Previous Page Next Page 
అర్చన పేజి 11


    "కమాన్....కూల్ డౌన్ వేణూ! ఏదో జరిగింది. నీకు తెలిసే చేసుకున్నావు కదా!"
    "అయితే, నేనేం అందుకు రిపెంట్ అయి ఆవిడని ఆదరించడం లేదా? ప్రేమించడం లేదా? నేనేమన్నా ఆ విషయాల గురించి ఆవిడతో గొడవపడ్డానా? ఏం చేశాను? పెళ్ళి చేసుకున్నాను. ఆనందంగా ఉండాలని కోరుకోడం తప్పా? ఆవిడ నాతో కోపరేట్ చేయకపోతే నేనేం చేయను? పిగా ఉద్యోగం కూడా మానేసి కూర్చుంది. ఏం జరిగింది అంటే చెప్పదు. పిచ్చెక్కిపోతోంది నాకు. నేనో వెధవలా కనిపిస్తున్నాను ఆవిడకి. చెప్పు... మాధవికి చెప్పి ఆమెకేదన్నా దయ్యం పట్టిందేమో కనుక్కో."
    "వేణూ నువ్వెంత త్యాగం చేశావో, ఆమె కోసం ఎంత సాహసం చేశావో ఆమెకి తెలియదా? ఇంతగా ప్రేమించిన నీకన్నా వేరే ఎవరన్న తనకింత సెక్యూర్డ్ లైఫ్ ఇవ్వగలరా? ఎనీవే ఉద్రేకపడకు. ఇంట్లో హడావిడి అయిపోనీ మాధవికి చెపుతాను, అర్చనతో మాట్లాడమని. సరేనా?"
    "ఏమో! నాకు నమ్మకం కుదరడం లేదు. ఆమె మనసులో ఎవరన్నా ఉన్నారేమో అనిపిస్తుంది. నా ప్రేమ వన్ వే ట్రాఫిక్ కదా!" విరక్తిగా అన్నాడు వేణు.
    "ఆమెకి వేరే ఎవరినీ ప్రేమించే అర్హత లేదు వేణూ. అసలు లేదు. నీ పట్ల ఆమె ఎంత కృతజ్ఞతగా ఉండాలి. అలాంటి స్థితిలో నువ్వు తప్ప ఎవరు చేసుకుంటారు ఆమెని? నో... నాకేదో అనుమానంగా ఉంది వేణూ! ఏదో జరిగింది. డెఫినెట్ గా మానసికంగా దెబ్బతింది. నాకు తెలిసి ఒక సైకియాట్రిస్టు ఉన్నారు. ఆయన దగ్గరకు తీసుకెళదాం."
    "నాకూ అలాగే అనిపిస్తోంది. పగలంతా చాలా బాగుంటుంది. రాత్రి కాగానే ముడుచుకుపోతుంది. దగ్గరికి వెడితే చాలు. బెదిరిపోతూ చూస్తుంది. పదిరోజుల్నుంచి అయితే పగలు, రాత్రీ అలా శూన్యంలోకి చూస్తూ కూర్చుంటోంది. నాకేం అర్ధం కావడంలేదు. ఏమో! మా జాతకాలు కలవలేదేమో! నేను అనవసరంగా బలవంతంగా వెంటబడి చేసుకున్నాను. దేవుడు మా ఇద్దరికీ రాసిపెట్టనప్పుడు ఏం చేసినా ఈ సమాంతర రేఖలు కలవ్వు."
    "జాతకాలా, గాడిదగుడ్డా! చూద్దాం. అయినా అనకూడదు కానీ, వేణూ! నువ్వసలు మగాడివేనా?"
    వేణు రోషంగా చూశాడు. "ఏం తమాషాగా ఉందా?" కోపంగా అన్నాడు.
    "మరేంటి? అర్చన నీ భార్య. నువ్వు తాళి కట్టిన భార్య. ఆమె మీద నీకు అన్ని హక్కులూ ఉన్నాయి. వాటిని వినియోగించుకుని, దారిలో పెట్టుకోలేవూ? ఏవిటీ తపస్సు? భార్య ఉండీ, బ్రహ్మచారిగా బతకడం నీకు అవమానంగా లేదూ? నీతోటి వాళ్ళం మేమంతా తండ్రులు అయితే, నీకూ తండ్రి కావాలనిపించడం లేదూ! నయానా, భయానా దారిలో పెట్టుకోవాలి."
    "చక్రవర్తీ!"
    చక్రవర్తి నచ్చచ్పుతున్నట్టుగా అన్నాడు. "ఆమె నీ భార్య. సామ, దాన దండోపాయాలు ఉపయోగించి దారిలో పెట్టుకునే బాధ్యత నీది. సెక్స్ విషయంలో ఆమెకేమన్నా భయాలుంటే పోగొట్టే ప్రయత్నం చేయి. అనునయంగా, జాగ్రత్తగా నీకు అనుకూలంగా తిప్పుకో. నీ వైపునుంచి కూడా ప్రయత్నాలు ఉండాలి కదా! ఆమె అంతట ఆమె నీ కౌగిట్లో వాలిపోవాలని ఎదురుచూడడం తెలివితక్కువ. జరిగిన సంఘటన మర్చిపోయి తను అంత సాహసం చేయలేదు. నీమీద ఇష్టం ఉన్నా నీ అంతట నువ్వు చొరవ చేయకపోతే ఎలా?"
    చక్రవర్తి మాటలు వేణు మెదడు మీద పనిచేయడం ప్రారంభించాయి. అతని పౌరుషాన్ని రెచ్చగొట్టాయి. నిశ్శబ్దంగా ఉన్న తేనెతుట్టును కదిలించినట్టు చెల్లాచెదరుగా అయాయి ఆలోచనలు. అవును! అర్చన తన బార్య. తనకి సంపూర్ణమైన హక్కులున్నాయి. చక్రవర్తి అన్నట్టు తనసలు ఉపయోగించుకోడం లేదు.
    వేణు చక్రవర్తి మాటలే మననం చేసుకుంటూ ఇంటికి వెళ్ళాడు.
    అప్పుడే అర్చన స్నానం చేసి, వాయిల్ చీర కట్టుకుని, పెద్ద జడ వదులుగా వేసుకుని, పెరట్లో కుర్చీ వేసుకుని కూర్చుని ఏదో ఆలోచిస్తోంది. సింపుల్ గా ఎంతో అందంగా అనిపించింది. వేణు ముగ్ధమోహనంగా ఉన్న ఆమెని చూస్తూ, వెనకగా వెళ్ళి నెమ్మదిగా కళ్ళు మూశాడు. అర్చన ఉలిక్కిపడి అతని చేతులు తోసేసి, విసురుగా లేచి నిలబడింది.
    వేణు వైపు చూసి "ఏంటిది?" అంది కొంచెం చిరాగ్గా.
    వేణు మనసు కలుక్కుమంది. నెమ్మదిగా తనకి తాను నచ్చచెప్పుకుని "నీ కళ్ళు మూసే ధైర్యం నాక్కాక ఇంకెవరికుంటుంది?" అడిగాడు చిలిపిగా.
    అర్చన మాట్లాడలేదు. నొసలు చిట్లించి మొహం తిప్పేసుకుంది.
    వేణుకి ఆమెనలా చూస్తుంటే మతిపోతున్నట్టుగా ఉంది. ఆమె అందం అతనిలో వివేకాన్ని చంపేసింది. తాపం నరనరానా వ్యాపించి ఆలోచనాహీనుడ్ని చేసింది. ఆమె తిరస్కారాలు, చిరాకులూ అతనిపైన ప్రభావం చూపించలేక పోయాయి. ఆమె భుజం మీదుగా వంగి. ఆమె చెంపకి తన చంప రాస్తూ, పరవశంగా అన్నాడు.
    "అర్చనా! ఎంత బాగున్నావో తెలుసా? వనంలో విహరిస్తున్న శకుంతలలా ఉన్నావు. కాళిదాసు నిన్నిప్పుడు చూస్తే మరో కావ్యం రాస్తాడు."
    అర్చన చివ్వున దూరం జరిగింది.
    వేణుకి ఒళ్ళు మండిపోయింది. ఆమె భుజం మీద చేతులేసి విసురుగా తనవైపు తిప్పుకుంటూ అక్కసుగా అన్నాడు. "ఏంటి ఎవరో పరాయివాళ్ళు నీ ఒంటిమీద చేయి వేసినట్టు అలా దూరం దూరం జరుగుతావు. నేను నీ మొగుణ్ణి."
    అర్చన బలవంతంగా అతడిని విడిపించుకుని అక్కడినుంచి కదిలి, కనకాంబరం మొక్కల దగ్గరకు వెళ్ళి, సుతారంగా పూలు కోయసాగింది.
    వేణు విడిచిపెట్టలేదు. ఆమెని అనుసరించి వెళ్ళి భుజం పట్టుకుని తనవైపు తిప్పుకుని చెంపమీద ముద్దుపెట్టుకున్నాడు.
    అర్చనకి నిప్పులకణికలా తగిలాయి అతడి పెదాలు. నిలువెల్లా వణికిపోతూ అంది. "వద్దు దయచేసి నన్ను ముట్టుకోవద్దు. నాకిష్టం లేదు."
    వేణులో ఆవేశం పెల్లుబికింది. చక్రవర్తి మాటలు చెవుల్లో గింగిర్లెత్తాయి. "ఏం ఎందుకిష్టం లేదు. అంత ఇష్టం లేనిదానివి పెళ్ళికెందుకు ఒప్పుకున్నావు?"
    "అదంతా నాకు తెలియదు. నన్ను మాత్రం ముట్టుకోవద్దు."
    "నీ ఇష్టంతో నాకు సంబంధం లేదు, నేను నీ భర్తని. నా కోరిక తీర్చాల్సిందే" ఆమె చెయ్యి పట్టుకుని బలవంతంగా లోపలికి లాక్కొచ్చాడు.
    అర్చన అతని చేయి విడిపించుకోడానికి ప్రయత్నిస్తూ గట్టిగా అంది. "వదులు. నా వల్ల కాదు. నాకు, నాకు ఇష్టం లేదు. నన్ను ముట్టుకోవద్దు. వదులు. ఐ హేట్ యూ."
    "బట్ ఐ లవ్ యూ" వేణు ఆమెని మంచం మీద పడేసి, రెండు చేతుల మధ్యా బంధించాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS