Previous Page Next Page 
ది ఎడిటర్ పేజి 22


    "కానీ దానిలో ఒక సమాచారం వుంది చూశారా! "ఆ వృక్షం యొక్క ఖండమై సువర్ణాంజనము, దాని పట్టు రసభేది' అని ............"
    "అంటే?"
    "రసవాదం అంటే బంగారం చేసే విద్య. దానిలో పాదరసాన్ని ముఖ్యంగా ఉపయోగిస్తారు. పాదరసాన్ని కొన్ని ప్రక్రియల ద్వారా మార్చి ఏ లోహనికన్నా తాకిస్తే ఆ లోహం బంగారం అవుతుందని ఒక ఉహా. ఆ ప్రక్రియని కనుక్కోవడం కోసం ఎంతోమంది ఎన్నో విధాల ప్రయత్నిస్తూ వుంటారు. ఈ రసబేది అనేది దానికి సంబంధించిన పరిభాషే!"
    "ఐసీ!"
    "ఇది తీసుకుని బ్రహ్మచారి దగ్గరకు వెళతాను నేను. మనంతట మనం ఊరికే వెళితే ఏమీ చెప్పకపోవచ్చు అతను. ఈ శునక.........శునక శాల్మని వృక్షం కోసం మనం వేదుకుతున్నామనీ , అతని సాయం కావాలనీ అడుగుదాం, అతను వప్పుకోవచ్చు. తర్వాత నెమ్మదిగా అతన్ని "
    "అతను ఒప్పుకోకపోతే మనం ఊహించని విధంగా అతను రియాక్ట్ అయితే?"
    "సదానంద్ హెచ్చరించినట్లు ఏదన్నా రిస్కు ఉంటుందంటారా? ఒకే! ఆ రిస్కు నేను తీసుకుంటాను సర్! మీరు ప్రతిరోజూ తీసుకునే రిస్కూ ముందు ఇది ఏపాటిది?" అన్నాడు ఉదయార్కర్.
    అప్పటిదాకా మౌనంగా కూచుని జరుగుతున్నదంతా అలర్టుగా అబ్జర్వు చేస్తున్న హరిణి , ఎడిటర్ దృష్టిని ఆకర్షించడానికి చిన్నగా గొంతు సవరించుకుంది.
    ఉదయార్కర్ రాకతో ఆమె ఉనికిని తాత్కాలికంగా మర్చిపోయిన ఎడిటర్ చటుక్కున ఆమె వైపు చూశాడు.
    "మీరు నా సంగతి మర్చేపోయారు" అంది హరిణి. మేగజైను మీద దావా వెయ్యడానికి' లాయరు నోటీసుతో సహా వచ్చేసిన అమ్మాయి.
    "ఎలా మర్చిపోతాను. చూస్తున్నారుగా ........చాలా సీరియస్ విషయాలు మాట్లాడుతూ......."
    "అంటే నా విషయం సీరియస్ కాదా?" అంది హరిణి.
    "అబ్బే! అలాగని కాదు" అన్నాడు ఎడిటరు. కానీ అతనికి తెలుసు.
    ఇది సీరియస్ విషయం కాదు.
    "బట్! డేఫనేట్లీ దిస్ విల్ బీ ఏ న్యుసేన్స్!"
    అంతే!
    లాయరు నోటీసులకి, కోర్టు కేసులకి జంకడు తను. ధర్మం తన పక్షాన ఉన్నన్ని రోజులూ.
    జంకేటట్లయితే తను ఈ స్థానంలో నిలబడలేడు.
    కానీ -----ఇది తప్పకుండా డిస్ట్రర్బెన్స్!
    ఊపిరి సలపని పనుల్లో, సమస్యలతో సతమతమవుతున్న తను దీన్ని కూడా టాకిల్ చెయ్యడం ఎలా?
    ఎలాగ?

                                   8

    ఒకసారి హరిణి వైపు చూసి చెప్పడం మొదలెట్టాడు ఎడిటరు. "చూడండి మిస్ హరిణి! మాది చాలా పెద్ద ఆర్గనైజేషను. మాకు అసంఖ్యాకమంగా వస్తు వుంటాయి కధలు, నవలలూ, కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతుంటాయి ఉత్తరాలు. వీటన్నిటినీ వెయ్యి కళ్ళతో కనిపెట్టి చూస్తూ ఉంటాము మేము. అయినా అప్పుడప్పుడు....ఒకటీ.......అర.....పొరబాట్లు తప్పవు. కానీ ఒకటి మాత్రం నిశ్చయంగా చెప్పగలను. ఆ జరిగిన పొరబాట్లు ఏవన్నా అనేప్ట్ మిస్టేక్స్ అయి వుంటాయి కానీ ఉద్దేశ్యపూర్వకంగా ఎవరినీ నొప్పించాలని కించపరచాలని చేసినవి అయి వుండవు. మీ పేరుతొ ఎవరో రాసి పంపిన కధ మాసపత్రికలో ప్రచురితమైనందువల్ల మీకు ఏదైనా అసౌకర్యం కలిగితే దానికి మేము చాల చింతిస్తున్నాము. సహృదయంతో అర్ధం చేసుకుని ఈ విషయాన్ని ఇంక ఇక్కడితో వదిలేస్తే బావుంటుంది."
    అని ఆగి హరిణి మొహంలోకి చూశాడు.
    హరిణి ఏమీ మాట్లాడలేదు.
    ఎడిటరు మళ్ళీ చెప్పడం మొదలెట్టాడు.
    "కాదూ, కోర్టుకే వెళ్ళాలని మీరు నిశ్చయించుకున్నరనుకొండి యూ అల్ లిబర్టీ టూ డూ సో! మా వల్ల జరిగిన పొరబాటు ఉద్దేశ్యపూర్వకంగా జరిగింది కాదని మేము రుజువు చేసుకోగలము. ఇది వరకు ఒకసారి మేము వినాయక చవితి సందర్భంలో ప్రచురించిన కార్టూన్ ని ఒకళ్ళు చాలా సీరియస్ గా తీసుకుని దానికి మతపరమైన దురేద్దేశ్యాలు అంటగట్టి కోర్టుకి వెళ్ళారు."
    "మూడేళ్ళ పాటు కేసు నడిచింది చివరికి మీరే గెలిచారు" అంది హరిణి చిరునవ్వుతో.
    "అది నాకు తెలుసు! అందుకే అన్నాను మా అన్నయ్య జస్వంత్ తో. ఈ కేసూ,గొడవా ఇదంతా అనవసరమనీ వద్దనీనూ! అయినా వినలేదు తను. నోటీసు తయారు చేశాడు.
    "...మరి దాన్ని ఇక్కడికెందుకు తీసుకొచ్చారు?"
    "ఎందుకా.......దాన్ని నా స్వహస్తాలతో తీసుకొచ్చి మీ సొంత చెత్తబుట్టలో పారేద్దామని" అని ఆ నోటీసుని నలిపి ఉండలా చేసి "విత్ యువర్ పర్మిషన్" అంటూ లేచి చెత్తబుట్టలో పడేసింది హరిణి.
    "లేకపోతే ఏమిటండి! నేను మీ అభిమానినని తెలియదా మా అన్నయ్యకి. తెలిసి కూడా నోటీసు ఇమ్మంటాడా! నేను సంతకంపెట్టకుండా చెల్లుతుందా ఆనోటీసు? నేను మేజర్ని! ఐ యామ్ నైన్టీన్  నౌ! చిన్నపిల్లను కాను!" అంది నిటారుగా కుర్చీలో కూర్చుంటూ.
    పెనుతుఫానులా అనిపించి అంతలోనే పిల్లెతెమ్మరలా మారిపోయిన వాతావరణాన్ని చూసి మనసులోనే నిట్టూర్చాడు ఎడిటరు.
    సో! ఈ మీనింగ్ లెస్ ట్రబుల్ తప్పిపోయింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS