Previous Page Next Page 
శారదా అశోకవర్ధన్ కథలు పేజి 10

 

                                                               10.  జ్యోతి
    హేమంతంలో ఒక సాయంత్రం!
    సంధ్యారాణి తన అందాలకి మెరుగులు దిద్దుకుంటూన్న వేళ.
    చందమామ సంధ్యతో సరాగాలు సలుపుతూ మబ్బుల పల్లకీలో ఊరేగుతూన్న వేళ!
    వెన్నెలతరంగాలు  సముద్రతరంగాలతో పోటీపడుతూ  పాలసముద్రం భూతలానికి దిగివచ్చినట్టున్న దృశ్యం!
    బీచ్ దగ్గరున్న హోటల్ "ఆహార్" విద్యుద్దీపాల మెరుపులతో ఆకాశంలోని తారలతో పోటీ పడుతూన్నట్టుంది. పెద్ద పెద్ద పడవలాంటి కార్లూ, వెడల్పాటి విమానాల్లాంటి కార్లూ, రంగురంగుల బొమ్మల్లాంటి కార్లూ ఎన్నో ఆ ఇసుకతిన్నెల కిరువైపులా పర్వతశ్రేణిని తిలకిస్తూన్నట్టుగా ఆగివున్నాయి. పట్టుచీరల రెపరెపలతో, పసందైన పంజాబీ దుస్తులతో, రంగురంగుల మిడ్డీలూ, జీన్సు, రకరకాల ఆధునికమైన దుస్తులతో అందాల పోటీవేదికలా మెరిసిపోతోంది హోటల్ ఆహార్! అందమైన దుస్తులతో, ఖరీదైన సూట్లతో ముదితలకు ఏమాత్రంతీసిపోము అలంకరణలో అన్నట్టు పురుషులు సయితం చక్కగా తయారై స్వయంవరానికొచ్చిన గంధర్వుల్లా  మెరిసిపోతున్నారు. రకరకాల్ ఆభరణాలు తిలకించాలన్నా, నవనాగరిక ప్రపంచాన్ని  ఒక నిమిషం మరో లోకంలో వుండిచూసి ఆనందిస్తూన్న అనుభూతి కలగాలన్నా ఆ రోజు హోటల్ ఆహార్ ముందు నుంచుంటే చాలు! అందరిని దూసుకుంటూ అందమైన  బ్లూ ప్లిమత్ కారు హోటల్ కారిడార్ లో కెళ్ళి ఆగింది. లోపల్నుంచి  మల్లెపువ్వులాంటి తెల్లని దుస్తులూ, ఎఱ్ఱని కుచ్చుటోపీ, నడుంకి బాగా బ్రాసోవేసి కుట్టి తళతళా మెరుస్తున్న బిళ్ళతో ఆజానుబాహుడు అయిన వెయిటర్ వాయువేగంతో వచ్చి  ప్లిమర్ కారు డోరు తెరిచి 'వెల్ కం మేడమ్' అన్నాడు. "థాంక్యూ" అంటూ వొయ్యారంగా కారు దిగింది ఫాల్గుణి. ఆమె కట్టుకున్న  ధవళవర్ణపు పట్టుచీర గాలికెగురుతూ మీగడతరగల్లా అనిపించింది. చెవుల రవ్వల దుద్దుల కాంతి తళుక్కుమంది. మెడలోని రవ్వలహారం విద్యుద్దీపాలు వెలవెలబోయేలా, పౌర్ణమి నాటి చంద్రుడిలా మెరిసిపోయింది. ఆమె వెనకే తాంబూరా పట్టుకుని ఒకరు, మృదంగం పట్టుకుని మరొకరు, చిడతలు, గజ్జెలు, వేణువు వయోలిన్ - ఇలా ఒక్కొక్కరే దిగి ఆమె వెనకే నడిచారు. నృత్య గాత్ర సంగీత సమ్మేళన్ వారు ఏర్పాటుచేసిన అపురూప కార్యక్రమం అది! సుప్రసిద్ధ గాయకుడు, గానగంధర్వ బిరుదాంకితుడు రజత్ గాత్రం! నాట్యమయూరి త్రిలోకసుందరి బిరుదాంకితురాలు ఫాల్గుణి నాట్యం! రెండుకళ్లూ చాలవన్నట్టు జనం విరగబడి కొనుక్కున్నారు టిక్కెట్లు. ఈ డబ్బుతో కాన్సర్ ఆసుపత్రి నిర్మించాలన్నది ఆ కార్యక్రమ నిర్మాతల, నిర్వాకుల ఉద్దేశం.
    భూతల స్వర్గంలో వెలిగిపోతూన్న ఆహార్ హోటల్లోని థియేటర్లో అడుగులు వేస్తూ వుంటే ఆమె కాలి మువ్వల అలికిడికి స్వరాలు పలికాయి!   ముందుగా రజత్ గాత్రకచ్చేరి. వేదికపై నుంచి చూశాడు ఫాల్గుణిని రజత్. దాదాపు నాలుగు వసంతాలు విదేశాల్లో  కంప్యూటర్ సర్వీసెస్ లోని శాస్త్రీయ విజ్ఞానంతో పాటు, తన కిష్టమైన శాస్త్రీయ సంగీతాన్ని అన్ని వాద్యాలను మన దేశంలోని వాద్యాలను అక్కడి వాద్యాలతో పోలుస్తూ అన్నీ నేర్చుకున్నాడు రజత్. చదువు, సంగీతం, సంస్కారం, అన్నీ వేటికవే పోటీపడుతూ సమపాళ్ళలో మిళితమై వున్న రజత్ మంచి అందగాడు కూడా! ఉంగరాల జుట్టూ, కండలు తిరిగిన బలిష్టమైన శరీరం, పచ్చని బంగారపు మెరుపులాంటి దేహచ్చాయ. గుండ్రటి మొహం, మగవారు కూడా అతనికేసి మళ్ళీ మళ్ళీ చూసేలా చేస్తుంది. భగవంతుడు తీరిగ్గా అతణ్ణి తయారుచేసి అన్నీ సమకూర్చి భూమ్మీదికి ఒదిలేడేమోననిపిస్తుంది! తెల్లటి సిల్కు పైజామా, లాల్చీలో అపరగంధర్వుడిలా కనిపించిన అతణ్ణిచూసి, చూపుమరల్చుకోలేకపోయింది ఫాల్గుణి.
    వేదిక పైన అతడు. వేదిక కింద మొదటి వరుసలో అతడికి ఎదురుగా ఆమె!
    అతడికి ఆమె__
    ఆమెకి అతడూ తప్ప వారికింకేమీ కనిపించడంలేదు!
    అందరి దృష్టి వారిపైనే!
    "ఎంత అందం!" కళ్ళు తిప్పుకోలేకపోతున్నాడతను.
    "ఏమి రూపం!" కళ్ళుప్పాగించిచూస్తోంది ఆమె.
    జనానికి వీరిరువురూ నయనానందమే!
    మైకులో అనౌన్స్ మెంటు పూర్తయింది.
    "వాతాపి గణపతిం భజే" మొదలెట్టాడు జనానికి నమస్కరించి రజత్. గోలగోలగా మాట్లాడుకుంటున్న  వారంతా ఒక్కసారిగా మూగబోయారు.
    ఫాల్గుణి కళ్ళు పెద్దవి చేసి చెవులు  రిక్కించుకుని వింటోంది. అతడి గొంతు పలికే భక్తిభావానికి ఫాల్గుణి తన్మయత్వంతో కళ్ళు మూసుకుంది.
    తరువాత మోహన!
    అతని ఆలాపనకి జనం పరవశించిపోతున్నారు.
    ఫాల్గుణి పులకరించిపోయింది.
    "నిన్నూ కో....రి..." వర్ణం.
    అతడు ఆమెనే చూస్తూ ఆమెకోసమే పాడుతూన్నట్లు ఆలపిస్తున్నాడు.
    ఆ చూపులకీ ఆ పాటకీ పారవశ్యంతో ఊగిపోతోంది ఫాల్గుణి.
    ఆమె కాళ్ళతో తాళం వేస్తోంది!
    ఆ కదలిక, ఆ గజ్జెల గలగలా అతడిని మరింత కదలించేస్తోంది!
    కల్యాణి, భైరవి - అలా ఒకదాని వెనుక ఒకటి అతడు పాడుతున్నాడు. ఆమె ఆ గానవల్లరిలో లీనమైపోయింది.
    దాదాపు రెండుగంటలు రెండు నిముషాల్లా గడిచిపోయాయి!
    సంగీత విభావరి పూర్తయింది. "కొంచెం సేపట్లో త్రిలోకసుందరి ఫాల్గుణి భరతనాట్యం తిలకిస్తారు" అంటూ అనౌన్స్ చేశారు. హాలంతా పావుగంటసేపు కరతాళధ్వనులతో మారుమోగిపోయింది.
    ఉలిక్కిపడి మైకంలోంచి  తేరుకున్నట్టుగా, గబగబా లేచి ఘల్లుఘల్లుమని అడుగులేసుకుంటూ, గ్రీన్ రూంవైపు వెళ్ళింది ఫాల్గుని. వేదిక దిగి చుట్టూ మూగి అభినందనలు తెలుపుతూన్న జనాన్ని చీల్చుకుని, ఆమె కోసం చూశాడు అతడు. చిరునవ్వుతో ఆమె అతడినే చూస్తోంది!
    అతడూ నవ్వేడు.
    ఆమె ఆనందంతో అతడి దగ్గరకి వెళ్ళింది.
    నాలుగు కళ్ళు కలుసుకున్నాయి!
    రెండు మనసులూ మాట్లాడుకున్నాయి!
    "యూ....ఆర్....గ్రేట్...." అంది మాటలు వెతుక్కుంటూ ఫాల్గుణి.
    "యూ ఆర్ బ్యూటిఫుల్!" అని అనాలనుంది అతనికి. కానీ మాట పెగలనట్టుగా, "థాంక్యూ" అన్నాడు, ఎలాగో అక్షరాలు  కూడబలుక్కుని.
    "మీరు నా ప్రోగ్రాంకి వుంటారుగా...." ఉండమని శాసిస్తున్నట్టుగా అంది.
    "మీరు చెప్పాలా?" అన్నట్టుగా "ఓ...." అన్నాడు అతడు.
    "మేకప్ చేసుకునే ఒచ్చాను. డ్రెస్ మార్చుకుంటే చాలు" అంటూ హడావుడిగా ముందుకెళ్ళింది ఫాల్గుణి.
    "కానీండి" అంటూ అడుగు ముందుకేశాడు రజత్.
    నరాల్లో కరెంటు ప్రవహించినట్టయింది! గుండె ఝల్లు మంది!
    మనసు ఎటోపోతోంది. ఇద్దరూ ఒకరినొకరు చూచుకుంటూ అలాగే వుండిపోయారు స్థాణువుల్లా కొన్ని క్షణాలు.
    వెంటనే తేరుకుని ఆమె గ్రీన్రూంలోకెళ్ళి పోయింది.
    అతడు ముందువరసలో ఇందాక ఫాల్గుణి కూర్చున్న సీటులోనే కూర్చున్నాడు. అతడిచుట్టూ ఆటోగ్రాపులకోసం జనం! ఫోటోగ్రాపులకోసం పత్రికల వాళ్ళు!
    అతని మనసు చుట్టూ ఆమె తాలూకు ఊహలపుట్టలు!
    కాలం స్తంభించి పోయినట్టుంది అతనికి.
    ఎయిర్ కండీషన్ ఆడిటోరియం ఉక్కగా అనిపించింది అతనికి.
    ఆటోగ్రాపులు సంతకం పెడుతూ ఫోటోగ్రాఫర్లకు ఫోజులిస్తున్నాడు. ఆ రకంగా అందరితో మాట్లాడే బాధ్యత తప్పుతుందని అతని ఉద్దేశం. ఎవ్వరితోనూ మాట్లాడాలని లేదు.
    ఆడిటోరియంలో లైట్లు తీసేశారు. వేదిక మీద జిలుగు వెలుగుల మధ్య వెయ్యి కాండిల్స్ బల్బులా వెలిగిపోతుంది ఫాల్గుణి. ఆమె వొంటిమీద చంద్రకాంతపు పువ్వురంగు డ్రెస్సు ఆమె అందాన్ని మరింత ద్విగుణీకృతం చేసింది.
    అతను రెప్పవాల్చకుండా  చూస్తున్నాడు.
    ఆమె చిరునవ్వుతో అతడికేసి చూస్తోంది.
    ముందుగా పూజానృత్యం.
    ఆమె అడుగడుగూ ప్రతి అడుగూ పులకరింతతో  చూస్తున్నాడు రజత్.
    ఆమె గజ్జెల గలగల అతని గుండెలో జిల్లుజిల్లుమంటోంది!
    "రారా నా సామి రారా.... రార జాగేల చేసేవురా.... ఇటు రారా...."
    జావళి! అతడు తేలిపోతున్నాడు, ఆ వొయ్యారాల వొంపుసొంపులకి.
    "భామనే....సత్యభామనే...." అతడు తాళలేకపోతున్నాడు ఆదర్పానికి!
    "కొలువైతిరా రంగశాయీ...." నిలవలేకపోతున్నాడు ఆ హావభావాలకి.
    "పలుకుతేనెల తల్లి పవళించెనే...." అతడు పిచ్చెక్కిపోతున్నాడు.
    ఆమెకు ఎవరు కనిపించడం లేదు - ఒక్క రజత్ తప్ప!....
    ఈ నాట్యం, ఈ లాస్యం, ఈ రూపం, ఈ తాపం, ఈ అడుగు,
    ఈ బతుకు అంతా నీకోసం అన్నట్టు అతణ్ణే చూసి మత్తెక్కిన మరాళిలా వేదికంతా ఒకటై, మనసంతా రజత్ కాగా పరవశించి నర్తిస్తోంది ఫాల్గుణి. హాలంతా కరతాళ ధ్వనులే! అవి మంగళ వాద్యాలుగా అనిపిస్తున్నాయి ఇరువురికీ. రెండు గంటలూ రెండు క్షణాల్లా కార్యక్రమం పూర్తయింది. ఒక్క అంగలో వేదిక చేరుకున్నాడు రజత్. ఆమె చేతులను తన చేతుల్లోకి తీసుకుంటూ, "కంగ్రాచ్యులేషన్స్, మార్వలెస్" అన్నాడు. ఆమె చేతులను వెనక్కి తీసికోలేదు. ఏదో శక్తి ఆ చేతులని అలాగే కట్టేసి నట్టనిపించింది.
    బరువెక్కిన కళ్ళతో "థాంక్స్" అంది మెల్లగా చిరుబొంగురుపోయిన  గొంతుతో.
    ఆ బొంగురు గొంతులో ఏదో మహిమ! ఏదో మత్తు! అతడు తేలిపోతున్నాడు.
    అశేష జనవాహిని వేదికపైకి  తోసుకువొస్తూంటే అదుపు చెయ్యలేక పోలీసులు వారిద్దరిని గదిలో పెట్టి గ్రీన్ రూమ్ తలుపులు మూసేశారు.
    "హమ్మయ్య" అనుకున్నారు రజత్, ఫాల్గుణిలు.
    ఆ ఏకాంతం, ఆ పరిసరాలు వారి భావాలకు తాళం వేశాయి. తలుపు లోపల నుంచి గడియవేసి ఆమెను తనివితీరా గుండెలకు హత్తుకున్నాడు.
    ఆమె ఒద్దనలేదు! ఎదురు చూస్తూన్న  విరహిణిలా అతడిని చుట్టేసింది!
    అలా ఎంతసేపు గడిచిందో - తలుపు కొట్టిన చప్పుడికి ఉలిక్కిపడుతూ గడియ తీశాడు.
    "రజత్! జనం వెళ్ళిపోయారు. ఇరువురు వారివారి కార్లదగ్గరకు వొచ్చారు.
    "రెండు కార్లెందుకూ? నా కారులో రండి" అంది ఫాల్గుణి మెల్లగా.
    వెంటనే అతనికార్లో తన వాద్య బృందాన్నీ ఆమె వాద్య బృందాన్నీ దింపమని డ్రైవర్ కి చెప్పేడు రజత్.
    అందరు వారి సఖ్యతకి, సమ్మేళనానికీ ఆశ్చర్యపోయారు.
    కారు కదిలింది.
    "ఎక్కడికి?" అడిగాడు రజత్.
    "మా ఇంటికి" అంది ఫాల్గుణి.
    కారు బంగళా ముందు ఆగింది. రజత్ కారుదిగి అంతా పరికించి చూశాడు. చక్కగా తీర్చిదిద్దిన పూలతోట..... అందమైన పాలరాతి కట్టడం, ఎత్తైన కొండ మీద ఆ మేడ, స్వర్గంలో ఇంద్రభవనంలా  వుంది. లోపలి కెళ్ళారు. గది గదిలో ఫాల్గుణి రకరకాల భంగిమలలో వున్న ఫోటోలు!
    "మీ ఇల్లూ మీలాగే ఎంతో అందంగా వుంది."
    "ఊ....మీ కన్నానా?" చిరునవ్వుతో అంది.
    అందమైన డ్రాయింగు రూం. పచ్చికలా పరచివున్న తివాసీ మీద నిర్మల్ టీపాయ్! డాన్సుపోజులో ఫాల్గుణి ఫోటోలు.
    భోజనాలగదిలో గుండ్రని నిర్మల్ టేబులు. అక్కడ ఫాల్గుని పాదాలు మాత్రం వున్న ఫోటో! ఆ పాదాల చుట్టూ వున్న మువ్వలు పాదాలకి వన్నెతెస్తున్నాయి. తదేకంగా చూస్తున్నాడు రజత్ అక్కడే ఆగిపోయి.
    "ఏంటలా చూస్తున్నారు" అడిగింది నవ్వుతూ ఫాల్గుణి.
    "ఏంలేదు. ఆ మువ్వలు ఎంత పుణ్యం చేసుకున్నాయో? నీ పాదాలని ఒదలని అదృష్టానికి నోచుకున్నాయి. 'మువ్వనైనా కాకపోతిని' అనుకుంటున్నాను." అన్నాడు.
    "అబ్బో! సంగీతమే అనుకున్నాను. సాహిత్యం కూడా ఒచ్చన్నమాట?" నవ్వింది.
    "సాలభంజికలను  చూస్తుంటే భోజరాజుకి కవిత్వం రాదూ? కాళిదాసుది సాహిత్యమా? సంగీతమా? ఫాల్గుణీ నిన్ను చూస్తూంటే పిచ్చివాణ్ణయిపోతున్నాను. ఏదీ, ఒక్కసారి మీ మువ్వల సవ్వడితో నన్ను మురిపించు."
    ఫాల్గుణి గబగబా అడుగులు వేసింది.
    అతడు అడుగడుగుకీ తేలిపోతున్నాడు.
    ఆనందంతో ఇరువురూ పరవశించి పోతున్నారు.
    "రజత్! నేను ఎన్నడూ ఎవ్వరినిచూసినా  చలించలేదు! మీ కంఠం నన్ను పిచ్చిదాన్ని చేస్తోంది. మీ రూపం నన్ను మరో లోకాలకి తీసుకుపోతోంది."
    ఇరువురూ ఆవేశంతో ఆలింగనంలో ఐక్యమైపోయారు.
    కాలం వారి మధ్యకి రావడానికి భయపడిపోయింది.
    రజత్ పాట!
    ఫాల్గుణి ఆట!
    రజత్ కృష్ణుడు! ఫాల్గుణి రాధ! మధురానగరం వారి వేదిక.
    రజత్ వెంకటేశ్వరస్వామి, ఫాల్గుణి అలిమేలు మంగ. పలుకు తేనేలతల్లి
    తిరుపతి వారి నివాసం.
    ఆనంద తాండవం ఆమె నృత్యం!
    ఆ నట్టువాంగం అతని కంఠం! కైలాసం వారికై వసం!
    ఆమె రతీదేవి! అతడు మన్మథుడు!
    ఆమె లాస్యప్రియ! అతడు చంద్రమౌళీశ్వరుడు!
    అదే వారి ఆహారం! అదే వారి ఆనందం! అదే వారి ఆదర్శం! అదే వారి పొద్దు!
    వారాలూ నెలలూ గడిచిపోయాయి! ఎవరేమనుకున్నా, ఎవరు చెవులు కొరుక్కున్నా, ఏ పత్రికలు ఏమి రాసినా వారు చలించలేదు.
    తన స్వరాలకీ రాగాలకీ ప్రాణం ఆమె అనుకున్నాడు రజత్!
    తన తాళానికీ అడుగు సవ్వడికీ ఊపిరి అతను అనుకుంది ఫాల్గుణి.
    అతని కొత్త పాటకి ఆమె నాట్యం చేసేసి!
    ఆమె కొత్త భంగిమకి అతను కృతులు రాసేవాడు.
    ఈ కలయిక అపూర్వమనుకున్నారు సంగీత సాహిత్య నృత్య శాస్త్రజ్ఞులు!
    ఆమె కెవరూ లేరు. అమ్మా నాన్నా చిన్నప్పుడే కారు ప్రమాదంలో పోయారు.
    అమ్మమ్మ పెంచి పెద్ద చేసింది! మనవరాలి శ్రద్ద చూసి నాట్యం నేర్పించింది.
    ఎంత కాదనుకున్నా ఫాల్గుణిని ఒక ఇంటిదాన్ని చెయ్యకుండానే, వాళ్ళమ్మా నాన్నల ఆస్తికి తన ఆస్తినీ జోడించి, కళ్లు మూసింది ఆమె. ఇంతవరకూ ఫాల్గుణి మనసును కదిలించిన వారెవరూ లేరు. 
    రజత్ ని చూడగానే జన్మ జన్మల సంబంధంలా కరిగిపోయింది ఫాల్గుణి.
    అతడు తనవాడే అనిపించింది.
    రజత్ కీ అంతే! కానీ తనకి అప్పుడే  పెళ్ళయిపోయి  ఇద్దరు పిల్లలు కూడా వున్నారన్న  సంగతి  ఫాల్గుణికి చెప్పడమేకాదు - తను అనుకోవడం కూడా  మర్చిపోయాడు!
    రజత్ భార్య భావ్య ఫాల్గుణి ఇంటికొచ్చి నెత్తీనోరూ  బాదుకునేవరకూ వారిరువురికీ ఏ విషయాలు బుర్రకెక్కలేదు. ఇద్దరికీ మతిపోయింది. భావ్యని బతిమాలాడారు. బజారు కెక్కొద్దన్నారు. ఫాల్గుణి తన ఆస్తిలో  ముప్పాతిక భాగం రజత్ కొడుకులు నలుగురికీ రాసిచ్చేసింది! భావ్య మాట్లాడలేదు. సమ్మతించకపోయినా ఎదురు తిరగలేదు. రజత్ భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు.
    ఫాల్గుని మెడలో మంగళసూత్రం కట్టలేదు కానీ, ఆమె మెడను ఏనాడో తన ప్రేమ కుసుమాలతో  మాలకట్టి  బంధించేశాడు. పెనవేసుకుపోయిన మనసులకి మళ్ళీ బంధనాలెందుకు?
    వీరు ముగ్గురూ సర్దుకుపోయినా  సమాజం మాత్రం  ఫాల్గుణిని వెలేసింది. నానారకాల దుర్భాషలాడింది రజత్ ఉత్తర భారతీయుడనీ, ఫాల్గుణి దక్షిణ ప్రాంతాల పిల్ల అని, సిగ్గులేక రజత్ కి ఉంపుడుకత్తెగా ఉంటోందనీ నానాప్రచారం చేశారు.
    "కళలకి  భాషా భేదం, ప్రాంతీయ భేదం వుందా?" నవ్వుకున్నారు వాళ్ళు.
    అయితే అనేకసార్లు తనవల్లే  హిమాలయాలనందుకునేంత ఎత్తుకు ఎదగాల్సిన ఫాల్గుణి మామూలుగా  ఉండిపోతోందని  బాధపడేవాడు. కానీ ఫాల్గుణికి ఆ బాధలేదు. తన నాట్యం వందలాది మంది చూసి చప్పట్లు కొట్టడం కన్నా, రజత్ ఒక్కడు చూసి పులకిస్తేచాలు.  ఆ పులకింత అతనిలో  కొత్త రాగాలు పలికించాలి! అతను మరో త్యాగరాజులా  వాగ్గేయకారుడిగా వెలిగిపోవాలి! అందుకే తను పుట్టింది! అప్పుడే  తన జీవితానికి  పరమావధి" అనుకునేది ఫాల్గుణి! అయితే కాలజలధి పొంగుకొచ్చే ఎన్నో కెరటాలు  తాకిడి ఆమెను చిగురుటాకులా ఊపేసింది.
    రజత్ అస్వస్థతతో మంచం పట్టాడు!
    భావ్య రజత్ పరిస్థితికి చీదరించుకుంటోంది. ప్రతి పనికి కారణం, తప్పు ఫాల్గుణిదేనని నిందిస్తోంది! శపిస్తోంది! కచ్చేరీలు లేక సంపాదన తగ్గిపోయే సరికి భావ్య దృష్టిలో రజత్ ఎందుకూ పనికిరానివాడిలా అయిపోయాడు.
    డాక్టర్లు రజత్ కి 'గొంతు కేన్సర్' అని నిర్ధారించారు!
    భావ్య గతుక్కుమంది! అతడి ఆస్తినంతా  తనపేరా, పిల్లల పేరా రాయించుకునే ఏర్పాటు చేసుకుంది!
    ఈ వార్త విన్న ఫాల్గుణి స్థాణువులా అయిపోయింది! ఆమె హృదయంలో దుఃఖం కట్టలు తెంచుకొని  ఉప్పెనలా పొంగింది. ఆమె రజత్ కి మరింత చేరువయింది. క్షణం ఒదలడంలేదు రజత్ ని! అతని ఊపిరిలో ఊపిరిగా మసలుతోంది!
    "ఫాల్గుణి! నాలో ఇంకా ఏం చూసుకుని, నన్నింతగా అంటిపెట్టుకునున్నావు? నీ భవిష్యత్తును నా కోసం హారతి పట్టేశావు. కర్పూరంలా వెలగవలసిన నువ్వు ఉత్తమసిలా మిగిలిపోయావు." బాధతో అనేవాడు రజత్.
    "ప్రేమ లాభనష్టాలు బేరీజు వేస్తుందా రజత్! నేను ఏనాడో నేనుగా కాక నీవుగా కలిసిపోయాను. నన్ను వేరుచెయ్యడం ఇప్పుడు నీకూ నాకూ కూడా సాధ్యంకాదు" అనేది వక్షస్థలంపై తనఆన్చి సేద తీర్చుకుంటూ. ఆమె తల నిమురుతూ  ఆప్యాయంగా, ఆమె పై ముద్దుల వర్షం కురిపించేవాడు. ఆనందంతో ఆమె పాదాలను ముద్దు పెట్టుకుని ఆ పారాణిని ఆమెకి తిలకంగా దిద్దేవాడు అతడు!
    ఒకసారి  భావ్య పెళ్ళయిన కొత్తలో ఎవరో పేరంటంలో వూశారని పసుపు పాదాలతో ఒచ్చింది పడకటింటికి పాదాలు చూస్తూ, ఆ పసుపుని ఆమె నుదుట బొట్టులా పెట్టేడు చిలిపిగా! భావ్య చీదరించుకుంది. ఏమిటా పిచ్చిపని? పసుపు రాలి నా చీరనిండా పడింది. పైగా పచ్చగా మొహమంతా మరకవుతుంది అంటూ.
    రజత్ మనసు చివుక్కుమంది!
    "ఏంటాలోచిస్తున్నావు?" అడిగింది ఫాల్గుణి.
    "నీ పాదాలు ముద్దు పెట్టుకోవడం, ఆ పారాణిని నీకు తిలకంగా దిద్దడం నీకు కోపంగానీ, చిరాకుగానీ తెప్పించలేదా?" అడిగిండు.
    కళ్ళు గుండ్రంగా తిప్పుతూ  ఆశ్చర్యంగా అతని కేసిచూసి "రజత్! ప్రేమంటేనే పిచ్చి! ప్రేమలో ఏది పిచ్చిగా అనిపించదు. అణువణువూ పులకిస్తుందే తప్ప" అంటూ  అతని రెండు భుజాలు  పట్టుకుని  కుదిపేసి, కొరికేసి పట్టలేని ఆనందంతో పరవసిస్తూ "నినువినా....నామదెందు...." అనే కీర్తనని అభినయించేది!
    రజత్ ఆ పారవశ్యాన్ని తనివితీరా జుర్రుకుంటూ తేలిపోయేవాడు మైకంలో!
    విధి ఒక్కొక్కసారి  బ్రహ్మ రాక్షసిలా ప్రవర్తిస్తుంది! తన్మయత్వంలో కళ్ళు మూసుకున్న రజత్ మళ్ళీ కళ్ళు తెరవలేదు. ఆ ఆనందం అలాగే నిలిచిపోవాలనేమో! ఫాల్గుణి జంట కోల్పోయిన ఒంటరి పక్షిలా  విలవిలలాడిపోయింది! నిశ్శబ్దతరంగాల భయంకర శబ్దాలు ఆమెకి ఒణుకుపుట్టించాయి.
    అంతా శూన్యం!
    నిశ్శబ్దం!
    నిశీధి!
    గమ్యం తెలియని బాటసారి!
    కాలగర్భంలో కొన్ని నెలలు దాటిపోయినాయి! ఫాల్గుణ ఒకరోజు భావ్య ఇంటికి వెళ్ళింది! రజత్ ఆఖరి కొడుకు రజత్ లాగే వుంటాడు. వాడికి కొంచెం సంగీత జ్ఞానం వుందని రజత్ చెప్పగా వింది. భావ్య ముందు ఒప్పుకోలేదు! కానీ ఫాల్గుణి మిగిలిన ఆస్తికి ఈ బాబు కేదార్ వారసుడవుతాడని ఆశతో, ఆ మాటలే లాయరు ద్వారా రాయించుకుని కేదార్ ని ఫాల్గుణి వెంట పంపించింది.
    ఫాల్గుణిలో కొత్త ఆశలు రేకెత్తాయి. కొత్త జీవితం ప్రారంభించింది. రేయింబవలు, కేదార్ కి విద్యా, సంగీతం నాట్యం నేర్పించడంలోనే నిమగ్నమయిపోయింది. రజత్ చిన్నరూపంలో  తన చుట్టూ  తిరుగుతూన్నట్టు  ఆనందించేది.
    తన గుండెనిండా అతని ఊహలే!
    కేదార్ నూనూగు మీసాలతో అవర రజత్ లా వెలిగిపోతున్నాడు.
    హోటల్ ఆహోరీ జనవాహినితో కిటకిటలాడిపోతుంది. అందంగా అలంకరించబడ్డ  ఆ ఆడిటోరియంలో ఆ రోజు కేదార్ నాట్య ప్రదర్శన.
    జనంమధ్య కూర్చుని చూడాలని ముందు వరుసలో  కూర్చుంది ఫాల్గుణి.
    "ప్రేమ గుడ్డిది! ప్రేమకి కళ్ళు లేవంటారు పెద్దలంతా! కానీ సముద్రమంత  మనసుందని ఎవ్వరూ  అనరేం? ప్రేమ అత్యంతమధురం!
    అద్భుతమైన అనుభూతి! అంతుచిక్కని ఆనంద సొరంగం!" గొణుక్కుంటూన్న  ఫాల్గుణిని చూసి" ఏమిటమ్మా ప్రోగ్రాం మధ్యలో మీ సణుగుడు" అన్నారెవరో!
    ఫాల్గుణి వారి ఏకాగ్రతకి, వారు చూపుతున్న శ్రద్దకీ ముగ్దురాలయింది.
    కేదార్ గంధర్యుడిలా  నాట్యం చేస్తున్నాడు. తనవైపే చూస్తున్నాడు.
    ఆ చూపులో కోటి సూర్యుల వెలుగు!
    ఆ చూపులో అనంత కోటి బ్రహ్మాండాలను కదిలించే శక్తివంతమయిన ఆప్యాయత!
    ఆ ప్రేమకే ఆమె దాసురాలు!
    ఆ ప్రేమకే ఆమె అంకితం!
    గాలికెగురుతూన్న వెండితీగెల జుట్టును సవరించుకుంటూ పైటచెంగు
    భుజాలనిండా కప్పుకుని కూర్చుంది ఫాల్గుణి.
    ఎదురుగ్గా కేదార్ లేడి పిల్లలా చెంగు చెంగున దూకుతూ నర్తిస్తున్నాడు.
    మనసునిండానిండి రజత్ ఆమెను జ్ఞాపకాల తటాకంలో ముందేస్తున్నాడు.
    "ప్రేమమయీ! నీ జీవితం ధన్యం! నీలోని కళా సంపత్తి నీతోనే రాలిపోక, నీ శక్తితో మరో నిన్నుని తయారుచేశారు. ఒక జ్యోతి మరో జ్యోతిని వెలిగించినట్టు!" ఆశీర్వదిస్తూన్నట్లు రజత్ కంఠం లీలగా వినిపించింది ఫాల్గుణికి!
    ప్రేమకి అంతంలేదు...........! ఫుల్ స్టాప్ లేదు - కామా మాత్రమే!
                                                                                                          (విపుల మాసపత్రిక 1994)      


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS