Previous Page Next Page 
ది పార్టనర్ పేజి 15

 

    అనుకోకుండా వెంటనే ఇంటికి తిరిగివచ్చిన సింహచలానికి తన భార్య ఎంతటి పతివ్రతా శిఖామనో తెలిసి వచ్చింది.
    ఇంటిలో ఎవరూ లేకపోవడంతో పెళ్ళి కాకముందు నుండీ తనకు పరిచయం వున్న మాజీ ప్రియుడిని ఇంటికి పిలిపించుకుని అతనితో కులుకుతున్నది.
    నమ్మలేని నిజాన్ని సింహాచలం వెంటనే జీర్ణించుకోలేకపోయాడు.
    కంటి ఎదురుగా కనిపిస్తున్న నగ్న సత్యాన్ని చూసి తట్టుకోలేక పోయాడు.
    అప్పుడే గది తలుపులు బాది ఆ ఇద్దరినీ జుట్టు పట్టి బయటకు ఈడ్చి బుద్ది చెప్పబోయి కూడా తన ఆవేశాన్ని అణిచి వేసుకున్నాడు.
    అలా చేయడం వలన పోయేది తన పరువే....
    అందుకే, గరళం లాంటి విషాదాన్ని భరిస్తూ వెనుదిరిగాడు.
    కళ్ళముందు ఆ దృశ్యమే పదేపదే కనిపిస్తుండడంతో మితిమీరి తిరిగాడు.
    అలాంటి భార్యను ఏం చేయాలో చాలాసేపు సతమతమవుతూనే వున్నాడు... ఎప్పటికో కాని ఒక నిర్ణయానికి రాలేకపోయాడు.
    బిల్ చెల్లించి బార్ లోనుంచీ బయటపడ్డాడు సింహాచలం.
    విశాఖ వీధులు అతనికి ఆహ్లాదాన్ని కురిపించడం లేదు.
    ఎలాగో ఇంటికి చేరుకున్నాడతను.
    స్వప్న తలుపు తీసింది.
    భర్త తాగివచ్చాడని ఆ క్షణంలోనే పసిగట్టినా ఏమీ తెలియనట్టు పక్కకు తప్పుకుని సింహాచలం లోపలకు వచ్చాక తలుపు గడియ పెట్టింది.
    అత్తమామలు నిద్రపోతున్నారని గమనించి సరాసరి తమ పడక గడివేపు నడిచాడు సింహాచలం.
    "భోజనం పెడతాను రండి" అంటూ వచ్చింది స్వప్న.
    "వద్దు ---ఆకలి లేదు"
    ముద్దా ముద్దగా వచ్చాయి సింహాచలం మాటలు.
    "మీరు తాగివచ్చారు కదూ"
    'అవును! సంతోషాన్ని భరించలేక తాగాను" ఇదిగో ఈ స్వీట్ తిని నా సంతోషాన్ని నువ్వు కూడా పంచుకో" అంటూ స్వీట్ పాకెట్ ను అందించాడు.
    "వద్దండీ .....ఇప్పుడేమీ తినను."
    "భర్త ప్రేమతో తెచ్చింది తినమన్నా తినవన్న మాట"
    ఒక క్షణం చురుగ్గా చూసింది అతని వేపు.
    'అలాగైతే సరే ---భార్య భర్త లంటే చెరిసగం పంచుకోవాలి గదా" అంటూ స్వీట్ ను సగం తుంపి సింహాచలానికి అందించబోయింది.
    "వద్దు! నేను తినను అది తెచ్చింది నీకోసమే"
    "ఓహో .......ప్రత్యేకంగా నాకోసమే తెచ్చారన్నమాట. అంటే అందులో ఏం కలిపారు?"
    "కలపడమేమిటి?" కంగారుగా ప్రశ్నించాడు.
    "అదే విషమా? పురుగుల మందా? ఏం కలిపారోనని"
    "అంటే నీకళ్ళకు అలా కనిపిస్తున్నానన్నమాట, నేను అలాంటి వాడిని అవునో కాదో నీకు తెలియదూ"
    "తెలుసు కాబట్టే అడుగుతున్నాను. నాతొ కాపురం చేయడం మీకు ఇష్టం లేకపోతే చెప్పండి విడిపోదాం. అంతే తప్ప ఒకరినొకరు చంపుకోవాల్సినంత తప్పు నేనేమీ చేయలేదు" నింపాదిగా అన్నదామె.
    "నువ్వు  చేయలేదూ.....? కోపంతో ఊగిపోయాడు సింహాచలం.
    'ఆగండి .....! మీరు చూడరాని దృశ్యం చూశారని నాకు తెలుసు . నేను అప్పుడే గమనించాను మిమ్మల్ని. అందుకే ఇంత సౌమ్యంగా చెబుతున్నాను . మీరు మాత్రం పరాయి స్త్రీలతో సంబంధం పెట్టుకోలేదా చెప్పండి?" స్వప్న విలాసంగా అడిగింది.
    "అంటే, నాపై నిఘా వేశావన్న మాట--------"
    "తప్పదుగా మరి ......! మొగుడు ఎలా నడిస్తే, భార్య కూడా అలానే అతని అడుగుజాడల్లో నడవడం హైందవ సాంప్రదాయం. అందుకే మీలానే నేనూ నా కంటికి నచ్చిన వాళ్ళతో తిరుగుతున్నాను. నేను చేస్తున్నది తప్పంటారా?"
    "ఓసి నీ ముఖం తగలెయ్యా.......రంకుతనం చేస్తున్నానని అంత ధైర్యంగా చెబుతూనే నేను చేసేది తప్పా అని అడుగుతున్నావా? నీకు నిజంగానే సిగ్గు లేదు ---మరీ బరితెగించావు."
    "ఎందుకు సిగ్గుపడాలి. మగాడికొక న్యాయం......ఆడదానికి ఒక న్యాయం వుంటుందా? మీరయితే నచ్చిన ఆడదాని దగ్గరకు వెళ్ళి సుఖాన్ని అనుభవించవచ్చు. అదే నేను చేస్తే తప్పు అంటారా? మీలాగానే నాకూ కోరికలు ఎక్కువ.....అందుకే నా సుఖాన్ని నేను వెదుక్కుంటున్నాను.....ఇదిగో ఇప్పుడే చెబుతున్నాను గుట్టుగా పడివుంటే ఇద్దరమూ భార్య భర్తలుగా వుంటాము. కాదంటారా చట్టబద్దంగా విడిపోదాం. అంతే తప్ప పిచ్చిపిచ్చి వేషాలు వేస్తె వూరుకునేది లేదు."
    గట్టిగా వార్నింగ్ ఇచ్చి చేతిలోని స్వీట్ ను కిటికీలో నుంచి బయటకు గిరాటు వేసింది.
    సింహాచలం నోరు వెళ్ళబెట్టుకుని చూస్తుండి పోయాడు.
    ధీమాగా పెట్టె మంచం ఎక్కి ముసుగుతన్ని పడుకుంది కలియుగ సాద్విమణి స్వప్న.
    

                                                         *    *    *


    రాజమండ్రి రైల్వే స్టేషన్........
    ఇన్ స్పెక్టర్ ధీరజ ట్రైన్ దిగి వడివడిగా రైల్వే పోలీస్ స్టేషన్ వేపు అడుగులు వేసింది.
    మెరుపు వేగంతో వచ్చిన , ఆమెను గుర్తించిన సెంట్రీ కానిస్టేబుల్ ఖంగారుగా సెల్యూట్ చేశాడు.
    ధీరజ హుందాగా లోనికి నడిచింది.
    రాజమండ్రి ఇన్ స్పెక్టర్ ఆమెను సాదరంగా ఆహ్వానించాడు.
    ధీరజ తను వచ్చిన పని చెప్పింది.
    "ఒకే మేడమ్ -----నా జీప్ లో వెళ్ళండి. మీకు తోడుగా ఇద్దరు కానిస్టేబుల్స్ ను తీసుకెళ్ళండి. కావలసిన అడ్రస్ ను వెదకడంలో సహాయపడతారు" చెప్పాడు ఎస్. ఐ.
    ఆ ఇద్దరు కానిస్టేబుల్స్ ను తీసుకుని జీప్ లో టవున్ లోకి బయలు దేరింది ధీరజ.
    అడ్రస్ పూర్తిగా దొరకకపోవడం వలన రాజమండ్రిలో ఉంటున్న రాదాదేవి ఇల్లు కనుక్కోవడం ఒక పట్టాన సాధ్యం కాలేదు. ఇల్లు వెదికే కార్యక్రమాన్ని ఆ ఇద్దరికీ అప్పజెప్పి, తను మాత్రం విశ్రాంతి కోసం రైల్వే రిటైరింగ్ రూమ్ తీసుకుంది ఇన్ స్పెక్టర్ ధీరజ.
    "మేడమ్ ......అడ్రస్ తెలిసింది" అంటూ సాయంత్రం ఐదు గంటలప్పుడు వచ్చారు ఆ ఇద్దరు కానిస్టేబుల్స్.
    అప్పటికే ఫ్రెష్ గా స్నానం చేసి, యూనిఫాం వేసుకుని వెళ్ళడానికి రడీ అవుతుందామె.
    అంతకుముందే రాధాదేవి ఇల్లు చూసి రావడం వలన ఈసారి డైరెక్ట్ గా ఇంటి దగ్గరకు తీసుకెళ్ళారు కానిస్టేబుల్స్.
    ఒక మధ్య తరగతి ఇల్లు అది.
    డోర్ నెంబరు సరిగా కనిపించడం లేదు. అందుకే ఆ చిరునామాను సంపాదించడం కోసం ఆ సిటిలో అంత కష్ట పడవలసి వచ్చింది.
    ఎదురుగా ఇన్ స్పెక్టర్ ధీరజను ,  కానిస్టేబుల్స్ ను చూడగానే రాధాదేవి ఖంగుతిన్నది.
    ఏం జరిగిందో అర్ధం కాలేదామెకు. వాళ్ళ వేపు అయోమయంగా చూసింది.
    "రాధాదేవి నువ్వే కదూ....."
    ఇన్ స్పెక్టర్ ధీరజ జవాబు కోసం క్షణం ఆగింది.
    'అవును నేనే మీరు మీరు?"
    రాధాదేవి వేపు పరిశీలనగా చూసింది ధీరజ.
    "మీకేం కావాలి మేడమ్ ?" తత్తరపడుతూ అన్నది.
    "మీవారు కావాలి ఇంటిలో వున్నారా?"
    రాధాదేవి గతుక్కుమన్నది.
    తన భర్త కోసం ఇన్ స్పెక్టర్ రావడం ఏమిటి? తన భర్త ఏమైనా నేరం చేసి వుంటాడా? తన ఇంటికే సరాసరి వచ్చి అయన కావాలి అని అడిగే తీరుని బట్టి చూస్తే తను రెండవ పెళ్ళి చేసుకున్నానే వివరాలు అన్నీ సేకరించి వుండాలి. తప్పనిసరిగా సీతాపతి తన భర్త అని తెలిసే వచ్చి వుండాలి. ఏం చెబితే ఏం తంటా వస్తుందో నని సంశయం ఆమెను పీడించసాగింది.
    "ఏమిటా ఆలోచిస్తున్నారు?" ఇంటిలో వున్నారా లేరా?"
    "అదా! అది" నీళ్ళు నములుతున్నది.
    "కమాన్ స్పీక్ మీవారు ఎక్కడకు వెళ్ళారు?"
    ఆ కమాండ్ కు మరింత బెంబేలు పడిపోయింది రాధాదేవి.
    ఆమెకు తెలియకుండానే బొటబొటా కన్నీరు....
    "మిసెస్ రాధాదేవి ఎందుకా ఏడుపు? నేనేం అన్నానని యిప్పుడు? మీవారు ఎక్కడకు వెళ్ళారు అని అడుగుతున్నాను. అంతే తప్ప నేనేం అడిగానని?' ఆమె భయపడుతోందని గ్రహించి ఈసారి అనునయిస్తూ అడిగింది ధీరజ.
    "మరి! మరి!"
    "మమ్మల్ని చూసి నువ్వు భయపడనక్కరలేదు. నువ్వు సీతాపతికి రెండవ భార్యవని తెలిసే వచ్చాను. తన భర్త కనిపించటం లేదని అతని మొదటి భార్య లలిత కంప్లయింట్ యిచ్చింది. మా పరిశోధనలో నీ విషయం తెలిసింది. ఆమె మీద కోపం వచ్చినప్పుడల్లా నీ దగ్గరికే వస్తాడనీ నిన్ను పెళ్ళి చేసుకున్నాడనీ వైజాగ్ లో కంటే నీ దగ్గరే ఎక్కువ రోజులు వుంటాడని మా దర్యాప్తులో తేలింది. అదీ గాకుండా తన భర్త కనిపించకుండా పోవడం వెనుక నువ్వే ఏదో చేసి వుంటావని లలిత స్టేట్ మెంట్ యిచ్చింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS