Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యము - 5 పేజి 2

   
    సహజ పాండిత్యుడైన పోతన్న నన్ను "ఆభ్రంకష శుభ్ర సముత్తుంగ తరంగ అయిన గంగ" గా పేర్కొన్నారు. అయన చంద్రగ్రహణం నాడు నాలో స్నానం చేసి నా "మహనీయ మంజుల పులిన తల మంటప మధ్యం " లో మహేశ్వరధ్యానం చేస్తూ కూర్చుండటం శ్రీరామభద్రుడు ప్రత్యక్షమై మహాభాగవతం తెలుగు చేయమనటం అందరికీ తెలిసిందే! అంటే తెలుగులో భారతం, భాగవతం నా తీరంలోనే ఆరంభమైనా యన్నమాట!
    కవి సార్వబౌముడు తన "భీమఖండం" లో నన్ను "గౌతమీగంగ' గా పేర్కొన్నాడు. "మహత్యంలో గంగ కన్న గోదావరే మిన్న" అని కూడా అన్నాడు. "మంగళోత్సంగ అయిన గౌతమీ గంగకు మరే యితర నదులూ సాటిరా" వన్నాడు.
    "అంధ్ర భూమండలీమధ్యం సంపుల్ల సరసీరుహం
    సప్త గోదావరం తీర్ధం మకరందో మనోరామః"
    అన్న స్కాందపురాణ భీమఖండంలోని శ్లోకాన్ని "ఆంధ్రభూభువన మధ్యము పుండరీకంబు;సప్త "గొదావరజలము తేనే " అని శ్రీనాధుడు తెలిగించాడు. "పృధివి యెల్లను రక్షించు పేరటాలు "గోదావరి గోదావరి గోదావరి యంచు బల్కు గుణవంతులకున్ గోదావరితల్లీ! సంపాదింతుగదమ్మ నీవు భవ్య శుభంబుల్" అనీ అనేక విధాలుగా శ్రీనాధుడు నన్ను తన కృతులలో కీర్తించాడు. తమిళ కవీంద్రుడు కంబన్ "కంబరామాయణం" లప్ భూదేవికీ అలంకారమైనదాని " ననీ, "చల్లని నదీమతల్లి" ననీ నన్ను పెక్కు విధాల వర్ణించాడు.
    కవిసామ్రాట్ విశ్వనాధ "గోదావరీ పావనోదార వాఃపూర మఖిలభారతము మాదన్ననాడు" అని నా వైభవాన్ని వెల్లడిచేశాడు. అంతేకాకుండా నా చిన్నారి పాప కిన్నెర సాని చలాకీతనానికి ముచ్చట పడి ఆ పిల్ల మీద చక్కని పాటలు వ్రాశాడు కూడా.
    చిత్రకారుడు అడవి బాపిరాజు "ఉప్పొంగి పోయింది గోదావరీ! తాను తెప్పున్న ఎగిసింది గోదావరీ! ' అంటూ నా ఔన్నత్యానికి ఉప్పొంగిపోయాడు. జాఘువా కవిచంద్రుడు "గౌతమీగంగ రమ్ము! స్వాగతము గొమ్ము!" అంటూ నా అఖండ గౌతమీ' రూపానికి నీరాజన మెత్తాడు. శాసనకర్తలు నన్ను "తెలుగు తల్లి మేడలో ముత్యాల హారంగా" సంభావించారు.
    ఈ విధంగా పురాణాలలో , రామాయణ భారతాలలో సంస్కృత నాటకాలలో ,  ప్రబంధాలలో , గేయ కృతులలో ,శాసనాలలో నా ప్రశస్తి ఎలా ఉన్నదీ విన్నవించాను. గంగపుత్రులు నామీద పడవలు నడుపుతూ - గొంతెత్తి ఇలా పాడతారు.


    గోదారి తల్లికి కోటిదండాలు
    బంగారు తల్లికీ సేంగల్వపూలు
    పిల్లలూ జేల్లలూ గల్లంతుగాకుండ
    సల్లంగ రచ్చించియిల్లు జేర్చేతల్లి        ||గోదారి||
    
    సంక్లిప్తంగా నా చరిత్ర ఇది. చెప్పాను గదా త్ర్యంబకంలో పుట్టి "నాసిక్" అని పిలువబడే "పంచవటి " దాటి శాతవాహనుల రాజధాని "ప్రతిష్టానం" మీదుగా తెలుగు దేశంలో ప్రవేశించి ఆదిలాబాద్ నిజామాబాద్ కరీమ్ నగర్ జిల్లాలను అతిక్రమించి భద్రాద్రి రాముణ్ణి దర్శించి అకాశ్నన్నంటుతున్న పాపికొండలలో పరుగులు పెట్టి, మలుపులు తిరిగి తూర్పు చాళుక్యుల రాజధాని రాజమహేంద్రవరంలో "మర్కేండేయేశ్వరుణ్ణి" "కోటి లింగాలక్షేత్రాన్ని" సేవించి ధవళేశ్వరం దగ్గర సప్తగోదావరిగా మారాను. అంటే ఏడుపాయలయ్యాను. అయితే తుల్య, ఆత్రేయ, భరద్వాజ, గౌతమి, వృద్ద గౌతమి , కౌశికి , వసిష్ట అనే సప్త గోదావరి పాయలలో ఇప్పుడు మీకు "గౌతమీ" వసిష్ఠ" అనే రెండు పాయలు మాత్రమె కనిపిస్తాయి. తక్కిన పాయలు అంతర్వాహినులైనాయి. గౌతమి తూర్పుగా 45 మైళ్ళు ప్రవహించి సముద్రంలో కలుస్తుంది. వసిష్ఠ దక్షిణదిశగా 50 మైళ్ళు ప్రవహించి నరసాపురం దగ్గర సముద్రంలో కలుస్తుంది. "అంతర్వేది" అనే లక్ష్మీనృసింహస్వామి పుణ్యక్షేత్రం  ఇక్కడే ఉన్నది. నా తీరంలో ఉన్న పుణ్యక్షేత్రాలలో పంచవటి, రామగిరి, భద్రాచలం, కోటి లింగాలగుడి, మార్కండేయేశ్వరం , దక్షారామం, కోటిపల్లి, ముక్తేశ్వరం , ర్యాలి, వాడపల్లి, అంతర్వేది ముఖ్యమైనవి. ఇంకా ఎన్నో ఉన్నవి.
    భద్రాచలంలో ప్రతియేటా చైత్రశుద్ధనవమి వాడు సీతారాముల కల్యాణం మహావైభవంగా జరుగుతుంది. ఆ ఉత్సవాలలో లక్షలాది ప్రజలు పాల్గొంటారు.
    మంజీర, మానేరు, ప్రాణహిత, ఇంద్రావతి, శబరీ, పూర్ణ, ప్రవర, మొదలైన ఉపనదులు నా నేస్తాలు; నాలో కలిసి నాకు తుష్టిని పుష్టినీ కల్గిస్తాయి.
    మీ ఇళ్ళల్లో జరిగే ప్రతి శుభకార్యంలోనూ "గంగే చ యమునేదైవ దగోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలే స్శిన్ సన్నిధిం కురు" అని నన్ను ఆహ్వానిస్తారు.
    సర్ అర్ధర్ కాటన్ ధవళేశ్వరం దగ్గర 1952 లో ఆనకట్ట కట్టి ఆంధ్రదేశాన్ని అన్నపూర్ణగా దిద్ది తీర్చారు. ఇప్పటికీ ఇంకా ఎన్నో ప్రాజెక్టులు, బారేజీలు, ఆనకట్టలు కట్టారు. కడుతున్నారు కట్టబోతున్నారు. నాకెంతో సంతోషంగా ఉంది. నా జీవనమంతా లోకం కోసమే ఉపయోగపడాలని నా ఆశయం - నా ఆకాంక్ష.
    నాకొక చిన్న కోరిక ఉంది. త్వరలో నా ముద్దుల చెల్లెలు కృష్ణవేణితో కలుసుకోవాలని అదే సిద్దిస్తే తెలంగాణం "దేదీప్యమాన" మవుతుంది. రాయలసీమ "రత్నాలసీమ" గా మారుతుంది. ఆరోజు కోసం ఎదురుచూస్తున్నాను.
    ఈ పుష్కరాల పుణ్యకాలంలో మీరు రావటం నాకెంతో ఆనందంగా ఉంది. నాలో పుష్కర జ్యోతులు ప్రకాశించుతున్నాయి. నా గుండెలు పులకించి పొంగిపోతున్నాయి. రండి! రండి! నా పుణ్యజలాలలో స్నానం చెయ్యండి.
    మేషం మొదలైన పన్నెండు రాసులలో బృహస్పతి ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క సంవత్సరం ఉంటాడు. అపుడు గంగ యమున నదులకు క్రమంగా పుష్కరాలు వస్తాయి. బృహస్పతి సింహరాశిలో ప్రవేశించినప్పుడు గోదావరినైన నా పుష్కరాలు వస్తాయి. అలాగే కన్యారాశిలో బృహస్పతి ప్రవేశించినప్పుడు నా చెల్లి కృష్ణకు పుష్కరాలు వస్తాయి. ఇప్పుడు బృహస్పతి సింహంలో ప్రవేశించాడు. లోక బాందవుడైన సూర్యుడు కూడా సింహరాశిలోకి అడుగుపెట్టాడు.
    రండి! రండి! ఈ శుభ సమయంలో నాలో స్నానం చెయ్యండి. మీ తాపాలూ, పాపాలూ అన్నీ పోతాయి. మీకు సమస్త శుభాలూ ప్రాప్తిస్తాయి. వెయ్యి గోదానాలు చేసిన పుణ్యం లబ్న్హిస్తుంది.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS