మన కట్టమంచి
కట్టమంచి రామలింగారెడ్డి తెలుగువారు సగర్వంగా చెప్పుకోదగ్గ వ్యక్తి. మహా మేధావి. గొప్ప పండితుడు. ప్రముఖ విద్యావేత్త. చక్కని రచయితే కాదు విమర్శకుడు కూడా. అన్నిటినిమించి బహుముఖ ప్రతిభాశాలి, సమర్థుడైన కార్యశీలి. రాజకీయాల్లో, అర్థశాస్త్రంలో ప్రతిభా సామర్థ్యాలు గల ప్రజ్ఞావంతుడు. తెలుగుభాషకు తెలుగుసీమకు రెడ్డిగారు చేసిన సేవ ఎంతమాత్రమూ విస్మరించరానిది.సాహితీ రంగంలో ఎంత వున్నత శిఖరాలను అధిరోహించగలిగారో విద్యారంగంలోనూ అంత వున్నత స్థాయికి చేరుకోగలిగారు. ఒకవైపు సాహిత్య కృషి, మరోవైపు విద్యారంగంలో పురోగమన ప్రస్థానం, ఇంకోవైపు రాజకీయరంగంలో వీరవిహారం_ యిన్ని విధాలుగా బహుముఖ ప్రతిభతో తెలుగునాట తన యశస్సును మూలమూలల్లోకి ప్రసరింపజేసి చిరస్మరణీయుడైన వ్యక్తి ఆయన.
తెలుగునాట ప్రముఖ విద్యావేత్త, తత్త్వవేత్త, రాజనీతిజ్ఞుడు, ఆచార్యుడు అయిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ తో సరిపోల్చదగినవ్యక్తి డాక్టర్ కట్టమంచి రామలింగారెడ్డి. పొట్టిగా చెప్పాలంటే సి.ఆర్.రెడ్డి. ఆయనలాగే ఆంగ్లభాషలోనూ, తెలుగులోనూ అనర్గళంగా ఉపన్యసించగల దిట్ట. ఆచార్యత్వంలోనూ, విజ్ఞాన పీఠాన్ని అధిరోహించడంలోనూ ఇద్దరిలో పోలికలు కూడా వున్నాయి. ఈ యిరువురు మహావ్యక్తులే. తెలుగు నేలలో విజ్ఞానకాంతులు ఈనాడు యింతగా విస్తరించడానికి కారకులని గట్టిగా చెప్పవచ్చు.
ఆంధ్ర విశ్వవిద్యాలయం అనే మర్రిగింజ నాటి మహావృక్షంగా పెంపొందించిన ఘనత రెడ్డి గారిదే. సి.ఆర్.రెడ్డిగారు కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో చదువుకున్న అనుభవాన్ని, అక్కడి క్రమశిక్షణ, బోధన, పరిశోధన పద్ధతులను ఆంధ్ర విశ్వవిద్యాలయంలో వ్యవస్థాపించి, విద్యార్థులకు విజ్ఞాన జ్యోతులను అందించే పరమ పవిత్రమైన ఆధునిక విజ్ఞాన కేంద్రంగా దానిని తీర్చిదిద్దారు.
ఆంగ్ల సాహిత్యంలో, ఆంగ్లభాషలో కొద్దోగొప్పో పరిచయం వున్నవారు తెలుగుభాషా సాహిత్యాల మీద చిన్నచూపు చూడడం సర్వసాధారణం. కాని సి.ఆర్. రెడ్డిగారు దీనికి భిన్నమైన వ్యక్తి. ఆంగ్లభాషమీద, ఆంగ్ల సాహిత్యం మీద విశేషమైన అధికారాన్ని సంపాదించి కూడా వారు తెలుగు భాషా సాహిత్యాలను అలక్ష్యం చేయలేదు. వేషధారణలో ఆంగ్లేయ ప్రభావం కనిపించినా ఆంతర్యంలోనూ, అభిమానంలోనూ ఆంధ్రత్వం మూర్తీభవించేదని పలువురు సమకాలికులు చెప్పిన మాట మనం విస్మరించడానికి వీల్లేదు. తెలుగులో వారు వ్రాసిన గ్రంథాలు సాహితీ జగత్తులో మణిదీపాలుగా నాడు, నేడు పరిగణిస్తున్నారంటే వారి ప్రతిభ ఎంతటిదో, తెలుగు భాష పట్ల వారికున్న ఆదరాభిమానాలు ఎట్టివో తేలికగానే మనం అర్థం చేసుకోవచ్చు. తెలుగులో రెడ్డిగారు మంచి పండితులు.సునిశిత విమర్శకులు. చక్కని వ్యాసకర్తలు. చివరకు స్వయంగా కవులు. వీరి కవిత్వంలో చక్కని భావుకత, వ్యాసాలలో బహు విషయ పరిజ్ఞానం, విమర్శలో నిష్పక్షపాత వైఖరితోపాటు వాడీ, వేడీ వున్నాయి.
సి.ఆర్. రెడ్డిగారు విద్యావేత్త, రచయిత మాత్రమేకాదు. రాజనీతిజ్ఞులు కూడా. విద్యారంగంలో నుంచి రాజకీయాలలోకి అడుగుపెట్టి శాసనసభలోకి ప్రవేశించి తన అనర్గళ వాగ్ధోరణితో అశేష విషయ పరిజ్ఞానంతో, నిర్భయ నిర్మొహమాటనైజంతో యావత్తు సభనూ ఆకట్టుకుని ప్రవర్తించాలంటే అది ఆయనవంటి బహుకొద్ది మందికే చేతనౌతుంది. సామర్థ్యం వున్నప్పుడు, చిత్తశుద్ధి వున్నప్పుడు, స్వార్థం లేనప్పుడు, ప్రజాసేవే అంతిమ లక్ష్యంగా యోచించినపుడు-అటువంటప్పుడు మాత్రమే ఆయనలాగా వ్యవహరించడానికి వీలవుతుంది. ఇటువంటి లక్షణాన్ని బహుకొద్దిమందిలో మాత్రమే చూడగలం.
ఇంతటి బహుముఖ ప్రతిభావంతుని గురించి ఈనాటి తెలుగువారికి వివరించవలసిన అవసరం ఎంతైనా వుంది. కాలంతోపాటు విలువలు కూడా మారిపోతున్నాయి. వెనుకటి అకుంఠిత దీక్ష, ఆనాటి సేవానిరతి, అప్పటి జ్ఞానార్జనాధోరణి గాని ఈనాడు కానరావడంలేదు. ఈనాటి యువకుల్లో నిర్మాణాత్మక కార్యకలాపాల పట్ల విజ్ఞాన పరిధులను విస్తరింపజేసుకోవడం పట్ల ఆసక్తి రేకెత్తించాలంటే అటువంటి మహనీయులను గురించి తెలియజెప్పాలి.
శ్రీ కొల్లూరు కోటేశ్వరరావుగారు రచించిన 'మన కట్టమంచి' పుస్తకం ఆవిష్కరణ సందర్భంగా హైదరాబాదులో 1983 డిసెంబరు 10న.
1983 ఆగస్టు 28న మెదక్ చర్చి సందర్శనం
1983 జూలై 3న నగరంలోని ముస్లిం సోదరులతో ఇఫ్తార్ విందుకు ముందు ప్రార్థనా కార్యక్రమంలో
హైదరాబాదు లాల్ బహదూర్ స్టేడియంలో 1984 జనవరి 9న నూతన ప్రభుత్వ ప్రథమవార్షిక నివేదిక సమర్పణ.
ప్రథమ వార్షిక నివేదిక సమర్పణోత్సవానికి హాజరైన అశేష ప్రజానీకం.
