రాధాదేవి ప్రాధాన్యత గురించి తెలుసా!


అమ్మవారిని ఆశ్రయిస్తే చాలు. సర్వులూ సులభంగా ముక్తిని పొందగలరు. భక్తిలో సర్వులూ అర్హులే.  అమ్మ యొక్క ఏ నామాన్నైనా, ఏ రూపాన్నైనా, ఏ స్తోత్రాలనైనా జపించి, తపించి, స్తోత్రించి తరించవచ్చు. ఇందులో ఒకటి రాధాదేవి స్వరూపం. రాధాదేవి ఉపాసన దక్షిణాపథంలో అంత వ్యాప్తిలో లేదు. కేరళ రాష్ట్రంలోని గురువాయూరు క్షేత్రంలో నారాయణుణ్ణి ఉపాసించిన నారాయణ భట్టాద్రి 'నారాయణీయం' గ్రంథంలో రాధాదేవి రహస్యాలు వ్రాశారు. అందువల్ల దక్షిణాపథంలో ఇది లేదని అనలేం. కానీ విస్తృతంగా వ్యాపించింది ఉత్తరాదిలో! కారణం - "బృందావనం.” 

అనారాధ్య రాధా పదాంభోజ యుగ్మం అనాశృత్వ బృందావనం తత్ పదాంకం.... కథం శ్యామసింధౌ కృత్స్న రస శ్యామ గాహః - రాధాదేవిని ఆరాధించకుండా, బృందావనాన్ని ఆశ్రయించకుండా, కృష్ణ కథను చదవకుండా ఆ కృష్ణ సముద్రంలో ఎవరు మునగగలరు!... రాధానుగ్రహం లేనిదే కృష్ణానుగ్రహం లేదు.

దుర్గ అనగానే శివుడు గుర్తుకు వస్తాడు. లక్ష్మి అనగానే విష్ణువు.  సరస్వతి అనగానే బ్రహ్మ. గాయత్రికి బ్రహ్మ అని చెబుతారు (వేదస్వరూపిణి కనుక చతుర్ముఖాలలో నుంచీ బ్రహ్మ చతుర్వేదాలూ పలుకుతాడు). రాధా అనేటప్పుడు కృష్ణుడు గుర్తుకు వస్తాడు.

ఈ ఐదూ పరమాత్మ యొక్క శక్తులు. పరమాత్మ, పరమేశ్వరుడు అని రెండు పేర్లున్నాయి. సృష్టి స్థితి లయలు చెయ్యాలి అని సంకల్పించుకున్న దగ్గర నుంచీ ఆ పరమాత్మ పేరు పరమేశ్వరుడయింది. అప్పుడు తనలోని ఐశ్వరాన్ని బయట పెడుతున్నాడు. సంకల్పంతో మొదలై, ఇచ్ఛా జ్ఞాన క్రియ... మొదలైన శక్తులతో జగత్తుగా వచ్చింది. "ఏకోహం బహుస్యాం” అన్నారు. 'ఏకః' అనే స్థితిలో పరమాత్మ, 'అహం బహుస్యాం' అన్నప్పుడు పరమేశ్వరుడయ్యాడు.

లోకంలో మనం ఒక పని చెయ్యాలంటే ముందు దానికి తగిన ఇచ్ఛా జ్ఞాన క్రియా శక్తులుండాలి. దాన్ని ఎలా చెయ్యాలి అనే పరిజ్ఞానం ఉండాలి. దాన్ని వ్యక్తం చెయ్యగలిగే శక్తి ఉండాలి. దానికి కావలసిన సంపద ఉండాలి. ఒక పనికి ఇలా మనకు ఎన్ని కావాలో పరమాత్మకీ అవన్నీ కావాలి. అయితే ఆయన తన నుంచే అన్నీ తెచ్చుకుంటాడు. ఎందుకంటే ఆయనకు భిన్నంగా ఏదీ లేదు కనుక! పరమాత్మ తన నుంచి తెచ్చుకున్న ఇచ్చా జ్ఞాన క్రియాత్మక శక్తి పేరు 'దుర్గ'. ఆయన  వాక్ బుద్ధి, జ్ఞానశక్తి పేరు సరస్వతి. ఆయన  సంపత్ శక్తి, ఐశ్వర్య శక్తి పేరు లక్ష్మి. ఆయన  వేదశక్తి స్వరూపమే గాయత్రి. ఆయన  ఆనందశక్తి స్వరూపం,  హృదయశక్తి స్వరూపం, హ్లాదినీ శక్తి రాధ. రాధ అంటే ఆయన యొక్క హృదయమట!

రాధ అనే పేరుకు చాలా విశేషమైన అర్థం ఉంది. జగత్తులో మనకు 'ఆరాధన' అనే ప్రసిద్ధమైన శబ్దం ఉంది. ఇక్కడ 'ఆ' అనేది ఉపసర్గం. ప్రధానం 'రాధనం'. రాధ అంటే అర్చన, పూజ అని చెబుతున్నారు. అర్చన (పూజ) అంటే భగవంతుడితో మనస్సును అనుసంధానం చెయ్యడమే. కనుక రాధ అంటే ఆ భగవంతునితో అనుసంధానం చేయించే శక్తి. భగవంతుడు చేయూత నిచ్చి లాగితే కానీ మనం ఉద్దరణకు గురికాము. 'చెయ్యెత్తి కరావలంబం ఇయ్యవయ్యా' అనడం పురుష ఆ ప్రయత్నం. ఆ పరమాత్మ కృప చూపించి (చెయ్యి పట్టుకుని)  పైకి లాగడం భగవదనుగ్రహం. ఈ రెండూ కలిస్తేనే సిద్ధి. అందుకు మన నుంచి ప్రవహించే ధార (భక్తి ధార ఒకటి, ఆయన నుండి ప్రవహించే ధార కృపాధార ఒకటి) రెండు ధారలూ కలిస్తే 'ధారా... ధారా... ధారా... ధా.... రాధా.... రాధా.... రాధా అవుతున్నది. ఈ ధారల్ని ఆధారం చేసుకున్న మహాశక్తే రాధ. అది పరమాత్మ వైపు నుండి ఆలోచిస్తే ఆయన యొక్క కృపాస్వరూపిణి రాధ. మన వైపు నుండి ఆలోచిస్తే భక్తి స్వరూపిణి అంటే రాధా దేవి అనుగ్రహం లేకపోతే  భగవంతుణ్ణి ఆరాధించాలనే బుద్ధి పుట్టదట!


                                      *నిశ్శబ్ద.


More Purana Patralu - Mythological Stories