Previous Page Next Page 
అతడు ఆమె ప్రియుడు పేజి 4


    "ఏం? బావోలేదా?"

    "బావుందనుకో. కానీ....."

    ముద్దు పెట్టుకున్న చప్పుడు. తరువాత అతడి స్వరం "....ఏడు సంత్సరాల పరిచయం. నీకు ఎక్కడెక్కడ బావుంటుందో నాకు తెలీదా?"

    శ్రీవాణి కంఠం నుంచి మంద్రస్వరంతో చిన్న మూలుగు "చంపేస్తున్నావ్!"

    "నిజంగానా?   పెళ్ళై ఆర్నెల్లయినా  నీ శరీరంలో మార్పేమీ లేదు సుమా పదహారేళ్లప్పుడు ఎలా వున్నావో ఇప్పుడూ అలాగే వున్నావు. మీ ఆయన అదృష్టవంతుడు."

    "ఇప్పుడు ఆయన ప్రసక్తి దేనికి?"

    "ఏం? సెంటిమెంటు అడ్డమొస్తోందా?"

    తరువాత సమాధానం వినిపించలేదు. అతను ముద్దుల్తో ఆమెను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నట్టు చిన్న పెనుగులాట వినిపించి, ఇక ఎంతో సేపలా వుండలేకపోయాడు మహర్షి.

    తను విన్నది అబద్ధమనీ, ఇదంతా  కలనీ....... చిన్న ఆశతో ముందుకు అడుగు వేయబోయాడు.

    అప్పటికే మొద్దుబారినట్లయిన అతని శరీరం చిన్నగా తూలింది. ఆసరాకోసం తలుపుమీద చేయి ఆన్చబోయాడు.

    లోపల గడియపెట్టి లేకపోవడంతో అది పెద్ద  శబ్దం చేస్తూ తెరుచుకుని గోడకు కొట్టుకుని ఆగిపోయింది.

    ఒకే మంచంమీద ఒకరి కౌగిలిలో ఒకరు  వున్న ఆ యిద్దరూ ఉలిక్కిపడి  తలేత్తారు.

    అసంకల్పిత ప్రతీకార చర్యగా ఆమె క్రిందపడ్డ చీరెని  లాక్కుని గుండెలకడ్డంగా పెట్టుకుంది.

    ఒక్కక్షణం......అక్కడ కాలం స్తంభించింది.

    మహర్షి వాళ్ళిద్దరివైపు శిలలా అచేతనంగా నిలబడి చూస్తున్నాడు. ఆమెనింకా ప్రియుడు పొదివి పట్టుకునే వున్నాడు. అతడి వంటిమీద ఫ్యాంటు మాత్రమే వుంది. ప్రక్కన స్టాండుమీద షర్ట్ వుంది. అక్కడనించి లేవాలనీ, పారిపోవాలని కూడా  తోచనంత గాఢమైన షాక్ లో వున్నట్టున్నాడు.

    అతడింకా తేరుకోలేదు.

    మహర్షి కూడా తేరుకోలేదు.

    ముందుగా తేరుకున్నది 'ఆమె.'

    చప్పున మంచం మీంచి కిందకు దిగి ప్రియుడిని హెచ్చరిస్తున్నట్టు "వెళ్ళు .......వెళ్ళిపో!" అని అరిచింది. చప్పున స్పృహలో కొచ్చినట్టు అతడు లేచి షర్టు  చేతిలోకి తీసుకున్నాడు. ఆమె  మాటలకి అప్పటివరకూ స్తంభించిపోయినట్టుగా అలాగే నించుండిపోయిన మహర్షి కూడా తేరుకుని ముందుకు వెళ్ళి అతనిమీద పడి ఇష్టం వచ్చినట్టుగా కొట్టసాగాడు.

    అతను మహర్షి దెబ్బలనించి తప్పించుకోవాలని చూస్తున్నాడు గానీ తిరిగి కొట్టాలనుకోవడంలేదు. ఒక్కోసారి తప్పు చేసిన ఫీలింగ్ తెగింపు నిచ్చినట్టే, పూర్తి నిర్వీర్యుణ్ణి కూడా చేస్తుంది. దానికి నిదర్శనంలా అతడు దెబ్బలు తింటూనే వున్నాడు.

    మహర్షి కదలికల్లో శివుడి విలయతాండవం కనిపించింది శ్రీవాణికి.

    ఆమెలో భయం క్షణక్షణానికి పెరిగిపోయింది. అలానే వదిలేస్తే ఇద్దరిలో ఎవరో  ఒకరు  హంతకులుగా మారిపోతారు అనుకుందేమో, చప్పున వెళ్ళి వాళ్ళిద్దరి మధ్య అడ్డుగా నిలబడి భర్త చేతులు పట్టుకుంటూ "ప్లీజ్....... నేను చెప్పేది వినండి" అంటూ ప్రాధేయపడింది.

    కోపంతో అతనామెని పట్టించుకోకుండా ప్రక్కకు నెట్టి, అతనిమీదకు లంఘించాడు.

    ఆమె తూలి గోడని ఆసరా చేసుకుని నిలబడుతూ "ప్లీజ్ వెళ్ళిపో!" అంటూ  ప్రియుడిని మళ్ళీ హెచ్చరించింది.

    మేరు పర్వతంలా ముందుకు రాబోతున్న మహర్షిని చూడగానే అతను  తలుపువైపు పరుగెత్తబోయాడు. అతన్ని వెళ్ళనివ్వకుండా అడ్డుపడి మోకాలితో పొత్తి  కడుపులో బలంగా పొడిచాడు మహర్షి.

    బాధను తట్టుకోలేక అతను అరిచిన ఆ గది గోడలమధ్య ప్రతిధ్వనించింది. నేలమీద  కొరిగిపోయాడతను.

    ఆమె భర్తకాళ్ళు పట్టుకుని వారిస్తూ "ప్లీజ్....... నా ముఖం  చూసి వదిలేయండి" అంది.

    బంగరు పూత పూసిన మాయలేడి కనిపించిందతనికి. అంతే...... ఆమె  జుట్టు పట్టుకుని లేవదీసి "ఓహొ అంత ప్రేమన్నమాట వాడిమీద. అలాంటి దానివి నన్నెందుకు పెళ్ళి చేసుకున్నావ్?" రౌద్రంతో ఉన్న అతని కళ్ళు అగ్నిగోళాల్లా కనుపిస్తున్నాయి. "నన్ను క్షమించండి" అంది ఏడుస్తూ.

    "నిన్ను క్షమించడమా ...... ఇంపాజిబుల్!" అంటూ ఆమె చెంపమీద బలంగా కొట్టాడు.

    అప్పుడు కదిలాడు ఆమె ప్రియుడు. తప్పుచేసిన ఫీలింగ్ వల్ల దెబ్బలు తిన్న  అతను, అప్పటికి తేరుకున్నట్టు విసురుగా వెళ్ళి మహర్షి కాలర్ పట్టుకుని ప్రక్కకు లాగాడు.

    అంతసేపూ కిక్కురుమనకుండా చావు దెబ్బలు తిన్న అతను తనమీద తిరగబడటం వూహించలేకపోయాడు మహర్షి. తిరిగి కలబడబోయాడు. అంతలో 'అతను' ప్రక్కనే ఫ్రిజ్ మీద ఉన్న ఇత్తడి ఫ్లవర్ వాజ్ తీసి బలంగా మహర్షి మీదకు విసిరేశాడు. అది వచ్చి నుదుటికి తగిలింది.

    అప్రయత్నంగా 'అమ్మా'! అన్న ఆర్తనాదం వెలువడింది. మహర్షి గొంతునుండి నేలమీద తూలిపోబోతుండగా శ్రీవాణి వెళ్ళి చప్పున భర్తని పట్టుకోబోయింది.

    'నన్ను ముట్టుకోకు' అన్నట్టు ఆమెని విసురుగా వెనక్కి నెట్టేశాడు. ఆ అనాలోచితమైన చర్య అతని జీవితాన్ని మలుపు తిప్పింది.

    ఆమె తల ఫ్రిజ్ కి కొట్టుకొని చప్పుడయింది. ఆమె నేల మీదకు ఒరిగిపోతూండగా క్రిందనున్న వైపర్ పూచ మెడగుండా లోపలికి గుచ్చుకుపోయింది.

    అంతా లిప్తపాటులో జరిగింది.

    అతడు తలెత్తి ఆమెవైపు చూసాడు. ఆమె కళ్ళు తెరచుకునే వున్నాయి అయితే ఆ కళ్ళల్లో ఏదో  అసహజత్వం తోచిఆమె దగ్గరగా వెళ్ళాడు.

    ఆమెలో ఏ మాత్రం  కదలిక లేదు. తెరుచుకుని వున్న కళ్ళని చూశాక, అప్పుడు కలిగిందతనికి అనుమానం.

    వంగి, ముక్కు దగ్గిర వేలుపెట్టి శ్వాస చూశాడు. శ్వాస ఆడటం లేదు.

    ఆమె మరణించిందన్న విషయం అతడికి అర్థమయింది.

    వస్తువు పగిలితే శబ్దం వస్తుంది. మనసు పగిలితే నిశ్శబ్దం మాత్రమే మిగులుతుంది. అక్కడ  గాలికూడా స్తంభించినట్టు వుంది.

    అతడు, ఆమె ప్రియుడు జరిగిన సంఘటనని జీర్ణించుకోడానికి సమయం తీసుకుంటున్నట్టు స్తబ్దంగా నిలబడి వున్నారు.

    మహర్షిలో ఉద్రేకం పూర్తిగా చల్లారిపోయింది.

    వృక్షానికి అర్థమయ్యేలోగానే కార్చిచ్చు కారడవిని దహించి వేసినట్టు, ఉద్రేకం చల్లారేలోగానే దాని ఫలితం అతన్ని పరిహసిస్తున్నట్టు ఎదురుగా వుంది.

    క్షణం ముందు వుండి, క్షణం తరువాత ఆమె లేకపోవడం అతనింకా జీర్ణించుకోలేకపోతున్నాడు. తన వెనక ఆమె, చీకటి తప్పు చేసి వుండవచ్చు. కానీ ఇప్పుడు తెరుచుకుని వున్న ఆ కళ్ళు అతన్ని నిలదీస్తున్నట్టు అనిపించాయి.

    ఇంకా ఆ ముఖంలో అతనికి అమాయకత్వమే కనిపిస్తోంది.

    క్యాంపు కెలుతున్నప్పుడు గుమ్మంవరకూ వచ్చి "తొందరగా రండి" అని  ఆమె అభ్యర్థిస్తున్నట్టు అనిపించింది. అవన్నీ  నోటి చివరిమాటలే అయ్యుండొచ్చు. తొందరగా రాకపోతేనే మంచిది' అని మనసులో అనుకుంటూ వుండవచ్చు. ఆ తరువాత ఆ విషయం ప్రియుడితో పంచుకుని నవ్వుకొని వుండొచ్చు. తాను దారుణంగా మోసగింపబడ్డాడు. తనకు తెలీకుండా తన వెనకాల ఇద్దరు వ్యక్తులు దారుణంగా మోసగింపబడ్డాడు. తనకు తెలీకుండా తన వెనకాల ఇద్దరు వ్యక్తులు తన గురించి నవ్వుతూ తేలిగ్గా మాట్లాడుకున్నారిప్పటివరకూ. తను పొరపాటున ఆమెని తోశాడు. దురదృష్టం వెంటాడి మృత్యువు రూపంలో ఆమెని కాటేసింది.

    ......కానీ, ఇదంతా ఎవరు నమ్ముతారు? కోర్టు నమ్ముతుందా?

    ........అతడు నేలపైనించి లేచే ప్రయత్నమేదీ చేయలేదు. ఇంకా  మరణించిన భార్యవైపే చూస్తున్నాడు. అయితే ఈ లోపులో ఆమె ప్రియుడు కలలోంచి తేరుకున్నట్టు చప్పున  స్పృహలో కొచ్చి అక్కణ్ణించి బయటికి పరుగెత్తాడు. అయితే అంత షాక్ లో కూడా తలుపు బయట గడియ పెట్టడం మరిచిపోలేదు.

    బహుశా పోలీస్ డిపార్ట్ మెంట్ లో పనిచేస్తూ వుండటంవల్ల అతనికా తెలివితేటలు అబ్బినాయేమో?

    ఈ విషయాలన్నీ బయటపడితే తనకీ ఆమెకీ ఉన్న సంబంధం ప్రపంచానికి తెలుస్తుందనీ అతను అప్పటికప్పుడు ఊహించాడు. పరాయివ్యక్తి భార్యతో తను కలిసి వుండగా ఆ వ్యక్తి క్యాంపునించి తిరిగొచ్చాడనీ, తమ ఇద్దరినీ  చూసి ఆవేశంతో తన మీద  కలియబడ్డాడనీ ఆ ఘర్షణలో ఆమె మరణించిందనీ రేప్రోద్దున్న అతని తరపున  డిఫెన్స్ లాయర్ వాదిస్తాడని అతనికి తెలుసు. అదే గనుక జరిగితే తన పరువూ, ప్రతిష్ట అంతా మంటకలసి పోతుంది అనికూడా అతనికి తెలుసు. అందుకే తలుపు బయట గడియవేసి దూరంగా నిలబడ్డాడు.

    ......తన భార్య ప్రియుడు బయటికి పరుగెత్తడం గమనించగానే మహర్షి చప్పున వెళ్ళి తలుపు తీయటానికి ప్రయత్నించాడు. కానీ అది రాలేదు. తను ఆ  గదిలో భార్య శవంతోపాటు ఇరుక్కుపోయానని అతడికి అర్థమైంది. ఎవరో ఒకరు వచ్చేవరకూ తను అక్కడే వుండటం తప్పనిసరి అని తెలిసిపోయింది. వచ్చి భార్య శవం ప్రక్కన కూర్చున్నాడు.

    రెండు నిమిషాలు ఆగిన తరువాత బయటవున్న మళ్ళీ వచ్చి ఏ మాత్రం శబ్దం కాకుండా తలుపు గడియతీసి, అక్కణ్ణించి వెళ్లిపోయాడు. లోపలున్న మహర్షికి మాత్రం  బయట తలుపు గడియ తీసివేయబడింది అని తెలీదు! లోపల  అలాగే శవం ప్రక్కన కూర్చుని వున్నాడు.

    ఇంకో పావుగంట తరువాత పనిమనిషి వచ్చి తలుపు తోసింది. గదిలో చెల్లాచెదురుగా పడివున్న వస్తువులమధ్య శ్రీవాణి శవాన్ని, ప్రక్కనే కూర్చుని వున్న మహర్షిని చూడగానే పనిమనిషికి జరిగిందేమిటో మొదట అర్థం కాలేదు. మరింత పరీక్షగా చూసేసరికి శ్రీవాణి చుట్టూ వున్న రక్తపు మడుగు కనబడింది. ఆమె గట్టిగా కేకలు వేయటం ప్రారంభించింది.

    ఈ తరువాత పోలీసులు రావడం, శ్రీవాణి శవాన్ని పోస్ట్ మార్టమ్ కి పంపటం, అతన్ని అరెస్ట్ చేయటం అంతా క్షణాల్లో జరిగిపోయింది.


                          *    *    *

    "అయితే నువ్వీ హత్య చేయలేదంటావ్" ఇన్ స్పెక్టర్ విసుగ్గా అడిగాడు.

    "చేసాను సర్. కానీ అది చేయాలని చేసిన హత్యకాదు. తోసేస్తే ప్రమాదవశాత్తు ఆమె ఊచమీద పడింది."

    "దీనికి సాక్షి నీ భార్య ప్రియుడు అంటావ్."

    "అవునండి. వాళ్ళని చూసి నేను ఆవేశపడిన మాట నిజమే. కానీ  నా  కోపమంతా అతని మీదే తప్ప, ఆమె మీద చేయి  చేసుకోవాలన్న కోరిక లేదు. మేమిద్దరం ఘర్షణ పడుతుండగా అతడు  నన్ను కొట్టాడు. నా భార్య నా దగ్గరికి వచ్చి నన్ను లేవదీయబోయింది. అతడిమీద ఉన్న ఉక్రోషమంతా ఆమెమీద చూపిస్తూ పక్కకు  తోసాను. ప్రమాదవశాత్తు ఆమె ఆ ఊచమీద పడి పోయింది."

    "అతనెవరు?"

    "నాకు తెలీదు. వాళ్ళిద్దరి మధ్యా శారీరక సంబంధం మాత్రం ఏడెనిమిది సంవత్సరాల్నించి  వుందని  వాళ్ళ మాటల ద్వారా  తెలిసింది."

    "అతన్ని ఎలాగైనా పట్టుకుంటాం. నువ్వు చెప్పిందంతా నిజమే అని  రుజువైన పక్షంలో, అది ప్రమాదవశాత్తు జరిగిన సంఘటనగా నీకు శిక్ష పడక పోవచ్చు" అన్నాడు ఇన్ స్పెక్టర్.

    మహర్షి మనసులోనే అతనికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు.

    కానీ అనుకున్నదంతా అనుకున్నట్టు జరిగితే అది జీవితం ఎలా అవుతుంది?


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS