Previous Page Next Page 
కాంతం కాపరం పేజి 6


    "అయితే నేనూ_నీకూ_చెప్పిబోధించిన ప...ప__పద్ధతులలో ఇపుడు నీవు ఏ ఏ పద్ధతులలో వున్నట్లు" అన్నాను గుండెల మీద చెయ్యి ఆదిమ పెట్టి.

    "ఏ పద్ధతి ఏమి టండి_మన పద్ధతే! మీదంతా అదో విచిత్రమూ" అన్నది. ఆవిడ నా ఆదుర్ధాను అంతా వుదాసీన భావంతో తోసేసింది.

    కాసేపు అట్లాగే నిలబడ్డాను. నోట మాటలేదు. కంట చూపు లేదు.

    ఆలోచనా ధూమ సముద్రంలో ఊపి రాడక క్షణం సేపు కొట్టుకుని తెప్పరిల్లి.

    "చక్కగా అలంకరించుకోనైనా లేదేం" అన్నాను.

    "ఏమి అలంకరించుకొనేది? మీరు పెట్టిన ఏడువారాల సొమ్ములున్నాయి గనుకనా? అట్లా దోడ్లోకి రండి_ మాట్లాడుకుందాం సరదాగా, చెయ్యి వూరుకోలేదు" అన్నది.

    నేను పడుతున్న అవస్థ ఆమెకు ఈషణం మాత్రం కూడా తెలిసినట్లు కనపడలేదు. లేక తెలిసి కూడా నా అవస్థను ఉన్మాద విశేషం క్రింద జమకట్టి, సౌదర్యాన్ని గురించి నాకు గల భావాలను తృణీకరిస్తూన్నదేమో నాకు తెలియదు. పైగా దొడ్లోకి వెళ్ళి సరదాగా మాట్లాడాలాట!

    కూలబడిపోయినాను కుర్చీలో నారాయణ స్మరణ చేస్తూ, "ఇప్పుడేం చేయాలి" అన్నది పెద్ద? అయిపోయినది ఆలోచించాలని ప్రయత్నించాను. కాని అదేమి చిత్రమోకాని నాతల మొద్దుపారి, గ్రీకు కథలలో చెప్పినట్లుగా, ఇనుప ముద్ద అయిపోయింది.

    అరగంట గడిచిన తరువాత మెల్లగా, జలాశయంలో చిరుగాలికి జన్మించే అలలలాగ, రెండు మూడు ఆలోచనలు తట్టినవి.
    మొదటిది ఆమెను కోప్పడితే లాభం లేదన్న విషయము, కోపపడి సాధించే విషయం కాదు ఇది.

    రెండవ ఆలోచన, ఆమెను బ్రతిమిలాడితే ఏమన్నా లాభం వుంటుందా అన్న సందేహం. ఇదివరలో నేను బ్రతిమిలాడగలిగినంత బ్రతిమిలాడాను. యింక అటువంటి పనివలన ప్రయోజనం లేదని తోచింది.

    కుర్చీలోనుంచి లేచి దొడ్లోకి వెళ్ళి_ఆమెవంక తేరి పార జూచి, పొంగి వస్తున్న దుఃఖాన్ని ఆపుకొని "ఆ జుట్టు ముడి ఏమిటి? అట్లా వున్నది?" అన్నాను. వేణీబంధాలను చిత్ర విచిత్ర రీతులలో చూపిస్తున్న ఒకటి కృష్ణా పత్రికలో ప్రచురించారు. దాన్ని సంపాదించే ఆవిడకు ఇచ్చాను. అందులో చూపెట్టిన పద్ధతులలో వేణీబంధాలను సవరించుకోమని ఇదివరలో చాలా కాలాన్నుంచి చెపుతూ వున్నాను.

    "దీనికేం యిది బాగుండలేదా" అన్నది తన జడచుట్టును ముద్దుబిడ్డను నిమురుతున్నట్లు నిమురుతూ_
ఇంకేం అనేది? కూలింది హిమాలయపర్వతం కూలింది. దభేలున కూలింది!

    నేనో........?            

    విచారవేదనా దోధూయమాన మానసుడనై శుష్య దోష్టుడనై, నిదాఘ శుష్కపత్త్రం బువోలె అనార్ధ్ర గళుండనై అంతః ప్రవిష్ట నయనుండనై

    ప్రభాత శశికళా పాండుముఖచ్చాయుండనై

    వికీర్ణ హ్రస్య కేశపాశుడనై

    దభీలున మళ్ళీ కుర్చీలో కూలబడ్డాను. ఆ జుట్టుముడి చూస్తేనే కాని నా నిస్పృహకు కారణం తెలియదు.

    ఆమెను...నేను_అప్పుడు_చూచి నప్పుడు_...ఉన్న రూపం...చూస్తేనేగాని నా దీనావస్థను మీరు మనోవీధిలో చిత్రించలేరు !!

    కట్టుకొన్నది...............బీ రాకు రంగు చీర చేతిలో.........తోముతున్న  కంచు దుక్క చెంబు చేతినిండా............చింతపండు,

    మొఖాన_కానీ డబ్బంత కుంకుమబొట్టు మొత్తం_పరమ ఎంకమ్మ స్వరూపం. యిక జుట్టుముడి సంగతే!!

    ఆ బొమ్మలో చూపిన పద్ధతుల ఒకటీ ఆవిడకు నచ్చలేదు. కామాలు, ఆ పద్ధతుల చాయకే పోలేదు.

    కొండీ చుట్టఅయినా కాదు అది!

    పోనీ ముచ్చటముడి అయినా కాదు!

    నడినెత్తిన శిఖరంలాగ జడచుట్ట వచ్చేటట్లు చుట్టబడిన పరమ అసహ్యపు దరిద్రపు గొట్టు ముడి అది!

    దాని ఆకారాన్ని బట్టి, దానికి మా కొంపలో ఇది వరలోనే చేయబడిన నామకరణం పిడక చుట్ట. 

    నేను కూర్చున్న చోటునుంచి లేవలేదు. అలాగే కూర్చున్నాను నా కుర్చీలో, కళ్ళు మూతలు పడ్డాయి. వళ్ళు నీరసించిపోయింది. ఆ నిస్పృహలోనుంచి నిద్రాలోకంలోకి మెల్లగా జారాను.

    ఏమిటి నేను అపుడు స్వప్నావస్థలో చూస్తున్నది?

    ఒక పెద్ద పిడక చుట్ట,

    తరువాత రెండు,

    జతలు జతలుగా పిడక చుట్టలు,

    మూడు మూడు,

    నాలుగు నాలుగు,

    అయిదు అయిదు,

    గుంపులు గుంపులుగా,

    తండాలు తండాలుగా, ఒక పిడక చుట్టలసేన మా కొంపను ముట్టడి వేస్తున్నది.

    లోకంలో ఉన్న పిడక చుట్టలన్నీ వచ్చేస్తున్నాయి.

    కాంతం అన్నానికి పిలవటంవల్ల కళ్ళు తెరవ సంభవించింది. కళ్ళు నలుపుకొని లేచి ముఖం, కాళ్ళు కడుక్కొని, మడి గట్టుకొని భోజనానికి కూర్చున్నాను.

    కాంతం ముఖం మామూలు సౌదర్యంతో విలాసంగానే వున్నది. కాని వెనక వైపున వున్న జుట్టుముడిని చూడటానికైనా బలం లేనంత భీరువునయిపోయినాను నేను నా హృదయంలో పుట్టిన సౌదర్య తృష్ణకు తృప్తి కలగక పోవటం మూలాన, జన్మించిన తాపంతో, కుంగి కృశించిపోతూ, భోజనం పూర్తి చేశాను.

    నా గదిలోనికి వెళ్ళాను. అదే నేను చదువుకొనే గది. అదేనా పడకగది కూడాను. రతీదేవి బొమ్మ ముందుంచుకొని అందున్న సౌదర్యాన్ని చూచి ముగ్దుడనై పోతూ, ఆ బొమ్మ వ్యక్తపరుస్తున్న భావాలను ఊహిస్తూ, సౌందర్యాన్ని ఉపాసిస్తూ కూర్చున్నాను. ఎంతసేపు అలా కూర్చున్నానో తెలియదు.

    చివరకు మా ఆవిడ రాక నాధ్యానానికి భంగం కలిగించింది. ముక్కుతీరులోగాని, పెదవులకుదిరకలో గాని, కళ్ళ సౌదర్యంలోగాని మా కాంతంలో లోటు నాకు ఏమీ కనిపించలేదు. వస్త్రధారణలో కొంచెం శ్రద్ధ, చూపులలో రవ్వంత తీవ్రత వుండి, ఆమె హృదయాంతర్భాగంలో వున్న భావాలు ప్రతి అవయవము వ్యక్తపరిచేటట్లు చేస్తే ఆమె పూర్తిగా రతీదేవి అయిపోను.

    నా కోరిక మన్నించదాయే. నా ఆందోళన అర్ధం చేసుకోదాయే జుట్టుముడియైనా మార్చదాయే.

    మంచినీళ్ళ చెంబు బల్లపై పెట్టి నా బల్లకు ఆ కొసను కుర్చీలో కూర్చున్నది కాంతం.

    నేను ఆమెవంక ఒక్కనిమిషం చూచి ఒక్క నిట్టూర్పు విడిచి, మళ్ళీ రతీదేవి చిత్రాన్ని చూస్తూ తల వంచుకున్నాను. నేను చెప్పినట్లు ఆమె చేసింది కాదని నాకు కోపంగా వున్న మాట నిజమే.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS