సాగర్ తండ్రి కూర్చున్న సోఫా వెనుక నిలబడ్డాడు. సాంబశివరావు అర్దర్లీ ని పిలిచి కూల్ డ్రింక్స్ తెమ్మన్నాడు.
"సో? మీ ఒపినీయన్ ఏమిటి డాక్టర్?" డాక్టర్ మూర్తి డాక్టర్ అనందరావును అడిగాడు. డాక్టర్ ఆనందరావు ప్రభుత్వ సివిల్ సర్జన్ గా రిటైరయి ప్రయివేటు ప్రాక్టీస్ చేస్తున్నాడు. డెబ్బై ఏళ్ళు నిండాయి. అనుభవం , ప్రతిభ గల డాక్టర్ గా పేరున్నది.
"బయాప్సీ రిపోర్టు మీద నాకు నమ్మకం కుదరలేదు. మరో చోట చేయించడం మంచిదేమో ననిపిస్తుంది." డాక్టర్ ఆనందరావు అన్నాడు.
"మాలిగ్నంపీ కాదంటారా?" డాక్టర్ మూర్తి ఆశ్చర్యంగా అడిగాడు .
"కాకపోవచ్చు! ఏదైనా మరోసారి బయాప్సీ చేయించడం మంచిది. ఇక్కడి రిపోర్స్ మీద నాకు నమ్మకం లేదు. అనుభవం మీద చెబుతున్నాను." డాక్టర్ ఆనందరావు సంబశివరావును ఆ తర్వాత సాగర్ ను చూస్తూ అన్నాడు.
"ఓ.కే దానిదేముంది? బాంబే మద్రాస్ రెండు చోట్ల చేయించుడాం" అన్నాడు డాక్టర్ మూర్తి.
'అలాగే త్వరగా చేయించండి. అంతవరకూ ఇప్పుడిప్పిస్తున్న ట్రీట్ మెంట్ ఆపడం మంచిదను కుంటాను డాక్టర్ " అంటూ ఆనందరావు మూర్తి ముఖంలోకి ప్రశ్నార్ధకంగా చూశాడు.
"ఐ ఎగ్రీ విత్ యూ. బయాప్సీ రిపోర్ట్స్ వచ్చాక ఆలోచిద్దాం" అంటూ డాక్టర్ మూర్తి సాగర్ వైపూ తిరిగాడు.
"ఇప్పుడిప్పిస్తున్న మెడిసిన్స్ ఆపివేయండి."
సాగర్ తల ఊపాడు. తల్లికి కాన్సర్ కాకపోవచ్చుననే ఆశ అతనిలో మొలకెత్తింది. మృత్యువు నోట్లో నించి తల్లిని బయటికి లాగిన భగవత్ స్వరూపంలా కనిపించాడు డాక్టర్ ఆనందరావు.
"హాప్, వుయ్ ఆర్ నాట్ టేకింగ్ ఎనీ రిస్క్!" డాక్టర్ మూర్తి సందిగ్ధంగా అన్నాడు.
"రిస్క్ ఏమీ లేదు. అంతవరకూ ఈ మందులు వాడండి" అంటూ ఆనందరావు స్లిప్ మీద మందులు రాసి సాగర్ కు ఇచ్చాడు. ఆనందరావు లేచి నిలబడ్డాడు. సాగర్ డాక్టర్ గారి కిట్ చేత్తో పట్టుకుని అనుసరించాడు. అతని వెనుకే డాక్టర్ మూర్తి, సాంబశివరావు బయటికొచ్చారు.
కారేక్కబోతున్న డాక్టర్ అనందరావుకు సాంబశివరావు థాంక్స్ చెప్పాడు. మూర్తి కరచాలనం చేశాడు .
డాక్టర్ అనందరావుతో పాటు సాగర్ కార్లో కూర్చున్నాడు.
"సాగర్ మళ్ళీ ఎలా వస్తావ్ నువ్వు! నాకారు తీసుకెళ్ళు!" అన్నాడు డాక్టర్ మూర్తి.
"నా సైకిల్ డాక్టర్ గారింటి దగ్గరే ఉన్నది థాంక్యూ" అని సాగర్ అంటుండగా డాక్టర్ ఆనందరావు కారు సాగిపోయింది.
ఇంట్లోకి తిరిగి వస్తూ సాంబశివరావు డాక్టర్ను చూసి "ఈ పని ముందే చేస్తే పోయేది బయాప్సీ అనుమానంగా ఉంటే మరోచోట చేయించి ఉండాల్సింది ." అన్నాడు.
డాక్టర్ మూర్తి గతుక్కుమన్నాడు.
"బయాప్సీ చేసిన పాధాలిస్టు చాలా నమ్మకమైన వాడు. అనుభవం ఉన్నవాడు. అందువల్ల మరో చోట చేయించాలన్న ఆలోచన కూడా రాలేదు. చూద్దాం బయాప్సీ రిపోర్ట్స్ ఎలా ఉంటాయో! ఐ యామ్ సారీ! సాంబశివరావ్. కాన్సర్ అని ఓసారి నిర్ణయమైన తర్వాత అలక్ష్యం చేయడం మంచిది కాదు అందువల్ల వెంటనే ట్రీట్ మెంట్ మొదలు పెట్టాను." డాక్టర్ సంజాయిషీ ఇచ్చుకుంటూన్న ధోరణిలో చెప్పసాగాడు. సాంబశివరావు డాక్టర్ మూర్తి చెప్పేది ఏమి పట్టించుకొన్నట్టు లేదు. గబా గబా భార్య పడుకొని ఉన్న గదిలోకి వెళ్ళాడు. మంచం ప్రక్కనే బల్లమీద కూర్చున్న నర్స్ లేచి నిలబడింది.
'ఇప్పుడే కునుకు పట్టింది. ఇప్పుడు లేపోద్దు" మెల్లగా గొంతు తగ్గించి చెప్పింది నర్సు.
ప్రశాంతంగా నిదురపోతున్న భార్య ముఖంలోకి కన్నార్పకుండా అలాగే నిలబడి చూశాడు సాంబశివరావు. తను ఆమెకు అన్యాయం చేశాడు! ఆమెను అశ్రద్ధ చేశాడు. డాక్టర్ మూర్తి మీదే పూర్తిగా ఆధారపడి మరో డాక్టర్ చూపించ లేదు. మూర్తి సమర్ధుడు కావొచ్చు ఆత్మీయుడు కావొచ్చు. కాని ఇలాంటి కేసుల్లో రెండో అభిప్రాయం తీసుకోక పోవటం తనదే పొరపాటు. ఇందులో డాక్టర్ మూర్తి పొరపాటు లేదు. తనమీద తనకు విశ్వాసం ఉన్నది. మరో డాక్టర్ కు చూపించాలని అతనికి ఉండకపోవటం సహజం. కాని తను చేసింది పొరపాటు. రెండో డాక్టర్ కు చూపించాలని తానంటే డాక్టర్ మూర్తే ఆ పని చేయించేవాడు. అతనికి తెలియకుండా వేరే డాక్టర్ను తీసుకొచ్చి చూపించినా అతడేమీ బాధపడలేదు. అది అతని సహృదయానికి సంస్కారానికి నిదర్శనం. ఏమైనా జరిగిపోయిందేదో జరిగిపోయింది. మతి చాలించిదనుకొన్న సాగరే మంచి పని చేశాడు! వెళ్ళి డాక్టర్ అనందరావును తీసుకొచ్చాడు. పైగా వాడి మీద నిఘా పెట్టాడు. వాడిలా అయిపోవడానికి కారణం మాధవి అనుకున్నాడు. అది పొరపాటు. తల్లి ఆరోగ్యాన్ని గురించే వాడు బాధ పడుతున్నాడు. కృంగిపోతున్నాడు ఆవిడ గురించిన ఆలోచనలే వాడ్ని క్రుంగదీసి వేశాయి. అది తను గమనించలేదు. ఒక వైపు తను ప్రేమించిన మాధవికి ఉన్మాదం! రెండో వైపున కన్నతల్లి కాన్సర్ వ్యాధి , వాడి మతిస్థిమితం లేకుండా చేశాయి. అది తను అర్ధం చేసుకోలేక పోయాడు. భర్తగా సుభద్రకు అన్యాయం చేశాడు. కొడుకుగా సాగర్ తల్లి బుణం తీర్చుకుంటున్నాడు. బయాప్సీ రిపోర్టు లో కాన్సర్ కాదని తేలితే? - సాంబశివరావు ఆలోచన ఆగిపోయింది. తల ప్రక్కకు తిప్పి చూశాడు. ప్రక్కన డాక్టర్ మూర్తి లేడు. ఎప్పుడు వేళ్ళాడు? సాంబశివరావు గదిలోంచి బయటకు నచ్చాడు. డ్రాయింగ్ రూమ్ లో డాక్టర్ మూర్తి ఫోన్ ముందు నిలబడి మాట్లాడం కళ్ళబడింది.
"బయాప్సీ కి ఏర్పాటు చేశాను. రేపు ఉదయమే బయాప్సీ చేసి, నైట్ ప్లేయిట్ లో బొంబాయి, మద్రాసు నడుపుదాం. మూడు రోజుల్లో రిపోర్టు మనకు అందుతుంది."
"థాంక్యు " అంతకంటే ఏమీ అనలేకపోయాడు సాంబశివరావు.
"మీరు నాకు థాంక్స్ చెప్పడమేమిటి? న అశ్రద్ధను నేను కుమిలిపోతున్నాను. కుర్రాడికి తట్టిన మాత్రం నీకూ నాకూ తట్టలేదు. సాగర్ ను చూసి నేను గర్వపడుతున్నాను." మూర్తి కంఠంలోని ఆర్ద్రత సాంబశివరావును కదిలించి వేసింది. డాక్టర్ మూర్తి స్నేహితుడు మాత్రమే కాదు, సోదరుడు కూడా.
"సాంబశివరావు ! నేను వెళతా మరి"
"కాదు టైర్ లో గాలి...."
"ఫర్వాలేదు , నీ జీప్ లో డ్రాప్ చెయ్యమను!"
'అంత పెద్ద రిపేర్ ఏమి లేదు. టైర్లో గాలి కొట్టించడమే!" టైర్లో గాలి తీసివేసిన సంగతి గుర్తు చ్చిన సాంబశివరావు మనసు చివుక్కుమన్నది. సాగర్ కు కారు అందుబాటులో లేకుండా చేసేందుకు విక్టర్ యెంత పని చేశాడు? అందుకు వాడ్ని అని ఏం ప్రయోజనం? తల్లి కోసం డాక్టర్ని తీసుకురావడానికి ప్రయత్నించిన కొడుక్కు అడ్డంకులు కల్పించాడు. అంతా డిపార్ట్ మెంట్ మెంటాలిటీ. వాడ్ని అని మాత్రం ఏం ప్రయిజనం? తన ఇనస్ట్రక్షన్స్ ప్రకారం నడిచాడు. ఇంకా ఆలోచిస్తూ అలాగే నిలబడ్డ సాంబశివరావు చెయ్యి పట్టుకున్నాడు డాక్టర్ మూర్తి.
