Previous Page Next Page 
మిస్టర్ 'యూ' పేజి 35

 

    అప్పుడు చూశాడు రాజు.........
    అక్కడంతా పెద్ద డిప్రెషన్ లాగా ఉంది. పెద్ద గుంటలాగా ఉన్న దాని నిండా ఏనుగుల ఆస్థిపంజరాలు !
    "ఎలిఫెంట్స్ గ్రేవ్!' అన్నాడు రాజు ఎగ్జయిట్ డ్ గా.
    "ఫాంటాస్టిక్ !" అంది సృష్టి.
    ఇద్దరూ ఇంకాస్త దగ్గరగా వెళ్ళారు.
    వేలకు వేలు ఏనుగుల ఆస్థిపంజరాలు ఉన్నాయి అక్కడ !
    "ఒక విశేషం గమనించావా సృష్టీ!" అన్నాడు రాజు నెమ్మదిగా .
    "ఏమిటి ?" అంది సృష్టి.
    "ఇక్కడ ఉన్న ఏనుగుల ఆస్థిపంజరాలలో ఒకదానికీ దంతాలు లేవు."
    "అవును" అంది సృష్టి.
    "అంటే దాని అర్ధం?"
    "ఇప్పటికే ఎవరో ఈ ఏనుగుల శ్మశానాన్ని కనిపెట్టేసి, ఆస్థిపంజరాల తాలుకూ దంతలన్నీ కోసుకు వెళ్ళిపోయారని !"
    "ఎవరై ఉంటారు ?"
    "ఎలా చెప్పగలం" అంది సృష్టి.
    వాళ్ళు అట్లా మాట్లాడుకుంటూ ఉండగానే -
    ఇందాక కనబడిన నరవానరం టార్జాన్ లాగా లాఘవంగా ఊడలు పట్టుకుని ఊగుతూ , ఒక చెట్టు మీద నుంచి ఒక చెట్టు మీదకి వెళుతూ కొద్ది క్షణాల పాటు కనబడి ఆ తర్వాత అదృశ్యమయింది.
    "సృష్టీ అది ఎంతో దూరం వెళ్ళి ఉండదు. దాన్ని చేజ్ చేసి పట్టుకుంటే ఈసారి మిస్టరీ సాల్వ్ అయిపోతుంది ." అన్నాడు రాజు పరిగెడుతూ. "నువ్వు ఇక్కడే వుండు. నేను ఇక్కడే వస్తాను " అన్నాడు పరిగెడుతూనే వెనక్కి తిరిగి, అతని పరుగు వేగాన్ని అందుకోలేక ఆగింది సృష్టి.
    అన్నట్లుగానే పది నిముషాల్లో తిరిగి వచ్చాడు రాజు.
    "దొరికిందా?" అంది సృష్టి. ఆతృతగా "నరవానరం దొరకలేదు - కానీ ఇది దొరికింది " అన్నాడు రాజు - చేతిని ముందుకు జాపుతూ .
    అతని చేతిలో చిన్న సెల్ ఫోన్ ఉంది.  
    "బహుశా ఇది ఆ సినిమా యూనిట్ వాళ్ళది అయి ఉండవచ్చునేమో" అన్నాడు రాజు.
    "ఏదీ?" అని దాన్ని అందుకుంది సృష్టి. బటన్స్ నొక్కి టెస్ట్ చేసింది. ఆమె మోహంలో ప్రశ్నార్ధకం కనబడింది.
    "ఏమయింది ?" అన్నాడు రాజు.
    "ఇది సెల్ ఫోన్ కూడా -- కానీ ఉత్త సెల్ ఫోన్ మాత్రమే కాదు -- దిసీజ్ సమ్ థింగ్ స్పెషల్!"
    "అంటే?"
    "పూర్తిగా టెస్ట్ చేస్తే గానీ అన్ని విషయాలు అంతుపట్టవు గానీ ఇది చాలా అడ్వాన్స్ డ్ గాడ్జెట్. మాములు మనుషులు ఉపయోగించేది కాదు. సైంటిస్టుల పరిశోధనలకీ, మిలటరీ అవసరాలకు పనికి వచ్చే సాధనం లాగా వుంది ఇది."
    "ఎవరిదై వుంటుంది ?"
    "ఈ రాక్షసుడి ఉదంతాన్ని పరిశోధించడానికి ఎవరైనా సైంటిస్టుల బృందం వచ్చి ఉండవచ్చును. లేదా, ఇక్కడెక్కడన్నా మిలటరీ క్యాంపు ఉండవచ్చును. అది కాకపోతే " అని ఆగి , తర్వాత చెప్పింది సృష్టి. "ఇట్లాంటి అడ్వాన్స్ డ్ పరికరాలు ఒక్కోసారి ఇంటర్నేషనల్ బ్లాక్ మార్కెట్ లో అమ్మకానికి వస్తుంటాయి - లేటెస్ట్ యుద్ద సామాగ్రితో సహా ..... ఎవరైనా తిరుగు బాటు దారులో , తీవ్రవాదులో ఇది సంపాదించి ఉండవచ్చును. పోగొట్టుకుని ఉండవచ్చును కూడా."
    "ఇందులో న్యూస్ వస్తుందా?" అన్నాడు రాజు.
    "ఎందుకు రాదు?" అని సెల్ ఫోన్ ని సెట్ చేసింది సృష్టి.
    వెంటనే మినీ స్రీన్ మీద అక్షరాలూ పరిగెత్తటం మొదలెట్టాయి.
    ఒక హెడ్డింగు దగ్గర ఆపింది సృష్టి.
    కోతి కాపరం !
    "ఆంధ్రప్రదేశ్ అడవుల్లో ఒక రాక్షసుడు సంచారిస్తున్నడన్న వార్త సంచలనం కలిగిస్తున్న సంగతి తెలిసిందే. రాక్షసుడిని చూసినట్లుగా ఎన్నెన్నో రిపోర్టులు వచ్చాయి.
    డుముకు అనే గిరిజనుడు రాక్షసుడి బారిన పడి మరణించాడు. డుముకు శరీరానికి తగిలిన గాయాలకు అంటుకున్న వెంట్రుకలు ఏ జంతువూ తాలుకూవో ఇంతవరకూ అంతుబట్ట లేదు.
    అదలా వుండగా ప్రొఫెసర్ భయంకర్ ఆ వెంట్రుకలు మనవ పరిణామ దశలో మిస్సింగ్ లింక్ అనదగిన ఒక నరవానరం తాలుకూ వని ప్రతిపాదిస్తున్నారు."
    తర్వాత స్క్రీన్ మీద ప్రొపెసర్ భయంకర్ కనబడ్డాడు. అతను భయంకర్ అన్న పేరుకి ఏ మాత్రం తగినవాడిలా లేడు. పొట్టిగా, టూకీగా చాలా సాధువుగా కనబడుతున్నాడు.  
    పెద్ద పెద్ద పారిభాషిక పదాలు ఉపయోగిస్తూ కంగారు కంగారుగా ఏదో చాలాసేపు చెప్పాడు ప్రొఫెసర్ భయంకర్.
    అతను చెబుతున్నదేమిటో రాజుకి అర్ధం కాలేదు.
    "ఏమంటున్నాడు?" అన్నాడు.
    నవ్వింది సృష్టి.
    అట్లా చెబితే అందరికీ అర్ధం అవుతుందా? అందుకే చాలా మంది సైన్సు అంటే భయపడతారు. అతను చెప్పేది ఏం లేదు. హిమాలయాల్లో "యేతి " అనబడే మంచు మనిషి ఉందంటాడు. చైనాలో 'బిగ్ పుట్స్' అనే నరవానరం గురించి రిపోర్టులు ఉన్నాయి " అని.
    "ఉండు ఉండు !" అంది.
    స్క్రీన్ మీద ప్రొఫెసర్ భయంకర్ అదృశ్యమయ్యాడు.
    మళ్ళీ అక్షరాలూ కనబడడం మొదలెట్టాయి.
    "అదలా వుండగా -- ఈ నరవానరం ఒక అమ్మాయిని ఎత్తుకు పోయిందనీ , ఆ అమ్మాయితో బలవంతంగా కాపురం చేస్తోందనీ మరికొన్ని రిపోర్టులు అందాయి.
    ఆ అమ్మాయి పేరు యువ. మిస్టర్ యూనివర్స్ గా సెలెక్ట్ అయి కూడా టైటిల్ ని కాలదన్నిన రాజుకి చెల్లెలు ".
    "గాడ్!" అన్నాడు రాజు.
    "అయితే మన అన్వేషణ ఒక కొలిక్కి వచ్చినట్లే !" అంది సృష్టి.
    "కానీ. ..కానీ ..... యువని ఎట్లాంటి స్థితిలో చూస్తానో అని భయంగా ఉంది సృష్టి !"
    నెమ్మదిగా అతని భుజం మీద చెయ్యి వేసింది సృష్టి.
    "డోంట్ వర్రీ రాజూ ,.....ఎవ్విరిథింగ్ విల్ బీ అల్ రైట్!" అంది.
    "యువ అంటే నాకు పంచ ప్రాణాలు " అన్నాడు రాజు.  


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS