అప్పుడే వచ్చిన ఆమెని, ముగ్గురూ పలకరించారు. మాటల సందర్భంలొ వాళ్ళ వివరాలు తెలుసుకుంది. మిగతా ఇద్దరూ కూడా తీసి పడెయ్య దగినంత చిన్నవాళ్ళు కారు. ఇద్దరు విదేశాల్లో చదువుకున్నారు. పెద్ద పెద్ద కంపెనీల్లో అనుభవం వుంది. ఒకరు బిర్లా కంపెనీలో చాలా కాలం పనిచేశారు. మరొకరు ఫాల్కీ అవార్డు గ్రహీత.
మొత్తానికి ఈ ఇంటర్వ్యూ తేలిగ్గా పూర్తయ్యేట్టు లేదు. అవదు కూడా.
అనూష కొద్దిగా భయపడ్డది. ఈ ఇంటర్వ్యూలో తను చాలా పెద్ద పోటీని ఎదుర్కోవలసి రావచ్చు. అయినా అందులో ఆశ్చర్యం ఏమీ లేదు.
స్టాక్ హొం! బిర్లా కంపెనీ నుంచి ఉద్యోగస్తుల్ని ఆకర్షించగల ఏకైక సంస్థ. రెండు వేళ కోట్ల లావాదేవీలతో భారతదేశపు 'కామర్స్' ని తన గుప్పెట్లో పెట్టుకుని వ్యవహారం నడిపిస్తూన్న ఏకైక సంస్థ. దాని జనరల్ మానేజర్ పదవి అంటే అరవైవేల జీతం, ఎయిర్ కండిషన్డ్ కారు, ఇల్లు ఇంకా ఇంకా.....
కేవలం నలుగుర్నే పిలిచారంటే..... ఎంతో వడపోత జరిగి వుంటుంది. నిజమే. అప్లికేషనే ఎనిమిది పేజీలుంది. వాటి ఆధారంగా ముందు ఎన్నిక జరిగిపోయిందన్నమాట. భారతదేశపు అత్యంత ప్రతిష్టాకరమైన సంస్థలో ప్రతిష్టాకరమైన స్థానం కోసం ఈ ముగ్గురితో పోటీ పడక తప్పదు.
"మిమ్మల్ని రమ్మంటున్నారు" నౌకరు మాటలకి నలుగురూ అటు చూసారు.
"ఎవర్ని"
"నలుగుర్నీ"
ఊహించని ఈ సమాధానానికి నలుగురూ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. లేచి లోపలికి వెళ్ళారు.
విశాలమైన గది. గదిలో టేబిల్, తీవాచీలతో సహా ప్రతీ వస్తువూ బంగారు రంగులో వుంది. దాదాపు ఈ గోడనుంచి ఆ గోడవరకూ వున్నా పెద్ద టేబుల్ వెనుక కూర్చుని వున్నాడు- స్టాక్ హొం చైర్మన్ పి.ఎస్. పండా. యాభై అయిదేళ్ళ యువకుడు. కేవలం తన స్వశక్తితో ఆ సంస్థని అంత పైకి తెచ్చినవాడు.
అతడి పక్కనే మరో వ్యక్తి కూర్చుని వున్నాడు. అతడెవరో ఆమెకు తెలుసు. అతడి పేరు గాంధీ. అతడు స్వంతంగా స్థాపించిన "కంప్యూటర్ బ్రెయిన్స్ " సంస్థ ప్రధానాధికారి. శకుంతలాదేవి, పెరెల్ మాన్ లలాగా, ఎంత పెద్ద లెక్కనైనా అతడు క్షణాల్లో చేయగలడని ప్రతీతి.
.....ఆమెకు జరగబోయేది అర్థం అయింది.
తమ ఇంటర్వ్యూ నిర్వహించటానికి అతడిని పిలిపించారు!
ఆమె ఊహ నిజమే!
చైర్మన్ గొంతు సవరించుకుని "జెంటిల్మెన్ అన్నాడు. అన్న తరువాత తప్పు తెలుసుకున్నట్టు "....అండ్ జెంటిల్ ఉమన్" అని సవరించాడు.
ముసిముసి నవ్వుల మధ్య ఆయన తిరిగి చెప్పటం ప్రారంభించాడు. "స్టాక్ హొం జనరల్ మేనేజర్ పోస్ట్ అంటే సామాన్యమైంది కాదు అని మీకు తెలుసు. క్షణాల్లో నిర్ణయం తీసుకోవాలి. తీసుకునే నిర్ణయం ఎ మాత్రం తప్పయినా అది ఈ సంస్థకే కాదు, మొత్తం దేశానికే ఒక్కోసారి ప్రమాదకరంగా పరిణమించవచ్చు."
ఆమెకా విషయం తెలుసు. అంతకు ముందు బంగారం ధర పెరుగుదల విషయంలో ఈ సంస్థలో జనరల్ మానేజర్ గా పనిచేసే వ్యక్తి తీసుకున్న తప్పుడు నిర్ణయంవల్ల సంస్థకి సుమారు అరవై లక్షలు నష్టం వచ్చినట్టు అంచనా, అందుకే అతడు తొలగించ బడ్డాడు. అందరికీ తెలిసిన అత్యంత రహస్యం ఇది.
ఆయన కొనసాగించాడు. "కాబట్టి అభ్యర్థి ఎన్నిక విషయంలొ మేము ఎ చొరవా చూపించదల్చుకోలేదు. దీన్నంతా ఇదిగో - ఈయనకి వప్పగించాము. ఈయన - మీకు తెలిసే వుంటుంది...." అన్నాడు.
తెలుసునన్నట్టు నలుగురూ తలూపారు.
పి.ఎస్. పండా తన పని అయిపోయినట్టు కుర్చీ వెనక్కి వాలుతూ, "ఇక మిగతా ఇంటర్వ్యూ ఆయన కొనసాగిస్తారు" అన్నాడు.
గాంధీ అభ్యర్థుల వైపు చిరునవ్వుతో చూసాడు. చిరునవ్వు అతడి మొహంలోంచి ఎప్పుడూ చెరగదనుకుంటా! అతడు అనుక్షణం ఎన్ని వత్తిళ్ళ మధ్య వుంటాడో, ఎంత టెన్షన్ లొ వుంటాడో చాలామందికి తెలుసు. కొడుకు స్కూల్లో పుస్తకం పారేసుకున్నాడని తెలిసి రక్తప్రసరణ హెచ్చి వాడిని చావబాదే తండ్రులూ, లైటు లేకుండా వెళ్తున్నందుకు స్కూటర్ ని పోలీసు పట్టుకుంటే అదో సమస్యగా రెండ్రోజులపాటు ఆఫీసులో పన్జేయకుండా 'దీర్ఘాలోచన'లో మునిగిపోయే వారూ- అతడిని చూసి చాలా నేర్చుకోవాలి.
"ఫ్రెండ్స్!" అన్నాడు గాంధీ. నిజానికి మీరే ఇలాంటి ఇంటర్వ్యూలు ఎన్నో చేసివుంటారు. అంతంత పెద్ద పోజిషన్లలో వున్నారు మీరు. ఎన్నో వడబోతల తరువాత మీరు నలుగురూ మిగిలారు. మీమీ సంస్థల్లో మీకు వస్తున్న జీతం కంటే 'స్టాక్ హొం' ఇచ్చే జీతం పెద్ద ఎక్కువేమీ కాదు. అయినా మీరీ ఇంటర్వ్యూకి వచ్చారంటే- మీ తెలివి తేటలకి మరింత పదును పెట్టే ఉద్యోగం కోసం చూస్తున్నారన్నమాట".
అనూషకి బార్న్ టు విన్ (Born to win) అన్న పుస్తకం గుర్తొచ్చింది. తమ అహాన్ని చాలా జాగ్రత్తగా రెచ్చగొడుతున్నాడు ఇతడు. నిశ్చయంగా అది ఆత్మస్థయిర్యాన్ని పెంపొందించటానికి కాదు. ఏదో మెలిక పెడతాడు.
"మీ నలుగురికీ విదేశాల్లో అనుభవం వుంది"-ఆగి, నెమ్మదిగా అన్నాడు- "జూన్ 25వ తారీకు నాటికి డాలరు విలువ ఎంత వుంటుంది అనుకుంటున్నారు?"
"పదకొండు రూపాయిలా ఇరవై అయిదు పైసలు" నలుగురూ ఒక్క క్షణం కూడా తడుముకోకుండా ఒకేసారి అన్నారు. గాంధీ నవ్వేడు.
".....నెల రోజుల తరువాత డాలరు విలువ ఎంత వుంటుందో క్షణాల్లో లెక్కగట్టి- దేశపు అన్ని పరిస్థితుల్నీ అంచనా వేసుకొని పైసా అటూ ఇటూ కాకుండా చెప్పగలిగే మేధావులు మీరు. కేవలం ఉద్యోగం చెయ్యాలన్న కోర్కెతో వచ్చారు తప్పితే, డబ్బు మీకో సమస్యకాదు. మీకున్న తెలివి తేటలకి ఒక పదివేలు పట్టుకుని ప్రొద్దున స్టాక్ ఎక్స్చేంజికి వెళ్ళితే, సాయంత్రానికి లక్షతో తిరిగి రాగలరు".
నవ్వులు.
గాంధీ తిరిగి చెప్పటం మొదలు పెట్టాడు. "ఈ కారణం వల్లే నలుగుర్నీ విడివిడిగా ఇంటర్వ్యూ చేయటం వల్ల ప్రయోజనం వుండదని అనుకున్నాను. ఎవరు మీలో తొందరగా నిర్ణయం తీసుకోగలరూ అని నిర్ణయించాలంటే అందర్నీ ఒకేసారి ప్రశ్నించాలి. మీ కభ్యంతరం లేదనుకుంటాను".
లేదు - అన్నట్టు తలలూగాయి.
"ఈ వేసవి కాలం వర్షాలు అనుకోకుండా పడసాగాయి. మీ దగ్గిర వెయ్యిటన్నుల పోలిస్టర్ గుడ్డ వుంది. ఆమ్మేస్తారా. వుంచుతారా?"
"అమ్మేస్తాం"
బుల్లెట్ లా ముగ్గురి నోటివెంట వచ్చిన ఈ సమాధానానికి గాంధీ హతాశుడై 'ఏంచేద్దాం' అన్నట్టు పండావైపు చేసాడు. ఆయన తనకి ఇదేమీ సంబంధంలేనట్టు వున్నాడు.
వేసవిలో పడే వర్షంవల్ల చింత పిక్క ధర తగ్గుతుంది. చింతపిక్కల్లోంచి తీసే ఒకరకమైన ఆమ్లం చౌకగా లభించటంతో - పోలిస్టర్ కి వాడే రసాయనాల ధర తగ్గుతుంది. అటువంటి పరిస్థితుల్లో సరుకు నిల్వవుంచటం అవివేకం. వాళ్ళలో ముగ్గురు క్షణంలో ఈ నిర్ణయానికి వచ్చేసారు.
"స్టాకు, షేర్ల విషయంలో మీ ఆధునిక పరిజ్ఞానాన్ని పరిశీలించ బోవటం తెలివి తక్కువతనం అని అర్థమైంది. వేరే రంగాలు పరిశీలిస్తాను" అన్నాడు గాంధి.
"ఇది అన్యాయం" అన్నాడు బయట మౌనంగా అందరి మాటలూ విన్న వ్యక్తి. "వేరే రంగాల గురించి మాకు తెలియక పోవచ్చు! ఉదాహరణకి శకుంతలకి దుష్యంతుడు ఏమవుతాడూ అని గట్టిగా అడిగితే".
గాంధీ నవ్వి, "థాంక్ గాడ్, కనీసం శకుంతలకీ దుష్యంతుడికీ ఏదో సంబంధం వున్నదన్న సంగతి మీకు తెలుసుకదా. నాకయితే అదీ తెలీదు" అన్నాడు. మళ్ళీ నవ్వులు. పెద్ద స్థాయి ఇంటర్వ్యూలు మామూలు ఇంటర్వ్యూల లాగా జరగవు. కొన్ని ప్రశ్నోత్తరాలు అయ్యాక మామూలు సంభాషణలా సమాన స్థాయిలో జరుగుతాయి.
"మిమ్మల్ని- మీకు తెలియని రంగాల్లో ప్రశ్నలడిగి ఇబ్బంది పెట్టనులెండి. మీరు చాలా హెచ్చు స్థాయిలో ఆలోచిస్తున్నారు. కాబట్టి ఈసారి తక్కువ స్థాయిలో అడుగుతానంతే" ఆగి, అన్నాడు గాంధీ.
"ఐన్ స్టీన్ ఒక సభకు వెళ్ళినప్పుడు ఒక చిన్న కుర్రవాడు అతడికో లెక్క ఇచ్చాడు. రామూ, సోమూ, జార్జి అనే ముగ్గురు కుర్రవాళ్ళు వన విహారానికి వెళ్ళారు. రాము అయిదు రొట్టెలు, సోమూ మూడు రొటేలు తెచ్చారు. జార్జీ ఏమీ తీసుకురాలేదు. ఆ ఎనిమిదింటినీ ముగ్గురూ తిన్నాక జార్జి తన వంతు ఖర్చుగా ఎనిమిది రూపాయిలు వారికి ఇచ్చాడు. ఈ డబ్బుని ముందు వాళ్ళు ఇద్దరూ ఎలా పంచుకోవాలి!" అని.
ఐన్ స్టీన్ ఆలోచించకుండా, రామూ, అయిదు రూపాయిలు, సోమూ మూడు రూపాయలు తీసుకోవాలి అని సమాధానం ఇచ్చారు. ఆ తరువాత ఐన్ స్టీన్ తన ఆత్మకథలో ఒకచోట, తను ఎంత తేలిగ్గా పప్పులో కాలువేసిందీ వ్రాస్తూ, "రామూ ఏడు రూపాయిలూ, సోమూ ఒక రూపాయి తీసుకోవాలని నాకు సరీగ్గా అర నిముషం తరువాత తట్టింది. కానీ ఈ లోపులోనే నానోటి వెంట తప్పు సమాధానం బయటకొచ్చేసింది" అన్నాడు. కాబట్టి మనం త్వరగా నిర్ణయం తీసుకోవటం ఎంత ముఖ్యమో, అంత త్వరగా అది సరి అయినదో కాదో చూసుకోవటం కూడా అంతే ముఖ్యం. ఈ రెండింటి మధ్యా సరిఅయిన గీత సరీగ్గా గీయగలిగినవారే....." అని ఆగి, నెమ్మదిగా అన్నాడు- "......స్టాక్ హొం జనరల్ మానేజర్".
నలుగురూ అతడు చెపుతున్నది వింటున్నారు. గాంధీ కొనసాగించాడు.
"మీ ఎదురుగా కాగితం పెన్సిల్ వున్నాయి. వరుసగా వ్రాయండి. 'నాసా' వారు రోదసీ యాత్రకి సంబంధించిన ఒక క్విజ్ ఏర్పాటు చేసారు. అందులో అన్నిటికన్నా ఎక్కువగా నన్ను ఆకర్షించిన ప్రశ్న ఇది. ఎంత తొందరగా మీరు సమాధానం వ్రాసారు అన్నదాని మీద ఆధారపడి వుంటుంది మీ విజయం".
నలుగురు అభ్యర్థులూ అప్రయత్నంగా పెన్సిళ్ళు చేతుల్లోకి తీసుకున్నారు.
'చంద్ర మండలం మీద రాకెట్ దిగి, మీరు మరో చిన్న వాహనంలో అన్వేషణకి బయల్దేరారు. మీ స్పేస్ కారు రాకెట్ నుంచి దాదాపు రెండు వందల కిలోమీటర్ల దూరం వచ్చాక అనుకోని ప్రమాదం ఎదురై శిథిలమైపోయింది. మీరు మీ రాకెట్ దగ్గిరకి, ఈ రెండు వందల కిలోమీటర్ల దూరాన్ని నడిచి వెళ్ళాలి. మీ కారులో కొన్ని వస్తువులు చెడిపోకుండా వున్నాయి. కానీ మీరుమీతోపాటూ కొన్నిటిని మాత్రమే తీసుకుపోగలరు. ప్రాముఖ్యతని బట్టి ఈ పదిహేనువస్తువుల్నీ వరుసగా వ్రాయండి. అన్నిటికన్నా ముఖ్యమైన దాన్ని నెంబర్ వన్ గా... అలా". అంటూ చెప్పటం ప్రారంభించాడు.
".....అగ్గిపెట్టె..... ఘనాహారం..... యాభై అడుగుల నైలాన్ తాడు...... మీ భార్య ఫోటో..... చేతిలో ఇమిడే చిన్న స్టౌ..... ఒక 38 పిస్టల్..... పాలడబ్బా ..... ఆక్సిజన్ టాంకు..... చంద్రమండలం మ్యాపు... దిక్సూచి..... ప్రధమ చికిత్స పెట్టె..... నీళ్లసీసా...... చంద్రమండలం మ్యాపు...... దిక్సూచి..... ప్రధమ చికిత్స పెట్టె..... నీళ్లసీసా...... రాకెట్ లో వున్న వాళ్ళతో మాట్లాడగలిగే టెలిఫోన్ లాటి సాధనం..... ప్లాష్ కెమెరా..... చంద్రశిలల్ని తవ్వే గునపం".
అతడు చెప్పటం ప్రారంభించగానే ఆమె వ్రాయటం మొదలు పెట్టింది. మిగతా అందరూ, అతడు చెపుతున్న పదిహేను పేర్లు వరుసగా ముందు వ్రాసుకుని తిరిగి వాటి ప్రాముఖ్యత బట్టి క్రమంలో అమర్చసాగారు.
ఆమె అలా చెయ్యలేదు.
అతడు చెబుతూ వుండగానే వాటి ప్రాముఖ్యతని మనసులో ఆలోచించుకో సాగింది! 'అగ్గి పెట్టె'- చంద్ర మండలంలో అగ్గిపెట్టె అవసరం ఏముంటుంది?- అన్నిటికన్నా చివర దాన్ని వేసింది. 'ఆక్సిజన్-' అన్నిటికన్నా పైన దాన్ని వుంచింది, ఇలా అతడు చెబుతూ వుండగానే వాటిని వరస క్రమంలో సర్దేసింది. అతడు ఆఖరిపదం చెప్పటం-ఆమె దాన్ని వ్రాసి, కాగితాన్ని అతడి ముందుకు తోయటం- రెండూ ఓకే క్షణంలో జరిగాయి.
