నాక్కావల్సిన మార్పు వచ్చింది ఆమెలో.
"ఈ లాకెట్ నీకెక్కడిది?..... చెప్పవూ ప్లీజ్....." అన్నాను కంఠంలోకి మార్దవాన్ని తెచ్చుకొంటూ.
"ఎందుకు?"
"చాలా బావుంది.....ఎక్కడిది?"
"........."
"ఈ లాకెట్ నీ కెవరిచ్చారో చెప్పవూ-?" చెయ్యివేస్తూ లాలనగా అడిగాను.
"కాంతమ్మ ఇచ్చింది".
"కాంతమ్మ ఎవరు?"
కాంతమ్మ కంపెనీ తెలీదా? చౌక్ లో. నేనక్కడే వుంటున్నాను- అబ్బా చెయ్యి తియ్యి.....ఉహుఁ....నిజంగా తీసెయ్యకు".
ఇక వినటానికి అక్కడ లేను. ఒక్క అంగలో తలుపు తీసి బయటకొచ్చి, చెక్క మెట్లు విరిగిపోతాయా అన్నంత వేగంగా క్రిందికి దిగేను.
8
ఆకాశం అంతా మేఘావృతమై వుంది. అప్పుడప్పుడు మెరుస్తోంది. వర్షం పడేలావుంది.
"కాంతమ్మ కంపెనీ ఎక్కడ?"
రిక్షావాడు నావైపు వింతగా దూరంగా వున్న పెంకుటిల్లు చూపించేడు అటు పరుగెత్తేను.
మిగతా ఇళ్ళకి కొంచెం ఎడంగావున్న ఎత్తు ఆరుగుల ఇల్లు అది. అంతా చీకటిగా వుంది. మెట్లముందు రొప్పుతూ నిలబడ్డాను. నుదుటిమీదకు చెమట కారుతోంది. గుండె వేగంగా కొట్టుకొంటోంది. అడుగు ముందుకు వేసి మెట్లు యెక్కబోయేను.
"ఎవరు కావాలి?" బొంగురుగా వినిపించింది. ఆగి తలెత్తిచూసేను. అరుగుమూల ఒక ఆరడుగుల మనిషి భయంకరంగా నిలబడి వున్నాడూ గళ్ళలుంగీ, బనీను, చేతిలో కర్ర నిటారుగా పట్టుకొన్నాడు.
"ఎవర్లేరు ఇప్పుడు. గంట ఆగిరా_"
"నాకు, నాకు కాంతమ్మ కావాలి".
ఫెళ్ళున నవ్వేడు. మట్టి పెళ్ళక్రింద పడుతున్నట్టుంది ఆ ధ్వని. లోపలి తొంగి చూసి, "పిన్నీ- నీ కోసం ఎవరో వచ్చేరేవ్- పదిసంవత్సరాల తర్వాత -" మళ్ళీ బిగ్గరగా నవ్వాడు.
హరికేన్ లాంతరుముందు ఓ నలభై అయిదేళ్ళ స్త్రీ కూర్చొని వుంది. లావుగా స్థూలాకారంలో ఉంది. ముందు పళ్ళెంలో ఆకులు పెట్టుకుని ఒకటోకటే నవుల్తోంది. నన్ను చూసి జారినపైట సరిచేసుకోకుండానే "ఏం కావాలి?" అంది.
చాలా టెన్షన్ గా వుంది. నాకు నరాలు పగిలిపోతాయేమో నన్నంత టెన్షన్. నన్ను నేను కంట్రోలు చేసుకోవటానికి ఠాకూర్ చెప్పిన ఏ విద్యా ఉపయోగపడటం లేదు. చేతివేళ్ళు వణకటం నాకే స్పష్టంగా తెలుస్తోంది. అతికష్టంమీద నా స్వరాన్ని అదుపులోకి తెచ్చుకున్నాను. అరచేతితో లాకెట్ పట్టుకొని ఆమె కళ్ళముందు ఆడిస్తూ "ఇదెక్కడిది నీకు?" అన్నాను ఆ నీరసంలో నా కంఠం ప్రతిధ్వనించింది.
ఇంతలో నా వెనుకగా చప్పుడయింది. వెనక్కి చూసేను- రూంలో నాతో గడిపిన అమ్మాయి గదిలోకి వచ్చి మౌనంగా మా యిద్దర్నీ చూడసాగింది.
"చెప్పు - నాకు సమాధానం వెంటనే కావాలి".
"ఏం చెప్పాలి?"
"ఈ లాకెట్ ఎక్కడిది?"
"కొనుక్కున్నాం" వెటకారం ధ్వనించింది.
"ఎక్కడ?" కొద్దికొద్దిగా సహనం కోల్పోతున్నాను.
"అవన్నీ నీకెందుకు?" తలతిక్కగా అంది.
"కావాలి-" అరిచేను.
"అర్థరాత్రిపూట ఇంట్లోకొచ్చి ఏవిటీ గొడవ....." ఆమె మాటపూర్తి చెయ్యకుండానే "కాంతమ్మా-" అని అరిచేను.
"నాకెక్కువ సమయం లేదు, నా ఓర్పుని పరీక్షించటం అంత మంచిది కాదు. ఇదిగో ఈ లాకెట్ తీసుకో, కానీ ఇదెక్కడ్నించి వచ్చిందో చెప్పటం నీ ఆరోగ్యానికి మంచిది చెప్పు".
ఆమె క్షణం నాకేసి తదేకంగా చూచి, 'జగ్గూ' అని కేకేసింది. నన్ను మొదట పలకరించినవాడు లోపలి వచ్చేడు.
"చూడు, ఈ కుర్రోడు ఏదో గొడవచేస్తున్నాడు, బయటకు పంపు" అంది. వాడు నా దగ్గరకు వచ్చి నవ్వి, 'ఏం బుల్లోడా' అన్నాడు. నేను పట్టించుకోకుండా ఆమెతో 'నేనేం గొడవ చెయ్యను కాంతమ్మా! ఈ లాకెట్ ఎక్కడ దొరికిందో చెప్పు. వెళ్ళిపోతాను' అన్నాను. ఆమె వాడివైపు చూసి ఏదో సైగచేసింది. నా మెడచుట్టూ చేయివేసి బలంగా ముందుకు తోసేడు. వెళ్ళి కాళ్ళముందు పడ్డాను. పెదవిచిట్లి రక్తం ఉప్పగా తగిలింది. ఆ అమ్మాయి జాలిగా నాకేసి చూస్తోంది. చేతులమీద నెమ్మదిగా లేచేను; వాడి దగ్గరగా వెళ్ళేను. నాకన్నా చాలా పొడుగ్గా వున్నాడు, ఐనా అదేమంత పెద్ద సమస్యకాదు? నేను దగ్గరకు రాగానే నవ్వి మెడమీద చరచడానికి చెయ్యి ఎత్తేడు.
అదే వాడుచేసిన పొరపాటు.
భుజానికి క్రిందుగా గూడిపక్కన ఉండే నరంమీద అరచేతిని చాకులా చేసికొట్టాను; నోట్లోంచి అరుపుకూడా రాకుండా ముందుకుపడ్డాడు, పడతాడని నాకు తెలుసు. కుడి కాలుని పొజిషన్ లో ఉంచుకొన్నాను. సరిగ్గా మొహం పాదం మీదకొచ్చి పడింది. చిన్న జర్కుతో పాదం కదిలింది.
ప్రత్యర్థి ముక్కుదూలం విరిగిందనీ, ఇక జీవితంలో అది మళ్ళీ మామూలు షేప్ లోకి రాదనీ తెలుసు నాకు! కానీ యుక్తాయుక్తాలు విచారించే స్థితిలో లేను.
హరికెన్ లాంతరు పక్కన శవంలా పడివున్నాడు వాడు. కాంతమ్మ నావైపు భయంగా చూస్తూ అడుగు వెనక్కి వేసింది. మూలగా నిల్చున్న అమ్మాయివైపు చూసేను. మా చూపులు క్షణంసేపు కలుసుకున్నాయి. పెదవులు విడివడనట్టు నవ్వింది ఆమె. ఈ అమ్మాయిల్ని వీడు చాలా బాధపెడ్తూ వుండాలి.
కాంతమ్మవైపు తిరిగి "ఇప్పుడన్నా చెప్తావా" అడిగాను.
"ఏం చెప్పను అంది సన్నగా. ఇంతకు ముందున్న దర్పం ఆ కంఠంలో లేదు.
"ఈ లాకెట్ ఎలా వచ్చింది నీకు?"
"ఎక్కడ్నించో ఒకత్తె కంపెనీకి వచ్చింది. దాని మెళ్ళోది వదిలేసి వెళ్ళి పోయింది."
నా దవడ కండరం బిగుసుకొంది. ఊపిరి బిగపట్టి "ఎవరు ఆమె?" అడిగాను. నా కంఠం భయంతో వణికింది. ఎంత ఘోరమైన విషయమైనా వినటానికి సిద్ధంగా సర్వేంద్రియాల్నీ కూడగట్టుకున్నాను.
"జ్ఞాపకం లేదు! ఎవరో వస్తుంటారు, పోతూ వుంటారు. అందర్నీ గుర్తు పెట్టుకోవటం కుదర్దు".
ఆమె దగ్గరగా వెళ్ళేను. "నాక్కావాలి, గుర్తు తెచ్చుకో....." కఠినంగా అన్నాను.
"అబ్బో, ఇప్పటిమాటా? ఎన్నాళ్ళయిందో! గొలుసొదిలేసి వెళ్ళిపోయింది. ఈ రోజు దీన్ని వేసుకొని వెళ్ళమన్నాను, అనకున్నా సరిపోయేది" గొణిగింది.
రెండు చేతుల్లో ఆమె గొంతు పట్టుకున్నాను, "జ్ఞాపకం చేసుకుని చెప్పు. లేకపోతే ఈ రోజు నా చేతిలో నీ చావు తప్పదు".
నా చేతుల మధ్య గింజుకోసాగింది. ఇంకొంచెంసేపు వుంటే ఏమయ్యేదో తెలీదు. కానీ అంతలోనే మూలనున్న అమ్మాయి కంఠం సన్నగా వినిపించింది.
"నాకు తెలుసు".
మెడ వదిలేసి ఆమె వైపు తిరిగేను.
"నాకు జ్ఞాపకం వుంది."
ఆ గదిలో చీమ చిటుక్కుమంటే వినిపించేటంత నిశ్శబ్దం అలుముకొంది. చప్పున తేరుకొని "ఎవరామె" అడిగాను."
"పార్వతి అని......."
దూరంగా ఎక్కడో గట్టిగా ఉరిమింది? వాన ధారలు ధారలుగా పడుతోంది. బయట మెరిసినప్పుడల్లా గది వెలుతురుతో నిండిపోతోంది. కాంతమ్మ బిక్కు బిక్కుమంటూ చూస్తోంది. ఆ అమ్మాయి ఏదో చెబుతోంది. నేను..........
నేను.........
నాలో నేను.
అసలామె మాట్లాడేది ఏవీ వినిపించటంలేదు. పార్వతి! నాతో అడవిలో దాగుడుమూతలు ఆడుకొనే పార్వతి.... చిలిపి చిలిపి తగాదాలకు అమ్మ దగ్గరకు వెళ్ళి ఫిర్యాదుచేసి వెక్కిరించే పార్వతి.....ఈ అంధకార కూపంతో.... ఈ రౌడీల ప్రాపకంలో ఎంత విషాదంగా బ్రతుకు వెళ్ళబుచ్చిందో..... నా చుట్టూ ప్రపంచం గిర్రున తిరగసాగింది. నిలద్రొక్కుకోవటానికి చాలా శక్తి కూడగట్టుకోవలసి వచ్చింది.
పార్వతి..... పార్వతి....ఎక్కడుంది యిప్పుడు?" నా కంఠం నాకే బలహీనంగా వినిపించింది.
"మాకు తెలియదు......"కాంతమ్మ అంది.
కృంగిపోయేను. "వెళ్ళిపోయి ఎంతకాలం అయింది"
"నాల్గయిదు సంవత్సరాలయింది....."
"ఎక్కడికి వెళ్ళింది?"
"తెలీదు-పారిపోయింది".
"అయిపోయింది. వున్న ఒక్క ఆధారమూ పోయింది. మళ్ళీ మొదట్నుంచీ వెతకాలి. అప్పటివరకూ బిగపట్టిన బలం అంతా జారిపోయినట్టయింది. ఒక్కసారిగా నిస్సత్తువ ఆవరించింది. బైటకు అడుగులు వేసేను.
"పార్వతి ఎక్కడుందో నాక తెలుసు" నెమ్మదిగా ఆ ఆమ్మాయి కంఠం వెనుకనుంచి వినిపించింది. గిరుక్కున వెనుదిరిగేను. ఒక్కసారిగా రక్తం మళ్ళీ వడివడిగా ప్రవహించటం మొదలు పెట్టింది. "ఎక్కడ..... ఎక్కడుంది?" ఆమె భుజాలు పట్టుకొని వూపేస్తూ దాదాపు అరిచేను.
"నాలుగు రోజులక్రితం హాస్పిటల్లో చూసేను. ఆ పరిసరాల్లోనే వుందట".
ఆ మాత్రం ఆధారం చాలు. ఎక్కడున్నా వెతికి పట్టుకోగలను. బయటకు పరుగెత్తేను. వర్షం ధారగా కురుస్తూంది క్షణం అరుగుమీదే నిలబడ్డాను.
-ఈ రాత్రి ఈ వర్షంలో ఎక్కడని వెతకను?
కాని వెతికి తీరాలి!
విధి నాతో ఇంత కర్కశంగా దాగుడుమూత లాడుతుందని అనుకోలేదు నేను. విధే కాదు - మూడుకోట్ల దేవతలు ఎదురొచ్చినా నా ప్రయత్నాన్ని విరమించ దల్చుకోలేదు అడుగు ముందుకేసేను. వర్షపుజల్లు మొహాన్ని తడిపేసింది. ఇంకో మెట్టు దిగేను.
"నేనూ వస్తాను" వెనుకనుంచీ వినిపించింది ఆగి వెనక్కి చూసేను తెల్లచీరమ్మాయి!
` "ఎక్కడికి?" అర్థంకానట్లు అడిగేను.
"మీతోపాటు వెతకటానికి-"
"వీల్లేదు" కాంతమ్మ అరిచింది. ఆమెవైపు ఒకసారి తిరస్కారంగా చూసి, "పదండి" అంది నాతో. వెనుకనించి కాంతమ్మ "ఇదెక్కడి ఖర్మరా భగవంతుడా" అని రోదిస్తూంది. ఇద్దరం కదిలేం.
"మీరు పార్వతిని గుర్తుపట్టలేరు. నేనూ వుండటం చాలామంచిది" మెట్టు దిగింది.
"కానీ ఈ వర్షంలో......."
"ఆమె తొందరగానే కనబడుతుందని నాకు నమ్మకం వుంది" అని ఆగి నెమ్మదిగా- "మీరు ఆమెకోసం చూపిస్తున్న ఆతృత చూస్తూంటే, మీ సాన్నిధ్యంలో ఆమె సుఖపడుతుందని అనిపిస్తోంది?" అది ఆ కంఠంలో నాకర్థంకాని భావం ఏదో వినిపించింది. "ఆమె అంటే నీకెందుకు అభిమానం".
"మేం కలిసివున్న రోజుల్లో 'చెల్లి' అని పిలిచేది అంతే....."
మరి మాట్లాడలేదు నేను, రిక్షా ఎక్కి 'హాస్పిటలుకి' అన్నాను. బేరమాడకుండానే రిక్షా నెమ్మదిగా కదిలింది. వర్షం ఆగి ఆగి కరుస్తోంది. చలికి ముడుచుకొని కూర్చుని వుంది. ఆమె కొద్దిగా వణుకుతోంది. ఏమవుతుంది ఈమె నాకు? ఎందుకోసం ఈ వర్షంలో- ఎముకలు కోరికేసే ఈ చలిలో నాతో వస్తోంది? విశ్వజననీయమైన ప్రేమని స్త్రీలో ఎక్కడో అమరుస్తాడు కాబోలు దేవుడు. ఆప్యాయతతో ఒక్కసారిగా నా హృదయం నిండిపోయింది. హొటల్ గదిలో నా ముందు నగ్నంగా నిల్చొన్న వ్యభిచారిణిలో ఒక స్త్రీ హృదయాన్ని ఒక ప్రేమమూర్తిని చూడగలుగుతున్నాను. తరచి చూస్తే మానవ హృదయంకన్నా గొప్పది లేదు.
