Previous Page Next Page 
రాజ హంస పేజి 2

 

    'అభ్యంతరమంటే ఎంతవరకూ?"
    "సపోజ్! అతను ముద్దు పెట్టుకుంటాడనుకో , నాకు ఇష్టమై సరదాగా వుంటే రిసీవ్ చేసుకుంటాను. రెస్పాన్స్ కూడా ఇస్తాను. బిగియారా కౌగలించుకుంటాడనుకో, కానియ్ , ఇంకా ముందుకు.....చెప్పానుగా. అప్పుడంతా మూడ్ మీద ఆధారపడి వుంటుంది.
    రాజహంసకు భయమేసింది. "ఒకవేళ అలా జరిగితే చెడిపోయినట్టు కాదూ?"
    "మంచీ - చెడు ఈ అర్ధాలు చరిత్ర నుంచి చెరిగిపోయి చాలా రోజులయిపోయింది హంసా. ఇప్పుడు కావాల్సిందల్లా మన అభిరుచికి విలువివ్వటం ."
    "నీకు....."
    "అడుగు."
    "ఎప్పుడన్నా అలా ముందుకు పోవటం జరిగిందా?"
    ఊర్వశి చిలిపిగా నవ్వింది. "సంఘటనలు జరగటం తప్పు లేదుగానీ అవసరమైనంతవరకూ రహస్యంగా వుంచకపోవటం తప్పు. ప్రతిదానికీ కొంత గుట్టు అవసరం."
    రాజహంసకి తెలుసుకోవాలని ఆసక్తిగా వున్నా అంతకన్నా గ్రుచ్చి గ్రుచ్చి అడగటానికి ధైర్యం లేకపోయింది.
    "హంసా" అంది ఊర్వశి. "ప్రపంచంలో ఏదీ శాశ్వతం కానట్టే యిష్టం అనేది కూడా శాశ్వతం కాదు. ఈ సత్యాన్ని గుర్తుంచుకో."
    ఆ రాత్రి.....
    రాజహంసకు చాలాసేపటివరకూ నిద్రపట్టలేదు. అటూ ఇటూ పొర్లి విసుగ్గా లేచి కూచుని లైటు వేసి చేతిలోకి క్లాసు పుస్తకం ఒకటి తీసుకుంది.
    రాజహంస మొదట్నుంచి బాగానే చదువుతుంది." క్లాసులో ఆమె ర్యాంక్ మొదటి కోవలోనే వుంటుంది. ఆరోజు యాంత్రికంగా పేజీలు  తిరగేస్తోంది గానీ తల్లోకి ఏమీ ఎక్కటం లేదు. పుస్తకం పక్కన పెట్టి లేచి గదిలో అటూ ఇటూ తిరిగింది. నిద్ర రావటం లేదు. గదిలోంచి ఇవతలి కొచ్చి చూసింది. హల్లో తమ్ముడు హరి, చెల్లెలు పద్మజ పక్కపక్క మడత మంచాలమీద పడుకుని గాడ నిద్రలో వున్నారు. ప్రక్కగదిలో తల్లీ తండ్రీ పడుకుని వున్నారు. హాలంతా బెడ్ లైట్ వెలుగు మందంగా ప్రసరిస్తోంది. చదువుకునేందుకేమయినా ప్రత్రికలలాంటివి కనిపిస్తాయేమోనని అటూ ఇటూ చూసింది. అల్మారాలో హరి పాత పుస్తకాల షాపులోంచి అద్దెకు తెచ్చినట్లున్నాడు. ఓ వారపత్రిక కనిపించింది. ముందుకు వంగి అందుకుని తిరిగి తను పడుకునే గదిలోకి వచ్చింది.
    అది కొత్తగా పెట్టిన వారపత్రిక. గెటప్, ముద్రణ రంగు రంగుల బొమ్మలు .....అందులో అమ్మాయిలని  చిత్రీకరించిన తీరు....
    ఆమెలో ఉత్కంట చెలరేగింది. ప్రతి పేజీ ఆకర్షణీయంగా తీర్చి దిద్దబడింది.
    అందులోని సీరియల్స్ , కధలు చదువుతుంటే ఊర్వశి మాటలు గుర్తుకొస్తున్నాయి.
    సెక్స్, క్రైం ,  థ్రిల్లర్స్ ......ప్రపంచమంతా వీటిలోనే నిండి వుందా అనిపిస్తుంది.
    ఈ మధ్య సినిమాలు కూడా అలాగే వుంటున్నాయి. ఫైట్స్, డ్యాన్సులు, హత్యలు, అర్ధనగ్నంగా హీరోయిన్లు పురుషా పురుషా అంటూ పెట్రేగిపోవడాలు.
    ఒకర్నొకరు వాటేసుకోవటాలు, ముద్దు పెట్టుకోవటాలు సరేసరి.
    ఆ మధ్య ఓ హిందీ సినిమాకి తల్లితో కలిసి వెళ్ళింది. చాలా ప్రఖ్యాత దర్శకులు తీసిన సినిమా కళాత్మకమయిన విలువలతో , స్త్రీని చాలా సెక్స్ గా ఎక్స్ పొయిట్ చెయ్యటంలో కిటుకులు తెలిసిన దర్శక నిర్మాత.
    అందులో హీరియిన్ మాతృమూర్తి అయినాక వక్షోజాలను ప్రదర్శిస్తూ చిటికీ మాటికీ పిల్లాడికి పాలిచ్చేస్తూ వుంటుంది.
    "ఏం?" బిడ్డకు తల్లి పాలివ్వటంలో మాతృత్వం కనబడటం లేదా? శృంగారమే గోచరిస్తుందా?' అన్న దర్శకుడి ప్రశ్నకు ఏం చెయ్యాలో తెలీక సెన్సార్ బోర్డు వాళ్ళు తమ సంస్కారాన్ని నిరూపించుకుంటూ అదృశ్యాలను వదిలేసి వుంచారు.
    ఆ సినిమాలో హీరోయిన్ పిల్లకి పాలిస్తూ వక్షోజాలను ప్రదర్శించే దృశ్యం వచ్చినప్పుడల్లా తల్లి తనని "కళ్ళు మూసుకొవే భడవా" అని గదమాయించేది.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS