భీష్ముడికి ఇచ్చా మరణం వరం ఎప్పుడు ఎవరు ఇచ్చారో తెలుసా...
భీష్మప్రతిజ్ఞ.. చాలామంది ఈ మాటను తరచుగా వాడుతూ ఉంటారు. భీష్ముడు మహాభారతంలో గొప్ప వీరుడు. భీష్ముని త్యాగం, ఆయన పరాక్రమం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈయనను గాంగేయుడు అని కూడా పిలుస్తారు. ప్రతి సంవత్సరం మాఘ శుక్ల పక్ష అష్టమి రోజు ఏకోదిష్ణ శ్రాద్దం జరుపుకుంటారు. ఇదే శుభసందర్బంగా భీష్మాష్టమి జరుపుకుంటారు. అయితే భీష్ముడు మహా భారతంలో దక్షిణాయనం సాగుతున్న సమయంలో అంపశయ్య మీదకు చేరతాడు. అప్పుడే మరణించాల్సిన భీష్ముడు ఉత్తరాయణం వచ్చేవరకు తనకు మరణం రాకూడదని కోరుకుంటాడు. తను అనుకున్నట్టే ఉత్తరాయణం రాగానే మాఘ మాసంలో అష్టమి నాడు తను దేహ త్యాగం చేస్తాడు. ఇలా ఇచ్చా మరణం అంటే తను అనుకున్నప్పుడు ప్రాణం వదిలెయ్యడం అనే వరాన్ని భీష్మునికి ఎవరు ఇచ్చారో తెలుసా?
పురాణ గ్రంథాల ప్రకారం భీష్ముడి తండ్రి శంతను మహారాజు తన కుమారుడు దేవవ్రతునికి ఇచ్చా మరణం వరం ఇచ్చాడని అంటారు. భీష్ముడు జీవితాంతం అవివాహితుడిగా ఉంటానని ప్రతిజ్ఞ చేస్తాడు. తన కుమారుడికి తన పట్ల ఉన్న ప్రేమకు సంతోషించిన శంతను మహారాజు తన కొడుకు భీష్ముడికి ఇచ్చా మరణం వరం ఇచ్చాడని పురాణ కథనాలు చెబుతున్నాయి.
భీష్ముడు మహాభారత యుద్దంలో కౌరవుల పక్షాన నిలబడి పోరాడాడు. పాండవులతో యుద్దం వద్దని దుర్యోధనుడితో చెప్పినా దుర్యోధనుడు వినలేదు. దీంతో కౌరవుల పక్షాన నిలబడి యుద్దం చెయ్యవలసి వచ్చింది. భీష్ముడికి తన తండ్రి ఇచ్చా మరణం అనే వరం ఇచ్చాడు. అంటే తను ఎప్పుడు కావాలంటే అప్పుడు మరణించవచ్చు. అయితే భీష్ముడు అధర్మం పక్షాన నిలబడి ధర్మం మీద యుద్దం చేస్తున్నాను కాబట్టి ఈ యుద్దంలో మరణించడం మంచిదని అనుకున్నాడు. దానికి తగ్గట్టే మహాభారతంలో బాణాలకు గురవుతాడు. అయితే దక్షిణాయనంలో ప్రాణాలు విడిస్తే మోక్షం లభించదని, అందుకే ఉత్తరాయణంలో ప్రాణాలు విడవాలని అనుకుంటాడు. తనకున్న ఇచ్చా మరణం కారణంగా తను అంపశయ్య పై ఉన్నా ఉత్తరాయణం వచ్చేంత వరకు అలాగే అంపశయ్య పై ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. దాదాపు 58 రోజులు భీష్ముడు అంపశయ్య పైనే ఉంటాడు. ఉత్తరాయణం వచ్చాక ప్రాణాలు వదులుతాడు. ఇది భీష్ముడి ఇచ్చా మరణం వెనుక కారణం, రహస్యం.
*రూపశ్రీ.
