Previous Page Next Page 
అమృతం కురిసిన రాత్రి పేజి 48

ఎన్ని కోరికలు ఎన్ని ప్రవృత్తులు
ఎన్ని విచిత్ర ప్రకృత్యార్భాట ఝంఝామరుత్తులు
ఎన్ని చలద్ధేమంత వర్షానిదాఘ ఋతు శకుంత గరుత్తులు
ఈ అనంత ద్రవ్యంనుండి ఎంత వైశ్వానరశక్తి
శిలను చీల్చి సిరలు దాల్చి చిగురించిన ప్రాణయుక్తి
ఎంత సృష్టి లాలస
ఎన్నెన్ని ప్రాణాలు ఇవన్నీ దీపాలు

ప్రాణంలోంచి పాపం పాపంలోంచి ప్రాణం పుట్టాయి.
పాపాన్ని చూసి పాపం అని జాలిపడడం పుణ్యం అని చెప్పాయి
సమాధిమీద దీపం చావుని వెలుగించి చూపుతుంది
దేవాలయంలోని దీపం దేవుని బందిఖానాను తెలుపుతుంది
ఇంటిముందు పెట్టిన దీపం ఇంటి లోపలిగుట్టును దాచుతుంది
ప్రతి రక్తకణంలో ఒక వాంఛాకీలిక
ప్రతి మనోంగణంలో ఒక సృష్టి దీపిక

ఏడమ్ అండ్ ఈవ్ లు చేసిన పాపం యిలపై వెలిగించిన తొలిదీపం
ఈడేరని కోర్కెలమంటల పిలుపులు యెద యెదలో తెరచిన
కత్తుల తలుపులు
ఇది ఆరని ఎర్రని దీపం
ఇది నిరంతర జీవనతాపం
తనను తాను కాల్చుకుంటూ భస్మమయే మోహన శాపం

           *     *     *
ప్లస్ యింటూ మైనస్
కొసరు కొంచెమైనా వెయ్యని
పిసినారి కోమటి దేవుడు
అసలు తూకంలోనే మోసంచేసి
ఆనందాన్ని, ఆయుఃప్రమాణాన్ని తగ్గిస్తాడు

అందమైన ఉదయాలూ, స్పందించే హృదయాలూ
చందనం, చంద్రకళా, సరదాలూ, స్వప్నాలూ
ఇన్నిటినీ సమకూర్చిన పసందైన గారడీ
చటుక్కున మడతపెట్టి చేస్తాడు టెరిబుల్ ట్రాజెడీ


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS