జనకుడికి వేదాధ్యయనం పట్ల ఎంత ఆసక్తి ఉండేదో తెలుసా!

మహాపురుషులు సుఖదుఃఖాలకు అతీతంగా అనాసక్తి భావంతో  జీవిస్తారు. జనకుడు ఈ విషయంలో చెప్పుకోదగ్గవాడు. జనకుడిలో అనాసక్తభావం, వేదాంతం పట్ల శ్రద్ద ఎంతగా ఉండేవో తెలియడానికి ఒక చిన్న సంఘటన ఉదాహరణగా నిలుస్తుంది.  

"కర్మపరిత్యాగం చేస్తేనే దుఃఖాలు నశిస్తాయి. లేళ్ళు, దుప్పులు తమ కొమ్ములనూ, పాము కుబుసాన్నీ ఎలా పూర్తిగా వదలివేస్తాయో, ఆ విధంగానే ముక్తపురుషులు బాధలనూ, దుఃఖాన్నీ దూరం చేసుకొంటారు. నీటిలోకి పడిపోబోతున్న వృక్షాన్ని వదిలి పక్షి ఎగిరిపోయినట్లే. ముక్తపురుషులు సుఖదుఃఖాలను పరిత్యజించి అన్నింటినీ మించిన శ్రేష్ఠపదం చేరుకొంటారు. మిథిలానగరం కాలిపోతుంటే  పూర్వ పురుషుడు జనకమహర్షి 'నా సొత్తు ఏదీ కాలిపోవడం లేదు' అన్నాడట..

విదేహరాజైన జనకుడు 'మిథిలా యాం ప్రదయం'.. 'మిథిలా నగరి కాలిపోయినా నాకు ఏ నష్టం లేదు”. అన్నాడు. అంతటి మహాజ్ఞాని, అయినా రాజ్యాన్ని ఏలేవాడు. మిథిలతో సహా సర్వం పోయినా ఏ మాత్రం చలించడు. జనకుడు వేదవ్యాసుడి వద్ద వేదాంతం అధ్యయనం చేశాడన్నది జనశ్రుతి. వ్యాసుని సన్న్యాస శిష్యులు. 'జనకుడు గృహస్థుడు. ఈయనకు వేదాంతం ఎలా అర్థమవుతుంది?' అనుకునేవారు. సన్న్యాసులకు కూడా అహంకారం ఉంటుంది. భక్తులకు కూడా, 'నేను మహాభక్తుణ్ణి' అనే అహంకారం ఉంటుంది. అహంకారం అంత సులువుగా పోదు. తన సన్న్యాస శిష్యులకు కూడా అహంకారం ఉందని వేదవ్యాసుడు గ్రహించాడు. వారికి జనకుని మనస్సు తెలియదు. వారికి గుణపాఠం నేర్పాలని ఒక ఉపాయం ఆలోచించాడు. ఒకరోజు భాగవత పఠనం సాగుతోంది. ఇంతలో ఒక వార్తాహరుడు వచ్చి, 'మహారాజా! పశువుల కొట్టాలన్నీ కాలిపోయాయి, ఇప్పుడు మంటలు రాజప్రాసాదాన్ని తాకాయి' అన్నాడు. 'మంత్రిగారిని అన్ని ఏర్పాట్లు చేయమను' అన్నాడు జనకుడు. మరి కొద్ది సేపట్లోనే మరో వార్త... రాజప్రాసాదం కూడా బుగ్గి అయింది. ప్రజల ఇళ్ళూ కాలిపోతున్నాయి అని.  'సైనికులను పంపి, మంటలు మరింత వ్యాపించకుండా రక్షణ చర్యలు చేపట్టాల్సిందిగా సేనాపతికి చెప్పండి' అని అన్నాడు జనకుడు.

మంటలు మెల్లమెల్లగా వ్యాసాశ్రమం చేరాయి, నలువైపులా కార్చిచ్చు. ఆ వేడిమి శరీరాలకు తగులుతోంది. వ్యాసుని శిష్యులు వేదాంతాధ్యయనం వదలి, తమ కౌపీనాలు, ధోవతులు పదిలం చేసుకోవడానికి పరుగులు తీశారు. జనకుడు మాత్రం నిశ్చలంగా కూర్చుని ఉన్నాడు.

ఇంతలో హఠాత్తుగా మంటలు చల్లారిపోయాయి. ఇది గురువు చేసిన పని అని శిష్యులు గ్రహించారు. 'చూడండి! రాజ్యం మొత్తం కాలిపోతున్నా జనకుడు నిశ్చలంగా కూర్చుని ఉన్నాడు. వేదాంతం విన్నాడు. ఆచరణలో పెట్టాడు. హడావిడి చేయలేదు. మరి మీరో! ఆశ్రమ సమీపంలోకి  అగ్ని ప్రవేశించగానే కౌపీనాలు సంరక్షించుకోవడానికి వేదాంతపాఠమే వదలివేశారు. మీరేమో జనకుడికి వేదాంత శ్రవణం చేసే అధికారం ఉందా అని అహంకారంతో ప్రశ్నించారు' అన్నాడు వ్యాసుడు.

అప్పుడు జనకమహారాజులో ఉన్న అనాసక్తిభావం సన్నాస శిష్యులకు అర్థమైంది. జనకుడే నిజమైన వేదాంతి అని వారంతా అంగీకరించారు.

                                        *నిశ్శబ్ద.
 


More Purana Patralu - Mythological Stories