అన్ని అర్హతలు ఉన్నప్పటికీ విదురుడు రాజు కాలేకపోయాడు.. కారణం ఈ శాపమే..!

 

విదురుడు చాలా తెలివైనవాడు. ఆయనకు శాస్త్రాలు, వేదాలు,  రాజనీతి, పాలనా వ్యవస్థ గురించి మంచి జ్ఞానం ఉంది. వీటన్నింటిని విదుర నీతిగా అందరికి అందించాడు కూడా. ఇంత జ్ఞాన సంపన్నుడు కావడం చేతనే  ఆయనను మహాత్మా విదురుడు అని కూడా పిలుస్తారు. రాజు కావడానికి ఉండవలసిన అన్ని అర్హతలు విదురుడికి ఉన్నాయి. కానీ ఆయన రాజు కాలేకపోయాడు. దీని వెనుక ఒక శాపం ఉందని పురాణ కథనాలు చెబుతున్నాయి. దీని గురించి తెలుసుకుంటే..

విదురుడు గత జన్మలో ఎవరంటే..

పురాణ కథనాస  ప్రకారం మాండవ్య అనే సన్యాసి ఋషి ఉండేవాడు. ఒకసారి రాజు దూతలు అతని ఆశ్రమంలో కొంతమంది దొంగలను పట్టుకున్నారు. వారికి ఆశ్రయం ఇచ్చాడనే నింద కారణంగా ఆ ముని కూడా శిక్ష అనుభవించాల్సి వచ్చింది.  తరువాత అతను నేరుగా యమరాజు దగ్గరకు వెళ్లి, 'ఏ నేరానికి నాకు ఇలా శిక్ష పడింది?' అని అడిగాడు. దీనికి యముడు బదులిస్తూ, నువ్వు చిన్నప్పుడు ఒక కీటకం తోకలో సూదిని గుచ్చావు. దాని కారణంగానే  ఈ శిక్ష విధించబడింది. అని సమాధానం ఇచ్చాడు.

యముడి సమాధానం విన్న ఋషి కోపోద్రిక్తుడు అయ్యాడు.  ఆ తరువాత యముడితో  ఇలా అన్నాడు.. 'బాల్యంలో చేసిన ఇంత చిన్న నేరానికి నాకు ఇంత పెద్ద శిక్ష విధించబడింది. నువ్వు బానిస కుమారుడిగా భూమిపై జన్మించవలసి వస్తుంది' అని శపించాడు. మాండవ్య ముని ఇచ్చిన ఈ శాపం కారణంగా యమరాజు మహాత్మ విదురుడి రూపంలో జన్మించాడు.


మహాభారతంలో వివరించిన కథ ప్రకారం, సత్యవతి,  శంతనుల కుమారుడు విచిత్రవీర్యుడు. ఈయన  అంబిక,  అంబాలికలను వివాహం చేసుకున్నాడు. కానీ అతనికి పిల్లలు లేరు.  అతను చాలా చిన్న వయస్సులోనే మరణించాడు. భీష్ముడు జీవితాంతం వివాహం చేసుకోనని ప్రతిజ్ఞ చేయడంతో, హస్తినాపుర సింహాసనాన్ని  ఎవరు అధిష్టిస్తారనే దానిపై సంక్షోభం తలెత్తింది. అప్పుడు సత్యవతి వేద వ్యాసుడిని గుర్తుచేసుకుంది.  సత్యవతి వేద వ్యాసునితో నా రాజవంశాన్ని నాశనం నుండి కాపాడాలంటే నువ్వు నా ఆజ్ఞలలో ఒకదాన్ని పాటించాలని చెప్పింది. అంబిక, అంబాలికల నుండి మీరు పిల్లలను కనాలని నేను కోరుకుంటున్నాను అని చెబుతుంది.

వేద వ్యాసుడు సత్యవతి ఆజ్ఞను పాటించాడు. రాణి అంబిక వేద వ్యాసుని దగ్గరకు వెళ్ళినప్పుడు ఆయన రూపానికి భయపడి కళ్ళు మూసుకుంది. అప్పుడు వేద వ్యాసుడు సత్యవతితో, మొదటి రాణి నన్ను చూసిన తర్వాత కళ్ళు మూసుకుందని, దానివల్ల ఆమెకు గుడ్డి కొడుకు పుడతాడని చెప్పాడు.


తరువాత అంబాలిక వేదవ్యాసుని దగ్గరకు వెళ్ళింది కానీ భయంతో పాలిపోయింది. వేద వ్యాసుడు సత్యవతి వద్దకు వెళ్లి, మరొక రాణి కూడా భయం కారణంగా పాలిపోయిందని, దాని కారణంగా ఆమెకు పుట్టిన కుమారుడు వ్యాధితో బాధపడతాడని చెప్పాడు.

ఇది విన్న సత్యవతి చాలా బాధపడింది. రాణి అంబాలికను మళ్ళీ వేద వ్యాసుని వద్దకు వెళ్ళమని కోరింది. కానీ రాణి స్వయంగా వెళ్ళలేదు. ఆమె స్థానంలో తన పనిమనిషిని పంపింది. వేద వ్యాసుని రూపాన్ని చూసిన తర్వాత ఆ పనిమనిషి ఏమాత్రం భయపడలేదు. ఈసారి వేద వ్యాసుడు తల్లి సత్యవతి వద్దకు వచ్చి ఈ పనిమనిషి గర్భం నుండి చాలా తెలివైన కుమారుడు పుడతాడని చెప్పాడు. దీని ఫలితంగా, అంబికకు ధృతరాష్ట్రుడు అనే అంధ కుమారుడు జన్మించాడు.   అంబాలిక గర్భం నుండి జన్మించిన పాండు అనే కుమారుడు పుట్టినప్పటి నుండి వ్యాధులతో బాధపడుతున్నాడు. కానీ పనిమనిషి గర్భం నుండి జన్మించిన విదురుడు తెలివైనవాడు కావడమే కాకుండా, శాస్త్రాలు,  వేదాలలో కూడా జ్ఞాని అయ్యాడు. కానీ పని మనిషి కొడుకు అనే కారణంతో రాజు కాలేకపోయాడు.

                        *రూపశ్రీ.


More Purana Patralu - Mythological Stories