Previous Page Next Page 
ఇదీ కధ! పేజి 39

 

    'డాక్టర్ మూర్తి వట్టి మోసగాడు. నీకు లేని జబ్బు అంటగట్టాడు. మాధవిని పిచ్చిదాన్ని చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. మీ మీద వత్తిడి తీసుకొచ్చి సుజాతను అంట గట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు....."
    "ఒరే సాగర్! ఏం మాట్లాడుతున్నావురా?" సుభద్రమ్మ అరిచినంత పని చేసింది.
    "వాస్తవం మాట్లాడుతున్నాను! ఈ పోలీసోడెమో ఆ మూర్తి గాడి వలలో చిక్కుకున్నాడు. కీలుబొమ్మలా అతడు చెప్పినట్టల్లా ఆడుతున్నాడు!"
    "ఒరేయ్! మూర్తి దేవుడు లాంటి వాడు రా! స్వయంగా బాబగార్ని తీసుకొచ్చి నా జబ్బు నయం చేయించాడు రా!"
    "బాబానా? వాడంత కంటే మోసగాడు!"
    "సాగర్! కళ్ళు పోతాయ్!" సుభద్రమ్మ అరిచినంత పని చేసింది.
    "మీ భార్య భర్త లిద్దరికీ ఎప్పుడో పోయినాయి . కళ్ళుండే గుడ్డి వాళ్ళయ్యారు. ఆ మూర్తి ఉచ్చులలో పడి వాస్తవాన్ని చూడలేకపోతున్నారు."
    "నువ్వా పిచ్చిదాని మైకంలో పడి ------"
    "అమ్మా! " సాగర్ విసురుగా లేచి నిలబడ్డాడు. కొడుకు ముఖం చూసి తల్లి వణికి పోయింది.
    'ఛీ! ఛీ! మీరు మనుష్యులు కాదు! ఈ కొంపలో ఉండటం కంటే....." సాగర్ చరచరా వెళ్ళిపోయాడు.
    'అయ్యో! నా బిడ్డ ! నీకేమయి పోయిందిరా నాయనా?" సుభద్రమ్మ పెద్దగా మూలిగి పక్కమీద వాలిపోయింది.


                                                       20

    విక్టర్! డాక్టర్ గారికి ఫోన్ చేసి నువ్వెళ్ళి సాగర్ ను పిలుచుకురా. అమ్మగారికి బాగలేదని చెప్పు."
    "నా కేమయిందండి! బాగోలేనిది వాడి కయితేను?" రాగం తీసింది సుభద్రమ్మ.
    "నువ్వూరుకోవే!  ఊ! విక్టర్ వెళ్ళు" సాంబశివరావు గొంతు గంభీరంగా ఉన్నది.
    "బాబుగారు ఎక్కడికి కెళ్ళారో?" విక్టర్ తల గోక్కుంటూ వంగి నంగిగా అన్నాడు.
    "ఇడియట్! వాడేక్కడి కేల్లాడో నాకేం తెలుసు? వెళ్ళు, వెళ్ళి వెతుకు"
    విక్టర్ 'టప్' మని శాల్యుట్ కొట్టి బయటికి నడకే పరుగుగా పరుగెత్తాడు. ఈరోజు యస్పీ గారి కేదో అయిపొయింది. చూస్తుంటే ఈ ఇంటిలో వాళ్ళందరికీ ఏదో అయిపోతోంది. ఇంటి ముందో, వెనుకో ఎవడో చాతబడి చేసినట్టున్నాడు. అమ్మగారేమో అబ్బాయిగారికి మతి లేదంటారు. అబ్బాయిగారేమో నాయన గారికి ఏదో అయిందంటారు. చూడంగా చూడంగా వీళ్ళందరికీ తలో రకం పిచ్చి పట్టినట్టుంది. అసలు యిది ఎప్పుడు మొదలయినట్టు? ఆ జడ్జి గారమ్మాయి , ఈ డాక్టర్ బాబూ ఇహ పొతే ఆ సుజాతమ్మ - రోడ్డు మీద నడుస్తున్న విక్టర్ మెదడులో ఆలోచనలు చిక్కుపడిన దారంలా చుట్టాలు చుట్టలుగ తిరిగిపోసాగాయి. ఆలోచిస్తున్న కొద్దీ తనకే మతి పోతున్నట్టనిపించింది. కట్! ఇవన్నీ తనకేందుకు? తన డ్యూటీ సాగర్ బాబును వెదకడం ? ఎక్కడ వెదకాలి? ఆ! అక్కడికే వెళ్లుంటాడు. ఆ మాధవమ్మగారింటి కెళ్లుంటాడు. ఆ అమ్మాయిని లవ్వాడేస్తున్నాడుగా?ఆ ! అదంతా తనకెలా? సాగర్ బాబు కనిపించగానే వాళ్ళ నాన్న గారికి పిచ్చి పట్టిందని, లేదు లేదు అమ్మగారికి వంట్లో బాగాలేదని వెంటనే రమ్మని చెప్తాడు. అదే తన డ్యూటీ! డ్యూటీ అన్నది మెదడులోకి రాగానే విక్టర్ బూటుకు బూటు టప్ మని కొట్టి శాల్యుట్ చేసి నడిరోడ్డు  మీద నిలబడ్డాడు. ఎదురుగా మోటారు సైకిల్ మీద వస్తున్న ఎసై ఆగాడు.
    "యస్పే గారు పిల్చుకు రమ్మన్నారా?"
    "యస్సార్"
    'అయితే రా! వెనక్కు" అంటూ ఎస్సై మోటారు సైకిల్ స్టార్టు చేశాడు.
    "మిమ్మల్ని కాదు సార్! సాగర్ బాబును! యస్పిగారబ్బాయిని."
    "ఇడియట్! మరి నన్నెందుకాపావ్?" "నేనెందుకపాను సార్ మీరే అగారుగా?" విక్టర్ తడుముకోకుండా అన్నాడు. యస్సైకి బెల్టు తీసి నాలుగివ్వాలని పించింది . కానీ విక్టర్ యస్పీ గారి అర్దర్ల్రీ అయిపోయాడు.
    "బ్లడీ ఇడియట్" ఎస్సై సాగిపోయాడు.
    "కాబట్టే యస్సై అయావ్" విక్టర్ గొణిగాడు. ఇప్పటికే యస్సై పెద్దగా అరిచినా వినపడనంత దూరంగా వెళ్ళిపోయాడు. విక్టర్ మళ్ళీ నడక సాగించాడు. ఎక్కడ అని వెతకడం? యెంత సేపని వెదకడం? దూరంగా కనిపిస్తున్న సినిమా హాలు కేసి నడిచాడు. హాలు ముందున్న శనగపప్పు బండి వాడు ముందు ఆగాడు. గుప్పెడు పప్పు చేత్తో దొరక పుచ్చుకొని దియేటర్ మెట్ల మీద నిలబడ్డ మేనేజర్ కు ఒక శాల్యుట్ పారేసి హాల్లోకి వెళ్ళి కూర్చున్నాడు. తెర మీద బొమ్మలు చూస్తూ చేతిలోని పప్పు తింటూ, తిరిగి వెళ్ళాక యస్పీ గారికి ఏం చెప్పాలా అని ఆలోచించసాగాడు విక్టర్.


                                                                 21

    పార్కులో బెంచిమీద కూర్చున్న సాగర్ మనసులో మాధవిని గురించిన ఆలోచనలు వాన రాకడ ముందు ఎగిరే తూనిగల్లా తిరగసాగాయి. వారం రోజులుగా మాధవిని చూడలేదు! తను చివరిసారిగా మాధవిని కలుసుకొన్నది ఈ పార్కులోనే! సరిగా యీ బెంచి మీదే కూర్చున్నారు. ఆరోజు మాధవి తనతో హాయిగా గడిపింది. ఆమెలో ఆత్మవిశ్వాసం ప్రస్పుటంగా కన్పించింది. ఏ సంకోచమూ లేకుండా మాట్లాడింది. ఆమె ఆరోగ్యం పూర్తిగా బాగుపడ్డదన్న నమ్మకం తనకు కలిగింది. అయితే తనకు యింకా అంతుచిక్కని సమస్య అలాగే వుండిపోయింది. డాక్టర్ మూర్తికి ఆమె సబ్ కాన్షన్స్ లో ఉన్న వంటవాడికి వున్న సంబంధ మేమిటి? ఎందుకు డాక్టర్ మూర్తి తన తల్లికి కాన్సర్ అని అబద్దం చెప్పాడు. సుజాతను తనకు అంటగట్టాలనే ఉద్దేశ్యమేనా? లేక ఇంకా వేరే ఏదయినా ఉద్దేశ్యమున్నదా? తన తండ్రి ఎవరికీ తల వంచని వాడు. డాక్టర్ మూర్తికి ఎందుకు లొంగిపోయినట్టు? వట్టి స్నేహ ధర్మంగా అంటే తను నమ్మలేకపోతున్నాడు. డాక్టర్ తన కూతురు భవిష్యత్తు కోసమే ఇదంతా చేస్తున్నడన్నా నమ్మడానికి వీలు లేదు.  సుజాత ను చేసుకోవడానికి తనలాంటి వాళ్ళు వందల కొద్ది ఉన్నారు. అది ఆయనకు అందుబాటులో ఉన్న విషయం కూడా. పోనీ సుజాత తననే చేసుకోవాలని పెద్ద పట్టుదల కూడా ఉన్న పిల్ల కాదు. సుజాత వ్యక్తిత్వం తామరాకు మీద నీటిబొట్టు లాంటిది. పువ్వు మీదనుండి మరో పువ్వు మీద వాలే సీతాకోక చిలికలా తనను కాదనుకొన్న రోజు మరోకడ్ని చూసుకొంటుంది. అయినా ఈ డాక్టర్ కెందుకు ఈ పట్టుదల? విడిపోతున్న మబ్బు తెరలు ముసురుకోంటున్నట్టుగా మళ్ళీ సాగర్ ఆలోచనలు చిక్కుముడులు పడసాగాయి. పార్కులో చీకటి తెరలు వాలుతున్నాయి. ఇంకా ఆడుకొంటున్న పిల్లలను తల్లి దండ్రులు గుంజి తీసుకు పోతున్నారు. ప్రాంతీయ వార్తలు చదివేది....." అంటూ స్పీకర్ లో వినిపిస్తూ వున్నది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS