Previous Page Next Page 
భవ బంధాలు పేజి 39


                              స్థిత ప్రజ్ఞుడు
    దశరధ రామయ్య అంటే రాముడు తండ్రి దశరధుడు అంత గొప్ప పేరున్న వాడు కాకపోయినా, ఆ ఊరిలో మకుటం లేని మహారాజు లాగే వెలిగిపోతున్నాడు ఎమ్మెల్యే పదవిలో . దశరధరామయ్య అంటే ఏ అరవయ్యో , డెబ్బై ఏళ్ళు ఉంటాయి అనుకునేరు. పట్టుమని నలభై ఐదో, ఆరో ఉంటాయి. ఆరడుగుల పొడుగు . తండ్రి పోలిక, తల్లి రంగు వచ్చిన అందగాడు. పైగా నూరెకరాల ఆసామి. నల్లటి మీసకట్టు గంబీరమైన చూపులతో చూసే ఆయన్ని చూసిన వారందరూ అడక్కుండానే ఆ ఊరికి మహారాజు పట్టం కట్టేశారు. బీకాం పాసవగానే , తండ్రినీ బీ.కాం చదువుకు వచ్చే ఉద్యోగాలు ఏమిటి జీతాలెంత, పొలాలు చూసుకో , రైస్ మిల్లు పెద్దది  చేసుకో, మొన్న కొత్తగా పెట్టిన ఆయిల్ మిల్లు చాలడం లేదు . ఇంకోటి పెట్టు, పొలంలో పప్పులు పంటలు మొదలెట్టు . ఏదో ఇంగ్లీష్ చదువుండాలి దడదడ మాట్లాడగలవు అని ఇంగ్లీష్ చదువులు చెప్పించాను బోలెడు డబ్బెట్టి, . నేను డబ్బు దాచి దాచి లక్షలు అప్ప చెపుతున్నాను. నా మనవడికి ఆ లక్షలు కోట్లు చేసి ఇవ్వాలి నీవు మర్చిపోకు అని తండ్రి కొడుకుని కూర్చోపెట్టి డబ్బు ఎలా చెయ్యాలో బోధించి లక్షలు, పొలాలు, మిల్లులు అన్ని అప్పగించి వంశోద్ధారకుడిని కనడానికి ఓ అయినింటి పిల్లని పెళ్లి చేసి, రంభ ఊర్వశీ కాకపోయినా బాగానే వుంది, ఏదో ఇంటరు వరకు చదువుకుంది బుద్దిగా అమ్మ నాన్న మాటలకి తలాడించి పెళ్లి చేసుకున్నాడు. ఇరవై నాలుగో ఏట దశరధ రామయ్య పట్నం బీకాం చదవడానికి వెళ్ళినప్పుడే దశరధరామయ్య పేరు మోటుగా ఉందని కాలేజీ లో ఎంటర్ అవగానే దశరద్ రాం అని మార్చేసుకున్నాడు. పేరు మార్చుకున్న వేళా విశేషమో , పెళ్ళాం వచ్చిన వేళా విశేషమో గాని , లక్షలు ఆనతి కాలంలోనే కోట్లుగా మారింది. రెండేళ్ళ లోగానే వంశోద్ధారకుడు కనగలిగి తల్లి తండ్రుల్ని సంతోషపెట్టాడు. మనవడి ముద్దు ముచ్చట్లు వరకే చూసారు గానీ, ఎంత ఘనకార్యాలు చేస్తాడో అని మురిసిన తాత మామ్మ అవేమి చూడకుండానే ఒకరివేనకొకరు రెండేళ్ళ లో దాటిపోయారు.
    తాతగారు తన ఆశలు కలలు అన్ని నీళ్ళు వదిలేసుకుని , బాధ దిగమింగుకుని బతకాల్సిన అవసరం లేకుండా దాటిపోవడం మంచిదయిందని , అందరు అనుకునే విధంగా, మనవడు తయారయ్యాడు, ఏళ్ళు వస్తున్న కొద్దీ పదేళ్ళ వయసు వరకు, చిన్నవాడు ముద్దు లేక్కువయి, ఒక్కడయి పోయి, పెంకి మొండిగా తయారయ్యాడు. ఏదో కాస్త జ్ఞానం వస్తే వాడికే బుద్ది తెలిసి మారతాడు . అల్లరి తగ్గుతుంది అనుకున్నారు అంతా.
    నేనేం మారాల్సిన అవసరం ఏముంది మా నాన్న బోలెడు సంపాయించాడు ఇంకా సంపయిస్తున్నాడు. ఈవూరికి మకుటం లేని మహారాజు పైగా ఎమ్మెల్యే అయన మాటకి ఎదురు లేదు. నేను మా నాన్నకి ఒక్కగానొక్క కొడుకుని, యువరాజుని, బియ్యేలు , ఎమ్మెలు చదవాల్సిన అవసరం ఏముంది . ఈ పొలాలకు ఇళ్ళకి తోటలకి, రైస్ మిల్లుల కు , ఆయిల్ మిల్లుల కు మా నాన్న కొని పడేసిన స్థలాలకి ఏకైక వారసుడి ని అన్న విషయం పట్టుకుని పదహారేళ్ళ కి అర్ధమైపోయింది అతనికి. చదువులో రాణించక పోయినా ఇటువంటి ప్రపంచ జ్ఞానం బాగానే అర్ధమైపోయింది. లెక్కల్లో ఏనాడు పాస్ మార్కులు రాకపోయినా డబ్బులు ఆస్తులు లెక్కెట్టు కొడంలో దిట్ట. కొడుకు మొదటి సారి మెట్రిక్ ఫెయిల్ అయాక రెండోసారి ముందే జాగ్రత్త పడి వీళ్ళని వాళ్ళని పట్టుకుని పలుకుబడి డబ్బుతో గట్టెక్కించాడు తండ్రి. పట్నంలో కాపురం పెట్టి ఇంగ్లీష్ మీడియం చదివించడం తో గటగటా ఇంగ్లీష్ మాట్లాడే కొడుకుని చూసి మురిసి పోయాడు గాని , చదువులో చవట అని మెట్రిక్ ఫెయిల్ అయ్యే వరకు గ్రహించలేక పోయాడు అయన . ఏదో బియ్యే వరకు గట్టేక్కిస్తే చాలు వున్న ఆస్తులు కాపాడు కుంటూ , ఏదో తన వారసత్వం ఎమ్మెల్యే పదవి అందిపుచ్చు కుంటే చాలు.
    ఓ డిగ్రీ చేతిలో ఉంటె సంఘంలో గౌరవం ఉంటుంది. చదువుకున్నవాడు అనిపించుకోవచ్చు. వచ్చిన మార్కులకి ఏ కాలేజీ లో ను సీటు రాదని తెల్సిన అయన ఓ మంచి పేరున్న కాలేజీ కి దండిగా డొనేషన్ ఇచ్చి, నెమ్మదిగా బి.ఏ. వరకు లాగించాడు కొడుక్కి లేకపోయినా తన తెలివి తేటలతో.
    కాలేజీలో చేరిన తరువాత ఆ నాలుగు ఐదేళ్ళు కొడుకు ఎంత పొగరు, తెగింపు ఎంత అహంభావంతో , అందరి విద్యార్ధులకి నాయకుడి లా తయారయి, డాబు దర్పం తండ్రి హోదా డబ్బు చూపి లోవరుచుకుని అధారిటీ తో పనులు చేయించు కుంతున్నాడో, ఆడపిల్లలని ఏడిపించి కొందరితో ప్రేమ కబుర్లు చెప్పి ఎలా లొంగ దీసుకున్నాడో, భయంతో కొందరు గతి లేనివారు డబ్బుకీ లొంగి కొందరు ,ఇలా ఎంత మందితో అడుకున్నాడో ఆ తండ్రి తెలుసుకునే నాటికి కాలాతీతమయింది. కారులో ఎదురు చెప్పని స్నేహితుల్ని వెంటేసుకుని సినిమాలు, షికారులు , హోటల్స్ , రూల్స్ మాకేమిటి అంటూ స్పీడ్ గా కారు తోలుతూ అర్ధరాత్రి తిరుగుతూ పట్టుకుంటే , తండ్రి హోదా చాటున అధారిటీ చూపించి తప్పించుకుంటూ , తాగుతూ, పార్టీలు, ఇస్తూ, విచ్చలవిడిగా డబ్బులు వెదజల్లుతూ, ఒకటేమిటి, మనిషి ఎంత దిగజార్చవచ్చో జారి, కాలేజీలో చదువు తప్ప తక్కిన వన్నీ చేసాడు. ఒకసారి ఏదో పార్టీ పబ్ లో మాదక ద్రవ్యాలు సేవిస్తూ పట్టుబడి కొత్తగా వచ్చిన స్ట్రిక్ పోలీస్ ఆఫీసర్ అందరిని లాక్కెళ్ళి సెల్ లో పడేసి చితకబాది కోర్టులో సోమవారం హాజరు పెడతామని, చాల కచ్చితంగా ఎవరు తండ్రుల హోదాలు చెప్పిన వినకుండా ఫోను లాక్కుని సెల్లో పడేసి వెళ్ళిపోయాడు. దాంతో దయ్యం దిగివచ్చి ఏం చెయ్యాలి అని ఆలోచనతో సతమతమై పోతూ గడిపేడు పుత్ర రత్నం.
    ఎలక్షన్స్ దగ్గర పాడుతుండడంతో బిజీగా వున్న తండ్రి, కొడుకు ముచ్చట్ల ని పట్టించుకోకుండా వదిలేసాడు. తీరిక లేక వేళాపాళా లేకుండా తిరిగే కొడుకుని మందలిస్తూ ఆలస్యం అయినదని కేకలు వేస్తూ ఇంటికి రాని రోజున కోపగిస్తూ కొడుకుని ఏ విధంగానూ కంట్రోల్ చేయలేని తల్లి , కోపం గా కాక మంచిగా చెపుతూ, బుజ్జగిస్తూ మార్చాలని ప్రయత్నిస్తూ వుండేది. ఆరోజు రాత్రి ఇంటికి రాని కొడుకు అలవాటుగా ఏ స్నేహితుడితోనే ఉండిపోయాడని సరిపెట్టు కుంది. మర్నాడు రోజంతా రాని కొడుకు గురించి ఆరాటపడి అందరికి ఫోన్లు చేసి ఎక్కడ లేడని విని భయపడింది. పని మీద రెండు రోజులుగా డిల్లీ వెళ్ళిన భర్తకి ఫోన్ చేసింది. అయన మీటింగ్ లో వుండి పట్టించుకోకుండా వస్తాడు స్నేహితులతో ఎటో పోయుంటాడు. నేను ఊర్లో లేనని తెలిసి ఏ రిసార్ట్ లో ఎంజాయ్ చేస్తున్నాడో వస్తాడు లే" అనేశాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS