తను చీకట్లో బాణం వేసి చూసాడు. అది నిజమైంది. ఆలోచనల్లో నుంచి బయటపడ్డాడు.
యింటి ముందు ఎవరో తలుపు వేస్తోన్న శబ్దం...గభాలున అటువైపు పరుగెత్తాడు.
అప్పటికి ఎవరో తలుపు బయటనుంచి వేసి గొళ్లెం పెట్టారు.
నవ్వుకున్నాడు కృపాల్. చాలా చిన్న టెక్నిక్.. స్క్రూడ్రైవ ర్ ఎక్కడుందో వెతికాడు. తలుపు మధ్యపెట్టి, బయటకు జొనిపి, చిన్నగా క్లిక్ మనిపించాడు.
క్షణాల్లో అటువైపు వున్న గొళ్లెం వూడొచ్చింది. అది అతనికి కష్టమైన విషయంకాదు.
తలుపువేసి, తాళంపెట్టి జీపులో బయల్దేరాడు. జీపు మిథిలానగర్ వైపు బయల్దేరింది. హొల్ స్టిర్ లో రివాల్వర్ తగులుతోంది.
చాందిని పైనుంచి లేచాడు జేమ్స్ డేవిడ్.
ఒక్క క్షణం రిలీఫ్ ఫీలయింది చాందిని. నరకంలో నుంచి స్వర్గంలోకి వచ్చినట్టనిపించింది.
జేమ్స్ డేవిడ్ లేచి బట్టలు వేసుకున్నాడు. సరిగ్గా అప్పడే అతని దగ్గరున్న సెల్ పోన్ మోగింది.
ఇన్స్ పెక్టర్ కృపాల్ తప్పించుకున్నాడు. పోలీస్ పోర్స్ నీ తరలిస్తున్నాడు. అతను మీ దగ్గరికే బయల్దేరాడు అటువైపు నుంచి జేమ్స్ డేవిడ్ కు చెప్పాడు అతను.
నల్లగా వున్నాడు. వయసు ముప్పయ్యేళ్లు వుంటాయి. టెలిఫోన్ బూతులో నుంచి బయటకు వచ్చాడు అతను.
ఎదురుగా కృపాల్.
"హలో...అతని తరపున మిగిలిన ఓకే ఒక వ్యక్తివి. యాదగిరిని లారీతో చంపింది నువ్వేనని నా ఎంక్వయిరీలో తేలింది. ఓ మనిషిని అంత ఘోరంగా చంపినందుకు నిన్ను క్షమించను" అంటూ హొల్ స్టర్ లో నుంచి రివాల్వర్ బయటకు తీసాడు.
లైసెన్సెర్ అమర్చిన ఆ రివాల్వర్ శబ్దం చేయకుండా బుల్లెట్ ను రిలీజ్ చేసింది.
శబ్దం చేయకుండా ఒకే ఒక్క క్షణంలో...అతను సైలెంట్ గా వెనక్కి విరుచుకుపడిపోయాడు.
యాదగిరిని లారీతో చంపింది లాల్ అనే వ్యక్తి అని, అతను పోలీస్ రికార్డ్స్ లో వున్న పాత క్రిమినలే అని తెలిసింది. ఈ రోజు తనని గ్యాస్ లీక్ చేసి చంపడానికి కూడా అతనే వచ్చాడని తెలిసింది.
తనని చంపడానికి ప్రయత్నించినందుకు కాదు, అతన్ని చంపాలనుకుంది.
యాదగిరి అనే నిస్సహాయుడ్ని లారీతో ఆటో పైకి ఎక్కించి చంపినందుకు కృపాల్ ఆ వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా చంపేసాడు.
ఇప్పుడు జేమ్స్ డేవిడ్ ఒక్కడే. చాందిని తప్ప అతని పక్కన ఎవరూ లేరు.
అయితే చాందినీ కూడా జేమ్స్ డేవిడ్ తో విసిగిపోయిందని, అతని నుంచి దూరంగా పారిపోవాలని వుందని అతనికి తెలియదు.
కృపాల్ జీపు స్టార్ట్ చేసాడు.
మిథిలానగర్ కు వెళ్లేముందు పొలీసు స్టేషన్ కు ఫోన్ చేసి లాల్ డెడ్ బాడీని హ్యండోవర్ చేసుకోమని చెప్పాడు.
చాందినీకి ఏడుపొచ్చేసింది. ఈ నరకం నుంచి బయటపడాలని చూస్తోంది. జేమ్స్ డేవిడ్ ఫోన్ లో మాట్లాడింది వింది.
ఈ యింటిని పోలీసులు చుట్టుముట్టి తమని అరెస్టుచేస్తే బావుండునని కోరుకుంటోందామె మనసు. కనీసం జైలులో అయినా తను ప్రశాంతంగా వుండొచ్చు.
ఆమె ఆలోచనల్లో వుండగానే జేమ్స్ డేవిడ్ హడావిడిగా వచ్చాడు.
"మనం వెంటనే యిక్కడ్నుంచి బయల్దేరాలి. పోలీస్ ఫోర్సు మరో కొద్ది సేపట్లో ఈ యింటిని చుట్టుముడుతుంది. కృపాల్ కూడా వస్తున్నాడు. నేను ఈ యింట్లో సరిగ్గా ఒంటిగంటకు పేలేలా బాంబు ఫిక్స్ చేసి వస్తాను. నువ్వు రెడీగా వుండు" అంటూ ఫ్రిజ్ దగ్గరికి వెళ్లి...అందులో వున్న గుండె భాగాన్ని నోట్లో వేసుకున్నాడు.
హడావిడిగా మెట్లెక్కి స్టోర్ రూమువైపు బయల్దేరాడు.
చాందిని ఓ నిర్ణయానికి వచ్చింది. వెంటనే పెన్ను, పేపరు తీసుకుంది.ఉత్తరం రాయడం మొదలెట్టింది. పావుగంటలో ఉత్తరం ముగించింది.
ఎదురుగా కేలండర్ మీద కనిపించేలా పిన్ చేసింది.
ఒక వేళ జేమ్స్ డేవిడ్ ఆ ఉత్తరం చూస్తే తన బ్రతుకు ఫినిష్ అని తెలుసు. అయినా తెగించింది. ఆఉత్తరం కృపాల్ ని ఉద్దేశించి రాసింది.
జేమ్స్ డేవిడ్...పార్ధసారధి వున్న గదిలో కి వచ్చాడు.
పార్ధసారధి, భార్గవ తలలు పైకెత్తారు.
"హలో...మీతో చాలా పనివుంది. కానీ ప్చ్...ఏం చేద్దాం...టైం లేదు,మిమ్మల్ని తీసుకెళ్లే వ్యవధి లేదు. అయినా మిమ్మల్ని వదిలే ప్రసక్తిలేదు. ఇదిగో టైం బాంబు...సరిగ్గా ఒంటిగంటకు పేలేలా పెడుతున్నాను.
కృపాల్ ఈ యింటిని చుట్టుముట్టే లోగా ఈ బాంబు పేలిపోయి అందరూ చస్తారు. అన్నట్లు నీ కూతురు కూడా నన్ను వెతుక్కుంటూ వస్తోందట. అందరూ ఫినిష్...మీరు చచ్చే సమయంలో సిటీ దాటి వెళ్తాను. మీరు అదృష్టవంతులు...కేవలం చంపేస్తున్నాను"అంటూ బాంబును ఓ మూలకు ఫిక్స్ చేసి టైమ్ అడ్జస్ట్ చేసాడు.
అపూర్వ కారు ఇంటి నెంబర్ పదహారు ముందాగింది. కారులో నుంచి దిగి గేటు దగ్గరికి వచ్చింది. గేటు తిసి తోసింది రాలేదు.
లోపల్నుంచి తాళం వేసి వుందని అర్ధమైంది. గేటు పైకి ఎక్కి అటువైపు దూకింది చిన్న శబ్దంతో బట్టలకు అంటిన దుమ్ము దులుపుకుంటూ ఆ చీకట్లో నే ముందుకు కదిలింది.
తలుపు తెరిచే వుంది. లోపలికి అడుగు పెట్టింది అపూర్వ.
ఇల్లంతా నిశ్శబ్దంగా, చీకటిగా వుంది. తన దగ్గరున్న టార్చిలైట్ వెలిగించింది.
దెయ్యాల కొంపలా వుంది.
ఒక్కో గదిని వెతుకుతూ వుంది అపూర్వ.
అదే సమయంలో జేమ్స్ డేవిడ్ చాందినీని తీసుకొని ఆ యిల్లు వదిలి, కారులో బయిటకు వెళ్లారు. వాళ్ల కారు సిటీ లిమిట్స్ వైపు వెళ్తోంది.
సరిగ్గా జేమ్స్ డేవిడ్ వెళ్లిన పావుగంటకు పోలీసులు ఆ యింటిని చీకటిలో నిశ్శబ్దంగా చుట్టుముట్టారు.
కృపాల్ గేటు దూకి లోపలికి వచ్చాడు. ఎదురుగా తలుపు తీసే వుంది.
స్టోర్ రూమ్ తలుపు తెరిచాడు. విరిగిన కుర్చీలు, బల్లలు...పాత సామాను.
ఎందుకో ఆ గదిలోనే మిస్టరీ వుందనిపించింది. ఒక్కో కుర్చీని పక్కకు జరుపుతూ, టార్చిలైటు తో పరిశీలనగా చూసాడు.
ఓ టేబుల్ కింద ఏదో మెరుస్తూ కనిపించింది. అదో చిన్న తలుపు లాంటిది. నీట్ గా వుంది. అనుమానం వచ్చి ఆ తలుపు గట్టిగా లాగడంతో పైకి వచ్చింది. లోపలికి మెట్లు కనిపించాయి.
అతని కళ్లు ఆశ్చర్యంతో వెడల్పు అయ్యాయి. మెల్లగా మెట్లు దిగి లోపలికి వెళ్లాడు.
లోపలి పట్టపగలులా వెలుతురు, ఆటో మేటిక్ జనరేటర్ పనిచేస్తున్నదని అర్ధమైంది.
ఫ్రిజ్, సోఫా, మంచం... అత్యాధునికమైనవి వున్నాయి. ఆ గదిని దాటి మరో గదిలోకి వెల్లాడు.
ఆపరేషన్ థియేటర్ వుంది.
అంటే... ఆపరేషన్స్ చేసి కిడ్నీలు, శారీరావయవాలు మాయం చేసింది యిక్కడేనని అర్ధమైంది. మళ్లీ పడగ్గదిలోకి వచ్చాడు.
ఫ్రిజ్ ఓపెన్ చేసాడు. అందులో మనిషి గుండె, కాలేయం, కన్ను... వున్నాయి.
కృపాల్ ఒళ్లు జలదరించింది.
ఓ పక్కన చిరిగిన నైటి వుంది. అతని దృష్టి ఆ గదిని నిశితంగా పరిశీలిస్తుంది.
అనుకోకుండా అతని దృష్టి క్యాలెండర్ మీద పడింది. క్యాలెండర్ కు ఏదో ఓ ఉత్తరం పిన్ చేసి వుంది. గబగబ ఆ ఉత్తరం విప్పాడు.
కృపాల్ గారికి,
ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తున్నది మీరని తెలుసు.
నాకు జరుగుతోన్న ఈ నేరాలతో సంబంధం వుంది. నాకు ఊహ తెలిసాక నేను వున్నాది జేమ్స్ డేవిడ్ సంరక్షణలో. అతనో మానసిక ఉన్మాది.....ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో అతనికే తెలియదు. కూతురి వయసున్న నన్ను పెంచి పెద్దచేసి సెక్స్ డాల్ గా మార్చాడు.
అతడేం చేయమంటే అది చేయాలి. నాకు మనసులేదు, కోరికలేదు, కనీసం మానవత్వం కూడా లేదు, కాదుకాదు.......వుండడానికి వీల్లేదు.
నాకు మరో ప్రపంచం తెలియదు. అతను చెప్పినట్టల్లా చేయడమే నాకు తెలిసింది. మనుషుల శరీర అవయవాలను ఎంతో యిష్టంతో తింటుంటే వాంటి అయ్యేలా వున్నా, బిగబట్టుకొని, ఆ సన్నివేశాన్ని ఎంజాయ్ చేసేదాన్ని....అలా ఎంజాయ్ చేసినట్టు నటించేదాన్ని.
అతను చేసిన నేరాలు ఘోరాలు....చాలా వున్నాయి.....అన్నింట్లోనూ నేను భాగస్వామినే.....ఎవర్నీ అతడు మాట్లాడనివ్వాడు.
అతనో విచిత్రమైన నేరస్థుడు. తనకు తనే కనబడుటలేదు అని ప్రకటన యిచ్చుకునేవాడు. తననెవరైనా గుర్తుపడితే, యిక్కడికి తీసుకువచ్చి అతడ్ని చంపి ప్రీతిగా తినేవాడు.
అలాంటి వ్యక్తితో గడిపి గడిపి.....చావాలనిపించేది. కానీ అతను చావనిచ్చే వాడు కాదు. ఆ ప్రయత్నం చేసానని తెలిస్తే, ఆ శిక్షయింకా భయంకరంగా వుంటుంది.
ఈ ఇంట్లో బాంబు పెట్టాడు. సరిగ్గా ఒంటిగంటకు పేలుతుంది. మరో విషయం నేను నాతోపాటు బాంబు తీసుకెళ్తున్నాను. దాని రిమోట్ ఫ్రిజ్ మీద పెట్టాను.
సరిగ్గా ఒంటిగంట ముప్పయి నిమిషాలకు మేము సిటీ లిమిట్స్ దాటుతాం. నిర్మానుష్యమైనా ఆ ప్రాంతానికి చేరుకోగానే మీరు రిమోట్ నొక్కండి. అతనూ, అతనితోపాటు నేనూ చస్తాం.....
నేను చేసిన తప్పులకు, నాకు కూడా శిక్షపడాలి. జేమ్స్ డేవిడ్ లాంటి నేరస్థుడు బ్రతికి వుండకూడదు. అతని మరణం నేరస్థులకు ఓ గుణపాఠం కావాలి. ఈ రిమోట్ పది కిలోమీటర్ల వరకూ పనిచేస్తుంది.
చాందినీ.
ఉత్తరం చదవడం పూర్తికాగానే అనుకోకుండా అతని మనసు చాందిని పట్ల జాలితో నిండిపోయింది.
పరిస్థితులు మనుషులను నేరస్థులుగా తయారుచేస్తాము. చాందిని కథ అతడ్ని కదిలించింది.
కర్తవ్యం గుర్తొచ్చి టైం చూసుకున్నాడు.
పన్నెండూ యాభై.......
ఆ యింట్లో బాంబు వుందన్న విషయం గుర్తొచ్చింది. వెంటనే మెట్లెక్కిపైకి వచ్చాడు.
సరిగ్గా అప్పుడే పక్క గదిలో నుంచి మాటలు వినిపించాయి.
గది తలుపు తెరిచింది అపూర్వ.
ఎదురుగా తండ్రి....
"డాడీ"
"బేబీ"
"పార్ధసారధి శక్తినంతా కూడదీసుకుని లేచాడు. భార్గవలో కొత్త ఉత్సాహం.
సరిగ్గా అప్పుడే ఆ గదిలోకి వచ్చాడు కృపాల్.
కృపాల్ గారూ....డాడీ" అంటూ ఆనందంగా పార్ధసారధివైపు చూపించింది.
"హల్లో"అంటూ పలకరించి భార్గవ వైపు చూసాడు.
"సార్ ......నేను భార్గవను"
అప్పుడు కలిగింది సంతోషం కృపాల్ కు.
ప్రణవి గుర్తొచ్చింది. ఆమె మొహంలో భర్తను చూడగానే కనిపించే ఆనందం వూహల్లోకి వచ్చింది.
పార్ధసారధి వెంటనే వాస్తవంలోకి వచ్చి "ఈ గదిలో బాంబు వుంది. ముందు మీరు బయటకు వెళ్లండి.....నేను వెతుకుతాను" అన్నాడు.
"మీరు వెళ్లండి......నేను నేరస్థుడ్ని....నా తప్పుకు ప్రక్షాళన జరగాల్సిందే........ఈ ప్రయత్నంలో బాంబుపేలినా నేను చచ్చినాసరే" అంటూ బాంబువెతకసాగాడు.
కృపాల్ వైపు తిరిగి, "అపూర్వ...మీరు భార్గావని, మీ నాన్నగారిని తీసుకొని వెళ్లండి...నేను బాంబు వెతికి పేలకుండా డిస్పోజ్ చేసి వస్తాను" అన్నాడు.
అపూర్వ భార్గవను, తండ్రిని తీసుకొని బయటకు నడిచింది.
కృపాల్ టార్చిలైటు సాయంతో బాంబు కోసం వెతుకుతున్నాడు.
అందరూ గేటు దగ్గరకు వచ్చారు.
రాయితో తాళం పగలగొట్టింది అపూర్వ.
టైం పన్నెండు యాభై ఐదు అయింది. అపూర్వ ఆందోళనగా చూసింది లోపలవున్న కృపాల్ వైపు.
కృపాల్ రావడంలేదు.
ఒక్కసారిగా పార్ధసారధి లోపలికి పరుగెత్తాడు. అపూర్వ తండ్రిని పిలవ బోయింది.
అప్పటికే పార్ధసారధి బాంబు వున్న గదిలోకి వెళ్లాడు.
కృపాల్ పార్ధసారధివైపు ఆందోళనగా చూసాడు.
"ప్లీజ్...కృపాల్ గారు...మీరు వెళ్లండి. డాక్టర్ గా నా వృత్తికి కళంకం తెచ్చాను, తండ్రిగా నాచిట్టితల్లిని నిర్లక్ష్యం చేసాను. నాకు శిక్ష పడాల్సిందే. మీలాంటి సిన్సియర్ పోలీసాఫీసర్ చావకూదాదు" అంటూ కృపాల్ ని నెట్టేసాడు.
పన్నెండు యాభై తొమ్మిది.
"ప్లీజ్ వెళ్లిపోండి" అంటూ కృపాల్ ని బయటకు నెట్టి తలుపు వేసాడు.
కృపాల్ కు లాభం లేదని అర్ధమైంది. బయటకు పరుగెత్తాడు.
ఒంటిగంట...
పెద్ద శబ్దంతో ఇంటి నెంబర్ పదహారు పేలిపోయింది.
పెద్ద మిస్టరీని తనలో దాచుకున్న ఇంటి నెంబర్ పదహారు పేలిపోయింది...విధ్వంసమైంది.
అందులో పార్ధసారధి శవం కూడావుంది.
తండ్రి శవంవద్ద కూచుని ఏడుస్తోంది అపూర్వ. కృపాల్ కు ఆమె నెలా ఓదా ర్చాలో అర్ధంకాలేదు.
ఏ తండ్రి కోసం స్టేట్స్ నుంచి వచ్చి, యింత సాహసం చేసిందో ఆ తండ్రే లేడని తెలిసినపుడు ఆమె బాధ సహజమే...
టైం చూసుకున్నాడు.
ఒంటిగంట ఇరవై ఐదు నిమిషాలు. అతని పిడికిట్లో రిమోట్ వుంది.
ఇంత దారుణానికి కారణంమైన జేమ్స్ డేవిడ్ బ్రతక్కూడదు.
కానీ, అనవసరంగా చాందినీని చంపివేయాల్ని వస్తుందన్న బాధ.
అలా అని వదిలేస్తే జేమ్స్ డేవిడ్ లాంటి వాళ్లని పట్టుకోవడం కష్టం. పట్టుకున్నా సాక్ష్యాలు, ఆధారాలు అంటూ కాలయాపన.
అతని తప్పులకు మరణశిక్ష విధించాల్సిందే. రిమోట్ మీద చేతివేళ్లు బిగుసుకున్నాయి.
ఒంటిగంటా ముప్ఫయి నిమిషాలు.
"ఏయ్ చాందినీ...మనం మకాం మద్రాస్ మారుస్తున్నాం" అన్నాడు ఆమె పెదవి మీద తన పంటితో గాటు సృష్టించి.
"అమ్మా" అంది బాధగా చాందిని.
"బాధ" అంటూ మరోసారి గట్టిగా కోరకబోయాడు.
చాందిని ఖాండ్రించి అతనిమీద ఉమ్మింది. జేమ్స్ డేవిడ్ కోపంగా చాందిని వైపు చూసాడు.
చాందిని ఎప్పటిలా భయపడలేదు. భయపడే అవకాశమూ లేదు..
ఎందుకంటే-
సరిగ్గా అదే క్షణంలో...
చాందిని బ్యాగులో వున్న బాంబు పేలింది.
పెద్ద శబ్దంతో ఆ నిర్జన ప్రదేశంలో కారు బ్రద్ధలైంది.
జేమ్స్ డేవిడ్ శరీరం తునాతునకలై రోడ్డుమీద చెల్లచేదురైంది.
చాందిని మృతదేహం మరోపక్కన వుంది.
పార్ధసారధి హాస్పటల్ ప్రారంభోత్సవం కృపాల్ చేతుల మీద జరిగింది.
స్టేట్స్ నుంచి ఇండియా వచ్చేసింది అపూర్వ. తండ్రి జ్ఞాపకార్ధం పార్ధసారధి మెమోరియల్ హాస్పటల్ ప్రారంభించింది.
భార్గవ,ప్రణవి ఆ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు.
అందరూఅపూర్వ యింట్లో లంచ్ చేసారు.
ప్రణవి, భార్గవ కృపాల్ కు చేతులు జోడించి నమస్కారంచేసారు.
వాళ్లని సాగనంపి, కృపాల్ బయల్దేరుతుంటే, కృపాల్ చేయి పట్టుకుంది అపూర్వ.
ఆమెవైపు ఆశ్చర్యంగా చూసాడు.
" ప్రేమంటే...కథ మొదలైనప్పుడు మొదలై ముగిసేలోగా పెళ్లి చేసుకోవడం కాదని నా అభిప్రాయం... దయచేసి నాచేతిని వదలొద్దు." అంతకు మించి మాట్లాడలేదు అపూర్వ.
ఆ చేతిని ఆప్యాయంగా నొక్కి వదిలాడు కృపాల్.
