Previous Page Next Page 
కాంతం కాపరం పేజి 5


    "అయిదుగురు పిల్లల తల్లిని నేనింకేం ప్రకాశిస్తాను లెండి!" అన్నది ఆవిడ అయిదు అనే మాటను నొక్కిపుచ్చురిస్తూ.

    "అలా అనటానికి ఏ మాత్రం వీల్లేదు. జహంగీరు చక్రవర్తి బహు సంతానవతియైన తన భార్యను నూర్ మహల్ అని పిలిచాడు. ఏం ఫరవాలేదు. నీవు ప్రయత్నిస్తే ఇట్లాగ వుంటావు. కొంచెం శ్రద్ధ కావాలె అంతే." "సరేలెండి ఈ బొమ్మలన్నీ ఈ మోస్తరేనా? ఇంకా ఏమన్నా మంచివి ఉన్నాయా?"

    "అంటే! ఈ బొమ్మలన్నీ మంచివి కాదనేనా నీ అభిప్రాయం?"

    "అందుకనే నాకు కోపం వచ్చేది. ఇప్పుడు నేను ఇవన్నీ మంచివి కాదన్నానా?"

    "పోనీ, పాపం, మీరు ఏదో వుత్సాహంగా చెబుతున్నారు గదా అని తీరికగా కూర్చొని శ్రద్ధగా వింటూన్నందుకా ఈ మాటలు?

   "కాదులే విను, ఈ బొమ్మచూడు. ఇది రతీదేవి చిత్రము అద్భుతంగా వుంది."

    "నిజమేనండి. ఈ బొమ్మ మట్టుకు చాల బాగుంది. ఆ చేతులు సన్నగిల్లి వంకరపోయినై అన్న మాటే కాని."         
          
"వంకర పోవటం కాదే పిచ్చి మొద్దూ. చేతులు అంతసన్నంగా వుండటం సౌదర్యానికి లక్షణం. చాలా బాగుంది ఈ బొమ్మ ఏమంటావు?"

    "నాలుగూ పెట్టుకుంటే నేనూ అట్లాగే వుంటా."

    "వుండమనేనా కోరిక, ఆ చూపులు చూడూ, ఆ యాకలి చూపులూ, ఆసిగ్గు, ఆనమ్రతా, ఆ లావణ్యమూ, అంతా అధ్బుతంగా వుంది. శయ్యామందిరంలోకి వచ్చినపుడు నీవు కూడా ఇటువంటి భావాలను వ్యక్తపరిస్తే సజీవమైన చిత్రాన్ని జూచి నేను ధన్యుడ్ని అవుతాను." అన్నాను నేను కళ్ళు తేలేసి గుటకలు మింగుతూ.

    "అయితే మనకు శయ్యామందిరం ఏదీ?"

    "అవ్వే, కుంటి ప్రశ్నలు, అందం అంతా ఆ చూపులలోనూ ఆ భావ ప్రకటనలోనూ వుందిగాని, శయ్యామందిరంలో వుందా ఏమిటి?"

    "సరేలెండి_ఇంకా చాలా బొమ్మలున్నయ్యే," అని అంటూ ఆవలించి రెండు చిటికలు వేసింది ఆవిడ.

    "ఈ బొమ్మలన్నీ నీవు జాగ్రత్తగా పరీక్షించు, మాట్లాడేటప్పుడు, పడుకున్నపుడు కూర్చున్నపుడు ఎట్లా ఉంటే అందమో, ఆవంపులు, ఆ హస్తవిన్యాసాలు, ఆ భంగిమలూ అవన్నీ చూపిస్తూ వున్న అజంతా చిత్రాలు తెచ్చాను. నిలుచున్నపుడు సాధారణంగా ఇట్లా నిలుచుంటే అందము."

    "ఇట్లాగా, ఇట్లా కడుపులో నొప్పితో బాధపడుతున్నట్లు గానా."

    "పిచ్చి మొద్దువు నీకేం తెలుస్తుంది? అది అద్భుతమైన పోజు, ఆ భంగిమాన్ని త్రిభంగి అంటారు. మాట్లాడేటప్పుడు ఇలా చెయ్యి ఎత్తి చూపాలె. ఈ హస్తాన్ని మృగశీర్షికమంటారు, ఎందుకు? ఎట్లు? అన్న ప్రశ్నలకు ఈ హస్తము ప్రసిద్ధం."

    "అయితే...నాకూ తెలియక అడుగుతాను...ఎందుకండీ, యివన్నీ? మనం మామూలుగా నిలుచున్నట్లు నిలుచుంటే ఏమి?"

    అంతా విని, మళ్ళీ ఆ ప్రశ్న వేశావు? మామూలు పద్ధతిలో అందం లేదు."

    "ఇందులో.....?"

    "గొప్ప అందము, లావణ్యము వుంది."

    "ఓహో తెలియకే అడిగాను లెండి!"

    "చెపుతున్నాగా విను. పోనీ నన్ను సంతోష పెట్టడానికైనా ఇట్లా చెయ్యి."

    "చేస్తాను లెండి!"

    "చేశావా నేను అదృష్టవంతుడినే! నా యిల్లు ఒక చిత్రశాల అవుతుంది. తప్పకుండా అవుతుంది. సజీవ చిత్రములతో కూడిన చిత్రశాల అవుతుంది! తప్పకుండా అవుతుంది, ఈ చిత్రాలను అనుకరిస్తావా?"

    అనుకరిస్తాను లెండి పోనీ మీ కంత సరదాగా వుంటే, అయితే మీతో మాట్లాడు తున్నపుడు మాత్రమే. ఇంక ఎవరితోనైనా మాట్లాడుతున్నపుడు మాత్రమే. ఇంక ఎవరితోనైనా మాట్లాడుతున్నపుడు మట్టుకు ఈ చిలిపి చేష్టలు నేను చెయ్యను సుమండీ."

    కాంతం నా అభిలాషలన్నీ విని ఆమోదించినట్లు కనపడి, సాధ్యమైనంత వరకు ప్రయత్నిస్తానని కూడా వాచా అన్నది ఇంకేం కావాలినాకు? నేను పరమానందభరితుడ్ని అయినాను.

    అంతేకాదు నికరంగా, పూర్తిగా, అమందానంద కందళిత హృదయారవిందుడ్ని అయినాను. అతిశయోక్తి ఇందులో ఏమీ లేదు. అంత పనీ జరిగింది.

    అమిత సంతోషం గలిగి, ఆవిడ పనుందని వంట యింట్లోకి వెడితే, వెంటబడి వెళ్ళి అన్నం పెట్టేటప్పుడు "ది యంగ్ హాస్టెస్" బొమ్మను అనుకరించమనీ మాట్లాడుతూ నిలుచున్నపుడు "ది పర్ ఫెక్ట్ వైఫ్" బొమ్మను అనుకరించమనీ చెప్పి ఇరవై నాలుగు హస్తజాతులూ, ముద్రా విశేషాలూ ఆవిడకు చూపించాను. వివిధాలంకారాలతో అలంకరించుకొని భర్తను సంతోష పెట్టడమే పరమావధిగా నిర్మించుకొనటం సనాతన మత ధర్మసమ్మతమని, కామ సూత్రాలు అచ్చు పుస్తకం కాంతానికి చూపి, ఎంతో నచ్చ జెప్పాను.

    ఆ మరునాడే నేజెప్పిన విషయాలు ఆచరణంలో పెట్టబడటానికి నిర్ణీతమైంది. కాంతం కూడా సమ్మతించింది.

    సాయంత్రం ఇంటికి వస్తూన్నాను.

    ఈ పాటికి కాంతం ఏ ఫోజులో వుంటుందా  అని సందేహం కలిగింది. తప్పకుండా నిరీక్షణలో వుండవచ్చునని తోచింది. ఆ సాయంత్రం చాలా రమణీయంగా కూడా వుంది. అలా అనుకొని వువ్విళ్ళూరిపోయినాను. గుటకలు మింగాను. కళ్ళు తేలేసి భావనాకాశాంతర్భాగాన, ఒక  దివ్యదృశ్యాన్ని మనశ్చక్షువుతో చూడగలిగాను. స్వర్గానికి పోతూన్న జీవివలె సంతోషం తూలిపోయినాను. తనువు పులకరించింది, తేలికయై మేఘపుతునకలాగా గాలిలో తేలిపోతూ యింటికి వచ్చాను.

    తలుపు వేసివుంది!!!

    కిటికీలో నుంచి చూశాను దడదడ కొట్టుకుంటోన్న గుండెతో.

    "లేదు...గవాక్షం పక్కలేదు.......నిరీక్షిస్తూ లేదు!!"

    పోనీ, యింట్లో పిల్లలమధ్య చక్కని చుక్కలాగ కూర్చుని "ది లైట్ ఆఫ్ ది హోమ్" పద్ధతిలో ఉందా.

    లేదు మహాప్రభూ, లేదు !!!

    రతీదేవిలాగ వుండవలసిన సమయం కాదది.

    ఇంక మరి ఏ పద్ధతిలో ఉందీ?

    ఏం జెప్పేది! ఆవిడ పద్ధతి ఆవిడదే నిలువునా నీరై పోయినాను తెప్పరిల్లి.

    "తెల్లచీరైనా కట్టుకోలేదేం?" అన్నాను ఆర్చుకు పోయిన పెదవులను నాలుకతో తడిజేస్తూ.

    "బోగం దాన్నిటండీ.  ప్రొద్దుగూకేసరికి చీర సింగారించుకొని వీధిలో నిలవటానికి? అన్నది, అదేదో ఒకరకం స్వరంలో, అది ఏమి స్వరమోగాని నా హృదయంలో మాత్రం తకిట దోం_దోం_తకిట_కిట_దోం_,ధధికిట_తకిట_ దోం తకిట_దోం అని మృదంగ నినాదం బయలు దేరింది."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS