సముద్రంలో బడబాగ్ని బద్దలవడానికి సిద్ధంగా వున్నట్లుగా.....
తోచటం లేదు
ఫోం బెడ్ ముళ్ళకంపలా వుంది.
ఆ సమయంలో జి.కె. గదిలో కాలు పెట్టాడు.
గదిలో చీకటి.
గది తలుపులు తెరిచిన చప్పుడు గానీ, అతని అడుగుల చప్పుడు గానీ నాగమణికి వినిపించలేదు.
ఆమె పరిసరాల్ని గమనించే స్థితిలో లేదు.
కళ్ళఎదుట లీలగా ఏదో రూపం
కార్తీక్ దేనా!
ఎందుకతని గురించి ఆలోచిస్తోంది?
భర్త గురించి ఆలోచించవచ్చు కదా! అతని గురించి ఆలోచించకపోతేనే మంచిది.
గదిలో లైట్ స్విచ్ వేశాడు. లైటు వెలిగింది.
అదికూడా ఆమె గమనించలేదు.
మంచంమీద పడుకున్న నాగమణికేసి చూసి అదోలా నవ్వుకున్నాడు జి.కె.
ఆకలిగొన్న పులి, వేటాడే మృగాన్ని చూసి పొంచి, పొంచి నిశ్శబ్దంగా చేరుతున్నట్లు.... మంచం దగ్గరికి నడిచాడు జి.కె.
అకస్మాత్తుగా గదిలైట్ ఆరిపోయింది.
