Previous Page Next Page 
నారి నారి నడుమ మురారి పేజి 15

 

సరే అని బలవంతంగా ఒప్పుకున్నాడు.  
కడుపులో కొంచెం ఫుడ్ పడగానే మంచి నిద్రపట్టింది కృష్ణకుమార్ కి. అందులోనూ టాబ్లెట్  కూడా వేసుకున్నాడు. మగతగా ఉంది.
సోఫాలో చిన్న దిండు తలకింద పెట్టుకుని పడుకుంది విద్య. 
****
బాగా చెమటలు పడుతున్నాయి. జ్వరం తగ్గినట్టుంది. మెలకువ వచ్చి చూస్తే టైం నాలుగయింది. తన కదలికలకి విద్య కూడా లేచింది. 
హె విద్యా ! హ్యాపీ బర్త్ డే విద్యా అన్నాడు అంత నీరసంలోనూ.
థాంక్యూ అంది.
ఎలా ఉంది ఇప్పుడు అని అడిగింది సోఫాలో కూర్చుంటూ. 
బాగానే ఉంది. నువ్వు నిద్రపోలేదా ? వెళ్లి పడుకో. నాకు ఇక ఫరవాలేదు అన్నాడు.
దగ్గరకొచ్చి మళ్ళీ చెయ్యిపట్టుకు చూసింది. జ్వరం తగ్గినట్లనిపించింది. 
సరే నేను వెళుతున్నాను. మీరు కూడా పడుకోండి. రెస్ట్ తీసుకుని కొంచెం లేట్ గా లేద్దాం. ఇవాళ పనేమీ లేదు కదా అంది.
అవును విద్యా. నేనైతే తొమ్మిదికి లేస్తాను అన్నాడు.
ఓకే బై . టేక్ రెస్ట్ అంది వెళుతూ. 
తొమ్మిదన్నాడు గానీ లెచేప్పటికీ పదకొండయ్యింది. 
మొబైల్ మ్యూట్ లో పెట్టున్నాడు.
రేణూ నుంచి మూడు మిస్సెడ్ కాల్స్ ఉన్నాయి.
ఆమ్మో కొంప మునిగింది.
ఏమైంది మీకు ఎలా ఉన్నారు అని తెగ కంగారు పడుతుంది.
జ్వరం అని తెలిస్తే ఇక ఊరుకోదు.
ఇప్పటికే చాలా మొక్కులు పెండింగ్ ఉన్నాయి వెంకటేశ్వర స్వామికి.
ఎదో ఒకటి సర్ది చెప్పాలి అనుకున్నాడు.
వాట్సాప్ లో విద్య మెస్సేజ్ కనిపించింది.
మీరు లేస్తే మెస్సేజ్ ఇవ్వండి అని. 
చక చక లేచి రెడీ అయ్యి రేణు కి ఫోన్ చేసి రాత్రి బాగా లేట్ అయ్యింది రా అని సర్ది చెప్పి విద్య కి మెస్సేజ్ ఇచ్చాడు తను రెడీ అని.
కిందకి వెళ్లి రెస్టారెంట్ లో బ్రేక్ఫాస్ట్ తీసుకుని లాంజ్ లో కూర్చున్నారు. 
అప్పుడు గమనించాడు రేణూ ఇచ్చిన చీర కట్టుకొని ఉంది విద్య.
ఓహ్ చాలా నప్పింది తనకి.
చీరకే అందం వచ్చింది.
కాసేపు కన్నార్పడం మరిచిపోయాడు.
బ్రేక్ఫాస్ట్ సరిపోలేదా అంది విద్య నవ్వుతూ .
సరిపోయింది అంటూ తడబడ్డాడు.
అరే నీకు గిఫ్ట్ ఏమీ ఇవ్వలేదు విద్యా అన్నాడు ఫీల్ అవుతూ.
అబ్బా ఈ గిఫ్ట్ గోల ఆపండి బాబు.
ఒక పని చెప్తా చేస్తారా అంది.
చెప్పు అన్నాడు ఉత్సాహంగా.
ఆ ఫ్లవర్ వాజ్ లో ఫ్రెష్ గులాబీలున్నాయి.
ఒకటి తెచ్చి నా జడలో పెట్టండి అదే పెద్ద గిఫ్ట్ నాకు అంది.
రోజా పువ్వు తెచ్చాడు కానీ హ్యాపీ బర్త్ డే అని చేతికిచ్చాడు.
వెనక్కి తిరిగి జడ చూపించింది ఆ పూవు పెట్టండి అని.
ఇదేంటి ఇలా చిక్కుకున్నాను నేను అనుకుని మెల్లగా పెట్టాడు.
అది మూడు సార్లు కింద పడింది.
ఎందుకు అంత తడబాటు.
మనసులో ఏమన్నా అనుకుంటున్నారా ఏంటి కొంపదీసి అంది నవ్వుతూ. 
అహహహ అదేం కాదు అని ఈసారి చక్కగా అమరేట్లు తనకిష్టమైన స్మాల్ టెయిల్ లో  పెట్టాడు.
థాంక్స్ అంది. ఈ గిఫ్ట్ చాలు నాకు. మీరు ఇంకేం ఇవ్వక్కరలేదు. ఏదన్నా గుడికి తీసుకెళ్లండి. కాస్త టైం స్పెండ్ చేసి వద్దాం.
ఓకే అంటూ రిసెప్షన్ లో కనుక్కున్నాడు దగ్గరలో గుళ్ళు ఏమైనా ఉన్నాయా అని.
క్యాబ్ బుక్ చేసి ఇద్దరూ చాముండి హిల్స్ వెళ్లారు.
విద్యతో అలా తిరగడం హాయి గొల్పినా మనసులో ఆమెపై ఎటువంటి ఆలోచనా కలగకుండా జాగ్రత్తపడ్డాడు.
ఒక మంచి స్నేహితురాలిగా చూడటం, మాట్లాడటం మొదలుపెట్టాడు.
అలా ఉండటం తనకు తనే ఎంతో మానసిక దృఢత్వం కలిగినట్లు అనుభూతి పొందాడు.
ఇక జీవితంలో ఇలాగే ఉండాలి. తనూ, రేణూ, తన బ్యాంకు ఇవే తనకు ఆరాధ్యం.
ఇంతకంటే ఈ జీవితానికి ఇంకేమీ వద్దు.
లేనిపోని ఆలోచనలు మనసును కుదిపేస్తే జీవితం చిన్నాభిన్నమవుతుంది.
ఆమ్మో ఆ ఆలోచనే భీతి కలిగిస్తోంది.
ప్రశాంతత లోపించేట్లు చేస్తుంది.
ఇప్పుడు తను ఎంతో సుఖంగా ఉన్నాడు.
క్యాబ్ లో వచ్చేప్పుడు రోడ్డు కిరువైపులా ప్రకృతి ఎంతో అందంగా ఆహ్లాదంగా ఉంది.
మనసులో తన గురించి కేవలం ఒక స్నేహితురాలు అన్న భావంతో ఏ ఇబ్బంది లేకుండా ఎంతో చక్కగా మాట్లాడుతూ విద్యతో ఎంజాయ్ చేసాడు తన కాలేజ్ రోజుల్లోలా.
విద్య కూడా ఎన్నో విషయాలు షేర్ చేసుకుంది అరమరికలు లేకుండా.
ఆ మాటల్లో ఆమె గొప్ప వ్యక్తిత్వం కనిపించింది కృష్ణకుమార్ కి. 
కృష్ణకుమార్ కి దేశభక్తి చాలా ఎక్కువ.
జాతీయగీతం పాడేప్పుడు పూనకం వస్తుంది. అంతలా లీనమవుతాడు.
మన దేశమన్నా, ఆడవారన్నా చాలా చాలా గౌరవం అతనికి. 
లంచ్ టైం కి హోటల్ కి వచ్చేసారు.
ఈ మూడు రోజుల్లో ఇద్దరి మధ్య ఎన్నో కబుర్లు దొర్లాయి.
చిన్నప్పటి సంగతులు, జోక్స్, కాలేజీ విశేషాలు అలా ఎన్నో.
విద్య కి చాలా రోజుల తరువాత మనసు తెరిపి గా అనిపించింది.
జీవితంలో ఒక మంచి స్నేహితుడు దొరికాడు. ఏ సమస్య వచ్చినా నేనున్నాను అంటూ ఆదుకునేవాడు.
కృష్ణ కుమార్ నిజంగా కృష్ణుడే.
మంచి మనసు, అంతకు మంచి ఎదుటివారి కష్టాలు తన కష్టాలుగా భావించేవాడు. 
లంచ్ కాగానే జోనల్ మేనేజర్ కి ఫోన్ చేసి మీటింగ్ విశేషాలు అంతా డీటెయిల్ గా చెప్పాడు.
ఆయన చాలా సంతోషించాడు.
అంత పెద్ద సమస్యని అంత చక్కగా డీల్ చేసినందుకు కృష్ణకుమార్ ని అభినందించాడు.
మీటింగ్ లో విద్యావతి పాత్ర గురించి చెప్తూ బాగా పొగిడాడు కృష్ణకుమార్ ఆమెని.
పక్కనే కూర్చుని వింటున్న విద్యకి కృష్ణకుమార్ అలా పొగడటం చాలా ఆనందం, కొంత ఇబ్బంది కలిగించింది.
జోనల్ మేనేజర్ ఫోన్ లో ఇద్దరినీ బాగా మెచ్చుకున్నాడు. 
ఫోన్ పెట్టేసిన తరువాత విద్య వైపు తిరిగి చెప్పాడు చూసారా మన జోనల్ మేనేజర్ గారు బాగా ఎక్సైట్ అయ్యారు.
ఆయన ఈ మీటింగ్ గురించి చాలా భయంగా ఉన్నాడు ఎలా జరుగుతుందా అని.
ఇప్పుడు హాఫీగా రిలాక్స్ అయ్యారు.    
మీటింగ్ సక్సెస్ అయినందుకు విద్య కి చాలా థాంక్స్ చెప్పాడు.
ఈ క్రెడిట్ మీకే దక్కుతుంది అన్నాడు నిజాయితీగా. 
విద్య సిగ్గుపడుతూ అంది నేను చేసింది చాలా తక్కువ సర్.
అంతా మీరే గా సారధ్యం వహించి కొత్త కొత్త ఆలోచనలతో అందరిని మెప్పించి శెభాష్ అనిపించారు.
ఉండొచ్చు కానీ స్ఫూర్తి నిచ్చింది మాత్రం మీరే అంటూ విద్య వైపు తిరిగి అన్నాడు. 
పొగడ్తలు చాలు బాబు ఇక పదండి.
రూముకెళ్ళి సర్దుకుని రెడీ కావాలి అంది విద్య.
మూడు గంటలకి చెక్ అవుట్ చేసి ఎయిర్పోర్ట్ కి వెళ్లారు.
ఆరుగంటలకి హైదరాబాద్ ఫ్లైట్.
సీట్ బెల్ట్ పెట్టుకున్నాక మనసులో గట్టిగా అనుకున్నాడు ఈ ప్రయాణంలో లాస్ట్ టైం లా ఎటువంటి కుదుపులు రాకుండా చూడమని.
అలా వచ్చి మళ్ళీ విద్య తనపై వాలడం, లేనిపోని ఆలోచనలు కలగడం అవేమీ లేకుండా ప్రశాంతంగా ల్యాండ్ అయ్యేట్లు చూడమని తను అమితంగా పూజించే ఆంజనేయస్వామికి చెప్పుకున్నాడు. 
తన మనసులో మాట అర్ధమైనట్లు విద్య తనవైపు చూసి కొంటెగా నవ్వుతూ అంది కంగారుపడకండి బాస్ ఈ సారి మీపై వాలను లెండి.
మీకెటువంటి ఛాన్స్ ఇవ్వను అంది.
బాగా సిగ్గుపడ్డాడు కృష్ణకుమార్.
చాలా స్ఫురద్రూపి ఈ విద్య అని మనసులో మెచ్చుకున్నాడు.  
ఎనిమిదికల్లా విద్య ని ఇంటిదగ్గర డ్రాప్ చేసి తనూ ఇల్లు చేరాడు.
రేణూని చూడగానే అబ్బా అని మొహం చేతుల్లోకి తీసుకున్నాడు ఆప్యాయంగా.
మూడు రోజులకే అంత మిస్ అయ్యారా నన్ను అంది రేణూ అతని తల నిమురుతూ.
మరి. నువ్వొచ్చిఉంటే ఎంతో హ్యాపీ గా తిరిగేవాళ్ళం అన్నాడు. 
సారీ అండి. మన బుజ్జిగాడు అమెరికా కి వెళ్తే నేను మీతో ఎక్కడికంటే అక్కడికి వస్తాను. సరేనా అంది గారాలు పోతూ.
డిన్నర్ చేసేప్పుడు చెప్పింది రేణూ నా మిడిల్ ఏజ్ లవ్ స్టోరీ కి అద్భుతమైన ముగింపు దొరికిందండి అని సంబరపడిపోతూ. 
అలెర్ట్ అయ్యాడు కృష్ణకుమార్. ఏంటి చెప్పు అన్నాడు కంగారుపడిపోతూ.
మీరు చెప్పినట్లు కాకుండా హీరోకి ఇద్దరుభార్యలు అన్న కథతో ముగింపు ఉంటుంది.
ఇదేం ట్విస్ట్. బాగుండదేమో రేణూ ! ఇంకోసారి ఆలోచించు అన్నాడు బ్రతిమిలాడుతున్నట్లుగా. 
వెబ్ సిరీస్ వాళ్లకి కూడా అలానే ముగింపు కావాలన్నారు. నేను చెప్పింది వాళ్లకి ఎంతో నచ్చింది అంది.
ఏమో నీ ఇష్టం రా అన్నాడు అన్యమనస్కంగా.
తమ మధ్య నవల ముగింపు విషయంలో జరిగిన సుదీర్ఘ చర్చ అతని మదిలో బోలెడు సంశయాలకు చోటిచ్చింది.
రేణూ చెప్పే ముగింపు తన జీవితానికో అర్ధం కానుందా అన్న మీమాంసలో పడ్డాడు.
 

 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS