Previous Page Next Page 
అర్చన పేజి 34

    "నువ్వు వాళ్ళమీద కేసు పెట్టడం మంచిదైంది. చాలా మంచి పని చేశావు. ఎంతవరకూ వచ్చింది?" మళ్ళీ అడిగాడు.
    అర్చన నిట్టూర్చింది. "సాక్ష్యాలు కావాలిట! ఏం సాక్ష్యాలు చూపించాలి? అతడినేమీ చేయలేకపోయారు. ఈ సమాజన్ని రాజకీయం శాసిస్తోంది." ఆమె స్వరం కొద్దిగా వణికింది.
    "అదికాదు అర్చనా! అసలు వాడ్ని నమ్మి ఒక్కదానివే కాఫీకి ఎందుకెళ్ళావు?"
    "కాఫీకా? కాఫీకి వెళ్ళడం ఏంటి?" అయోమయంగా.
    "కాఫీకి ఆహ్వానించాట్టగా!"
    "ఓ గాడ్! అసలు విషయానికి చాలా రంగులు పూస్తున్నారన్నమాట! అది నిజం కాదు. సారీ చెప్పిన మాట నిజం. ఇప్పటినుంచీ నన్ను నీ బ్రదర్ అనుకో అదనం నిజం. కానీ, తన బర్త్ డే అని నన్ను, నీలిమని, మరో ఇద్దర్నీ కూడా వాళ్ళింటికి పార్టీకి పిలిచాడు. నేనూ నీలిమా బయలుదేరాం. దాదాపు వాళ్ళింటిదాకా వెళ్ళాక నీలిమకి ఏదో హెల్త్ ప్రాబ్లం వచ్చింది. తప్పనిసరి పరిస్థితుల్లో తను వెనక్కి వెళ్ళాల్సి వచ్చింది. అంత దూరం వెళ్ళాం కదా అని నేను జస్ట్ విష్ చేసి వెళ్ళిపోదాం అని వెళ్ళాను. కానీ, వాడు పెద్ద ప్లాన్ వేశాడని నాకు తెలియదు. తెలియక ఇరుక్కుపోయాను."    
    "అలాగా! ఎంత దుర్మార్గం! కానీ, జనం వేరే అనుకుంటున్నారు."
    "ఇంకా ఏం అనుకుంటున్నారు?" సూటిగా అడిగింది.
    "కోర్టులో ఉందిటగా కేసు!"
    "కోర్టా? వాడిని కనీసం పోలీస్ స్టేషన్ కి కూడా పిలవలేదా. అంత గొప్పగా ఉంది మన లా అండ్ ఆర్డర్. నేను ఫర్ దర్ గా ప్రొసీడ్ అవుదామంటే ఇదిగో ఇంట్లో ఇలా నన్ను ఖైదు చేశారు."
    "పోనీలే అర్చనా! జరిగింది మర్చిపో! పి.జి.కి అప్లై చెయ్యి."    
    "మర్చిపోవాలా?" ఆవేశంగా అంది.
    "అంటే నా ఉద్దేశం..."
    "అంటే...ఏ ఎవరి ఉద్దేశ్యాలతో పనిలేదు. నేన్నేం చేయదల్చుకున్నానో చేసి తీరతాను. వాడ్ని మాత్రం వదలను. సాక్ష్యాలు కావాలి కదూ! చూపిస్తాను" పళ్ళ బిగువున అంది.
    వేణు ఆవేశంగా అన్నాడు. "అయినా ఇంకా ఏం సాక్ష్యాలు కావాలి? నిన్ను మెడికల్ టెస్టుకి పంపించలేదా?"
    "మెడికల్ టెస్ట్ కా? దేనికి?" చిత్రంగా చూసింది.
    వేణు తడబడుతూ అన్నాడు "అదే రేప్ జరిగినట్టుగా కన్ ఫర్మ్..."
    "వాట్?" గట్టిగా అరిచింది అర్చన. "రేప్ జరిగిందని ఎవరు చెప్పారు?"
    వేణు బిత్తరపోయి చూశాడు. "కా... కాలే."
    అర్చన అరిచినట్టుగా అంది. "నాన్సెన్స్ మీరంతా చదువుకుంటున్నారా? గాడిదలు కాస్తున్నారా? చూడూ! మళ్ళీ మళ్ళీ చెబుతున్నా. నన్ను ఎవరూ రేప్ చేయలేదు. ఓన్లీ కిడ్ నాప్.... కిడ్ నాప్ చేశారు. అండర్ స్టాండ్."
    లోపల్నించి సావిత్రి, వాకిట్లోంచి ఆనందరావు అర్చన అరుపుకి పరిగెత్తుకుంటూ వచ్చారు.
    సావిత్రి తీవ్రంగా అంది "ఎందుకే ఎందుకలా అరుస్తావు? జరిగిన అల్లరి చాల్లేదా? ఎందుకే మా బతుకులు బజార్న పడేస్తావు?"
    "అమ్మా!" తీవ్రంగా పిలిచింది అర్చన. "ఏంటి? నేనేదో అపరాధం చేసినట్టు మండిపడతావు? ఆ వెధవ ఒళ్ళు బలిసి, తనేదో పెద్ద లీడర్ నని అందరూ తెలుసుకోవాలని కిడ్నాప్ చేశాడు. మోసంతో చేశాడు. వాడికి నన్ను రేప్ చేసే దమ్ముందా? ఒక్కరోజు వాడెక్కడో దాచేస్తే, అడ్డమైన వాళ్ళు నేను రేప్ చేయబడ్డానని వాగుతోంటే నోర్మూసుకుని ఊరుకోవాలా? నెవ్వర్."
    "ఊరుకోక ఏం చేయగలం తల్లీ?" బాధగా అన్నాడు ఆనందరావు. ఆయనకి కూతురంటే ప్రాణం. కానీ సంప్రదాయాలన్నా ప్రాణమే. పరువుప్రతిష్ఠలంటే మరీ ప్రాణం. అందుకే ఏ ప్రాణం ఎలా నిలుపుకోవాలో అర్ధం కాక నిస్సహాయంగా ఉండిపోయాడు.
    ఆయన మనసులో ఆవేదన అర్ధంకాని అర్చన మండిపడుతూ అంది "ఊరుకోను. నడిరోడ్డుమీద నిలబడి అందర్నీ పిలిచి ఏం జరిగిందో, ఎందుకు అలా జరిగిందో చెపుతాను. అందరి నోళ్ళు మూయిస్తాను."
    "ఉద్ధరించావు" గట్టిగా అరిచింది సావిత్రి. "జరిగింది చాలు వెంటనే ఈ ఊరినుంచి వెళ్ళిపోదాం. బాబూ! నువ్వు పరామర్శించింది చాలు. ఇంక వెళ్ళు నాయనా! మమ్మల్నిలా బతకనీ" రెండు చేతులెత్తి నమస్కరిస్తూ అంది.
    వేణు ఏదో చెప్పబోయి అది సమయం కాదని అర్ధం చేసుకున్నాడు. మౌనంగా వెనక్కి తిరిగి "మీకేధన్నా సాయం కావాలంటే నేనున్నానండి. అర్చనకి పిజికి అప్లై చేయడానికి అప్లికేషన్ తెస్తాను. తనని చదివించండి" అన్నాడు ఆనందరావుతో నెమ్మదిగా.
    ఆయనేం మాట్లాడలేదు.
    అర్చన తీవ్రంగా అంది. "వేణూ! చాలు. నా కోసం నువ్వు చేసిన త్యాగాలు చాలు. ఇంక నీ దారిన నువ్వు వెళ్ళు. నాకేం కావాలో, నేనేం చేయాలో నేను చేసుకోగలను."
    వేణు ఏదో చెప్పబోయాడు. కానీ, అది సమయం కాదనిపించింది. అర్చన కోపంగా ఉంది. ఆవేశంగా ఉంది. ఈ ఆవేశం తగ్గనీ అనుకుని "సరే అర్చనా! వస్తాను. కానీ, నన్ను నమ్ము. అయామ్ యువర్ వెల్ విషర్" అంటూ వేణు బైటికి వచ్చేశాడు. ఏమైనా తన పట్టు వదల్లేదు. ఈ పట్టు సడలితే అర్చనని దక్కించుకోడం అసాధ్యం అనుకున్నాడు. వెంటనే పీజీకి రెండు అప్లికేషన్స్ తీసుకున్నాడు. ఒకటి తాను అప్లై చేసి, మరొకటి అర్చన దగ్గరకు తీసుకుని వెళ్ళాడు. అడపా దడపా వెళుతూ ఆనందరావుని, సావిత్రిని మంచి చేసుకున్నాడు. వాళ్ళ ద్వారా అర్చనకి కావాల్సిన సాయం చేసి, ఆమె మనసులో ముందు స్నేహితుడిగా, ఒక శ్రేయోభిలాషిగా స్థానం సంపాదించుకుంటే చాలనిపించింది. అందుకే ఈ దిశగా ప్రయత్నాలు ప్రారంభించాడు. అతని ప్రయత్నాలు కొంచెం విజయం వైపుగా సాగాయి.
    అర్చన పి.జి.కి అప్లై చేసింది. వేణుతో పాటు ఆమె యూనివర్శిటీకి వెళ్ళడానికి ఆనందరావు అంగీకరించాడు.
    వేణు సాయం తీసుకుని బైటికి వచ్చిన అర్చన హాయిగా ఊపిరి పీల్చుకుంది.
    "నీ మేలు మర్చిపోను వేణూ! చాలా థాంక్స్. ఆ అప్లికేషన్ నాకిచ్చి నువ్వు వెళ్ళిపో. నేను ఒక్కదాన్నీ వెళ్ళగలను యూనివర్శిటీకి" అంది బండి తీసుకుని బైటకి రాగానే.
    "వద్దు అర్చనా! నేనూ వస్తాను. నన్ను నమ్మి మీ ఫాదర్ పంపించారు. నేనిలా మధ్యలో వదిలేసి వెళ్తే ఏదన్నా జరిగితే నా గురించి ఏం అనుకుంటారు?"
    "నాన్సెన్స్" విసుక్కుంది. "పదే పదే మోసపోడానికి నాకేం వెర్రిదానిలా కనిపిస్తున్నానా? ఐ నో వాట్ టు డూ. వాట్ నాట్ టు డూ."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS