" ఇవి నాకెలా తెలుస్తాయి?" నీరుకారిపోతూ అడిగాడు.
"అన్నీ నేనే చెబితే నువ్వు చేసేదే ముంటుంది?"
" కాలేజీలో చదివేటప్పుడు ఆమె ఎలాంటి ఎక్టివిటీస్ లో ఆసక్తి చూపేది? స్టూడెంట్స్ ఎవరితోనన్నా తిరిగేదా? లెక్చరర్స్ .... ఇకపోతే ఆమె ఉద్యోగం చేసిన కంపెనీలో ఎగ్జిక్యూటివ్స్ తో గానీ, డైరెక్టర్స్ తో గానీ ఏమైనా..... లేకపోతే ఇంకెవరితోనన్నా గ్రంథం వుందా?" చాలా సీరియస్ గా చెప్పాడు.
" సర్" అన్నాడు అయోమయంగా నరేంద్ర.
జి.కె. అతని ముఖంలోకి చూసాడు.
"ఇదంతా ఎందుకు సర్ ఇప్పుడు"
"నువ్వు నన్ను ప్రశ్నించకూడదు. నాకు కావల్సిన సమాచారాన్ని మాత్రమే నువ్వు. ఇవ్వాలి. ఇంతా బయట ఎవరికీ తెలీకూడదు. నా భార్యప్రియుడెవరో తెలుసుకోవటం తప్పేంలేదు."
జి.కె. కృరంగా చూస్తూ వెళ్ళి కుర్చీలో కూర్చున్నాడు.
"ఏమిటి? చేస్తావా?" అడిగాడు.
"అమ్మగారి తెలిస్తే?"
"ఏమీ కాదు ,అవన్నీ నేను చూసుకుంటాను."
"ఇప్పుడివన్నీ ఎందుకు సర్, ఏదైనా వున్నా ఏమీ లేదనుకుని హాపీగా ఉండాలి కానీ"
" షటప్ నాకు సలహా చెప్పకు. డూ వాటై సే" అరిచాడు.
" అలాగే సర్!" అన్నాడు వినయంగా.
"నువ్వు వెళ్ళొచ్చు"
నరేంద్ర బయటికి నడిచాడు.
జి.కె. ఆలోచనలో పడ్డాడు.
నాగమణి కేవలం స్వార్థంతో, డబ్బుమీద మోహంతో నే తనని పెళ్ళి చేసుకుంది. దానికి తనమీద ప్రేమలేదు. తన తదనంతరం ఆస్థికి వారసుల్ని కావాలని ఆలోచిస్తోంది.
తను ఆమెకంటె సూమారు ముఫైఏళ్ళు పెద్దాడు. ఆమె అచ్చట ముచ్చటతీర్చలేని స్థితిలో వున్నాడు. అది ఒప్పుకోలేని అహం అడ్డువస్తోంది.అందుకే హింస పెట్టి ఆనందిస్తున్నాడు.
అది ఎదురు తిరిగి ఏకు మేకు అవకుండా వుండాలంటే దాని గతం తెలుసుకుని దాన్ని మరింత టార్చర్ చేయాలి.
అప్పుడే అది లొంగి పడుంటుంది.
నరేంద్ర చాకులాంటి వాడు. అతను ఖచ్చితంగా చేయగలడనే ఆపనిని ఒప్పగించాడు.
* * *
కాపీ ఇవ్వడానికి జి.కె. గదిలోకి వెళ్ళాడు మల్లన్న.
అప్పటికే లేచి గదిలో ఫైల్స్ ,అవీ చూసుకునే జి.కె. మంచం పైన వెల్లకిలా పడుకున్నాడు. సన్నగా మూలుగుతున్నాడు.
" బాబుగారు! బాబుగారూ" అని పిలిచాడు మల్లన్న.
జి.కె. పలకలేదు.
అనుమానంతో ఆయన వంటిమీద చెయ్యివేసి చూసాడు మల్లన్న ఒళ్ళుకాలిపోతోంది.
వెంటనే రావుగారి ఫామిలీ డాక్టరుకి ఫోన్ చేసాడు. తర్వాత సెక్రటరీ నరేంద్రకి కూడా ఫోన్ చేసి చెప్పాడు.
ఎంత కోటీశ్వరుడైనా జి.కె. తెలుసుకోని దొక్కటే. తనుకోసం ఆరాటపడే మనిషి ఒక్కరైనా భూమ్మీద వుందా అని ఆలోచించడేం?డబ్బు ఖర్చుపెట్టి పరాయివాళ్ళ సేవల్ని కొనుక్కోవాలే తప్ప అభిమానం, ప్రేమ ఎక్కృడికినుండి వస్తాయి?
మల్లన్న మనస్సులోనే ఊసడించుకున్నాడు.
డాక్టర్ సారధి. సెక్రటరీ నరేంద్ర వచ్చారు.
డాక్టర్ అతన్ని పరీక్ష చేశాడు.
హై టెంపరేచర్. రెండు ఇంజెక్షన్స్ చేసి తీసుకోవాలసిన జాగ్రత్తలన్నీ మల్లన్న కి చెప్పాడు. మళ్ళీ మధ్యహ్నం వస్తానని చెప్పి వెళ్ళి పోయాడు.
