Previous Page Next Page 
శారదా అశోకవర్ధన్ కథలు పేజి 11

                                                         11.  ఆగు !
    నందకిషోర్ కి తన పేరు అచ్చులో చూసుకోవాలన్న కోరిక రోజురోజుకీ తీవ్ర రూపం దాల్చి వేదించసాగింది. ఏదైనా సొసైటీ పెట్టి తాను లీడర్ గా నుంచుని ఆ కార్యక్రమాన్ని నిర్వహించాలనుకున్నాడు. ఎంతకీ ఏం సొసైటీ పెట్టాలో అర్ధంకాలేదు. ఏదో ఒక యూనియన్ తయారుచేద్దామనుకున్నాడు. అదీ వీలుపడలేదు. చివరకి ఎవరితోటీ గొడవలేకుండా తనంతట తను కథలు రాసి పత్రికలకి పంపితే హాయిగా తనపేరు అచ్చులో చూసుకోవచ్చుననుకున్నాడు. మనసు తేలికపడింది. రకరకాల సమస్యల గురించీ, దరిద్రుల గురించీ, హక్కుల గురించీ ఎన్నో ఎన్నో ఆలోచించడం మొదలెట్టాడు. అతికష్టంమీద ఆలోచనలనీ, అక్షరాలనీ కలిపి, అనేక వార మాసపత్రికలకు  పంపాడు. అయితే నెల తిరక్కుండా  అన్నీ తిరిగొచ్చాయి. దాంతో బాధ మరీ ఎక్కువయిపోయింది నందకిషోర్ కి. బజారుకెళ్ళి ఊళ్ళో వున్న అనేకరకాల పత్రికలనన్నీ  కొనుక్కొచ్చేశాడు. రోజుకో సినిమా  వీడియోలో  క్యాసెట్టు  పెట్టుకుని చూశాడు. ఏదో స్పురించినవాడిలా తృప్తిగా  నిట్టూర్చాడు. తాను కొన్న పత్రికలలో, చూసిన వీడియో చిత్రాలలో అన్నింటిలో  అతనికి ప్రధానంగా కన్పించినవి హింస, సేక్క్సు మాత్రమే! వెంటనే  తన కలానికి పదునుబెట్టి, చక్కటి సెక్సు కథ రాయడానికి నిశ్చయించుకున్నాడు.
    పన్నెండేళ్ళ  స్కూలు విద్యార్ధి, తన లెక్కల టీచర్ పాతికేళ్ళ యువతిని ప్రేమించడం, ఆమె పాఠాలు చెబుతూ  వుంటే ఆమెను నగ్నంగా ఊహించుకోవడం, మెల్లగా  ఆమెతో స్నేహం చేసి, ఆమెతో మాట్లాడుతూ తృప్తిపొందడం, ఆ పిల్లాడి పిచ్చి ఊహలకి మొదట్లో  ఆ టీచరు కోప్పడ్డా, క్రమేణా ఆ పిల్లవాణ్ణి మార్చే పద్దతిలో తనే ఆ పిల్లాణ్ణి ఒక్కరోజు  చూడకపోతే అదోలా అయిపోవడం, ఆ తరవాత మెల్లగా ఆ పిల్లాడు ఆమె యింటికి వెళుతూ  వుండడం, ఒకసారి ఆమె స్నానం చేస్తూవుంటే, బాతురూము కిటికీలోనుంచి  ఆ అబ్బాయి, ఆమెని నగ్నంగా చూసి ఏవేవో ఊహించేసుకుని తన్మయత్వంలో  వుండగా, ఆమె బాతురూము తలుపు తీసుకునొచ్చి, అతడిని చూసి సిగ్గుతో మొగ్గలా ముడుచుకుపోవడం వగైరా ఇతివృత్తంతో 'పసివాడి ప్రేమగోల' అంటూ కథ రాసి ఓ వారపత్రికకి పంపించాడు నందకిశోర్. పక్షంరోజులు గడవకుండా అచ్చయిన వారపత్రిక కాపీ నందకిశోర్ చేతిలో పడింది. పసివాడు ఆశగా చూస్తున్న చూపులూ, ఆమెగారు నగ్నంగా జలకాలాడడం  పెద్ద పెద్ద బొమ్మలతో చిత్రించారు. ఆ బొమ్మలు చూసి నందకిశోరే సిగ్గుపడ్డా  తన పేరు రచయితగా అచ్చులో చూసుకుని  మురిసిపోయాడు. కొందరు మిత్రులూ, శ్రేయోభిలాషులూ "ఏంటయ్యా అలా రాశావ్? తప్పుకదూ?" అని చిన్నగా మందలిస్తే "ఈ రోజుల్లో పసివాళ్ళకి కూడా సెక్స్ ఎడ్యుకేషన్ చాలా అవసరం! అందుకే 'క్లాసు పుస్తకాల్లో కూడా సెక్స్ ఎడ్యుకేషన్ ని ప్రవేశ పెట్టాలి' అని కొందరి పెద్దల సలహాలని ఆమోదిస్తూ ఈ కథ రాశాను. ప్రచురించిన పత్రికకు నా ధన్యవాదాలు" అంటూ  సమాధానం చెప్పేడు నందకిశోర్.
    "అబ్బాయ్! నువ్వు కథ రాశావంటే  ఎంతో సంతోషపడిపోయి  ఆ పత్రిక తెప్పించుకుని  చదివానురా! కానీ, అలా రాశావేమిటి? జీవితం గురించీ, సంసారాల్లో అనేక సంఘర్షణల గురించీ, ప్రకృతి గురించీ, భక్తీ, రక్తీ ఏదో రాస్తావనుకున్నాను. కానీ ఇలా బూతు రాస్తావనుకోలేదు. చివరికి నువ్వు చెప్పిందేమిటిరా? అభం శుభం తెలీని ఆ పిల్లాడు ఆత్మహత్య చేసుకుంటాడు. అతడు చేసిన పని తప్పు అని చెప్పడానికి, ఆ పిల్లాణ్ణి అలా సృష్టించి, చివరకి చంపేశావు. ఇలాంటి కథలు రాయకురా! ఊళ్ళో వాళ్లు నానా రకాలుగానూ చెప్పుకుంటూ వుంటే సిగ్గేస్తోంది"  అని రాసింది నందకిశోర్ ని కన్నతల్లి అరవింద.
    అతని తల్లి సలహా కూడా నచ్చలేదు. మరో వారం పత్రికలో కథ చాలా బాగుందంటూ  యువకిశోరాలు రాసిన ఉత్తరాల పరంపర నందకిషోర్ ని పారవశ్యంలో ముంచేసింది. 'పసి ప్రేమ' - 'పిల్లల్లో కామాయణం' 'శృంగార రాత్రులు' ఇలా పరంపరగా కథలు  రాసెయ్యడం మొదలెట్టాడు. అన్నీ చక్కటి బొమ్మలతో అచ్చవుతున్నాయి. ఇప్పుడు నందకిషోర్ పేరు అచ్చులో కొన్ని వందల సార్లొచ్చుంటుంది. రచయితగా  ముద్ర పడ్డాడు. కొన్ని సాంస్కృతిక సంస్థలు  అతనికి సన్మానాలు కూడా చేశాయి. నందకిషోర్ కి చెప్పలేని ఆనందం!
                                                             *    *    *
    నందకిషోర్ ఆఫీసు రూంలో కూర్చుని ఏదో రాసుకుంటున్నాడు. ఫోను గణ గణా మోగుతూ  వుంటే విసుక్కుంటూ ఫోన్ తీశాడు. "ఏమండీ! మీరు అర్జెంటుగా ఇంటికి రండి. కొంప మునిగిపోయింది" అంది నందకిషోర్ శ్రీమతి నవ్య. 
    "ఏమయింది చెప్పు?" కంగారుగా అడిగాడు.
    "ఫోనులో నేనేమీ చెప్పలేను. వెంటనే ఇంటికి రండి." ఫోన్ లో ఆమె ఏడుస్తున్నట్టు  అర్ధమయింది.
    "ఏమయిందోయ్? ఎందుకా ఏడుపు....?" ఏదో చెప్పబోతూండగానే ఠక్కున  ఫోన్ పెట్టేసింది ఆమె.
    "నవ్యా....నవ్యా...." అంటూ, ఫోన్ పెట్టేసిందని తెలుసుకుని  కంగారుగా ఇప్పుడే వస్తానని ఆఫీసులో చెప్పి, ఇంటికి బయల్దేరాడు.
    ఇల్లు చేరిన నందకిషోర్ ఖంగు తిన్నాడు - ఇంటికి వేసి వున్న పెద్ద తాళం కప్పను చూసి.
    పక్కింటావిడొచ్చి  "మీ బాబు పవిత్రన్ ని ఆసుపత్రికి తీసుకెళ్ళింది మీ ఆవిడ" అంది.
    "ఏమయింది?"
    "ఏమో తెలియదు. స్పృహ కోల్పోయాడు".
    "ఏ ఆసుపత్రికి వెళ్ళిందో తెలుసా?"
    "ఆఁ .... నిమ్స్ కి తీసుకెళుతున్నానంది. మీరొస్తే అక్కడికి రమ్మంది."
    నందకిషోర్ కి చెమటలు పోశాయి. 'ఏముయింది తన బాబుకు!' కాళ్లు వొణికాయి. కొంపదీసి ప్రాణాపాయం ఏమీ లేదు కదా? వెంటనే స్కూటర్ స్టార్ట్ చేసి యమ స్పీడులో నిమ్స్ చేరుకున్నాడు.
    ఏం చూడవలసొస్తుందో, ఎటువంటి వార్త వినవలసి వొస్తుందోనని  గుండె చేతులో  పట్టుని అడుగులో అడుగు లేసుకుంటూ  లోపలికి వెళ్లాడు, పిల్లలవార్డు ఎక్కడుందో కనుక్కుంటూ.
    ఆరో అంతస్థులో ఆరువందల పద్నాలుగో గదిలో  స్పృహ లేకుండా పడున్న  పవిత్రన్ కి 'సెలైన్ ' ఎక్కిస్తున్నారు డాక్టర్లు.
    "నందూ...." అంటూ అతని భుజాలు పట్టుకుని గొళ్లున ఏడ్చింది నవ్య.
    "ఏం జరిగింది? మన బాబుకి ఏమైంది?" నవ్యని ఓదారుస్తూ  అడిగాడు నందకిషోర్.
    డాక్టర్లు బయటకెళ్ళి  మాట్లాడుకోమనడంతో, నవ్యా నందూ బయటికొచ్చి వరండాలో నుంచున్నారు.
    "వీడు రోజూ బడికెళ్ళి బాగా చదువుకుంటున్నాడనుకున్నాను. స్కూల్లో ఇంత పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నాడని అనుకోలేదు." ఏడుస్తూ చెప్పింది.
    "ఏం జరిగింది?"
    "వాళ్ళ తెలుగు టీచరు సౌందర్యని వీడు పిచ్చిపిచ్చిగా చూడటం, వెకిలిగా నవ్వడం చేస్తున్నాడట ఏదో కుర్రాడులే అని ఆమె పట్టించుకోలేదుట. ఇవ్వాళ 'నిన్ను నేను ప్రేమిస్తున్నాను. నిన్ను నగ్నంగా చూడాలని వుంది. ముఖ్యంగా స్నానంచేస్తూ వుంటే నీ వొంటిమీద నుంచి ముత్యాల్లా రాలే నీటి బొట్లను చూడాలని వుంది. అంతేకాదు, ఆ నీటితో నేనూ స్నానం చెయ్యాలని వుంది.....' ఇంకా ఏమిటేమిటో నా బొంద.....రాశాడట!"
    "..............."
    "ఆ ఉత్తరం చదివి ఆవిడ వీణ్ణి పిలిచి ఆ చెంపా ఈ చెంపా వాయించి ప్రిన్సిపాల్ గారికి ఈ ఉత్తరం చూపించిందట. ఆయన వీణ్ణి స్కూల్ నుంచి డిస్మిస్ చేశాడు. అందరూ' మీరు రాసిన కథలో హీరో వీడేలాగుంది' అంటూ ఏడిపించారట. పరుగెత్తుకుంటూ  వెళ్ళి బండిమీద అమ్ముతున్న  ఎలుకల మందు ప్యాకెట్టు కొని నీళ్ళలో కలిపి తాగేశాడట. స్పృహతప్పి పడిపోయిన  వీణ్ణి ఎవరో పుస్తకాల మీద అడ్రస్ చూసి ఇంటికి పట్టుకొచ్చారు." అంది ఏడుస్తూ నందకుమార్ కళ్ళు గిర్రున తిరిగాయి. కాళ్ళకింద భూకంపం వొస్తున్నట్టు  తూలిపడిపోతున్నాడు. కల్తీవ్యాపారి తన కల్తీవస్తువులు ఇతరులు కొనుక్కుతింటూంటే, తన డబ్బులు లెఖ్క పెట్టుకుంటూన్నట్టు  తన చెత్త సాహిత్యంతో ఎందరు చెడిపోతున్నారో పట్టించుకోకుండా  తనదారిన తాను పోతున్నాడు. కానీ ఇప్పుడు తనకొడుకే తన ప్రభావానికి బలైపోతున్నాడని తెలిసి, ఆ నిజాన్ని భరించలేక పోతున్నాడు.
    డాక్టర్లు కంగారుగా లోపలకీ బయటకీ తిరుగుతున్నారు. ఏవేవో ఇంజక్షన్లు చేస్తున్నారు. ఒక నర్సు పవిత్రన్ జేబుల్లో ఈ కాగితం దొరికిందని చెప్పి, నందకిషోర్ కిచ్చింది. "నాన్నా! పిచ్చిపిచ్చికథలురాసి, బంగారంలాంటి బాలల భవిష్యత్తుని నాశనం చెయ్యకు. నా వయస్సు పదేళ్ళే! నీ కథలు దొంగతనంగా చదివిన నాకు ఇరవైఏళ్లలా అనిపించేది. అందుకే పద్దెనిమిదేళ్ళ సౌందర్యగారితో  అలా ప్రవర్తించాను. నన్ను క్షమించు - పవిత్రన్" అని వుంది అందులో.
    అంతలోనే నవ్య గొల్లుమంది.
    పరుగెత్తుకుంటూ  రూంలోకెళ్ళాడు నందకిషోర్.
    పవిత్రన్ తెల్లటిదుప్పటికింద కనబడడంలేదు.
    "బాబూ, పవిత్రన్!...." పిచ్చివాడిలా అరిచాడు నందకిషోర్, మంచం మీదపడి ఏడుస్తూ.
    డాక్టర్లు వెళ్ళిపోయారు, నాలుగు ఓదార్పుమాటలు చెప్పి. నర్సులు మిగతా ఏర్పాట్లు చేశారు.
    నవ్య ఈ లోకంలో లేదు! శూన్యంలోకి చూస్తోంది.
    నందకిషోర్ మన ధ్యాసలో లేడు!
    "మొట్టమొదటి కథ రాసిన రోజునే, ఒక స్త్రీగా నేను అలా రాయొద్దని అభ్యంతరం చెబితే ఇలా జరిగి వుండేదికాదు." గొణుక్కుంది నవ్య గుండె బాదుకుంటూ!
    "ఆగు! కలం విసిరెయ్!" ఎవరో హెచ్చరిస్తూన్నట్టనిపించి  దిక్కులు చూశాడు నందకిషోర్.
    అంతా శూన్యం!
    ఎవరోకాదు - ఆ చెప్పింది తన అంతరాత్మే!
                                                                                                           (వనితాజ్యోతి, 1994)


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS