళి ఆమె భుజంపై చెయ్యివేసి మృదువుగా పిలిచాడు.


    అతని చేతిని తీసేసి మంచంమీదనుండి లేచి నిలబడింది, పైట చెంగుతో కళ్ళు తుడుచుకొంటూ.


    "సురేష్ నాకు అంతా చెప్పాడు. ఇంత చదువుకున్న మీరుకూడా అందరి ఆడపిల్లల్లాగే పిరికిగా ప్రవర్తించడం నాకు నచ్చలేదు" అన్నాడు.


    ఆమె అతనివేపు తిరగలేదు.


    "మీ ప్రవర్తన నాకు నచ్చలేదు. మీరు ఎంతో ధైర్యవంతులుకున్నాను. ఇంత పిరికివారనుకోలేదు" అంది.


    "నేను పిరికివాడ్నా?" అడిగాడు.


    "కాకపోతే మీరు నాకు చెప్పిందేమిటి? చేసిందేమిటి? మీరు నిజంగా ధైర్యవంతులే అయితే నన్ను మీ ఇంటికే తీసుకెళ్ళి ఉండేవారు. ఇక్కడ ఎందుకు అట్టే పెడతారు! దీనివలన నేను ఎన్ని అవమానాలకి గురయ్యానో తెలుసా!" అంది గిర్రున ఇటు తిరిగి అతనివేపు చూస్తూ. అతను వెంటనే సమాధానం చెప్పలేకపోయాడు.


    మెల్లగా అన్నాడు "నిన్ను మా ఇంటికి తీసుకెళ్ళటానికి నాకు ఏమి అభ్యంతరం లేదు. కాని...." అంటూ ఆగాడు.


    "ఏమిటో సరిగ్గా చెప్పండి" అంది. అంబిక ముఖం పీక్కుపోయి మనిషి నీరసంగా ఎలాగోవుంది.


    తను అంతకుముందు చూసిన అంబికకు ఈ అంబికకు చాలా తేడా ఉందనిపిస్తుంది. అంతగా మారిపోయిందనుకున్నాడు.


    "నిన్ను ఇంటికి తీసుకెళితే మా అమ్మ నాన్నగారు ఏమనుకుంటారు? ఏమయినా అనుకుంటే నాకు బాగుండ"దన్నాడు మెల్లగా.


    "ఊళ్ళో వాళ్ళందరూ అలా అనుకుంటుంటే మీకు బాగుందా?" సూటిగా ప్రశ్నించింది.


    "నిజమే బాగోలేదు కాని నన్నేం చెయ్యమంటావో చెప్పు! నీవు ఎలా చెయ్యమంటే అలా చేస్తాను" అన్నాడు మెల్లగా.


    "నిజంగా అంటున్నారా! ఆ మాటలు."


    "నిజంగానే, నాకు రెండుమాటలు చెప్పటం చేతకాదు. చెప్పు నీవు ఎలా చెయ్యమంటే అలాగే చేస్తాను" అన్నాడు.


    "అయితే నే చెప్పినట్టు వింటారా! నేను చెప్పినట్టు చేసి అందరి నోర్లు మూయిస్తారా?"


    "తప్పకుండా, ఏమిటో చెప్పు" అన్నాడు. ఈసారతని ముఖములో ఉషారు కళ్ళలో కాంతి వచ్చాయి.


    "నన్ను పెళ్ళిచేసుకొని, మీ భార్యగా మీ యింటికి గౌరవంగా తీసుకెళ్ళండి. అప్పుడందరి నోళ్ళు
మూతపడతాయి. మన పెళ్ళయిపోతే మనల్ని ఎవరూ హేళన చేయలేరు" అంది ఆవేశంగా.


    ఆ మాట విన్నంతనే అతని ముఖం ఒక్కసారి గంభీరంగా మారిపోయింది.


    "క్షమించాలి ఆ పని మాత్రం నేను చెయ్యలేను. నా పెళ్ళి నా ఇష్టం కాదు" అన్నాడు ఖచ్చితంగా చెప్పేస్తూ. అంతే అంబిక ముఖం కోపంతో ఎర్రబడిపోయింది. తీక్షణంగా చూస్తూ సూటిగా అడిగేసింది.


    "ఇదా మీ ధైర్యం, ఇంకా ఏమో అనుకున్నాను. సాయం చెయ్యమని మిమ్మల్ని కోరాను. ఇంత పిరికివారనుకోలేదు. మీతో కలిసి ఎప్పుడయితే గుమ్మందాటి వచ్చానో నా జీవితాన్ని మరోవిధంగా నా చేతులారా నాశనం చేసుకున్నానని బాధపడుతున్నాను. ఇల్లుకాలిన తరువాత ఆకులు పట్టుకులాగితే ప్రయోజనంలేదు, అలాగే ఇప్పుడు నేను విచారించినా లాభంలేదు. నా తొందరపాటుకి నా తెలివితక్కువ తనానికి పరిష్కార మార్గం ఒకటే" అంది ఆవేశంగా.


    ఏమిటి అన్నట్టు చూశాడు.


    "ఆడపిల్లకి పరువు పోయిన తరువాత బ్రతుకులేదు. నా ఈ జీవితాన్ని ఇంతటితో ఆపేయటం ఒక మార్గం, లేదా అన్ని అవమానాలను సహించి చివరకు కృష్ణమౌలి ఇంటికే వెళ్ళిపోవటం రెండవ మార్గం, అంతే ఏదో ఒకటి నేను చెయ్యాలి తప్పదు" అంది.


    ఆ మాటలతన్ని హేళనచేసి ఎత్తిపొడిచినట్టుగా అనిపించాయి.


    అతన్ని ఆమె పిరికివాడిగా జమకట్టిందని ఆవేశంతో ఊగిపోయాడు.


    ఆమె ప్రాణం తీసుకొంటే కారకుడు తనవుతాడు.


    అందరి దృష్టిలో తను ఒక మోసగాడుగా అనుకుంటారు. కృష్ణమౌలి అంటే తనకి చిన్నప్పటినుండి అసలు పడదు అతనింటిలోనుంచి ధైర్యంగా తీసుకువచ్చిన అంబికను కృష్ణమౌళికి ఓడిపోయినట్టుగా తిరిగి పంపిం చేసినట్టు అనుకుంటారు అంతా....


    అది తనకి మరీ పెద్ద అవమానం.


    క్షణంసేపు ఆలోచనతో సతమతమయిపోయాడు.


    అతని బుర్ర గిర్రున తిరగసాగింది.


    ఇప్పుడు ఏం చెయ్యాలి!


    అంబిక విషయంలో తను ఓడిపోయి కృష్ణమౌళి ముందు తల వంచటమా!


    వీల్లేదు అలా జరగడానికి వీల్లేదు, అతని మనసులో కోపం కట్టలు త్రెంచుకుంది, ఐతే ఇప్పుడు ఏం చెయ్యాలి? అప్రయత్నంగా అతను అంబికవేపు చూశాడు. మొట్టమొదటిసారిగా అతని మనసులో తియ్యని రాగం పలికినట్టయింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS