"తనయా! ఎవ్వడవోయినీవు?" "హలికిన్ తమ్ముండ" "మాయింటికే
పనిమీదన్ దయచేసినావు?" "స్వగృహభ్రాంతిన్" "సరే వెన్నకుం
డను చేబెట్టితివేల?" "మా చిరుత దూడన్ చూచుచున్నానులె"
మ్మనుచున్ వ్రేతకు బల్కు నిన్ గొలుతు దేవా! బాలకృష్ణప్రభూ!
నినుప్రార్థించుచు, నీకథల్ చదువుచున్, నీదివ్యచారిత్రమున్
వినుచున్, నీదు మనోహరాకృతి మదిన్ వీక్షింపుచున్, నీదు పా
వన నామంబె స్మరించుచుండు నను దేవా! ప్రోవవే రాధికా
స్తనశైలోపరిభాసితాసితపయోదా! బాలకృష్ణప్రభూ!
ఆకారంబులు లేని నీవు మును కారాగారమధ్యంబునన్
సాకారంబుగ నెట్లు పుట్టితివి దేవా! దేవకీదేవికిన్
లోకానీకము బొజ్జలో నిడెడు సుశ్లోకుండవౌ నీ వెబుల్
లోకంబందు చరించినాడవు దయాళూ! బాలకృష్ణప్రభూ!
అబ్బా! గోవులగాచు గొల్లడట; అన్నా! మద్యమున్ ద్రావి పెన్
బొబ్బల్ పెట్టును; చెల్లె లొక్కముని గొంపోయెన్; సరే! భార్యకాల్
దెబ్బల్ దింటివి నీవు; నీ సుతుడు సాధ్వీలోక బాధాకరుం
డబ్బే! నీ కులశీల మింతియె గదయ్యా! బాలకృష్ణప్రభూ!
పనిపాటల్ విడనాడి గోపతరుణుల్ పర్వెత్త, లేబచ్చికన్
దినుటల్ మాని పశుల్ గనంగ, అనురక్తిన్ నెమ్ములాడంగ, నెం
డిన మ్రాకుల్ చిగురింప, రాధ మన మాట్టే పొంగి పోవంగ నీ
ఘనమౌ పిల్లనగ్రోవి నూదుము శుభాంగా! బాలకృష్ణప్రభూ!
గోలల్ సేయుచు, గ్రుద్దుకొంచు, నగుచుం, గోపార్భకశ్రేణితో
కాళిందీనది యొడ్డునన్ నిబిడవృక్షచ్చాయ జొక్కంపుజి
క్కాలన్ జక్కగ విప్పి చల్దులన్ వేడ్కం దించుకూర్చున్న యో
లీలా బాలకవేష! వందనము తండ్రీ! బాలకృష్ణప్రభూ!
సమ్మోదంబున రాధికా తరుణి పెన్ జందోయి యుప్పొంగ, స
ర్వమ్మానంద రసాంబుధిన్ మునిగిపోవన్, గొల్లయిల్లాండ్ర యు
ల్లమ్ముల్ పెల్లుగ నుల్లసిల్ల, తరులెల్లన్ పల్లవింపంగ ర
మ్యమ్మౌ వేణువు నూదు మొక్కపరి దేవా! బాలకృష్ణప్రభూ!
మత్తేభాధిపరక్షణోత్సుకమతీ! మత్తేభవృత్తాళిచే
సత్తేజోమయరూప! పాపహరణా! శార్దూల వృత్తాళిచే
చిత్తంబందున భక్తి జొత్తిల నినున్ సేవింపనుంటిన్; దయా
మత్తస్వాంత! యనుగ్రహింపగదవయ్యా! బాలకృష్ణప్రభూ!
మురళిం బ్రక్కగ బెట్టి యందమగు నెమ్మోమందున గ్రమ్ము ముం
గురులం బైకెగబట్టి తల్లియొడిలో గూర్చుండి రంగారు బం
గారపుం గిన్నియలోని పాలు నతికాంక్షం ద్రావుచున్నట్టి నీ
చిరుబ్రాయంబున కేను మ్రొక్కెదనెదన్ శ్రీ బాలకృష్ణ ప్రభూ!
"రారా ముద్దుల తండ్రి! కృష్ణ!" యని చేరందీసి ముద్దాడి బుల్
గారాబంబున కౌగిలించుకొన కేలం ముంగురుల్ దువ్వి వి
స్తారానందము నంద నందుడు యశోదాదేవి పూర్వంబునన్
దారే పుణ్యము లాచరించిరొ ముకుందా! బాలకృష్ణప్రభూ!
తతరాధామధురాధ రోదిత సుధాధారాధునీ పాన సం
తత సంతోషసముద్రమున నీతల్ గొట్టుచున్నట్టి నీ
కతి దుఃఖప్రదమౌ భవాబ్ధి బడి "కృష్ణా! కావు" మంచున్ ముము
క్షుతతుల్ బెట్టెడు మొఱ్ఱలెట్లు చెవికెక్కున్ బాలకృష్ణప్రభూ!
మామం జంపితి వంటినా? పశువులన్ మళ్లించినావంటినా?
రామల్ స్నానము చేయుచుండ జని చీరల్ దెచ్చినా వంటినా?
పాముం ద్రొక్కితి వంటినా? విదురు కొంపం భుక్తి గొంటంటినా?
స్వామి! ఏమిటికింత యాగ్రహము నాపై బాలకృష్ణప్రభూ!
నాదంబుల్ స్వరముల్ సెలంగ పదవిన్యాసంబు గావింపుచున్
వేదంబుల్ తలక్రిందు చేసిన మహావిద్వాంసు డౌగాక నీ
పాదంబుల్ మదినమ్మడేని గలదే భావింప మోక్షంబు? దు
ర్వాదంబుల్ పదివేలు నేమిటికి దేవా! బాలకృష్ణప్రభూ!
చరణాబ్జంబుల పండపెట్టుకుని యుష్మన్మాత సామోదయై
దరహాసాంచిత సుందరాననము మీదన్ మూగు నిద్దంపు ముం
గురు లొక్కించుక పైకిద్రోయుచును నుగ్గుంబాలు ద్రావించుచో
చిరుబిడ్డంబలె గోలజేసెదవహో! శ్రీ బాలకృష్ణప్రభూ!
కుజనుం ధార్మికుగా, సుధార్మికుని మూర్ఖుంగా, మహామత్తసా
మజమున్ దోమగ, దోమ సామజముగా, మౌనీశ్వరున్ దొంగగా,
గజదొంగన్ మునిగా స్వమాయ వలనన్ గావింపుచున్నావహో
త్రిజగన్నాటక సూత్రధారి! కరుణాబ్ధీ! బాలకృష్ణప్రభూ!
