Previous Page Next Page 
సౌందర్య దీపం - 2 పేజి 6


    దీని పర్యవసానం ఏమిటి?


    ఎన్ని మాటలంటున్నారు. కావాలనే అంటున్నారు. కృష్ణమౌలి లేని సమయంచూసి అతను పెళ్ళి చేసుకోబోయే అమ్మాయిని ఇతను లేవదీసుకు వచ్చి వేరే యిల్లు చూసి పెట్టాడని.


    బాగా రెండు చేతులా సంపాదిస్తున్న పిల్లని వలవేసి పట్టి తనవేపుకి తిప్పుకున్నాడని.


    ఇంక రకరకాలుగా అనసాగారు.


    ఆలోచిస్తుంటే కావాలని తను రావటంచూసి అలా అంటున్నారని తను రాగానే ఏమీ తెలియనట్లు ఉండిపోయారని తెలుస్తుంది.


    అంటున్నవాళ్ళు ఎవరో తనకి అసలు పరిచయంలేదు. పదిమంది వరకూ ఉంటారు వాళ్ళు.


    ఇంతవరకూ తనని ఎదిరించి మాట్లాడినవాళ్ళు లేరు. ఎంత ధైర్యంగా అన్నారు.


    కావాలని వైరం తీసుకురావడానికే వాళ్ళలా అన్నారనిపిస్తుంది.


    వాళ్ళేకనుక అడ్డు తగలకపోతే వాళ్ళందర్నీ చిత్తుగా తన్ని వదిలేవాడు.


    అతని మనసు అవమానాలతో ఆవేశంతో కుతకుతలాడిపోతుంది.


    రాత్రి తొమ్మిదిగంటలవుతుండగా అతని ఫ్రెండ్సు ఇద్దరు ఫంక్షన్ కు వచ్చినవాళ్ళు జయరాం యింటికి వచ్చారు.


    అతని గదిలోకి తీసుకెళ్ళాడు వాళ్ళయిద్దర్నీ.


    ఆ ఫ్రెండ్సు ఇద్దరు మొదట కాసేపు ఏదో విషయం మాట్లాడి అసలు విషయానికి వచ్చారు.


    "వాళ్ళ యింట్లో జరిగిన విషయం తలుచుకుంటే మాకు చాలా బాధగా ఉంది. నీవు మంచిపనిచేసినా వాళ్ళు అర్ధం చేసుకోకుండా నిన్ను అలా అంటుంటే...." అంటూ మాటలు ఆపేశారు.


    జయరామ్ ముకం కందగడ్డలా అయింది.


    పళ్ళు బిగించి మనసులో కోపం బలవంతంగా ఆపుచేయసాగాడు.


    తలుచుకుంటుంటే కోపం ఆగటంలేదు అతనికి. వాళ్ళు మెల్లగా చెప్పసాగారు.


    "నీ ఉద్దేశం మంచిదే కావచ్చు కాని లోకులు కాకులు అన్న సంగతి నీవు మరువకూడదు నీవు ఎంత మంచిపనిచేసినా ఏదో వంకలు పెడుతూనే వుంటారు. ఒక వయసులో ఉన్నావుగా వయసుల వున్న ఆడపిల్లని ఎవరికీ తెలీకుండా తీసుకెళ్ళి వేరే యింటిలో ఉంచితే అలాగే అంటారు."


    "దీనిలో తప్పేమిటి! నేను కావాలని చెయ్యలేదే, ఆమె నా సహాయం కోరింది" అన్నాడు జయరాం.


    "ఆ విషయం మేము నమ్ముతాము కాని వాళ్ళు నమ్ముతారా!"


    దెబ్బతిన్నట్లు చూశాడు.


    "మా మాటవిని ఆ అమ్మాయిని ఎక్కడికయినా పంపించేయి" అన్నారు వాళ్ళు.


    అతను తల అడ్డంగా తిప్పాడు. ఆ పనిమాత్రం నేను చెయ్యలేను అన్నట్లు.


    "ఎందుకని?" అడిగారు.


    "కృష్ణమౌళి అందరూ అనుకున్నంత మంచివాడు కాదు. అతన్ని పెళ్ళిచేసుకోవటం ఆమెకు ఇష్టంలేదు. అందుకే నా సాయం కోరింది. నేను ఆమెకు సాయం చేశాను. ఎవరో ఏదో అన్నారని ఆమెను అక్కడికి పంపించలేను" అన్నాడు ఖచ్చితంగా చెప్పేస్తూ.


    "అయితే ఏమి చేద్దామని నీ ఉద్దేశం?"


    "ఏమీ అనుకోలేదు" ముక్తసరిగా చెప్పేశాడు.


    "అలా అయితే ఎలా! ఆమె అక్కడ ఎన్నాళ్ళు ఉండగలదు?"


    అతను మాట్లాడలేదు.


    "ఈ విషయం ఇంకా అందరినోటా పాకితే ఆమె జీవితం నాశనం అవుతుంది. ఆమెను పెళ్ళి చేసుకోవటానికి ఎవరూ ముందుకురారు."


    జయరాం ఆలోచనల్లో పడిపోయాడు.


    అతనివేపు పరీక్షగా చూస్తూ అనసాగారు.


    "నీ చేతులారా ఆమె జీవితాన్ని పాడుచేస్తున్నావనిపిస్తుంది."


    "నేనా!" ఆశ్చర్యంగా చూశాడు.


    "నువ్వే" అన్నారు ఖచ్చితంగా చెప్పేస్తూ.


    "అయితే నన్నేం చేయమంటారు?" అదోలా అడిగాడు.


    "దానికి రెండే మార్గాలు బాగా ఆలోచించుకో. ఒకటి ఆ అమ్మాయిని ఎక్కడికయినా పంపించేయటం. రెండవది.... " అంటూ క్షణం ఆగి చెప్పారు వాళ్ళు.


    ఆతృతగా చూశాడు వాళ్ళవేపు.


    "డాక్టర్ అంబికను నీవు పెళ్ళిచేసుకోవటం" అన్నారు.


    అంతే అతని ముఖం ఒక్కసారిగా ఎర్రబడిపోయింది. కొద్దిసేపు అతను ఏం మాట్లాడలేక పోయాడు.


    "ఈ రెండింటిలో ఏదో ఒకటి చెయ్యక తప్పదు" అంటూ వాళ్ళు వెళ్ళడానికి లేచి నిలబడ్డారు.


    "ఆమెను పెళ్లిచేసుకోవటం కుదరదు" అన్నాడు.


    "అయితే ఆమెను ఎక్కడికయినా పంపించేయి" తేలిగ్గా చెప్పేరు.


    "ఉహూ! అలా నేను పంపించలేను" అన్నాడు.


    వచ్చినవాళ్ళు ఇద్దరూ ముఖముఖాలు చూసుకొని అదోలా నవ్వుకున్నారు.


    "సరే నీ ఇష్టం. నువ్వేంచేస్తావో చెయ్యి" అంటూ చెప్పి వెళ్ళిపోయారు.


    అంబికను పెళ్ళిచేసుకోవడమేమిటి!


    ఆమె వింటే! ఏమనుకుంటుంది!


    ఇదంతా తన కుట్ర అనుకోడూ!


    ఆ రాత్రంతా అతనికి నిద్రపట్టలేదు. ఆ ఫంక్షన్ లో జరిగే అవమానం ఒకవేపు దహించివేస్తుంటే ఫ్రెండ్స్ ఇద్దరి మాటలు గుండెల్లో తొలిచేస్తుంటే మనసంతా ఏమిటోగా అయిపోసాగింది.


                               *    *    *

        

    తెల్లవారి ఆరుగంటలకు ఫ్రెండు సురేష్ అతనికి ఫోను చేశాడు గాబరాగా.


    డాక్టర్ అంబిక రాత్రి ప్రాణం తీసుకోబోతే నేనూ, మా ఆవిడా ఆపాం. నీవు వెంటనే రా అంటూ ఫోన్ లో చెప్పేసరికి ఎక్కడికో వెళ్ళాలనుకొని ఉదయమే లేచి తయారవుతున్న జయరాం ప్రెండు ఫోన్  చెయ్యగానే అక్కడికి వెళ్ళటం మాముకొని సురేష్ ఇంటికి గాబరాగా పరుగెత్తాడు.


    అంబిక అతను వెళ్ళేసరికి గదిలో ఏడుస్తూ పడుకుంది. నీల ఆమెను ఓదారుస్తుంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS