Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యము - 5 పేజి 3

 

                           పోతన్నగారూ! ధన్యులండీ మీరు!

     ఎవరూ ? పరమభక్తాగ్రన్యులైన బమ్మెర పోతన్నగారా! సమస్కారమండీ! ఎన్నాళ్ళకెన్నాళ్ళకు కన్నుల విందుగా కనిపించారు! ఎప్పటి నుంచో మిమ్మల్ని సందర్శించాలనీ, పరమపవిత్రమైన మీ పాద పద్మాలు భక్తితో సంస్ప్రుశించాలనీ,  ఆప్యాయంగా బుజ్జగించి కవితా సరస్వతి కన్నీళ్లు తుడిచిన మీ చేతి వ్రేళ్ళు ముద్దు పెట్టుకోవాలనీ , కమ్మని పద్యాలను గ్రుమ్మరించిన మీ గంటాన్ని కన్నుల కద్దుకోవాలనీ ఎంతగానో ఉవ్విళ్ళూరాను. ఎన్నెన్నో కలలు గన్నాను. ఇన్నాళ్ళకు నా కోరిక తీరింది. నా తపస్సు ఫలించింది. సహజపాండిత్యుల వారు సాక్షాత్కరించారు.
    "మధుమయ ఫణితీనాం మార్గదర్శీ మహర్షి" అన్న సుకవిసూక్తికి ఉజ్వలమైన ఉదాహరణం మీరు. "కవిత్వ" మనే పొలల్లో "భక్తీ" అనే పంచదార కలిపి భాగవత రసాయనాన్ని పాకం చేసి లోకానికి అందించిన అమృతహస్తం మీది. "బాల రసాల సాల నవపల్లవ కోమల" అయిన మీ కావ్య కన్యక తెలుగు గుండెల్లో "మందార మకరందా" లను చిందించింది. తెలుగు జాతిని "నిర్మల మందాకినీ పీచికల్లో" ఓలలాడించింది.
    "బాలరసాలసాల " అంటే గుర్తుకొచ్చింది. అన్నట్టు పోతన్నగారూ! మీ ఇంటి ముందు నవపల్లవాలతో నవనవలాడే బాలరసాలం ఉంది కదండీ! ఆ గున్నమామిడి క్రింద తిన్నె మీద కూర్చుండేగా మీరు భాగవతం వ్రాసింది! అవునంటారా?
    పోతరాజు గారూ! మరొక్క చిన్న సందేహం. ఇదిగో ఇలా చూడండి. మీ అరచేతులు అలా కాయలు కాదాయె? హలం పట్టి పొలం సేద్యం చేయడం మూలానా? గంటం పట్టి పద్యం వ్రాయడం మూలానా? అసలు మీరు కవులా? కర్షకులా? లేకపోతే కవి కర్షకులా? కాకపోతే కర్షక కవులా ? ఇంతకూ మీకు కలమంటే యిష్టమా? హలమంటే యిష్టమా? కొంచెం సెలవీయండి. ఇదేమిటి వీడు ఇలా అడుగుతున్నాడు అనుకోకండి. మీ అవిరళకృషి ఆంధ్ర సారస్వత క్షేత్రాలను పదును చేసి కవితాబీజాలు చల్లి బంగారు పంటలు పండించింది గదండీ!
    చూశారా మరి! ఊర్వపుండ్రాలు ధరించి ఉంటారనుకున్నాను గాని మీ ఫాలాన విభూతిరేఖలూ, కంఠన తులసి పేరులూ ఉంటాయనుకోలేదండీ! అవునులెండి. హరిహరాద్వైత దృష్టి కదా మీది.
    అయ్యా! మీ తండ్రి కేసన మంత్రిగారు శైవాచార సంపన్నులు. మీ తల్లి లక్కామాంబ గారు సదా శివపాదయుగార్చనాపరులు. మీ అన్న తిప్పన్న ఈశ్వరసేవాకాముడు. ఇక మీరో "పరమేశ్వర కరుణా కలిత కవితా విచిత్రున్ని" అని స్వయంగా చెప్పుకొన్నారు. అటువంటి శైవకుటుంబంలో జన్మించిన మీరు శ్రీరామభక్తులై భాగవతం వ్రాయడం చిత్రంగా లేదండీ!
    "అభ్రంకష సముత్తుంగ తరంగ" అయిన గంగలో స్నానం చేసి మహనీయ మంజుల పులినతల మద్యంలో మహేశ్వరధ్యాస తత్పరులై మీరు కూర్చోడమేమిటి? సీతా సమేతుడైన శ్రీరామచంద్రుడు మీ కన్నుల ముందు సాక్షాత్కరించి "మన్నామాంకితంబుగా భాగవతంబు తెనుగు సేయు" మని మీకు అనతీయటమేమిటి? ఎంత చిత్రంగా ఉందండీ! శ్రీరాముడు తనకు అంకితం చేయమన్న భాగవతాన్ని మీరు "హరికి నందగోకుల విహారికి గోపనితంబినీ మనోహరికి" అని షష్ట్యంతాలు వ్రాసి శ్రీక్రుష్టునికి అంకితం చేయడం అంతకంటే విచిత్రంగా లేదుటండీ! ఇదంతా శివుడికీ - శ్రీరాముడికి ; రాముడికీ - కృష్ణుడికీ భేదం లేదని ధ్వనింపచేయటానికీ కాకపోతే మరేమీటంటారు?
    పోతన్నగారూ! మీరెంత ముందు చూపు గలవారండీ! గ్రంధారంభంలో వాల్మీకి, వ్యాసుడు, కాళిదాసు, మొదలైన సంస్కృత కవులకు నమస్కరించారు. బాగుంది. నన్నయ్య గారినీ, తిక్కన్న గారినీ, ఎఱ్రన్న గారినీ కైవారం చేశారు. ఇంకా బాగుంది. మిగిలిన పూర్వకవులందరినీ సముచితంగా సంభావించారు. చాలా బాగుంది. చివరకు వర్తమాన కవులకు ప్రియం పలికారు. మరీ బాగుంది. అంతటితో ఊరుకున్నారా! ఎప్పుడో ముందు రాబోయే భావికవులను కూడా భావించి బహూకరించి శుభం పలికిన మీ విశాల హృదయానికి ఈ అయిదు వందల ఎండ్లలో జన్మించిన కవులంతా చేతులెత్తి నమస్కరించక తప్పదు ఏమంటారు?
    కవిగారూ! మీరు మీ భాగవతానికి శ్రీకారం చూడుతూనే "శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్" అని లోకరక్షైకారంభకుడూ , భక్త పాలన కళా సంరంభకుడూ దానవోద్రేకస్తంభాకుడూ, కేళిలోల విలసద్డ్రుగ్జాల సంభూత నానాకంజాతభవాండకుంభకుడూ అయిన మహనందాంగనా డింభకుణ్ణి సంస్మరిస్తూ వ్రాసిన మొదటి పద్యంలోనే భాగవత మహాగ్రంధంలోని ప్రధాన కధా ఘట్టాలన్నీ స్పురించేటట్లు చేశారు. అత్యంత సుందరమై అంత్యప్రాస విలాస విన్యాసాలను వెదజల్లే ఈ పద్యం అనవద్యం హృద్యం. సహృదయహృదయైన వేద్యం.
    మహాకవీ! లలితస్కంధమూ, కృష్టమూలమూ , శుకాలాపాభిరామమూ మంజులతాశిభితమూ, సువర్ణసుమనస్సుజ్ఞేయమూ , సుందరోజ్వల వృత్తమూ, మహాఫలమూ అయిన భాగవత కల్పవృక్షాన్ని తెలుగువారి సొంతం చేసిన మీ ప్రతిభ అప్రతిమానం.
    "విద్యావతాం భగవతే పరీక్షా" అని కొమ్ములు తిరిగిన పండితులకు కూడా "కొరకరాని కొయ్య" అయిన శ్రీమద్భాగవతము మీ అమృతహస్త స్పర్శతో "బాలరసాలంగా" పరిణమించి పల్లవించి పుష్పించి ఫలించి ఆబాలగోపాలానికీ రసానందాన్ని అందించింది.
    చూడండి పోతన్నగారూ! పురాణ గ్రంధాలను ఆంధ్రంలోకి అనువదిస్తూ నన్నయ్య తిక్కనలు భారత రామాయణాలను మాత్రమే గ్రహించి భాగవతాన్ని నిజంగా మీ కోసమే అట్టి పెట్టారండీ! అది కేవలం మీ పురాకృత సుకృత విశేషం మాత్రమే కాదు. ఆంధ్రులందరి అపూర్వ పూర్వ పుణ్య విశేషం. శ్రీమద్భాగవతాన్ని తెనిగించడం మూలాన మీకు మాత్రమే కాదు - ఆ భాగవతానికి కూడా పునర్జన్మ అన్నది లేకుండా పోయింది.
    మీ పలుకు పలుకులో రామభద్రుడు పలుకుతూనే ఉన్నాడు. మీ దృడ సంకల్పం, మీ ఆత్మవిశ్వాసం అనన్య సామాన్యాలండీ! పాఠకుల్ని ఉద్దేశించి మీరిలా అన్నారు -
        కొందరకు తెలుగు గుణమగు;
        కొందరకు సంస్కృతంబు గుణమగు, రెండున్
        గొందరకు గుణములగు; నే
        నందర మెప్పింతు గృతుల నయ్యే యెడలన్
    అవునులెండి. "ఉభయ కావ్యకరణ దక్షులు" గదా మీరు. మీకు సాధ్యం కాని దేముటుంది? అక్షరాలా అన్నంతపనీ చేశారు.
    భక్తకవీ! మహాభాక్తులైన మీరు పొంగి పులకించిన హృదయంతో గజేంద్రమోక్షంలో వామన చరిత్రంలో, ప్రహ్లాద వృత్తాంతంలో, రుక్మిణీ కల్యాణంలో, నరకాసురవధలో కృష్ణలీలల్లో, గోపీకాగీతల్లో, కుచేలోపాఖ్యానంలో , ప్రతిభా పాండిత్యాలను ప్రదర్శించి మూలాన్ని పెంచి సర్వాంగ సుందరంగా ఆ ఘట్టాలను దిద్ది తీర్చారు. కొన్నిచోట్ల మూలంలోని మూడు శ్లోకాలను ముప్పై మూడు పద్యాలుగా ప్రపంచీకరించారు.
    చూడండీ! గజేంద్రమోక్షంలో ఒక చమత్కారం జరిగింది. 'అలవైకుంటపురంబులో - ఆ మూల సౌధంబు దాపల" మందారవనంలోని అమృత సరోవరం ప్రక్కన ఉన్న చంద్రకాంత శిలావేదికపై కలువపూల పాన్పు మీద కూర్చుండి ఉన్న ఆపన్నప్రపన్నుడు గజేంద్రుడి మొర ఆలకించాడు. చెంతనున్న శ్రీదేవికి చెప్పకుండానే,  శంక చక్రాల ధరించకుండానే అయన కరిని కాపాడటానికి పరుగెత్తుకొంటూ వచ్చాడు. అవక్రమైన చక్రంతో నక్రం కంఠం ఖండించి కరిరాజును కాపాడాడు. అంతా సక్రమంగానే జరిగిపోయింది. ఆయనకు అప్పుడు జ్ఞాపకం వచ్చింది లక్ష్మీదేవి పైట చెరగు తన చేతిలో ఉన్నదని, శ్రీహరి "దరహసిత ముఖకమల" అయిన కమలతో ఇలా అన్నాడు -
        బాలా! నావెనువెంటను
        హేలన్ వినువీధి నుండి యేతెంచుచు నీ
        చేలాంచలంబు పట్టుట
        కాలో నే మంటి నన్ను నంభోజ ముఖీ!
    
    అనగానే "అరవిందమందిరయైన యయ్యిందిరాదేవి మందస్మిత వదనారవింద" యై ముకుందునితో ఇలా పలికింది - "స్వామి! ఏం చేసేది. మీ పాదాలు సేవించటయే నా కర్తవ్యం. మీరు ముందు పరుగెత్తుతుంటే మీ వెంట నేనూ వస్తున్నాను." ఇలా పలికించి ఊరుకున్నారా మీరు. ఆ లక్ష్మీదేవి చేత దేవదేవుడికి ఒక యోగ్యతా పత్రం ఇప్పించారు.
    
        దీనుల కుయ్యాలింపను
        దీనుల రక్షింపమేలు దీవన పొందన్
        దీనావన! నీ కొప్పును
        దీనపరాదీన! దేవదేవ! మహేశా!


    ఈ విధంగా దేవాదిదేవుడైన వాసుదేవుణ్ణి అపద్భంధవుడుగా భక్తరక్షణ పరతంత్రుడుగా చెప్పించారు. బాగానే ఉంది - కాని ఇక్కడ ఒక్క అనుమానం ఉందండీ. "అలవైకుంఠపురంబులో" అని యెత్తుకున్నారు మత్తేభవృత్తంలో. ఆ తరవాత శీమహావిష్ణువు పరుగెత్తుకు రావడంతో "సిరికింజెప్పుడు శంఖచక్రయుగముంజేదోయి సంధింపడు" అని మత్తేభవృత్తాన్నే అనుసంధించారు. ఆ తరువాత అప్పటి పరిస్థితిని అభివర్ణిస్తూ "తన వెంటనే సిరి లచ్చివెంట నవరోధవ్రాతమున్" అంటూ మళ్ళీ మత్తేభాన్నే పరువేత్తించారు. అనంతరం "తన వేంచేయు పధంబు పేర్కొన దానాద స్త్రీ జనాలాపంబుల్ వినెనో" అంటూ మత్తేభంలోనే మీ భావాన్ని వెలిబుచ్చారు. ఆపైన "వినువీధిం జనుదేర గాంచి రమరుల్" అన్న పద్యం కూడా మత్తేభ విక్రీదితమే. అటు పిమ్మట "చనుదేంచేన్ ఘను దల్లవాడే హరిపజ్జన్ గంటిరే లక్ష్మి" అంటూ మళ్ళీ మత్తెభాన్నే నడిపించారు. చివరకు "కరుణాసింధుడు శౌరి వారిచరమున్ ఖండింపగా బంపె" అన్న పద్యంలో కూడా మత్తేభాన్నే పైకేత్తేరు. ఈ విధంగా వరుసగా ఈ ఘట్టమంతా మత్తేభమయంగా నడిచిందే, ఇందులో ఏమైనా రహస్యం ఉందా? అని సందేహం. అవునులేండీ! మీరెందుకు చెబుతారు. మధురమధురంగా మందహాసం చేస్తున్నారు. పోనీలెండి, నేనిలా ఊహిస్తున్నాను -


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS