Previous Page Next Page 
ది పార్టనర్ పేజి 36

 

    వి.సి.ఆర్  అన్ చేశాడు గజపతి.
    రేష్మా పడకగదిలో ......ఆమెతో తను జరిపిన శృంగార కేళి స్పష్టంగా కనిపిస్తుంది.
    ఆ దృశ్యాలను చూడలేక తల పక్కకు తిప్పుకున్నాడు సునిల్.
    "ఏం చూడలేకపోతున్నావా.....ఇప్పుడెం అంటావు ........నువ్వు తీయక పోతే నేను తీశాను అంటావా?"
    ఉరిమి మట్టాడడంతో సునిల్ దోషిలా తల వంచుకున్నాడు ?
    "ఇంకా ఏం మిగిలిందని నిలుచున్నావు . ఈ జన్మలో నీ ముఖం నాకు చూపించకు....."
    సునీల్ సిగ్గుతో కుంచించుకు పోతూ వెను దిరిగాడు.
    అతని కళ్ళలో ఎర్ర జీర......
    పిడికిళ్ళు బిగుసుకున్నాయి.....
    దీనికి అంతటికీ కారణం......రేష్మా!
    అసలు ఆమె పిలవకపోతే తను వెళ్ళేవాడు కాదు....వెళ్ళిన తరువాత జరిగిన దాంట్లో ఆమె ప్రమేయం ఉన్నా లేకపోయినా తను యిలాంటి చక్రబంధంలో చిక్కుకున్నది ఆమె వల్లనే......
    ఆరోజు ఆమె మాటలను వినడం వలనే తను పారిపోయాడు ......పోలీసుల దృష్టిలో , గజపతి దృష్టిలో , దోషిలా నిలబడవలసి వచ్చింది.
    మంచి మనిషి అయిన గజపతిని తను అనుమానించేలా చేసింది....
    అసలు రేష్మానే అలా చేయించిందేమో....\
    అలా అనుకోవడంతోనే ఆవేశంగా ఆమె ఇంటికి బయలుదేరాడు సునిల్.
    అతనిని చూసీ చూడడంతోటే......
    "హాయ్ హాండ్ సమ్ .......ఇన్నాళ్ళు ఎమయిపోయావు ......ఏదో పారిపోమ్మంటే అసలు కంటికి కనిపించకుండా అదృశ్యమై పోయావు. గజపతి పోలీసులను అప్పుడే మేనేజ్ చేశాడు. అసలు ఆ పోలీసులు ఆ విషయమే ఎత్తరు....." చిరునవ్వుతో అంటూ వచ్చి అతనిని కౌగలించుకున్నది రేష్మా.
    ఆమెను కోపంగా విదిలించాడు....
    "ఏమిటిది?"
    "రేష్మా ......నటించడం మానేయ్. నేనేమన్నా ఆటబొమ్మను అనుకున్నావా? నువ్వు ఏది చెబితే అది నేను నమ్మడానికి?"
    "ఏమో ఎవరికి తెలుసు .....నువ్వు ఆటబొమ్మవో....ఆడించే వాడివో తెలియాలంటే కొంతకాలం నాతోపాటు నువ్వు వున్నావంటే అప్పుడు తెలుసుకుని చెబుతాను" అన్నది విలాసంగా.
    "నీ జోకులు కట్టిపెట్టు.......గజపతి మీద ఎందుకు అలా అబద్దం చెప్పి నన్ను పారిపోమ్మన్నావు....అసలు ఆ కాసేట్ తీయించింది నువ్వే కదూ?"
    "ఓహో ....అదా నీ కోపానికి కారణం....కోపం తగ్గించుకుని నేను చెప్పేది నిదానంగా విను. గజపతి ఎలాంటి వాడో నీకు తెలియక అతన్ని గుడ్డిగా నమ్ముతున్నావు. అతని నిజస్వరూపం నీకు తెలియదు. నీలాంటి ఎందరో యువకులు అతని కుటిల బుద్దికి పతనమై పోయారు. నువ్వు అన్నావు చూడు....నేనే తీయించానని ....ఆ మాటలో కొంత నిజం వుంది. ఎందుకో తెలుసా.....ఆ రాత్రి వీడియో తీస్తారని నాకు తెలుసు.
    "ఆ తెలుసా ....నీకు తెలిసే అలా ప్రవర్తించావన్నమాట"
    'అవును ....అది నాకు కొత్తేమీ కాదుగా ....నీలాగా ఎందరో సూపర్ వైజర్ లను అలా విందుకు ఆహ్వానించాను. అలా మత్తులో మునిగిపోయిన జంటల శృంగారాన్ని వీడియో తీసి, ఆ కాసేట్ కాపీలను విదేశాలకు అమ్ముకుంటాడు గజపతి. ఆ విషయం తెలిసే నేను గజపతికి అమ్ముడుపోయాను"
    "నో.....నేను నమ్మను ...నన్ను నమ్మించాలని ప్రయత్నించకు"
    "పిచ్చివాడా........ఆ అవసరం నాకులేదు. నిజం చెబుతున్నాను అంతే! అందుకే తనపై ఎలాంటి అపనమ్మకం కలగకుండా వుండేందుకే నువ్వు పనిచేసిన కాలానికి జీతం కూడా నీ ముఖాన గిరాటు వేసి పెద్ద నీతిమంతుడిలా ఫోజు పెట్టి వుండాలే.....ఏమంటావ్"
    "ఎమనగలడు?
    రేష్మా మాటలకూ తల తిరిగిపోయింది అతనికి.
    అక్కడకు వెళితే రేష్మా దోషి అనిపించింది....
    ఇక్కడకు వస్తే గజపతి అలా చేశాడు అంటుంది.
    ఎవరు చేసినా ....ఎవరు చేయించినా ...అతను మాత్రం దోషిగా నిలబడి పోయాడు....మానసికంగా శిక్షను అనుభవిస్తున్నాడు.
    అందుకే ఆ సంభాషణను పొడిగించడం ఇష్టం లేక.......రేష్మా పిలుస్తున్నా వినిపించుకోకుండానే వెను దిరిగి వెళ్ళిపోయాడు సునిల్.
    

                                                        *    *    *

    సునీల్ మనస్సు పరిపరి విధాల పోతున్నది.
    ఎంత వద్దు అనుకున్నా జరిగిపోయిన దృశ్యమే అతని కళ్ళ ముందు మెదులుతుంది.
    ఒక విధంగా గజపతి, రేష్మా ఇద్దరూ తనను వంచించారు. ఆ ఇద్దరు ఏ ప్రయోజనాన్ని ఆశించి తనను పావులా ఉపయోగించుకున్నప్పటికీ నష్ట పోయింది తను మాత్రమే.
    పరువు ప్రతిష్టలు పోగొట్టు కోవడంతో పాటు పోలీసుల దృష్టికి వెళ్ళాడు.
    తన ట్రయినింగ్ పూర్తీ అయ్యాక వెంటనే హైదరాబాద్ లోనే పోస్టింగ్ చేసినట్టు ధీరజ ఉత్తరం వ్రాసినా ఆ సంతోషాన్ని ఆమెతో పంచుకోలేక పోయాడు. తిరిగి రిప్లయి రాయాలని పించినా ఒక విధంగా జరిగిన సంఘటనలు తనను పూర్తిగా పతనం చేశాయి.
    తనకు ఉన్న ఒక్కగానొక్క తోడు....జీవిత నావకు చుక్కానిలా భావించిన ప్రేమ దేవతను సయితం ఒదులుకున్నాడు. ఇక తన జీవితం ఎటు వెళుతుందో?
    తన గమ్యం ఏమిటి.....?
    మిరుద్యోగిలా బతుకు వెళ్ళ దీసేకన్నా ధీరజ దగ్గరకు వెళ్ళడం మంచిదేమో....ఆ ఆలోచనకే తనపై తనకే అసహ్యం వేసింది. ఇంత బ్రతుకు బ్రతికి చివరకు ఒక ఆడదాని సంపాదన మీద ఆధారపడాలి అనుకోవడం ఎంత హీనమో....!
    తన కాళ్ళపై తను నిలబడేలా ఏదో ఒక ఉద్యోగాన్ని వెతుక్కోవాలి..... అప్పుడే గర్వంగా ధీరజ ముందుకు వెళ్ళి నిలబడగలడు..... అంత వరకూ ఆమెతో మనస్సు విప్పి కూడా చెప్పుకోలేని వ్యధతో తను కుమిలి పోవలసిందే.
    రకరకాల ఆలోచనలతో అతని అంతరంగం సతమతమవుతున్నది.
    మరో వైపు నల్లని చీకట్లు బీచ్ కు అప్పుడప్పుడే చుట్టూ ముడుతున్నాయి.
    సునీల్ కంటికి దూరంగా జనం ఎక్కడో కనిపిస్తున్నారు. బీచ్ కు దూరంగా ఆ ప్రదేశానికి వచ్చి అక్కడ వున్న రాతి బండలకు అనుకుని ధీరజతో వూసులాడుతూ గంటలను నిమిషాల్లా గడపడం సునీల్ కు ఎప్పటి నుంచో అలవాటు.
    ఉన్నట్టుండి కేవ్వుమనే కేక వినిపించడంతో సునీల్ ఉలిక్కిపడ్డాడు.
    అతను కూర్చున్న చోటికి మరికొంచెం వెనుకగా నోకరాతి బండను అనుకుని గజగజా వణికి పోతున్నది వొక యువతి.
    ఆమె ఎందుకు ఖంగారు పడిందో ననుకుంటూ ఆప్రయట్నంగానే లేచి ఆమె వైపు నడిచాడు సునీల్.
    "పా........పా........పాము" అన్నది ఆమె కీచు గొంతుతో.
    అప్పుడే సునీల్ కూడా ఆమెకు ఎదురుగా తోకపై నిలుచుని వున్న తాచుపాముని చూశాడు.
    వొక నిముషం సందేహించినా రెండే రెండు అంగలలో ఆమెను సమీపించాడు.
    ఆమెను విసురుగా వెనక్కి లాగి .....ఆమె నిలుచున్నా చోట తను నిలబడ్డాడు.
    తన శతృవును తప్పించి మరొకరు వూడిపడ్డాడు అనే కోపం కాబోలు ....తాచు బుసలు అధికం అయ్యాయి.
    సునీల్ నిశ్చలంగా దానివైపే చూస్తూ నిలుచున్నాడు.
    తాచు ఏమాత్రం కదిలినా తను కూడా రియాక్ట్ కావడానికి సిద్దంగా వున్నాడు.
    భయంతో వణికిపోతున్న ఆ సుందరి అతని వేపు నుంచి ఆ నాగు పామును పాలిపోయిన ముఖంతో చూస్తూనే వున్నది.
    ఉన్నట్టుండి ఆ తాచుపాము యేమనుకుందో ఏమో ....యెదుట నున్న వ్యక్తీ తనకన్నా మొండివాడు అనుకున్నట్టుంది.....మెల్లగా పడగ దించుకుని ఆ రాతి బండపై పాక్కుంటూ ఇసుకలో దూరంగా వెళ్ళిపోయింది.
    ఆ దృశ్యం చూడడంతో ఆమెలోని టెన్షన్ చల్లారింది.
    సునీలు తృప్తిగా శ్వాస పీల్చాడు.... తనకు యేమీ కానందుకు కాదు వొక అబలను రక్షించాననే ఉద్దేశ్యంలో అతని మనస్సు వూరట చెందింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS