మహాకాళుడికి సమర్పించే బూడిద ఎలా తయారు చేస్తారో  తెలుసా?

మహాకాళుడు శివుడికి గల పేర్లలో ఒకటి. ప్రఖ్యాత జ్యోతిర్లింగం అయిన ఉజ్జయిని లో పరమేశ్వరుడు మహాకాళుడిగా పిలవబడుతున్నాడు. ప్రతి రోజు మహాకాళుడికి భస్మంతో అభిషేకం జరుగుతుంది. అయితే ఇది సాధారణ భస్మం కాదు.  ఈ భస్మాన్ని సాధారణంగా విభూతి అని కూడా పిలుస్తారు. కానీ మహాకాళుడికి భస్మాబిషేకం కోసం తయారు చేసే విభూతి వేరు.  దీని తయారీ పద్దతి కూడా చాలా ప్రత్యేకం.  దీన్ని ఎలా తయారు చేస్తారో తెలుసుకుంటే..

మహాకాళుడి విభూతి..

మహాకాళుడికి సమర్పించడానికి భస్మం  సిద్ధం చేయడానికి, కపిల ఆవు పేడతో పాటు శమీ  అంటే జమ్మి వృక్షం, రావి వృక్షం, మర్రి, రేల చెట్టు, రేగు చెట్టు   వంటి కలపను కాలుస్తారు. ఈ సమయంలో మంత్రాలు కూడా జపిస్తారు. దీనితో పాటు, మహాకాళుడికి సమర్పించే భస్మంలో అనేక రకాల మూలికలు కూడా చేర్చబడతాయి, ఇది దానిని దైవికంగా చేస్తుంది. ఈ వస్తువులన్నింటినీ అఖండ ధునిలో కాల్చిన తర్వాత వచ్చిన బూడిదను ఒక వస్త్రం ద్వారా ఫిల్టర్ చేస్తారు. అప్పుడు ఆ  భస్మాన్ని మహాకాళుడికి సమర్పిస్తారు.  దీన్నే  భస్మ హారతి అని పిలుస్తారు.

భస్మ హారతి ప్రత్యేకత..

మహాకాళుడి  దర్శనం ద్వారా భక్తులు జనన మరణ చక్రం నుండి విముక్తి పొందుతాడని,  మరణం తరువాత మోక్షాన్ని పొందుతాడని ఒక మత విశ్వాసం ఉంది. మహాకాళుని హారతిని రోజుకు 6 సార్లు నిర్వహిస్తారు.  వాటిలో ఒకటి భస్మ హారతి.. ఉదయం 4 గంటలకు భస్మ హారతి తర్వాత మహాకాళుడికి సమర్పించిన భస్మాన్ని భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేస్తారు. ఈ భస్మం ద్వారా సాధకుడికి మహాదేవుని ఆశీస్సులు లభిస్తాయని,  భక్తుల  జీవితంలోని అన్ని సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారు.

                               *రూపశ్రీ.


More Purana Patralu - Mythological Stories