ఆవిడ దగ్గరకు వెళ్ళాడు.
"ఏం కావాలి?" విసుగ్గా అడిగిందావిడ...
తన జేబులోంచి ఆటోగ్రాఫ్ పుస్తకం తీశాడు వామనమూర్తి.
"మిమ్మల్ని గురించి విన్నాను, మీ ఆటోగ్రాఫ్ తీసుకుందామని వచ్చాను" అన్నాడు.
కామేశ్వరీ దేవి ఉక్కిరి బిక్కిరయింది. ఆవిడ ఆటోగ్రాఫ్ ఇవ్వడం అదే మొదటిసారి.
అది మొదలు వామనమూర్తి ఆవిడ దగ్గరకు తరచు వచ్చేవాడు. ఏమీ అడిగేవాడు కాదు. కనుముక్కు తీరు చక్కగా ఉండే తన ముఖంలోకి చూస్తూ ఆవిడ అప్పుడప్పుడు తనను తను మరిచిపోవడం గమనించాడు. ఆవిడ సౌందర్యోపాసనా దృష్టిని మెచ్చుకున్నాడు. అప్పుడప్పుడు ఆవిడను ఆశ్చర్యంగా చూస్తూ నిలబడిపోయేవాడు.
"ఏమిటీ?" అనేది ఆవిడ.
"దేవతలు అమృతం తాగుతారనీ, నిత్య యవ్వనులనీ విన్నాను. అలాంటిది మీకు ఏమైనా దొరికిందా?ఎప్పటికీ ఇలా చిన్న పిల్లలాగ ఎలా ఉండగలుగుతున్నారు?" అని అడిగేవాడు అమాయకంగా...
మిసెస్ కామేశ్వరీ దేవి ఇలాంటి మాటలు మనసార నమ్మగలిగేది. ఎందుకంటే అద్దంలో చూసుకున్నప్పుడల్లా తను చిన్న పిల్లలాగ ఉన్నాననే భావం ఆవిడకు వచ్చేది. అందరూ ఆ మాట అనరేమో అని ఆశ్చర్యపోయేది. వామనమూర్తి అలా అంటుంటే అతను చనువుకొద్దీ అలా అనగలుగుతున్నాడని మిగిలినవాళ్ళు సంకోచంతో అనలేకపోయారనీ అనుకునేది.
ఇంటర్ పరీక్షలు రాశాక దీనంగా మిసెస్ కామేశ్వరీ దేవి ముందు నిలబడ్డాడు వామన్.
"ఏం? పరీక్షలు బాగా వ్రాయలేదా!" అంది ఆవిడ...
"వ్రాశాను. కానీ క్లాస్ రాకపోతే మెడిసిన్ లో సీట్ దొరకదు!"
"నీకు మెడిసిన్ ఇష్టమా?"
"ఆ లైన్ లో ఉద్యోగం త్వరగా దొరుకుతుంది. డబ్బు బాగా వస్తుంది."
మిసెస్ కామేశ్వరీ దేవి పకపక నవ్వింది.
"మంచివాడివే! క్లాస్ వస్తుందిలే!" అంది.
క్లాస్ వచ్చింది. అలాగే ఎంట్రెన్స్ పాసయ్యాడు! మెడిసిన్ లో సీట్ వచ్చింది. గోల్డు మెడల్ కూడా వచ్చింది. భాస్కరరావు ఆర్ధిక సహాయం ఉండనే ఉంది.
"మా విక్రమ్ నా ప్రాణ స్నేహితుడు. పెద్ద జీనియస్ కాదనుకోండి! అయినా మీరు తలుచుకుంటే... మీకు ఇబ్బందిగా ఉంటే ప్రయత్నించకండి. మీకు ఇబ్బంది కలిగించటం నాకే మాత్రం ఇష్టం లేదు..."
కామేశ్వరీ దేవి ఫకాలున నవ్వి "చాల్లే! వేషాలు. అతడికి ఉద్యోగం వస్తుందిలే!" అంది.
లోపలి నుండి సుధ రావటం గమనించి గబగబ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
వామనమూర్తి సుధతో మాట్లాడటం మిసెస్ కామేశ్వరీ దేవి సహించలేదు. ఈర్ష్య కాదు. ఆవిడ గొప్ప శీలవతి. ఏ మాత్రం నైతిక పతనాన్ని ఆవిడ సహించలేదు.
7
సౌందర్య స్నేహితురాలొకావిడ తన భర్తకు వామనమూర్తి దగ్గర ఆపరేషన్ చేయించబోతున్నానని చెప్పగానే సౌందర్య తేలుకుట్టినట్లు అదిరిపడింది.
"వద్దు! వద్దు! నీకేమైనా మతి పోయిందా?"
"నీకే మతి పోయినట్లుంది. వామనమూర్తి గారిని మించిన సర్జన్ ఈ చుట్టుప్రక్కల ఉన్నాడా? అందరూ ఆయన గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటున్నారో విన్నావా? ఇటీవల ఆయన గురించి పేపర్లో కూడా వచ్చింది. నువ్వు చూడలేదా?"
"ఇదెక్కడి విడ్డూరం?" అంది. ఆ మాటలు స్నేహితురాలితో అంటున్నట్లుగా లేవు. తనలో తను అనుకుంటున్నట్టుగా ఉన్నాయి.
"ఇందులో విడ్డూరం ఏముంది? అతను గోల్డుమెడలిస్ట్! మొదటి నుండీ బ్రైట్ కెరీర్!"
ఏమీ మాట్లాడలేకపోయింది సౌందర్య. సౌందర్య స్నేహితురాలి మాటలకు మనసు ఒప్పుకోవడం లేదు. బాహాటంగా కాదనగలిగే ఆధారాలు లేవు. ఒక వేళ వద్దన్నా స్నేహితురాలు వినేలాగ లేదు.
అందరూ వామనమూర్తి గొప్ప సర్జన్ అని చెప్పుకుంటున్నారు. వామన మూర్తిని పత్రికలు కూడా పొగిడాయి.
ఈ రెండు బ్రహ్మాస్త్రాలను ఎదిరించగల ఆయుధమేదీ లేదు. అంచేత ఊరుకుంది. కానీ ఆపరేషన్ రోజున తను కూడా హాస్పిటల్ కు వెళ్ళింది.
తెల్లని బట్టల్లో గ్లోవ్స్ తొడుక్కున్న వామనమూర్తి చిరునవ్వుతో మాట్లాడుతున్నాడు.
"అఫ్ కోర్స్! కేస్ కొంచెం కాంప్లికేటెడ్ అనుకోండి! అయిబ్నా ఫరవాలేదు. మీరు అధైర్యపడకండి. మా శాయశక్తులా ప్రయత్నిస్తాం! నో! నో! మీరు మమ్మల్ని బ్రతిమాలక్కర్లేదు. ఏ డాక్టర్ కైనా తన పేషెంట్ బ్రతికి బాగుపడటం కంటే వేరే ప్రతిఫలం ఉండదు. నేను చెప్తున్నాగా! అతనికి తప్పకుండా నయమవుతుంది. మరోసారి మీరిద్దరూ చెట్టాపట్టా లేసుకుని నా దగ్గరకు వస్తారు. నాకియ్యబోయే బహుమానాన్ని గురించి చిలిపిగా వాదించుకుంటారు."
అంత దుఃఖంలోనూ స్నేహితురాలు నవ్వింది. ఆవిడ చూపుల్లో వామనమూర్తి పట్ల కృతజ్ఞత ఉట్టిపడుతోంది.
తనను పరిశీలనగా చూస్తోన్న సౌందర్య చూపులతో కలుసుకున్నాయి వామనమూర్తి చూపులు. ఒక్కసారి గతుక్కుమన్నాడు. ఎవరి సమక్షంలోనయినా ధారాళంగా మాట్లాడగలిగే తను సౌందర్య ముందు ఎందుకిలా ముడుచుకు పోతున్నదో అర్ధంకాదు వామనమూర్తికి...
"హలో సౌందర్యా! వెల్ కం."
"వామన్! నేను ఆపరేషన్ థియేటర్ లోకి రావచ్చా?"
"నువ్వు థియేటర్ లోకి..."
తడబడిపోయాడు వామనమూర్తి. ఆపరేషన్ థియేటర్ లోకి ఎవరినీ రానీయ కూడదు... అది రూల్! ఆ సంగతి సౌందర్యకు తెలుసు! కానీ రూల్స్ బ్రేక్ చెయ్యవచ్చు. వామనమూర్తి లాంటివాళ్ళు సునాయాసంగా చెయ్యగలరు. వామన మూర్తిని చక్కగా అర్ధం చేసుకుంది సౌందర్య. అతని కంటే ధృడమైన వ్యక్తిత్వం ముందు అతను వెన్నలా కరిగిపోతాడు. మరో వ్యక్తిత్వంలో ఒరిగిపోతాడు.
