Previous Page Next Page 
ది పార్టనర్ పేజి 37

 

    "మేడమ్ , పాము వెళ్లి పోయింది. ఇక మీకు యే ప్రమాదము లేదు. నిర్భయంగా మీరు వెళ్ళవచ్చు!" అంటున్న సునీల్ కు, ఆమె యే స్థితిలో వున్నది అప్పుడు అర్ధం అయింది.
    బహుశా భయం వలననేమో వెనుక నుంచి అతని వీపుని చుట్టిందామే.
    పాము వెళ్ళిపోయి నప్పటికీ ఆమెలో భీతి తగ్గలేదు. అనడానికి ఆమె వుచ్చ్వాష విశ్వాసలు స్పష్టంగా తెలుస్తున్నాయి. మెత్తని శరీరం తన వీపును కౌగలించుకుని వుంది. అనే వూహ తట్టడంతో ఏదో తెలియని గిల్టీ నెస్ అతనిలో ప్రవేశించింది.
    "మేడమ్ .....మీరు.....నన్ను వదులుతారా?"
    ఆమె అప్పటికి తెరుకున్నది.
    "ఓహ్ సారీ......ప్రమాదం నుంచి నన్ను కాపాడినందుకు థాంక్స్" అన్నదామె దూరంగా జరుగుతూ. సునీల్ యేమీ ప్రశ్నించలేదు.
    "ఇఫ్ యూ డోంట్ మైండ్.....మీ పేరు యేమిటో తెలుసుకోవచ్చా?"
    "అంత అవసరం లేదు మేడమ్.....నేనేమీ గాంధీని కాదు....తెలుసుకుని ఆదర్శంగా జీవించడానికి..... ప్లీజ్ లీవ్ మీ ఎలోన్" అన్నాడు ముక్తసరిగా.
    ఒక క్షణం అతని వైపు పరిశీలనగా చూసిందామె.
    "ఇట్స్ అల్ రైట్....మీ పేరు చెప్పకపోయినా ఫరవాలేదు....నా ప్రాణాలను కాపాడారు అన్న కృతజ్ఞత నాకు వుంది. అందుకే మీరు అడిగినా అడగకపోయినా నా వివరాలు చెబుతున్నాను. డాబా గార్డెన్స్ దగ్గర వుంది నా బంగళా....చేతినిండా డబ్బు .....తిరగడానికి కార్లు....ఇన్ని వున్నాయి కానీ మనశ్శాంతి ఒక్కటే కరువయింది....అందుకే వెతుక్కుంటూ వచ్చాను."
    "ఇక్కడకా? అయినా మనశ్శాంతి ఇక్కడ దొరుకుతుందా?" ఆశ్చర్యపోతూ అడిగాడు.
    "మరి మీరు ఇక్కడికి ఎందుకొచ్చినట్టు?"
    సునీలు ఉలిక్కిపడ్డాడు.
    అవునో కాదో మీ గుండె పై చేయి వేసుకుని చెప్పండి. అన్నట్టు వున్నాయి ఆమె మాటలు.
    అసలు ఈమె ఎవరు? తన గురించి తెలిసినట్టు మాట్టాడుతుంది .... ఇక్కడకు ఎలా వచ్చింది? ఎప్పుడు వచ్చింది .....ఎందుకు వచ్చింది? తొలిసారిగా ఆమెను గురించి ఆలోచిస్తూ పరిశీలనగా చూశాడు ఆమె వైపు.
    గొప్పింటి యువతిలా వున్నది.... మెడలో మంగళసూత్రం .... నల్లపూసల గొలుసు .....ఖరీదయిన అలంకరణలు.....ఆకర్షణీయ మయిన రూపం.
    "మీరు చెప్పినా చెప్పకపోయినా నిజం యేమిటో నాకు తెలుసు. ఇలాంటి ఒంటరి ప్రదేశాలకు మనసు బాగోని వాళ్ళే వస్తారు. అందుకే అలా అన్నాను. మీ వాలకం చూస్తుంటే మీరూ నాకన్నా ఎక్కువ అశాంతిగా వున్నారు అనిపిస్తుంది.
    సునీలులో ఎలాంటి ప్రతి స్పందన లేదు.
    "రండి, వెళదాం...." చొరవగా అన్నది ఆమె.
    "నాన్సెన్స్ ....ఎవరు మీరు....అసలు ఇక్కడకు ఎందుకు వచ్చారు . మీతో నేనెందుకు రావాలి?" అతని గొంతులో కోపం. విసుగూ రెండూ మిళిత మయ్యాయి.
    "యింత చిన్న విషయానికి అంతలా కోపగించుకొనవసరం లేదండీ నేను ఎవరో యిందాకనే చెప్పానుగా......పేరంటారా.....సుజాత......మావారు టాప్ ఇండస్ట్రియలిస్ట్....నాకు అన్నీ అందుబాటులోనే వున్నాయి. కానీ జీవితంలో ఏదో పోగొట్టుకున్నాననే భావన....అది పూడ్చుకోవాలని మనశ్శాంతి కోసం నేను అప్పుడప్పుడూ ఇక్కడకు వస్తుంటాను. ఈరోజు మీరు కాకతాళీయంగా కనిపించారు అంతే"\
    ఆమె కూడా తనలాగానే ఇక్కడకు వస్తుందన్నమాట....
    ఇంతవరకూ తనకు ఆమె ఎప్పుడూ తారసపడలేదు కాబట్టి ఇప్పుడే వచ్చింది అనుకుంటున్నాడు.
    "సారీ.....నేను విసుగులో ఏం మాట్లాడుతున్నానో నాకే తెలియడం లేదు"
    "ఆ విషయం అర్ధం అవుతూనే వుంది లెండి.... చీకటి పడుతున్నది ఇంకా కాసేపు వుంటే పాములు వస్తాయి.... రండి వెళదాం."
    నిజమే....చీకట్లో పాములు తిరుగుతాయని ఇందాక స్పష్టంగా చూశాడు.
    తనకు కూడా వెళ్ళాలనే ఉంది....
    అందుకే , ఆమె వెళ్ళిపోయాక వెళదామనుకున్నాడు.
    "మీరు వెళ్ళండి, నేను తరువాత వస్తాను."
    "నా ప్రాణాలను కాపాడినందుకు కనీసం కృతజ్ఞత నయినా చూపించుకునే అవకాశాన్ని నాకు ఇవ్వండి/ ప్లీజ్ మా ఇంటికి రండి"
    ఆమె కంఠంలో అభ్యర్ధన తొంగి చూసింది.
    "మీ ఇంటికా?"
    "అవును....ఏం రాకూడదా?"
    సునీల్ తడబడి పోయాడు.
    ఒక్కసారి తనను తను చూసుకున్నాడు.
    పిచ్చివాడిలా ఉంది తన అవతారం. పెరిగిపోయిన గడ్డం....మాసిన జుట్టు....దుమ్ము కొట్టుకుపోయినట్టున్న బట్టలు....
    ఇలాంటి రూపంతో ఆమె వెంట వెళ్ళడమా?
    అతని సందేహం ఆమెకు అర్ధమయింది.
    "ఫరవాలేదు రండి.....మా ఇంటిలో అన్నీ వున్నాయి. చక్కగా షేవ్ చేసుకుని స్నానం చేయవచ్చు.
    ఆమె చేత అన్నిసార్లు అడిగించుకోవడం అదోలా అనిపించి మౌనంగా ఆమె వెంట నడిచాడు సునీల్.
    బీచ్ ఒడ్డున పార్క్ చేయబడిన మారుతీ కారు వేపు నడిచింది సుజాత....
    సునీల్ కారులో కూర్చోబోతూ ఒక నిమిషం సందేహించాడు.
    "మీరు ఆలోచించే విషయం ఏదో ఇంటికి వచ్చాక తీరికగా ఆలోచించుకోవచ్చు"
    మౌనంగా కారు ఎక్కాడు అతను.
    సుజాత అతని మీదుగా ముందుకు వంగి డోర్ ను లాక్ చేసింది.
    మెత్తని ఆమె శరీరం మరొకసారి సునీల్ కు గట్టిగా తగిలింది. ఆమె అది గమనించిందో లేదో కానీ ఎంతసేపటికీ డోర్ సరిగా పడకపోతే చాలాసేపు అలానే అతని మీదుగా వరిగి వుండిపోయింది.
    సునీల్ పరిస్థితి ముళ్ళ మీద కూర్చున్నట్లుంది.
    మారుతీ కారు కదిలింది.
    "నా ప్రశ్నకు మీరు జవాబు చెప్పనే లేదు?"
    "ఏ ప్రశ్న?" తడబడుతూ అడిగాడు.
    "మీ మనస్సు ఇక్కడ లేనట్టుంది....మీరు ఈ లోకంలోకి వచ్చినప్పుడు అడుగుతాలెండి' చిరునవ్వుతో అన్నదామె.
    మారుతీ కారు ఖరీదయిన ఒక ఇంటి ఆవరణలోకి వెళ్ళి ఆగింది.
    సుజాత కిందకు దిగుతూ అతనిని కళ్ళతోటే రమ్మని పిలిచి, తాళం తీసి లోపలకు అడుగు పెట్టింది.
    కాలు పెడితే మాసిపోయేటట్టున్న తివాచీ కింద పరచబడీ వుంది.
    గొప్పింటి యువతి అనుకున్నాడే తప్ప మరీ కోటీశ్వరురాలు అయి వుంటుందను కోలేదు. అందుకే ఆశ్చర్యాన్ని లోలోపలే అణచుకుంటూ సోఫాలో కూర్చున్నాడు.
    "ఇంతకూ మీపేరు చెప్పలేదు సుమా"
    సునిల్...."
    "నైస్ నేమ్....లుక్ మైడియర్ సునిల్ మీలాంటి అందమయిన యువకుని ముఖంలో అంత వైరాగ్యం గూడు కట్టుకుని వుండకూడదు. ఎందుకు అలా వున్నారు అని అడగబోవడం లేదు నేను. యూ ఆర్ యంగ్ అండ్ డైనమిక్ యూత్ ఫోల్స్....నీలాంటి వాళ్ళే ఈ దేశానికి కానీ సమాజానికి కానీ కావాలి. బాధలు అనేవి మనుషులకే వస్తాయి కానీ మానులకు రావు. మీ అందమయిన పర్సనాలిటీని శుభ్రంగా ఉంచుకోండి. షేవింగ్ చేసుకుని నీట్ గా డ్రస్ చేసుకోండి. ఎలాంటి సంకోచం పడవద్దు." ఇది మీ స్వంత ఇల్లు అనుకోండి" అంటూ లోపలకు వెళ్ళింది ఆమె.
    సునిల్ లో సంఘర్షణ మొదలయింది.....
    ఒక పరాయి స్త్రీ అందునా భర్త లేని సమయంలో తను ఇలా రావడమే తప్పు. ఆమె ఎంత ఆప్యాయంగా రమ్మని పిలిచినా తను చొరవ తీసుకోవడం మంచిది కాదేమో....


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS