"మాట వరసకు అదే పులి తన టెరిటరీ సరిహద్దులు ఏమిటో నిర్ణయించడానికి మనుషుల మాదిరిగా ఒక డాక్యుమెంటు తయారు చేయించిందనుకుందాం. ఫలాని దేశంలోని రాష్ట్రం , ఫలానా జిల్లా , ఫలాని మండలం లోని ఇన్నో అక్షాంశం -- ఇన్నో మధ్యాంశరేఖల మధ్య వున్న ఈ మేర అతవిప్రాంతం , ఫలాని పులిరాజుకీ, ఫలాని పులిరాణికి పుట్టిన ఫలాని పులిరావు (వయసు - తొమ్మిదేళ్ళు) వ్రుత్తి - వేట , నివాసం - వెదురుపొద . ఈ ప్రాంతానికి సర్వ హక్కు భుక్తాలతో అధికారి " అని అందులో వుందనుకుందాం.
అప్పుడు -
ఎవరు ఆ ప్రాంతాన్ని పులిరావుకి ధారాదత్తం చేశారు? ఎందుకని సదరు ఆ ధారాదత్తం చేసినవాళ్ళకి ఒరిజనల్ గా దాని మీద హక్కు ఉందా? ఉంటే ఎవరు ఇచ్చారు? ఎవరి ద్వారా యెట్లా వచ్చింది? లింక్ డాక్యుమెంట్లు ఉన్నాయా? ఎన్నేళ్ళ నుంచి ఉన్నాయి? ఈ భూమి మీద ఇంకెవరికన్నా క్లెయిమ్ ఉందా? అసలు ఈ పులిరావు ఫలాని పులురాజుకి , ఫలాని పులిరాణికి పుట్టినదే అని గ్యారంటీ ఏమిటి? డి.యన్. ఏ టెస్టు చేయించారా? వగైరా వగైరా శతకోటి ప్రశ్నలు , కేసులు , లీగల్ పాయింట్స్ - లాయర్ల చమత్కారాలు - కోర్టు తీర్పులు -- అప్పీళ్ళు.
పొతే -- ప్రాక్టికల్ గా అందరికీ తెలిసిందే కదా- రాజకీయాల్లోకి అవినీతిపరులకి ప్రవేశం ఉండకూడదూ అన్న ఒక్క నియమాన్ని అందరూ పాటిస్తే ఇబ్బంది వుండదు.
అదే అక్షరాలలో రాసి పెట్టారనుకో . అవినీతికి మహారాజ్జి లాంటి ఒక విప్లవ నాయకురాలు ఉంటుంది. అవినీతి కేసులలో పట్టుపడుతుంది. శిక్ష కూడా పడుతుంది. ఈలోగా ఎన్నికలు వస్తాయి. సహజ న్యాయం అయితే, ఆమె ఎన్నికల బరిలోకి రాకూడదు. కానీ న్యాయం అక్షరాలలో వుంటుంది. ఆ అక్షరాల సముదాయానికి ఎవరికి తోచిన విపరీతార్ధం వాళ్ళు చెప్పవచ్చును. చెప్పించవచ్చును.
వేరే రాష్ట్రంలో వేరే మంత్రి పుంగవుడు ఉంటాడు. అతనూ అవినీతిపరుడే కానీ ఎన్నికలు వచ్చేసరికి అక్కడ అక్షరాలకు వేరే వ్యాఖ్యానం చెప్పడం జరుగుతుంది. అతను ఎన్నికలకు నిలబడతాడు -- గెలుస్తాడు. న్యాయాన్ని అక్షరాల చట్రంలో బిగించాలని చూడడం వలనే న్యాయానికి ఊపిరి పోతుంది. అన్యాయానికి ప్రాణం వస్తోంది.
ఇంకొక్క విషయం - మీ ఇండియాని తరతరాల పాటు ఇంగ్లీషు వాళ్ళు పాలించారు. ఇండియాకు స్వాతంత్యం కావాలన్న డిమాండు పెరిగింది. అప్పుడు ఇంగ్లీషు ప్రధానమంత్రి ఏమన్నాడో తెలుసునా -- అక్కడ వాళ్ళకు స్వాతంత్యం ఇచ్చేసి, మనం ఇండియా నుంచి వచ్చేస్తే, ఇంక రౌడీ రాస్కేల్స్, స్కౌండ్రల్స్ నాయకుల వేషంలో తయారయి , చివరికి తాగే నీళ్ళ మీదా, పీల్చే గాలి మీదా కూడా పన్నులు వేస్తూ ప్రజలని పీడించుకు తింటారు అని.
అట్లాగే - మేం కూడా మనిషిని సృష్టించి నాగరికత నేర్పించి, సొంత ఆలోచనలు, తెలివి తేటలూ ఇచ్చాం -- అక్షరజ్ఞానం కలిగించాం. మత ప్రవక్తులను పంపాం.
కానీ మనిషి ఎట్లా తయారయ్యాడు? అక్షరాలని రాయడం చదవడం నేర్చుకున్నాడే గానీ భావం అర్ధం చేసుకునే స్థితికి ఎదగలేదు. అట్లాగే మతాలు గొప్పవి. మత ప్రవక్తలు మహా పురుషులు . కానీ ఎన్ని మతాలూ, ఎందరు ప్రవక్తలు ఎంత మంచిని చెప్పినా, మనిషి తను మతం లేవెలుకి ఎదగకుండా మతాలను తన లేవెలుకి దింపెస్తాడు. మతాన్ని మరణహోమంగా మారుస్తాడు.
ఇవన్నీ చూశాకే -- మాకు మానవజాతి అంటేనే విరక్తి పుట్టింది." అని ఆగి డ్రమెటిక్ గా అన్నాడు సిసిహ.
మా ఎక్స్ పెరిమెంటు ఫెయిల్ అయిపొయింది రాజూ. అంచేత మేం మొత్తం మానవజాతిని సమూలంగా సర్వనాశనం చేయదలచుకున్నాం.
ఒక్క క్షణం నిశ్శబ్దం!
తర్వాత రాజు కోపంగా అన్నాడు.
"ఏమిటి ?"
"నువ్వు విన్నది కరెక్టే! ఇప్పుడున్న మానవజాతిని మారణహోమం చేయడానికి నిశ్చయించుకున్నాం మేము. కొత్త సృష్టిని ప్రారంభిస్తాం. ఇప్పుడున్న మానవజాతి అంతరించిన తర్వాత అవతరించబోయే కొత్త మానవ జాతికి మూలపురుషుడిని నువ్వే కావాలని మేమే, అనగా దేవతలం, నిర్ణయించాం రాజూ!
"దిసీజ్ అబ్సర్డ్@!" అన్నాడు రాజు.
"అని నువ్వనుకుంటున్నావు -- కానీ అక్షరాల జరగబోయేది ఇదే! రెండు లక్షల సంవత్సరాల క్రితం మే కోతిని జెనెటిక్ గా దశలు దాటించి మనిషిని సృష్టించాం. ఎంతయినా కోతి కోతే- మనిషికీ కోతి బుద్ది వదలలేదు. అంచేత ఈసారి కొత్త సృష్టి - మనిషిని ఆ దేవతలతో కలిసి కొత్త జాతిని సృష్టించాం. మనుషులూ, దేవతల వల్ల పుట్టిన ఆ జాతి భూమండలాన్ని ఏలుతుంది. మా ఊహకు తగినట్లుగా సృష్టి జరిగితే, ఈ జాతి మొత్తం విశ్వాన్ని కూడా శాసించవచ్చు. మొన్న నువ్వు మిస్టర్ యూనివర్స్ గా సెలెక్ట్ అయ్యావు రాజూ. అది ఉత్తుత్తి టైటిలు. దాన్ని వద్దనుకున్నావు. కానీ మేం నిజంగానే నిన్ను విశ్వాధిపతినీ చేస్తాం.
నిజం మిస్టర్ యూనివర్స్! ఈ అవకాశాన్ని జారవిడుచుకోకు" అన్నాడు సిసిహ.
"ఏమిటి మీరంటున్నది ?" అన్నాడు రాజు సంభ్రమంగా.
మృదువుగా అన్నాడు సిసిహ.
"నువ్వు మా సిహానా - అదే సృష్టిని పెళ్ళాడి ఈ భూమండలానికీ, వీలైతే విశ్వానికీ కూడా అధిపతివి కాబోతున్నావు రాజూ!
రాజు ఆశ్చర్యంలో నుంచి తేరుకోకముందే అన్నాడు సిసిహ.
"ఇప్పుడున్న మానవజాతి పరమ నీచమైనది. అంచేత మేం మనుషులని డిస్ట్రయ్ చెయ్యక తప్పదు. తలుచుకుంటే మానవుల ఊహకి అందని ఆయుధాలతో మొత్తం భూగోళాన్ని , దాని మీద వున్న సకల చరాచర జీవులని అంతం చేయగలం! కానీ మాకు మనుషుల మీద తప్ప తక్కిన జీవాల మీద వ్యతిరేకత లేదు . ప్రకృతిలోని ప్రతి జీవి పుట్టుకకీ ఏదో కారణం, వుపయోగం వుంటాయి. ప్రతి జీవి ప్రకృతిని పాడు చేయడమూ, సమస్యలూ సృష్టించడమూ మాత్రమే మనుషులు చేసే ఘనకార్యం. ఈ భూగోళం మీద మనుషులు మాత్రమే లేకుండా చేయాలి. అందుకు ఒక ప్రణాళిక సిద్దంగా ఉంది." అన్నాడు సిసిహ.
వెంటనే సిసిహ అసిస్టెంటు ఆనందంగా అందుకుని టెక్నికల్ టర్మ్స్ లో చెప్పడం మొదలుపెట్టాడు.
నోనోబోట్లు అనే సూక్ష్మాతి సూక్ష్మమైన రోబోలు అసంఖ్యకంగా తయారు అయి వున్నాయి. వాటిని వదిలితే , అవి ,మనుషుల శరీరాలలో దూరి, అక్కడ రోబోల ఫ్యాక్టరీలలాంటివి పెట్టి, ఒక్క మానవశారీరంలో బిలియన్ల కొద్దీ నోనోబోట్లని తయారు చేసేస్తూ పోతాయి. మానవునికి మెకానికల్ కాన్సర్ అనే జాడ్యం పట్టుకుంటుంది. అతి త్వరలోనే ఈ మెకానికల్ కాన్సర్ మానవజాతిని మొత్తంగా సంహరిస్తుంది.
అప్పుడు పురుషోత్తముడైన ఈ రాజుకీ, దేవతాకన్య అయిన సృష్టికీ వివాహం జరుగుతుంది. వారి కలయిక ద్వారా మహోన్నతమైన ఒక కొత్త జాతి పుట్టుకొస్తుంది. అప్పుడు కొత్త జాతిలో అజ్ఞానం వుండదు. అవివేకం వుండదు. అంతటా శాంతి సౌభ్రాతృత్వాలు వెల్లి విరుస్తాయి. నెలకు రెండు వర్షాలు పడి అంతటా సుభిక్షంగా వుంటుంది." అని చెప్పి వున్నట్లుండి స్వరం గంభీరంగా మార్చి, తైత్తరీయోపనిషత్తులోని పూర్వ శాంతి పాఠం పఠించడం మొదలెట్టాడు అనుచర్.
శంనో మిత్రశ్శం వరుణః శంనో భవ త్వర్షమా!
శంనో ఇంద్రో బృహస్పతిః శంనో విష్టురరుక్రమః
నమో బ్రాహ్మణే నమస్తే వాయే! త్వమేవ ప్రత్యేక్షం
బ్రహ్మసి! త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మవదిష్యామి!
ఋతం వదిష్యామి! సత్యం వదిష్యామి!
తన్నావతు! తధ్యకారమవతు! ఆవతుమామ్!
అవతువక్తారమ్ ! ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః
సత్యం వదిష్యామి!
