Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యం - 4 బాలసాహితి - 2 పేజి 3


    నీ పాదాబ్జయుగంబు మానసమునన్ నిత్యంబు ధ్యానించినన్
    పాపానీకము బాపెదంచు విబుధుల్ పల్మారు చెప్పంగ నన్
    గాపాడంగలవంచు నెంచి పరమోత్కర్షంబుతో నుంటినో
    యాపద్బాంధవ! కృష్ణ! చేకొనగదయ్యా! బాలకృష్ణప్రభూ!

    భవసంబంధలతాలవిత్ర! గిరిజాప్రాణేశవాణీశ వా
    సవముఖ్యామర వందితాంఘ్రియుగళా! సౌందర్యకందర్ప! నన్
    భవదీయాంఘ్రి సరోజయుగ్మ భజనాభ్యాసోత్సంకుంజేసి సం
    స్తవనీయంబగు మోక్షమీయగదె స్వామీ! బాలకృష్ణప్రభూ!

    కరుణాసాగర! కాంచనాంబరధరా! కంజాతపత్రేక్షణా!
    కరిరాట్పాలక! కాలకంఠ వినుతా! కల్యాణసంధాయకా!
    కరవిభ్రాజిత శంఖచక్ర! కమలాకాంతా! కటాక్షేక్షణా!
    కరుణం గావగదయ్య! కంసమదభంగా! బాలకృష్ణప్రభూ!

    వేల్పుల్ సాధ్యులు కిన్నరుల్ భుజగులున్ విద్యాధరుల్ భోగిరాట్
    తల్పున్ నిన్ను నుతింపనేరరట గాదా? అట్టిచో మూర్ఖుడన్
    స్వల్పప్రజ్ఞుడ బాలుడన్ నరుడ నజ్ఞానుండ దీనుండ నే
    సల్పం జాలుదునే భవన్నుతుల దేవా! బాలకృష్ణప్రభూ!

    అక్షీణప్రతిభాసమేతులగు పూజ్యశ్రేణితో వ్యర్థపుం
    గక్షల్ పూనగరాదు నేరికిని; దానం జేటు వాటిల్లు; స
    ర్వక్షేమంకరుడైన శంకరునితో వైరంబునన్ దక్షుడౌ
    దక్షుండట్లు వినాశమందడె ముకుందా! బాలకృష్ణప్రభూ!

    స్థిరసంశోభితముల్, మునీశ్వర మనస్సింహాసనాసీనముల్,
    హరపంకేరుహ సంభవా ద్యమర పూజ్యంబుల్, సమస్తావనీ
    శ్వర కోటీర చిరత్న రత్న సుషమా వ్యాప్తంబులై యొప్పు నీ
    చరణాబ్జంబులె దిక్కు నాకు జగదీశా! బాలకృష్ణప్రభూ!

    నిను సర్వేశ్వరునిన్, చతుర్దశ జగన్నిర్మాణ విద్యాధురీ
    ణుని, తేజోమయు, భక్తిగమ్యు, ననమానున్, భావనాతు,నీ
    శుని, నవ్యక్తు, ననంతు, నచ్యుతు, ననాశున్, వేదసంవేద్యు, నా
    ద్యుని వర్ణింపగ నెవ్వడోపు భువియందున్ బాలకృష్ణప్రభూ!

    దేవా! దేవమునీంద్రభావిత! మహాదేవప్రియా! దీనులన్
    గావం గంకణమూనితంట; యిదినిక్కంబే గదా! యైన వే
    రావా నన్ను గృపామతిం గనక; నశ్రాంతంబు స్వాంతంబునన్
    నీవే దిక్కని గొల్చుచుంటి గద తండ్రీ! బాలకృష్ణప్రభూ!

    విరిబోడుల్ పదియారు వేవురకునున్ వేర్వేరు రూపంబులన్
    పరమాహ్లాదము గూర్చుచున్ మునులకేన్ భావింపగారాని సు
    స్థిర మాయామయమూర్తివై తనరు నిన్ సేవింతు; కందర్ప సుం
    దర! బృందారక బృంద వందిత! ముకుందా! బాలకృష్ణప్రభూ!

    సుత్రామాద్యమరార్చితాంఘ్రియుగళా! సుత్రామగర్వాంతకా!
    మిత్రేందుద్వయనేత్ర! మిత్రతనయా మిత్రప్రియా! విద్విషత్
    గోత్రాధీశవినాశ! గోత్రధరణా! గోత్రాధిపా! గోత్రరాట్
    పుత్రీస్తోత్ర చరిత్ర! కావవె స్వయంభూ! బాలకృష్ణప్రభూ!

    యమునాంతస్థిత భోగి భోగనటన వ్యాపార పారీణులౌ
    తమ కాల్దోయి కడాని గజ్జియల మ్రోతల్ సుంత లోనెంచినన్
    యమునాభ్రాతృలులాయ కంఠగతఘంటా కుంఠనాదంబు స్వ
    ప్నము నందైన వినంగ బోరట గదన్నా! బాలకృష్ణప్రభూ!

    ఏదో దీనజనావనుండనగ పేరెక్కెన్ జగమ్మందు మ
    ర్యాదాభంగము సేయనేలయని నిన్నర్థించి ప్రార్థించినన్
    నీదౌ పెంకితనంబు జూపితివి; కానీ నాకు లోటయ్యెనే?
    లేదే రుక్మిణి మమ్ము గావ! వనమాలీ! బాలకృష్ణప్రభూ!

    ఆలన్ గాయుచునుంటివో! చెలులతో నాటాడుచున్నావొ! నిన్
    రోలన్ గట్టెనొ తల్లి! పాల్పెరుగు జున్నుల్ చూచితో! రాధ రా
    నీలేదో! నిదురించితో! చెవుడొ! లేనేలేవొ వ్రేపల్లెలో!
    ఆలస్యం బిటు చేసెదేల శుభశీలా! బాలకృష్ణప్రభూ!

    సైదోడల్ల త్రిలోకవల్లభుడుగా! సాక్షాన్మహాలక్ష్మియే
    నీదేవేరి; పసిండిబొజ్జ దొరయే నీపట్టి; రత్నాకరం
    బే దిట్టంబగు సెజ్జగీము; ఇక నీకేలోటు? చేసాచి దా
    యాదిం గోరితి వంట మూడడుగు లేలా బాలకృష్ణప్రభూ!

    నీటం డాగిన, కొండ క్రిందయిన, క్షోణిం దూరినన్, కంబమున్    
    జూటుంగొన్నను, మిన్నుదాటిన, బెదర్చం గొడ్డలిన్, వింటనా
    గేటిన్ జూపిన, లేనటన్నను, స్వశక్తిం యుక్తిమై భక్తి నిన్
    ద్రాటం దప్పక గట్టివైచెద మహాత్మా! బాలకృష్ణప్రభూ!


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS