Previous Page Next Page 
త్రీ- ఇన్- వన్ పేజి 16

    వింటున్న అందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుని తృప్తిగా తలలూగించారు.

    "ఇంకేముంది రాధ గోపీ చేతుల్లోని  వెండి కప్పులన్నీ చూసి గోపిని ఆరాధనగా, ప్రేమగా చూస్తుంది...."

    "హా... రాధ గోపీని ప్రేమిస్తుందా?"

    భేతాళరావు గుండెలమీద చేయ్యేస్కుని కళ్ళింతింత చేస్కుని అడిగాడు.

     ఆ సుబ్బరంగా ప్రేమిస్తుంది .... అన్నింట్లోనూ తెలివైన వాడు... బుద్ది మంతుడూ... పైగా అందగాడు.... ప్రేమించాక ఏం చేస్తుఅద్మి....?" అన్నాడు చంచల్రావు.

    అంతే .... వింటున్న అందరూ ఘొల్లున నవ్వారు.

    చంచల్రావు అయోమయంగా చూశాడు.

    "ఏం కతయ్యా అది...? ఆ....?" చొంగ తుడుచుకుంటూ అడిగాడు భేతాళరావు.

    "సినిమాకి కథ రాయడం ఇదే కదా మొదలు... పాపం వేళాకోళం ఆపండి డార్లింగులూ... ఆయన బాధపడ్తారు...." అంది లిల్లీ నవుతున్న అందర్తో.

    "నువ్వు సెగట్రీ నాకా లేకపోతే  ఇక్కడున్న అందరికీనా...? అందర్నీ డార్లింగులని అంటావేం...? ఆ ....?" కయ్ మంటూ లేచాడు భేతాళరావు.

    "నువ్వు చెప్పవోయ్ అసిస్టెంటూ...." కులాసాగా అన్నాడు డైరెక్టర్ ఎల్లారావు.

    "ఏవయ్యా...అలా వెంటనే ప్రేమించేస్తే సస్పెన్స్ ఏముంటుందయ్యా...? చూసేవాళ్లు హీరోయిన్ ప్రేమిస్తుందా లేదా అని ఊర్కె తెగ ఇదయిపోయి సస్పెన్స్ లో కొట్టుకుని చావాలి...ఊ... ఎలా చెప్తావో చెప్పు మరి" అన్నాడు అసిస్టెంటు డైరెక్టర్ పుల్లారావు.

    చంచల్రావు ఓ నిమిషంపాటు సీలింగు వంక చూసి ఆలోచించి "ఊ... వినండి" అన్నాడు.

    అందరూ గ్లాసుల్లోని ద్రవం కాస్త కాస్త చప్పరిస్తూ జాగ్రత్తగా వినసాగారు.
                            
   

    "మరేమో గోపీకీ, రాధకీ మొదట్నుంచీ అస్సలు పడదు. ఒకసారి గోపీ పార్కులో రాధని ఏడిపిస్తూ పాత పాడ్తే ఒక చెంపదెబ్బకూడా కొడుతుంది..."

    శభాష్... ఇప్పుడు దార్లో పడ్డావ్" అన్నాడు భేతాళరావు మెచ్చుకుంటూ.

                                         

    "అన్నట్టు నీకు పాటలు రాయడం వచ్చా?" అన్నాడు కూర్మారావు.

    "వొచ్చు అన్నాడు చంచల్రావు.

    "అయితే పార్కులో హీరో హీరోయిన్ని ఏడిపిస్తూ పాడేపాటని నువ్వైతే ఎలా రాస్తావ్ చెప్పు...."

    చంచల్రావు రెండు నిమిషాలు ఆలోచించి పాట చెప్పాడు.

    "ఓ అనురాగ వల్లరీ...

    నా యదలో ఏదో అల్లరీ....

    మరువేల మొలకా రావా

    నీ పరువాలన్నీ దోచుకోనా...."

    అతని పాట వింటూనే అక్కడున్నవాళ్ళ మొహాన కత్తివేటుకి నెత్తురుచుక్క లేకుండాపోయింది.

    "ఏటీ..." సినిమాకి ఈ పాట రాద్దామనేనా....? నువ్వేకాలంలో ఉన్నవయ్యా రైటరూ...?" అన్నాడు భేతాళరావు మేల్లా.

    చంచల్రావు తెల్ల మొహం వేశాడు.

    శంభులింగం అందుకున్నాడు.

    "పాటెలా వుండాలో నేను చెప్తాను విను"

    ఓసారి గొంతు సవరించుకుని మొదలుబెట్టాడు.

    "ని కోకలోని అందాలు ఛాంగు భళా....

    అవి నాకే చెందాల ఛాంగుభళా.....

    నా గుండెలోని ఆటుపోటు తగ్గాలా..."

    అందరూ ఆనందం పట్టలేక చప్పట్లు కొట్టారు.

    "శభాష్ బ్మ్మర్ది... మా గొప్పగా సెప్పావ్... మన సినిమాలకి పాటలు నువ్వేరాసెయ్... ఈయనేమో కవిర్వం ఎక్కుపెట్టేస్తున్నాడు" అన్నాడు భేతాళరావు.

    "ఊ... మిగతా కథ చెప్పు" అన్నాడు ఎల్లారావు.

                                            

       చంచల్రావు చెప్పడం మొదలు బెట్టాడు.

    "ఒకరోజు రాధ బజారుకి వెళ్తుంటే ఒక దొంగ ఆమె చేతిలోంచి పర్సు లాక్కుని పారిపోతుంటాడు. అప్పుడు వాడిని తరిమి పట్టుకుంటాడు గోపీ...."

    "అప్పుడు దొంగకీ గోపీకీ హోరా హోరీ పోట్లాట జరుగుతుంది. గోపీ దొంగని చితక్కొట్టి పర్సుని రాధకి తెచ్చి ఇస్తాడు. రాధ అప్పట్నుండి గోపీని ప్రేమిస్తుంది.... అంతేనా?" అన్నాడు అసిస్టెంటు డైరెక్టర్ పుల్లారావ్.

                               

       అంతేనన్నట్టు తల ఊపాడు చంచల్రావు.

    లిల్లీ కిచకిచా నవ్వింది.

    "చూడు బాబూ! అలాకంటే ఇంకోలా చెప్తే బాగుంటుంది... రాధని నలుగురు గూండాలు ఎత్తుకెళ్ళి ఓ గుహలో రేప్ చేయడానికి శత విధాల ప్రయత్నిస్తుంటారు"అన్నాడు డైరెక్టరు ఎల్లారావు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS