Previous Page Next Page 
Sri N T Rama Rao Prasangalu పేజి 20

 

గురవే నమః

    భారత జాతి చరిత్రలోనేగాక మానవజాతి చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగినది ఈరోజు. సిక్కు మత ప్రవక్త, యుగపురుషుడు, భగవాన్ గురునానక్ జన్మించిన శుభదినం ఈ రోజు.
    పుణ్యభూమి, కర్మభూమి అయిన భరతఖండంలో ఎందఱో మహామహులు, మహితాత్ములు జన్మించారు. ఆదర్శమూర్తి శ్రీరామచంద్రుని పాదధూళితో పవిత్రమైన పుణ్యభూమి ఇది. భగవద్గీత సందేశాన్ని లోకానికి అందించిన శ్రీ కృష్ణ భగవానుడు జన్మించిన పవిత్ర స్థలం యిది. శాంతి, అహింసామూర్తి బుద్ధభగవానుడు పుట్టిన పునీత దేశంయిది. మత సామరస్యాన్ని ప్రబోధించి, పవిత్ర భావాలతో వున్నత ఆదర్శాలతో ముక్తి మార్గాన్ని చూపిన జగద్గురువు శ్రీ నానక్ అవతరించిన పుణ్యభూమి యిది.
    గురునానక్ ఆత్మసాక్షాత్కారాన్ని పొంది, అనంతజ్ఞాన జ్యోతిని దర్శించిన అవతారపురుషుడు. భగవత్ స్వరూపి. పొగడ్తలకు పొంగి పోకుండా, విమర్శలకు కృంగిపోకుండా తాను నమ్మిన సిద్ధాంతాలతో, ఆదర్శాలతో నిర్భయంగా ముందుకు సాగిన మహనీయుడు ఆయన. అజ్ఞానాంధకారంలో పడి కొట్టుమిట్టాడుతున్న లక్షలాది ప్రజానీకానికి భక్తి సందేశాన్ని అందించి వెలుగుబాట చూపిన ధన్యజీవి ఆయన.
    కోరికలు తీరినకొద్దీ వృద్ధి పొందే తత్వం కలవని, అగ్నిలో ఆజ్యం పోసినట్లు కోరికలు ప్రజ్వరిల్లి నిరాశకు, దుఃఖానికి త్రోవ తీస్తాయని ఆయన బోధించారు. కోరికలను కట్టడిచేసి, దృష్టిని అంతర్ముఖం చేసి అమృతాస్వాదన చేయవలసిందిగా ఆయన ప్రబోధించారు. కేవలం శాస్త్రీయ పరిజ్ఞానం వల్ల లాభం లేదని, జీవితమే నిజమైన పాఠశాలని, అనుభవ పూర్వకంగా నేర్చుకున్న పాఠాలు ఎక్కువ విలువైనవని అయన చాటి చెప్పారు. మనం సంపాదించిన ఆస్తి పదిమందికి ప్రయోజనకారి అయినప్పుడే చరితార్థమవుతుందని ఆయన వివరించారు. పేద ప్రజలకు సహాయం చేయడమే, దీనులను ఆదుకోవడమే మానవుని ప్రథమ కర్తవ్యమని మానవసేవే మాధవసేవ అని ఆయన నొక్కి వక్కాణించారు.
    గురునానక్ బోధనలు నాడే కాదు నేడు కూడా శిరోధార్యాలే. నేడే కాదు. ఏనాటికీ అవి మానవాళికి అవశ్యం అనుసరణీయాలే.

    గురునానక్ జయంతి సందర్భంగా హైదరాబాదులో 1983 నవంబరు 20న.

 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS