ఈ విశ్వవిద్యాలయం విద్యార్థులు పాలను ఆల్కహాల్ గా  మార్చేవారట..!

పాలు.. ఆరోగ్యానికి చాలా మంచివి.  రోజూ గ్లాసుడు పాలు తాగుతుంటే శరీరానికి కాల్షియం లభిస్తుంది.  మరొకవైపు శరీరానికి ప్రోటీన్ కూడా లభిస్తుంది.  ఇక ఆల్కహాల్.. శరీరానికి అంత మంచిది కాదు.. ఆల్కహాల్ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది అంటారు.  కానీ పాలను ఆల్కహాల్ గా మార్చడం కాస్త విచిత్రంగా అనిపిస్తుంది. కానీ ఇది నిజమే.. రసాయన శాస్త్రం పాదార్థాలను విభిన్న రకాలుగా మార్చగల సామర్థ్యం కలిగి ఉంటుంది. అయితే నేటి కాలంలో అయితే టెక్నాలజీ, ప్రయోగాలు అభివృద్ది చెందాయి అని  చెప్పుకుంటున్నాం. కానీ 8వ శతాబ్దంలోనే పాలను ఆల్కహాల్ గా మార్చగలిగారు ఒక విశ్వవిద్యాలయం విద్యార్థులు.  ఇంతకీ ఆ విశ్వవిద్యాలయం ఏది? దీన్ని ఎలా మార్చగలిగారు? తెలుసుకుంటే..

ఇప్పటి టెక్నాలజీ ఒకప్పుడు మన పూర్వీకులకు తెలిసినవే.. అనే విషయం ప్రతి సారి తేలుతూనే ఉంది.  కట్టడాల విషయంలో కావచ్చు,  ఏదైనా వస్తువు తయారీలో కావచ్చు,  పూర్వీకులు ఏర్పరిచిన సంప్రదాయాలు,  పెద్దలు చెప్పిన విషయాలలో కావచ్చు.  అయితే 8వ శతాబ్ధంలో విక్రమశిల అనే విశ్వవిద్యాలయం ఉండేది.  దీన్ని 8వ శతాబ్ధంలోనే ధర్మపాల రాజు స్థాపించాడు.  ఈ విశ్వవిద్యాలయం కీర్తి టిబెట్, ఆగ్నేయాసియాకు కూడా వ్యాపించింది అంటే ఇది అప్పటికి ఎంత ప్రఖ్యాతి చెందిందో అర్థం చేసుకోవచ్చు.

విక్రమశిల విశ్వవిద్యాలయం గంగానది ఒడ్డు ఉన్నది.  ఈ విశ్వవిద్యాలయంలో 108 దేవాలయాలు ఉన్నాయి.  ఈ విశ్వవిద్యాలయంలో అభ్యసించాలంటే చాలా కష్టం.  ఎందుకంటే అంత సులువుగా ప్రవేశం దొరికేది కాదు.  అర్హత పరీక్ష నిర్వహించి అర్హత సాధించిన విద్యార్థులకు మాత్రమే ఇక్కడ చదువుకునే అవకాశం ఇచ్చేవారు.  

విక్రమశిల విశ్వవిద్యాలయంలో సైన్స్, తత్వశాస్త్రం,  వ్యాకరణం, తంత్రవిద్యతో పాటు ఇతర విషయాలను కూడా భోధించేవారు.  చాలా మంది పై విషయాలను ఇక్కడ అధ్యయనం చేసేవారు. ఈ విశ్వవిద్యాలయాన్ని స్థాపించిన ప్రారంభంలో విద్యార్థులకు అప్పటి గురువులుగా ఉన్న సన్యాసుల పర్యవేక్షణలో  విద్య భోధన జరిగేది.

అన్నింటి కంటే ముఖ్యంగా విక్రమశిల విశ్వవిద్యాలయం తంత్రవిద్య  అధ్యయనానికి ప్రసిద్ధి చెందింది.  ఇక్కడ విద్య అభ్యసించే విద్యార్థులు పాలను వైన్ గా అంటే ఆల్కహాల్ గా మార్చాడని చెబుతారు.

విక్రమశిల విశ్వవిద్యాలయాన్ని 12వ శతాబ్ధంలో భక్తియార్ ఖల్జీ సైన్యం నాశనం చేసింది.  ఎత్తైన గోడలతో చుట్టబడిన ఈ విశ్వవిద్యాలయాన్ని కోటగా భావించి ఈ విశ్వవిద్యాలయాన్ని దోచుకుని పూర్తీగా ధ్వంసం చేశారు.

భక్తియార్ ఖల్జీ దాడి తర్వాత ఈ విక్రమశిల విశ్వవిద్యాలయం చరిత్ర పుటల నుండి కూడా అదృశ్యమైంది. ధ్వంసం అయిన తరువాత దాదాపు 800 సంవత్సరాల పాటు  ఈ ప్రదేశాన్ని నిర్లక్ష్యంగా వదిలేశారు. విక్రమశిల విశ్వవిద్యాలయం పేరు చాలా పాత పుస్తకాలలో తప్ప ఎక్కడా కనిపించకుండా పోయింది. భారత పురావస్తు శాఖ జరిపిన త్రవ్వకాలలో ఈ విక్రమశిల విశ్వవిద్యాలయ ఉనికి తిరిగి బయటకు వచ్చింది.  పురాతన భవనాలు,  శిల్వాల అవశేషాలు ఈ త్రవ్వకాలలో కనుగొనబడ్డాయి.  ఇవన్నీ విక్రమ శిల గొప్పతనాన్ని రుజువు చేస్తున్నాయి.

విక్రమశిల అవశేషాలు బీహార్ రాష్ట్రంలోని కహల్ గావ్ లో ఉన్నాయి.  భారతదేశపు ఈ అద్భుతమైన విద్యాసంప్రదాయాన్ని మళ్లీ గుర్తించి దీన్ని పరిరక్షించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.


                                        *రూపశ్రీ.


More Purana Patralu - Mythological Stories