అతనికి అందరి మధ్య తన పుట్టిన రోజు జరుపుకోవడం బ్యాంకు లో చేరిన తరువాత అది ఫస్ట్ టైం. ఎంతో సంతోషంగా ఫీల్ అయ్యాడు. తానూ ఒక కేక్ ముక్క కృష్ణకుమార్ కి తినిపించాడు.
బ్రాంచ్ తరపు నుంచి ఇది మీకు చిన్న గిఫ్ట్ అని అతనికి ఇచ్చాడు కృష్ణ కుమార్. అందులో ఒక చిన్న ఆర్ట్ పీస్ ఉంది. చాలా అందంగా ఉంది. ఖరీదు తక్కువే అయినా అది అందరి మనసులు దోచింది. ఎందుకంటే ఇప్పటివరకు అలాంటి అలవాట్లు ఆ బ్రాంచ్ లో లేవు. కృష్ణ కుమార్ ఆ మంచి అలవాటుకు నాంది పలికాడు. అందరికి సంతోషం కలిగింది. తమ బ్రాంచ్ మేనేజర్ చక్కగా అందరితో కలవడం చూసి ముచ్చటపడ్డారు.
స్వీట్, హాట్, కాఫీ లు సేవించి అందరూ తమ సీట్స్ కి వెళ్లిపోయారు.
సర్ మీరు ఫ్రీ అయితే ఇవాళ్టి రిపోర్ట్ మీకు ఇచ్చి వివరిస్తాను అంది విద్యావతి.
రండి మేడం ఇప్పుడే చూసేద్దాం అని కేబిన్ లోకి దారి తీసాడు.
ఇందాక ఐ బి బ్యాంకు ఏ జి ఎం వచ్చారు. ఈ అకౌంట్ గురించి మాట్లాడి వెళ్లారు అన్నాడు.
ఎందుకో విద్యావతి మొహం మామూలుగా లేదు. పొద్దుటికి, ఇప్పటికి చాలా తేడా ఉంది. బాగా ఏడ్చి కళ్ళు ఉబ్బి బుగ్గలు ఎరుపెక్కినట్లు కనిపించింది. లంచ్ టైం లో కూడా బాగానే ఉందే. ఈ మూడు గంటల్లోనే ఎందుకు ఇలా అని ఆలోచనలో పడ్డాడు. భర్త నుంచి ఎమన్నా ఇబ్బంది ఫోన్ వచ్చిందేమో ! మరు నిముషంలో మనకెందుకులే అది వాళ్ళ జీవిత సమస్య మనం తలదూర్చకూడదు అనుకున్నాడు.
చెప్పండి మేడం అన్నాడు
అన్నీ చక్కగా వివరించింది. అంతా అయిన తరువాత రేపు నాకు లీవ్ కావాలి సర్ అంది.
తీసుకోండి అన్నాడు.
మళ్ళీ కొంచెం ఆగి తనే చెప్పింది. రేపు స్టేట్ విమెన్ కమిషన్ ని కలవాలి సర్ అంటూ తన భర్త మూర్తి కలిగించే ఇబ్బందులు గురించి చెప్పింది. అతని మీద కంప్లైంట్ ఇద్దామనుకుంటున్నాను అంది.
కూర్చోండి అన్నాడు. నా హెల్ప్ ఏమన్నా కావాలా అని అడిగాడు.
ఎవరన్నా తెలిసిన వాళ్ళు చెప్తే కొంచెం సపోర్ట్ ఉంటుందేమో సర్. నాకు అక్కడ ఎవరూ తెలీదు.
తనకు తెలిసిన వాళ్లకు ఫోన్ లు చేసాడు. చివరకు ఒక లింక్ దొరికింది. వాళ్ళు చైర్మన్ కు చెప్తామన్నారు. ఆ విషయం విద్యావతి కి చెప్పాడు. ఏమని కంప్లైంట్ ఇస్తారు అని అడిగాడు.
తను పడుతున్న ఇబ్బందులు, భర్త వేధింపులు గురించి చెప్పింది. వాటిమీదే కంప్లైంట్ ఇస్తాను అంది.
అలా చేస్తే అతని మీద యాక్షన్ తీవ్రంగా ఉంటుందేమో ఆలోచించండి. దానివల్ల అతను మిమ్మల్ని ఇంకా ఇబ్బందిపెడతాడు. అందువల్ల మీకు వచ్చే ప్రయోజనం ఏముంటుంది. ఏదన్నా పెర్మనెంట్ పరిష్కారం ఆలోచించండి.
విడాకులు ఇద్దామంటే ఒప్పుకోవడం లేదు. మెంటల్ క్రూయల్టీ వేద్దామంటే దానికి గట్టి లాయరు కావాలి. అతను లాయర్లని కూడా మేనేజ్ చేస్తున్నాడు. ఇది ఇప్పటి సమస్య కాదు సర్. పెళ్లయినప్పటినుంచి అతని తీరు ఇలాగే ఉంది. నా జీవితం చాలా నరకమయ్యింది అతని వలన. చాలా సార్లు ఆత్మహత్య కు కూడా ప్రయత్నించాను. పిల్లల వల్ల ఆగి పోయాను. ఇప్పుడు వాళ్ళ జీవితాలు ఒక దారిలో పడ్డాయి. ఇక నాకు ఏ చింతా లేదు వాళ్ళ గురించి అంటూ కన్నీళ్లు పెట్టుకుంది.
ఏడవకండి మేడం ప్లీజ్ అన్నాడు. మీరు కూడా అలా పిరికిగా ఆలోచిస్తే ఎలా ? ఆత్మహత్య పరిష్కారమా ? ఇంత చదివి, తెలివి తేటలు ఉండి కూడా మీరే అలా అంటే ఎలా ?
మరి నాకు ఎవరు సపోర్ట్ లేరు కదా సర్. పిల్లలని ఇటువంటి విషయాల్లో ఇన్వాల్వ్ చెయ్యడం నాకిష్టం లేదు. మా సిస్టర్స్ కూడా అతనితో చాలా విసిగి పోయున్నారు. పిల్లలకి కూడా నరకం చూపించాడు. వాళ్ళు ఇంత స్టేజి కి వచ్చారంటే మా అక్కల సపోర్ట్ వల్లనే. అలాంటి మా అక్కలతో మళ్ళీ నా సమస్య చూడమంటే అది వాళ్ళని చాలా ఇబ్బందులలో పడేసినట్లు ఉంటుంది.
నా సప్పోర్ట్ మీకు ఎప్పుడూ ఉంటుంది మేడం. ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ టాప్ ఆఫిసియల్స్ చాలా మంది తెలుసు నాకు. ముందు మీకు కలిగిన ఇబ్బందులు ఇక కలుగవు అని మటుకు భరోసా ఇవ్వగలను. మీకు ఎప్పుడు ఏ అవసరమున్నా క్షణాల్లో చేయించగలను. ఇక అతనిమీద కేసు పెట్టడం అది అంటే మీరు కొంచెం అలోచించి నిర్ణయం తీసుకోండి. ఆవేశంలో అతనేమన్నా చేస్తే మీకు సమస్యలొస్తాయి. అందులోనూ మీరు మీ అక్క ఒంటరిగా ఉంటారు. రెండు మూడు రోజులు సమయం తీసుకోండి. ఒక శాశ్వత పరిష్కారం కోసం వెదకండి అని చెప్పాడు కృష్ణకుమార్. నా ఫ్రెండ్స్ లాయర్లు చాలా మంది ఉన్నారు. మీకు ఎటువంటి లీగల్ సపోర్ట్ కావాలన్నా వాళ్ళు చూసుకుంటారు. ఆ భాద్యత నాది అన్నాడు.
విద్యావతి మోహంలో ధైర్యం కనిపించింది. కర్చీఫ్ తో కళ్ళు తుడుచుకుని థాంక్యూ సర్ థాంక్యూ వెరీ మచ్ అంది. గొంతులో జీర వినిపించింది.
లేవబోతుంటే ఒక నిముషం కూర్చోమన్నాడు.
ఇంటర్కం లో రెండు కాఫీలు తెమ్మని చెప్పాడు.
రేపు లీవ్ కావాలంటే తీసుకోండి. రెస్ట్ తీసుకోవచ్చు అన్నాడు.
వద్దు సర్. వర్క్ ఉంటేనే నేను లీవ్ పెడతాను. ఇంట్లో బోర్ కొడుతుంది. మీరు భరోసా ఇచ్చారుగా ఇక నాకు భయం లేదు లెండి. ఏ ఇబ్బంది ఉన్నా మీ తలుపు తడతాను అంది జాగ్రత్త అన్న ధోరణిలో నవ్వుతూ.
అమ్మయ్య. మొత్తానికి నవ్వారు. అది చాలు. మీ మొహానికి ఆ నవ్వు, మీ మాటల్లో ఆ కొంటెతనం మీకు సహజ ఆభరణాలు. అవి అలాగే ఉంచుకోండి. మీకు ఏ సమస్య ఉన్నా మా ఇంట్లో ముగ్గురం మీ ముందు వాలిపోతాం అన్నాడు నవ్వుతూ.
చాలా చాలా థాంక్స్ సర్ మీరిచ్చిన ఈ ధైర్యానికి అంది రెండు చేతులు జోడిస్తూ విద్యావతి.
****
రాత్రి తొమ్మిది గంటలైంది. స్నానం చేసి టి వి చూస్తున్నాడు కృష్ణ కుమార్.
భోజనానికి లేస్తారా అంటూ అడిగింది రేణుక.
మోహిత్ బిజీ గా ఉన్నాడా. వాడిని కూడా రమ్మను అందరం కలిసే చేద్దాం అన్నాడు.
వాడు మామూలేగా, రూంలో చదువుకుంటున్నాడు . మీరు ఓకే ఆంటే వాడిని కూడా పిలుస్తాను అంది.
ఇంతలో మొబైల్ మోగింది.
విద్యావతి నుంచి ఫోన్ సర్ 'మీరు అర్జెంటు గా రావాలి. మా హస్బెండ్ ఇంటి బయట న్యూసెన్స్ చేస్తున్నాడు. చేతిలో పెట్రోల్ కెన్ పట్టుకోనున్నాడు. పెట్రోల్ పోసి చంపుతానని బెదిరిస్తున్నాడు అంటూ ఏడుస్తోంది. ఫోన్ లో దబ దబ అంటూ ఇంటి తలుపులు బాదుతున్న చప్పుడు వినిపిస్తోంది.
మేడం నేను పది నిముషాల్లో అక్కడుంటాను. మీరు కంగారు పడకండి అని చెప్పాడు కృష్ణ కుమార్.
మోహిత్ ని పిలిచి అర్జెంటు గా డ్రెస్ వేసుకో రా. కారు డ్రైవ్ చెయ్యాలి నువ్వు. డ్రైవింగ్ లైసెన్స్ కూడా పెట్టుకో. మన ఇంటికి దగ్గరే. అశోక్ నగర్ దాకా వెళ్ళాలి అన్నాడు. రేణుక కు బ్రీఫ్ గా వివరాలు చెప్పి బయలుదేరాడు.
మోహిత్ డ్రైవింగ్ చేస్తుంటే కృష్ణకుమార్ తన క్లాసుమేట్ కమీషనర్ అఫ్ పోలీస్కి ఫోన్ చేసి వివరం చెప్పాడు. అతను అశోక్ నగర్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ని పంపిస్తానని చెప్పాడు.
ప్లీజ్ అర్జెంటు గా పంపరా అని రిక్వెస్ట్ చేసాడు.
విద్యావతి ఇంటి బయట జనాలంతా గుమిగూడి ఉన్నారు.
ఆవిడ భర్త తలుపులు బాదుతూ గట్టి గట్టిగా అరుస్తున్నాడు. బాగా తాగి ఉన్నట్టు తెలుస్తోంది.
ట్రాఫిక్ అంత లేదు రోడ్ మీద. కారు పక్కనే ఉంచి కృష్ణకుమార్ మోహిత్ ఇద్దరూ గేట్ దగ్గరికి వచ్చారు. అతన్ని వారించే స్థితి లో లేడు. గట్టి గట్టిగా అరుస్తూ తూలుతున్నాడు.
విద్యావతి కి ఫోన్ చేసాడు. మేడం నేను మీ ఇంటి బయటే ఉన్నాను. మీరేమీ వర్రీ అవకండి. ఐదు నిముషాల్లో పోలీసులొస్తున్నారు. నేను చెప్పేంతవరకు మీ కిటికీ కానీ, తలుపులు కానీ తీకండి అని చెప్పాడు.
థాంక్యూ సర్ అంది. ఆమె కంఠంలో కొంచెం ధైర్యం కనిపించింది.
ఇంతలో పోలీస్ వాన్ వచ్చింది. అందులోనుంచి ఇన్స్పెక్టర్ మరో నలుగురు పోలీసులు దిగారు.
కృష్ణకుమార్ ఇన్స్పెక్టర్ దగ్గరికెళ్లి అన్నీ చెప్పాడు. నాకు కమీషనర్ గారు ఫోన్ చేశారు. అతన్ని మేము చూసుకుంటాము సర్ అని హామీ ఇచ్చాడు. మీరు ఒక కంప్లైంట్ రాసివ్వండి అన్నాడు.
కృష్ణకుమార్ ఇన్స్పెక్టర్ ని రిక్వెస్ట్ చేసాడు. అతని మీద థర్డ్ డిగ్రీ ఉపయోగించకండి. జస్ట్ లాక్ అప్ లో ఉంచండి. ఎందుకంటే ఎక్కువ అభియోగాలు అరెస్ట్ అంటే అతని ఉద్యోగం పోతుంది. అతని భార్య మా బ్రాంచ్ స్టాఫ్. ఆవిడని మా ఇంట్లో వదిలేసి నేను మీ పోలీస్ స్టేషన్ కి వచ్చి మాట్లాడుతాను అని చెప్పాడు.
ఇన్స్పెక్టర్ ఓకే సర్ అలాగే చేస్తాను అన్నాడు. మాకు కమీషనర్ గారి ఆర్డర్స్. సర్ కూడా జాగ్రత్తగా డీల్ చెయ్యండి అని చెప్పారు నాతో.
పోలీసులు వెళ్లి మూర్తి ని కంట్రోల్ లోకి తీసుకున్నారు. వాళ్ళను చూడగానే కంగారు భయం కలిగింది అతనిలో. వాన్ లో కూర్చోపెట్టారు.
నేను స్టేషన్ కు వచ్చి కంప్లైంట్ ఇస్తాను అని చెప్పాను ఇన్స్పెక్టర్ కి.
అతను సరే అన్నాడు. పోలీస్ వాన్ వెళ్ళిపోయింది.
విద్యావతి కి ఫోన్ చేసి సంగతి చెప్పి తలుపు తీయండి అన్నాడు.
కిటికీ తీసి చూసింది. కృష్ణ కుమార్ చెయ్యి ఊపాడు.
ధైర్యంగా తలుపు తీసింది. థాంక్యూ సర్ అంది. ఆమెకు గుండె దడ ఇంకా తగ్గలేదు. ఏమి అఘాయిత్యం జరుగుతుందోనని బెంబేలెత్తిపోయింది. ఇప్పుడు మనసు కాస్త కుదుటపడ్డది.
రండి సర్ లోపలికి అంది. వెనుకనే నిలుచున్న మోహిత్ ని చూసి మీ అబ్బాయా అంది.
అవును అని చెప్పి మేడం మీరు నాతోపాటు మా ఇంటికి వచ్చేయండి. ఇవాళ అక్కడే ఉందురుగాని. ఇక్కడ వద్దు అన్నాడు.
ఫరవాలేదు సర్. నేను ధైర్యంగా ఉండగలను అంది.
ఈ లోపు మిద్దెపై నుంచి ఆమె పెద్ద అక్క వచ్చింది. చాలా థాంక్స్ సర్ మీకు అంది. సమయానికి మా రెండో సిస్టర్, ఆవిడ హస్బెండ్ లేరు. వాళ్ళు నిన్ననే టూర్ వెళ్లారు. మీకు చాలా శ్రమ ఇవ్వాల్సి వచ్చింది అంది.
కృష్ణకుమార్ మాటలు విన్న ఆవిడ కూడా విద్యా ! సర్ చెప్పినట్లు వాళ్ళింటికి వెళ్ళు . ఇక్కడ ఉంటె అంత మంచిది కాదు. పొద్దున్నే వద్దువుగాని అంది.
కృష్ణకుమార్ ఆవిడని కూడా తమతో రమ్మన్నాడు మీరు ఒంటరిగా ఇక్కడ ఎందుకు అని.
