Previous Page Next Page 
అతడు ఆమె ప్రియుడు పేజి 5


    అతడి భార్య ప్రియుడి గురించి ఇన్ స్పెక్టర్ ఎంక్వైరీ చేసినట్టున్నాడు. అతడెవరో తెలిసింతర్వాత ఇన్ స్పెక్టర్ ధోరణిలో మార్పు కొట్టొచ్చినట్టు కనబడింది. అది మహర్షి కూడా గమనించాడు.

    "నువ్వు నీ భార్య శవం ప్రక్కన కూర్చుని వుండగా నీ భార్య ప్రియుడు బయటికి పరుగెత్తుకుని వెళ్ళిపోయాడని చెప్పావ్ కదూ?"

    "అవును సార్."

    "అలా వెళ్తూ వెళ్తూ బయట తలుపు గడియపెట్టి వెళ్ళిపోయాడన్నావ్ కదూ?"

    "అవును. బహుశ నన్ను పోలీసులకి రెడ్ హండెడ్ పట్టించటం కోసం అనుకున్నానప్పుడు."

    "కానీ  అది అబద్ధమని మా పరిశోధనలో తేలింది. పావుగంట తర్వాత వచ్చిన  పనిమనిషి బయట తలుపుతీసి వున్నట్టు సాక్ష్యం చెపుతోంది. నువ్వు అబద్ధం చెపుతున్నావన్నమాట."

    మహర్షి ఇన్ స్పెక్టర్ వైపు తెల్లబోయి చూశాడు. "లేదండీ. అతను బయట గడియపెట్టాడు. నేను వెళ్ళి తలుపులు బలంగాలాగి చూసాను కూడా. ఇంకెటూ దారితోచక, బయటికి వెళ్ళలేని పరిస్థితిలో నా భార్య శవం పక్కన కూర్చున్నాను."

    "కానీ అతను  చెపుతున్న దాన్నిబట్టి అతనికీ నీ భార్యకీ ఏ సంబంధమూ లేదు. అది కేవలం అన్నాచెల్లెళ్ళ బంధం మాత్రమే. ఆ రోజు అసలతను మీ ఇంటికే రాలేదు."

    "అబద్ధం!" గట్టిగా అరిచాడు మహర్షి. "అతను మా ఇంటికి రాలేదన్నది అబద్ధం. వాళ్ళిద్దరి మధ్యా వున్నది అన్నాచెల్లెళ్ళ అనుబంధం అని చెపుతోంది అంతకన్నా పచ్చి అబద్ధం. అతను గానీ అలా చెపితే, అది ఒక  పవిత్రమైన బంధానికే అపప్రద."

    "అదంతా నీ వాదన" కామ్ గా అన్నాడు ఇన్ స్పెక్టర్. "నేను ఎంక్వైరీ చేసాను. అసలతను ఈ హత్య  జరిగిన రోజు ఈ వూళ్ళోనే లేడు అని చెప్పటానికి సాక్ష్యాధారాలు బలంగా వున్నాయి. నీ మీద కోర్టులో కేసు ఫైల్ చేయబోతున్నాను" అని ఇంకా మాట్లాడ్డానికి ఏమీ  లేనట్టు అక్కణ్ణుంచి వెళ్ళిపోయాడు.

    మహర్షి సెల్ లో చాలాసేపు నిర్వికారంగా కూర్చుండి పోయాడు. అతడి  మనసు ఆలోచించటానిక్కూడా నిరాకరిస్తోంది. తన భార్య ప్రియుడు సమాజంలో బాగా పలుకుబడి ఉన్నవాడైనా అయి వుండాలి. ఈ ఇన్ స్పెక్టర్ కి బాగా లంచమైనా ఇచ్చి వుండాలి.

    కనీసం అతడెవరో కూడా చెప్పడానికి ఇన్ స్పెక్టర్ యిష్టపడటం లేదన్నమాట.

    ఆరునెలల తరువాత కేసు కోర్టులో ఫైనల్ హియరింగ్ కి వచ్చింది.

    మహర్షి తరపున  డిఫెన్స్ లాయర్  శాయశక్తులా వాదించాడు. ఉన్న విషయం వున్నట్టు కోర్టువారికి నివేదించాడు.

    "ప్రాసిక్యూషన్ చెపుతున్న వివరాలకీ, మీరు  చెపుతున్నదానికీ చాలా తేడా వుంది" అన్నాడు జడ్జి. "మీరు చెప్పిందే నిజమైతే ముద్దాయి క్యాంపు నుంచి వచ్చే టైమ్ కి అతని భార్య, ప్రియుడు గదిలో వుండి వుండాలి. మరి ఆ ప్రియుడు ఎవరు? అతణ్ణి కోర్టులో హాజరు పరచగలరా?"

    బోనులో నుంచుని వింటున్న మహర్షి తనలో తానే నవ్వుకున్నాడు. హాజరు పరచవలసింది డిఫెన్స్ తరపు లాయరు కాదు, పోలీసువారు. పోలీస్ వాళ్ళే కేసులోని సత్యాలని తొక్కిపెట్టి తప్పురాస్తే ఇక న్యాయమేం జరుగుతుంది?

    అంతకీ డిఫెన్స్ లాయర్ అతికష్టంమీద 'అతణ్ణి' పట్టుకున్నాడు. "చూడు బాబూ! మంచికో, చెడుకో ఒక అనర్థం జరిగిపోయింది. అతడి భార్యతో స్నేహం చేసి నువ్వు తప్పు చేశావు అని వాదించి ఒప్పించటానికి నేనిక్కడకి రాలేదు. అక్కడ జరిగింది చూసిన ఏకైక సాక్షివి నువ్వే. 'అక్కడ జరిగింది హత్యకాదు యాక్సిడెంటల్ గా  జరిగింది' అని ఒక్కమాట చెప్పు చాలు. అతనికి శిక్షపడదు" లాయర్ సామరస్యంగా  అతణ్ణి ఒప్పించడానికి ప్రయత్నించాడు.

    "నేనా సమయంలో అక్కడ లేను" ఖండితంగా చెప్పాడతను.

    "నువ్వున్నావని మాకు తెలుసు. నీ తప్పు వున్నా లేకపోయినా అతడి భార్య ప్రాణం పోవటానికి నువ్వే కారణమయ్యావు. ఇప్పుడు నువ్వు సాక్ష్యం చెప్పగలిగిన పరిస్థితిలో వుండి చెప్పకపోవటం ద్వారా మరోవ్యక్తి ఉరికంబం ఎక్కడానికి దోహదం చేస్తావు. మనసున్న మనిషిగా ఆలోచించి చూడు."

    "నేనక్కడ లేనని చెప్పానుగా" విసుగ్గా అన్నాడు అతడు. "......అదీగాక మీరనుకున్నాటువంటి సంబంధం ఏమీ  అతడి భార్యకూ, నాకూ లేదు" అడ్డంగా వాదించాడు.

    లాయర్ కోపంగా లేచాడు. "నువ్వెందుకు రానంటున్నావో నాకు తెలుసు. అలా వస్తే నీ ఫోటోతో సహా పేపర్లో పడుతుంది. పరాయివాడి భార్యని లొంగదీసుకున్న వాడిగా నీ ఫోటో పేపర్లో పడితే, నీకు అది  ఒక మాయని మచ్చ అవుతుంది. నీ కెరియర్ కే అది దెబ్బ. అవునా?"

    అతడు నవ్వాడు "చాలా చక్కగా గ్రహించారు. అందుకే నేను కోర్టుకి రానంటున్నది."

    "నీ కెరియర్ కి రాబోయే ఒక చిన్న మచ్చ గురించి ఒక మనిషి అన్యాయంగా ఉరికంబం ఎక్కుతుంటే చూడగలుగుతున్నావంటే నువ్వు మనిషిని కాదు. రాక్షసుడివి" అని లాయర్ అక్కడి  నుండి వచ్చేస్తాడు.

    లాయర్ చెప్పిందంతా విని మహర్షి నిర్లప్తంగా తనలో తనే నవ్వుకున్నాడు. ప్రపంచం దృష్టిలో తనొక నేరస్థుడు. ఒక అమాయకురాలైన భార్యని చంపిన నరరూప రాక్షసుడు.

    తన వెనక తన భార్య ఎలాంటి వ్యభిచారం చేసిందో.......

    తన భార్యతో ఆమె ప్రియుడు ఏ విధంగా సంబంధం పెట్టుకున్నాడో.....

    తరువాత ఒక గౌరవమైన వ్యక్తిగా ప్రపంచంలో ఎలా తిరుగుతున్నాడో ఇవేమీ ప్రపంచానికి అక్కరలేదు. తనని  మాత్రం  ఒక హంతకుడిగా ముద్ర వేసింది.

    జడ్జిమెంట్ కూడా  పూర్తయింది.

    జడ్జి చదువుతున్నాడు. "మహర్షి అనబడే ముద్దాయి భార్యకి అక్రమ సంబంధం ఉందేమోనన్న అనుమానంతో అమాయకురాలైన ఆమెమీద ద్వేషం పెంచుకుని నిర్థాక్షిణ్యంగా ఒక ఊచతో ఆమెను హత్య చేసాడు. మామూలు మనుషులెవరూ కలలో కూడా ఊహించలేని విధంగా మెడలోకి ఊచ దింపిన ఈ నరరూప రాక్షసుడిని సెక్షన్ 302 ప్రకారం ఉరి తీయవలసిందిగా ఆర్డర్ వేస్తున్నాను."


                             5

    మహర్షికి మెలకువ వచ్చేసరికి బాగా చీకటి పడింది. రిసెస్షన్ కి ఫోన్ చేసి టైమ్ కనుక్కున్నాడు. ఎనిమిదిన్న అయింది.

    'చాలాసేపు నిద్రపోయానన్నమాట' అనుకున్నాడు మనసులో. ఈ లోపులో ఫోన్ మోగింది. అటునుంచి అతడి స్నేహితుడు వర్మ.

    "హలో"

    "నువ్వక్కడే వుండు. బయటికి రాకు" కంగారుగా వినిపించింది వర్మ గొంతు.

    "ఏమిటి విషయం?"

    "నే వస్తున్నాకదా చెప్తాను."

    పది నిముషాల్లో వర్మ హొటల్ కి చేరుకున్నాడు. రూమ్ లోపలకు వచ్చి తలుపు గడియవేసి మహర్షి కెదురుగా కూర్చున్నాడు. అతని చేతిలో ఆ రోజు పత్రిక ఈవినింగ్ ఎడిషన్ వుంది.

    "నీ ఫోటో పేపర్ లో పడింది" అన్నాడు.

    మహర్షి కళ్ళు చిట్లించే "ఇంత చిన్న విషయాలు పేపర్లో పడవనుకున్నామే? అన్నాడు.

    "ఇది చిన్న విషయమా? జైలు సెంట్రీని ఎందుకు చంపావ్? " కాస్త కోపంగా అడిగాడు  వర్మ.

    మహర్షి కాస్త ఆశ్చర్యంగా  "సెంట్రీనా ....... నేను చంపటమేమిటి?" అన్నాడు.

    వర్మ అతనికి పేపరిచ్చాడు. క్రోటన్ మొక్కల ప్రక్కన రక్తసిక్తమైవున్న సెంట్రీ ఫోటో ప్రముఖంగా ప్రచురించారు. ఆ ప్రక్కనే మహర్షి ఫోటోకూడా వేసారు.

    'సెంట్రీని చంపి ఉరిశిక్ష ఖైదీ పరారు" అని హెడ్డింగ్ వుంది. మహర్షికేమీ అర్థంకాలేదు. అతడు ఆ న్యూసంతాపూర్తిగా చదివాడు. మరో ఇద్దరు చిన్న  ఖైదీలు కూడా తప్పించుకున్నట్టు అందులో వుంది. అప్పుడు అతడికి జరిగిందంతా అర్థమైంది.

    "సెంట్రీని చంపింది నేను కాదు. ఇదిగో ఈ ఇద్దరు ఖైదీలు" అన్నాడు ఆ వార్తనంతా చూపిస్తూ.

    "అంటే......"

    "మరుసటిరోజు తెల్లవారుజామున ఉరి అని నాకు చెప్పారు. ఆ రాత్రంతా దైవప్రార్ధనలో గడపమని నాకు భగవద్గీత పుస్తకం కూడా ఇచ్చారు. నేను సిరిచందన గురించి ఆలోచిస్తూ  కూర్చున్నాను. అప్పుడు దూరంగా ఒక సెల్ లో  అలికిడి  అయింది. కేకలు  వినిపించాయి. ఖైదీలకి రహస్యంగా హాట్ డ్రింక్స్ అందజేయబడటం, వాళ్ళు  రాత్రిళ్ళు త్రాగటం అలవాటే కాబట్టి నేను  పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఇప్పుడనిపిస్తోంది. ఆ కేకలు సెంట్రీవన్నమాట. నేను ఆ కేకలు వింటూ వుండగా, ఈ ఇద్దరు ఖైదీలు నా దగ్గరికి పరుగెత్తుకుంటూ వచ్చారు. "రేపేగా నీకు ఉరిశిక్ష? తప్పించుకో" అంటూ లోపలికి తాళం చేతులు విసిరేసి అక్కడినించి వేగంగా పరుగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. సిరిచందనని  కలుసుకోవటం కోసం దేవుడే నాకు ఆ అవకాశాన్ని కల్పించాలనుకుంటూ లోపలినుంచి చేతులు బయటకు పెట్టి తాళం తీసి బయటపడ్డాను. అదీ జరిగింది" అన్నాడు మహర్షి.

    "బహుశ ఆ ఇద్దరు దొంగలు జైలునుంచి బయటపడడానికి ప్రయత్నించి వుంటారు. సెంట్రీ అది చూసి గట్టిగా కేకలు వేయడంతో వీళ్ళు అతన్ని మొహం చితికిపోయేలాగా గాయపరచి చంపేసి వుంటారు. ఆ నేరం తమ మీదకు రాకుండా ఉండటం కోసం అతని దగ్గరున్న తాళం చేతులు తీసి ఈ సెల్ లోకి విసిరి వెళ్ళిపోయారన్నమాట. ఇప్పుడు ఆ సెంట్రీని చంపింది నువ్వే అన్న అనుమానం అందరికీ కలిగింది. చిన్న ఖైదీలు జైలునుంచి తప్పించుకోవటం కోసం ఒక సెంట్రీని చంపుతారని ఎవరూ అనుకోరు. మరుసటిరోజు ఉరిశిక్ష అనగా తప్పించుకోవటం కోసం నువ్వే ఇలా దారుణంగా చంపావని అందరూ భావించి వుంటారు" అన్నాడు వర్మ విచారంగా.

    మహర్షి పేలవంగా నవ్వి "దీనివల్ల నాకు పెద్దగా పడబోయే శిక్ష మరింకేమీ లేదు. నేనిప్పటికే ఉరిశిక్ష పడినవాడిని కదా!" అన్నాడు. "శిక్ష ఏం పడుతుందని కాదు. ఎంత దారుణంగా ఈ సెంట్రీని చంపారో చూసావా? ప్రక్కనే నీ ఫోటో కూడా వేశారు. ఇక ఎవరికీ నీ మీద సానుభూతి వుండదు. బహుశ సిరిచందనగానీ ఈ ఫోటో చూసి వుంటే ఆమె నీ మొహం చూడటానికి కూడా ఇష్టపడదు."

    "సిరిచందన నన్ను ఇష్టపడాలనీ, నాతో మాట్లాడాలనీ నేననుకోవటం లేదు వర్మా. కేవలం నేనామెను దూరంనుంచి ఒక్కసారి చూస్తే చాలు" అన్నాడు మహర్షి నిర్లప్తంగా.

    "నువ్వు నాకెప్పుడూ అర్థంకావు" అన్నాడు వర్మ స్నేహితుడి వైపు చూస్తూ...."అంతగా ఆ అమ్మాయిని ప్రేమించినవాడివి కాలేజీ రోజుల్లోనే ఆ విషయం ఆమెతో ఎందుకు చెప్పలేదు?"

    "నేను రెండు పూటలా తింటానికి తిండిలేనివాడిని. ఆమె కోటీశ్వరుడి కూతురు. నా ప్రేమని ఎందుకొప్పుకుంటుంది? అడిగి భంగపడటం ఎందుకు? తను నన్ను ప్రేమించటానికి నాలో ఏ క్వాలిఫికేషన్స్ వున్నాయి...... అవన్నీ ఆలోచించి నేను అసలా ప్రసక్తే తీసుకురాలేదు. దూరంనుంచే ఆమెను చూస్తూ సంతృప్తి పడేవాడిని."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS