Previous Page Next Page 


    చచ్చిపోవాలనిపిస్తోంది.

    "అతన్ని అల్లరి చేస్తే నాబతుకు అల్లరైపోదా రణధీర్?" ఆవేదనతో అంది సరస్వతి.

     "అల్లరవడానికి నువ్వేం శీలం పోగొట్టుకోవడంలేదుగా!నీ ప్రాతి వ్రత్యానికేమీ భంగం వాటిల్లదు. నిన్ను రేప్ చేయబోయాడని పరుశురాంని కటకటాల్లోకి తోయిస్తావు అంతే!"   

    " నేను చేయలేను."

    రణధీర్ ఆమె కింద పెదిమని రెండు  వేళ్ళతో గట్టిగా నొక్కాడు.

    ఆమె బాధతో మూలిగింది పెదిమ చిట్లి రక్తం ప్రవహిస్తోంది.

    "అయితే నీకు రేప్ తప్పదు.

    "రణధీర్! నేను  అతి సామాన్యురాలిని. ఇంత దారుణానికి నేను ఒడిగట్టలేను. పరుశురాం చాలా మంచివాడు. అతనికి ద్రోహం చేస్తే పాపం చుట్టుకుంటుంది."

    చెప్పేది నేను. చేసేది నువ్వు. పాపం మాట కొస్తే చేయించిన  వాడిని దాన్ని నాకే అంటనీ. పర్వాలేదు. కాదుకూడదు అంటే మా వాళ్ళ చేత రేప్ చేయించుకొంటావో లేక వాడు నిన్ను రేప్ చేయబోయినట్టు అల్లరి పెడతావో నీఇష్టం!" అన్నాడు రణధీర్.

    తనెంత విషమ పరిస్థితులో ఇరుక్కున్నదీ సరస్వతికి అర్థం అయిపోయింది వాళ్ళు చెప్పినట్టు వినకపోతే  "పని" జరిపించేస్తారు. అంత దారుణం జరిగిన తర్వాత  బ్రతకలేదు. తనపైన ఎన్నో అశలు పెట్టుకుని చదివిస్తున్నారు అమ్మా, నాన్నా! అక్కయ్యకి. అన్నయ్యకీ తనని డాక్టర్ గా చూడాలని కోరిక. నాన్నంటాడు.... " నా బిడ్డ డాక్టరై , నా ఆరోగ్యం సంగతి చూసుకుంటుంది.  అంతవరకు ఏ డాక్టర్ కీ నా చేతిని  ఇవ్వను."

    తన కోసం, తన వాళ్ళకోసం  తను బ్రతకాలి.

     స్వార్థమే అయినా తప్పదు.

    "మీ మాట వింటాను!" అంది మెల్లగా.

    " కానీ, షరతు!"

    " ఏమిటి?"

    "మా పేర్లు బయట పెడితే నీ పీక కత్తిరించేస్తాను. మొత్తం డ్రామా నీవే నడిపించాలి. మా ప్రమేయం ఏమీ ఉండదు" అన్నాడతను . సరస్వతి వడివడిగా నడుస్తూ వెళ్ళిపోయింది.

                                                                          12

    "ఆ తర్వాత కథ నాకు తెలిసిందే! ప్రాక్టికల్ బుక్ కావాలని అడిగితే దాన్ని తీసుకుని మా ఇంటికి వచ్చావు. నిన్ను అల్లరిచేసి పోలీసులకి పట్టించాను. అనర్థం జరిగిపోయింది."

    సరస్వతిని కళ్ళనించి జారుతున్న కన్నీటిని తుడిచాడు పరుశురాం.

    "పరుశురాం" పిలిచిందామె.

    "ఏమిటి?" సిగరెట్ వెలిగించి అడిగాడు.

    "నేను నీకు నిజమే చెప్పాను. నమ్మితే అదృష్టవంతురాలిని. నమ్మకపోతే నువ్వు నాకే శిక్షవేసినా చిరునవ్వుతో స్వీకరించడానికి నేనిప్పుడు రెడీగా వున్నాను.

     నన్ను అనుభవించడానికి ప్రయత్నించినా నిన్ను అపను.

     చంపడానికి సమయత్తమైతే  మనస్ఫుర్తిగా శిరస్సు వంచుతాను.

     నన్ను క్షమించినానని  ఒక్క మాట అంటే ఈ క్షోభని నేను మరచి పోతాను. నీపైన కేసుని విత్ డ్రా చేసుకుంటాను అందామె ఆవేదనతో."

    అతను నిట్టూర్చాడు.

     "నువ్వే చేసినా నేను పోగొట్టుకున్నదాన్ని తిరిగి పొందలేను. విధి ఆడించిన నాటకంలో నువ్వొక 'పావువి' మాత్రమే పద" అని  లేచి నించుని ఆమెకి చేతిని అందించాడు.

     సరుకుతోటలోంచి ఠ్రాక్ పైన నడుస్తూ ఇంటికి కొంత దూరంలో వదిలాడు పరుశురాం. రోడ్డు నిర్మానుష్యంగా వుంది.

    సరస్వతి అలాగే కొన్ని నిమిషాల నిలబడిపోయిందతని మొహంలోకి చూస్తూ . వున్నట్టుండి అతని చేతుల్ని పట్టుకుని "పరుశురాం నువ్వునిజంగా పరుశురాముడిపై ఆ రణధీర్ గాడి తలని  వెయ్యి ముక్కలు చేయిలేదా? నా లాంటి ఆడపిల్లలకి రక్షణని కల్పించలేదా?" అంది.

     ఆ మాటలకి పరుశురాం మొహం జేవురించింది. కళ్ళు ఎర్రబడి నాయి. ఛాతీ వెడల్పయింది. పిడికిళ్ళు బిగుసుకున్నాయి.

     అతను అక్కడనుంచి కొదమసింహంలా కదిలాడు. సరస్వతి కళ్ళకు అతను శత్రువు తలను వెయ్యి ముక్కలు చేయడానికి గండ్ర గొడ్డలితో బయలుదేరిన పరుశురాముడిలా కనిపించాడు.

     పరుశురాం అగ్గిరాముడిలా నడుస్తున్నాడు. అతనికి పోలీసులు పెట్టిన  హింస గుర్తుకు వచ్చింది.

     సరస్వతి రిపోర్టివగానే కాలేజీకి వచ్చి పోలిస్ స్టేషన్ కి లాక్కెళ్లారు.

    స్టేషన్ లో  అడుగుపెట్టిన మరుక్షణం మెడమీద చేయివేసి సెలో లోకి ఒక్కతోపు తోశాడు.  ఇన్  స్పెక్టర్ పాపారావు.

     ఆ విసురుకి కింద పడిపోయాడు పరుశురాం. పైకి లేవకుండా కాని స్టేబుల్స్  పైకిలేపాడు పరుశురాంని.

     "చెప్పరా చెప్పు. నువ్వు నేరం చేశావా లేదా?"

    "చేయలేదు" నీరసంగా అన్నాడు పరుశురాం.

    "లేదు."

    "అబద్ధం చెప్పకు. నాలిక తెగిపోతే . నేనసలే స్ట్ర్రిక్ట్  ఆఫీసర్ని. నా పేరు చెబితే ఆముదాలవరస నుంచి  ఆమెరికా వరకు పులులు నీళ్ళు తాగవు" అన్నాడు ఇన్ స్పెక్టర్ పాపారావు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS